ప్రసంగి 4:1-16

  • దౌర్జన్యం చావుకన్నా ఘోరం (1-3)

  • పని విషయంలో సరైన అభిప్రాయం (4-6)

  • స్నేహితుడి విలువ (7-12)

    • ఒక్కరి కన్నా ఇద్దరు మేలు (9)

  • పరిపాలకుడి జీవితం వ్యర్థం (13-16)

4  సూర్యుని కింద జరుగుతున్న దౌర్జన్యాలన్నిటి గురించి నేను ఇంకొకసారి ఆలోచించాను. దౌర్జన్యానికి గురౌతున్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అయితే వాళ్లను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు.+ వాళ్లను బాధపెడుతున్నవాళ్లు బలవంతులు కాబట్టి ఎవ్వరూ వాళ్లను ఓదార్చట్లేదు.  అందుకే, బ్రతికున్నవాళ్ల కన్నా చనిపోయినవాళ్లే ధన్యులని నాకు అనిపించింది.+  ఇంకా పుట్టనివాళ్లు వీళ్లిద్దరి కన్నా ధన్యులని నాకు అనిపించింది,+ ఎందుకంటే వాళ్లు సూర్యుని కింద జరిగే చెడు విషయాల్ని చూడలేదు.  పోటీతత్వం వల్ల మనుషులు ఎంతో శ్రమిస్తారని, ఎంతో నైపుణ్యంగా పనిచేస్తారని నేను గమనించాను;+ ఇది కూడా వ్యర్థమే, గాలి కోసం ప్రయాసపడడమే.  మూర్ఖుడు చేతులు ముడుచుకొని కూర్చుంటాడు, కాబట్టి అతని శరీరం క్షీణించిపోతుంది.*+  రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాస ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు.+  సూర్యుని కింద ఉన్న ఇంకో వ్యర్థమైనదాని మీద నేను మనసుపెట్టాను:  తోడు లేని ఒక ఒంటరివాడు ఉన్నాడు; అతనికి కుమారుడు గానీ సహోదరుడు గానీ లేడు, అయినా అతను పడే ప్రయాసకు అంతే లేదు. అతని కళ్లు సంపదలతో తృప్తిపడవు.+ కానీ అతను, ‘నేను నా సుఖాల్ని త్యాగం చేసి ఎవరి కోసం ఇంతగా కష్టపడుతున్నాను?’ అని ఆలోచించడు.+ ఇది కూడా వ్యర్థం, దుఃఖకరం.+  ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది,+ ఎందుకంటే వాళ్ల కష్టం వల్ల వాళ్లకు మంచి ప్రతిఫలం* కలుగుతుంది. 10  వాళ్లలో ఒకరు పడిపోతే, తోటివ్యక్తి అతన్ని పైకి లేపుతాడు. కానీ ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే, అతన్ని ఎవరు పైకి లేపుతారు? 11  అంతేకాదు ఇద్దరు కలిసి పడుకుంటే వాళ్లకు వెచ్చగా ఉంటుంది, కానీ ఒంటరివాడికి ఎలా వెచ్చదనం కలుగుతుంది? 12  ఒంటరివాడి మీద ఎవరైనా పైచేయి సాధించగలరు; కానీ ఇద్దరుంటే, ఇద్దరు కలిసి వాణ్ణి ఎదిరించగలరు. మూడు పేటల తాడు త్వరగా* తెగిపోదు. 13  హెచ్చరికల్ని ఇక ఏమాత్రం పట్టించుకోని మూర్ఖుడైన ముసలి రాజుకన్నా,+ పేదవాడే అయినా తెలివిగల పిల్లవాడు నయం.+ 14  ఎందుకంటే, ఆ రాజు పాలనలో అతను* పేదవాడిగా పుట్టినా, చెరసాలలో నుండి బయటికి వచ్చి రాజౌతాడు.+ 15  సూర్యుని కింద తిరిగే సజీవులందరి విషయంలో, అలాగే రాజు తర్వాత అతని స్థానంలోకి వచ్చే యువరాజు విషయంలో ఏమి జరుగుతుందో నేను ఆలోచించాను. 16  అతనికి మద్దతిచ్చేవాళ్లకు అంతు ఉండదు, అయితే ఆ తర్వాత వచ్చేవాళ్లు అతన్ని బట్టి సంతోషించరు.+ అది కూడా వ్యర్థమే, గాలి కోసం ప్రయాసపడడమే.

అధస్సూచీలు

అక్ష., “తన మాంసాన్ని తింటాడు.”
లేదా “ఎక్కువ ప్రయోజనం.”
లేదా “తేలిగ్గా.”
బహుశా తెలివిగల పిల్లవాణ్ణి సూచిస్తుండవచ్చు.