కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు భయపడండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి

యెహోవాకు భయపడండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి

యెహోవాకు భయపడండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి

“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”​—⁠ప్రసంగి 12:⁠13.

1, 2. (ఎ) భయం శారీరకంగా మనల్నెలా కాపాడగలదు? (బి)జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన భయాన్ని అలవరచడానికి ఎందుకు ప్రయత్నిస్తారు?

“ధైర్యం, ప్రాణాన్ని అపాయంలో పడవేస్తుంది, భయం కాపాడుతుంది” అని లియోనార్డో డావిన్సీ చెప్పాడు. వెర్రిసాహసం మానవుడు ప్రమాదాన్ని గ్రహించకుండా చేస్తుంది. అయితే, జాగ్రత్తగా ఉండమని భయం ఆయనకు గుర్తుచేస్తుంది. ఉదాహరణకు, మనం, నిట్రంగావున్న ఎత్తైన కొండ అంచుకు వెళ్ళాక, అక్కడి నుండి పడ్డామంటే ఎంత క్రిందకు పడతామో చూసినప్పుడు, మనలో చాలామందిమి సహజంగానే వెనుదిరుగుతాము. అదేవిధంగా, మనం ముందటి ఆర్టికల్‌లో నేర్చుకున్నట్లు, ఆరోగ్యకరమైన భయం, దేవునితో మనకున్న సంబంధాన్ని దృఢపరచడమే గాక, ప్రమాదం నుండి తప్పించుకునేందుకు కూడా సహాయపడుతుంది.

2 అయితే, ఆధునిక దినాల్లో అనేక రకాల ప్రమాదాలను గురించిన భయాన్ని నేర్చుకోవలసివుంది. చిన్న పిల్లలకు, విద్యుత్‌ ప్రమాదాల గురించి గానీ ట్రాఫిక్‌ ప్రమాదాల గురించి గానీ తెలియదు కనుక, వాళ్ళు తీవ్రమైన ప్రమాదాలకు సులభంగా గురికావచ్చు. * జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన భయాన్ని అలవరచడానికి ప్రయత్నిస్తూ, పరిసరాల్లో కలిగే ప్రమాదాలను గురించి వారిని హెచ్చరిస్తూనే ఉంటారు. ఈభయం తమ పిల్లల ప్రాణాన్ని కాపాడుతుందని తల్లిదండ్రులకు తెలుసు.

3. యెహోవా ఆధ్యాత్మిక ప్రమాదాలను గురించి మనలను ఎందుకు, ఎలా హెచ్చరిస్తాడు?

3 అలాగే యెహోవా కూడా మన క్షేమాన్ని గురించి చింతిస్తున్నాడు. ప్రేమగల తండ్రిగా, ఆయన మన ప్రయోజనార్థం తన వాక్యం ద్వారా తన సంస్థ ద్వారా మనకు బోధిస్తున్నాడు. (యెషయా 48:​17) ఈదైవిక బోధనా కార్యక్రమం యొక్క ఒక ఉద్దేశం, మనం అలాంటి ప్రమాదాన్ని గురించిన ఆరోగ్యకరమైన భయాన్ని అలవరచుకునేందుకుగాను, ఆధ్యాత్మిక ప్రమాదాలను గురించి మనకు హెచ్చరికా “వర్తమానము పంపుచు” ఉండాలన్నదే. (2 దినవృత్తాంతములు 36:​15; 2 పేతురు 3:​1,2) ‘ప్రజలు తమ దేవునికి భయపడేలా, ఆయన ఆజ్ఞలన్నిటిని ఎల్లవేళలా అనుసరించేలా తమ మనస్సును’ మలచుకొనివుంటే చరిత్రలో జరిగిన అనేకానేక ఆధ్యాత్మిక విపత్తులు నివారించబడేవి, అనేక బాధలు తప్పేవి. (ద్వితీయోపదేశకాండము 5:​29) ఈ“అపాయకరమైన కాలము”లలో దేవునికి భయపడేలా మన హృదయాన్నెలా మలచుకోవచ్చు, ఆధ్యాత్మిక ప్రమాదాన్ని ఎలా నివారించుకోవచ్చు?​—⁠2 తిమోతి 3:⁠1.

చెడుతనం నుండి తొలగిపోండి

4. (ఎ) క్రైస్తవులు దేని మీద అసహ్యాన్ని పెంచుకోవాలి? (బి)పాపభరితమైన ప్రవర్తనను గురించి యెహోవా ఎలా భావిస్తాడు? (అధఃసూచి చూడండి.)

4 “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే” అని బైబిలు వివరంగా చెబుతోంది. (సామెతలు 8:​13) అసహ్యించుకోవడమని ఇక్కడ ఉద్దేశించినది, “వ్యతిరేకించబడిన, అసహ్యించుకోబడిన, తృణీకరించబడిన వ్యక్తులు లేదా విషయాల పట్ల భావోద్వేగపరంగా కలిగే భావము, అలాంటి వారితో లేదా వాటితో ఎలాంటి సంప్రదింపులు గానీ సంబంధాలు గానీ పెట్టుకోకూడదని ఒకరు కోరుకుంటారు” అని ఒక బైబిలు నిఘంటువు చెబుతోంది. కనుక, దేవుని భయంలో, యెహోవా దృష్టిలో చెడుతనమైన దాని పట్ల అంతర్గత ఏవగింపు లేదా వెక్కసము కూడా మిళితమై ఉంటాయి. * (కీర్తన 97:​10) మనం నిట్రంగావున్న ఎత్తైన కొండ అంచున ఉన్నప్పుడు మనకు సహజంగా కలిగే భయం మనలను హెచ్చరించినప్పుడు మనమెలా వెనక్కి వస్తామో, అలాగే, దేవుని భయం మనం చెడు నుండి వెనుదిరగడానికి పురికొల్పుతుంది. అందుకే, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు” అని బైబిలు చెబుతోంది.​—⁠సామెతలు 16:⁠6.

5. (ఎ) మనం మన దైవ భయాన్ని, చెడుతనంపై అసహ్యాన్ని ఎలా పెంచుకోగలము? (బి)ఈ విషయంలో ఇశ్రాయేలు జనాంగపు చరిత్ర మనకు ఏ పాఠం నేర్పుతుంది?

5 పాపం వల్ల కలిగే హానికరమైన అనివార్య పర్యవసానాలను పరిశీలించడం ద్వారా మనం ఆరోగ్యకరమైన భయాన్ని, చెడుతనంపై అసహ్యాన్ని పెంచుకోవచ్చు. శరీరేచ్ఛలను బట్టే కానివ్వండి, ఆత్మను బట్టే కానివ్వండి, మనమేమి విత్తుతామో అదే కోస్తామని బైబిలు ఖచ్చితంగా చెబుతోంది. (గలతీయులు 6:​7,8) కాబట్టి, తన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసి, సత్యారాధనను వదిలిపెడితే కలిగే అనివార్య దుష్ఫలితాల గురించి యెహోవా స్పష్టంగా వివరించి చెప్పాడు. దేవుని కాపుదల లేకపోతే, సులభంగా దాడికి గురికాగల చిన్న జనాంగమైన ఇశ్రాయేలు పొరుగున ఉన్న క్రూరమైన శక్తివంతమైన జనాంగాల చేతుల్లో చిక్కుకుపోయేది. (ద్వితీయోపదేశకాండము 28:​15,45-48) మనం పాఠం నేర్చుకునేలా, దైవ భయాన్ని అలవర్చుకునేలా “మనల్ని హెచ్చరించాలని” ఇశ్రాయేలు అవిధేయత చూపినందువల్ల కలిగిన విషాదకరమైన పర్యవసానం గురించి బైబిలులో వివరంగా వ్రాయబడింది.​—⁠1 కొరింథీయులు 10:​11, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

6. దేవుని భయాన్ని నేర్చుకోవడంలో, లేఖనాల్లోవున్న ఎలాంటి ఉదాహరణలను గురించి ఆలోచించవచ్చు? (అధఃసూచి చూడండి.)

6 మొత్తమ్మీద ఇశ్రాయేలు జనాంగానికి జరిగినవే కాక, అసూయ, అనైతికత, దురాశ, గర్వం వంటి వాటికి లోనైన వ్యక్తుల నిజ జీవితానుభవాలు కూడా బైబిలులో వ్రాయబడ్డాయి. * ఈమనుష్యుల్లో కొందరు యెహోవాను అనేక సంవత్సరాలు సేవించారు, కానీ తమ జీవితంలో ఒకానొక నిర్ణాయక సందర్భంలో, వారికున్న దేవుని భయం కావలసినంత దృఢంగా లేనందువల్ల, వారు చాలా విషాదకరమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చింది. లేఖనాల్లోవున్న అలాంటి ఉదాహరణలను ధ్యానించడం ద్వారా, మనం కూడా అలాంటి తప్పులు చేయకుండా ఉండాలన్న మన దృఢ నిశ్చయతను మరింత బలపరచుకోవచ్చు. మన సొంత జీవితంలో దుస్సంఘటనలు సంభవించేంతవరకూ దేవుని సలహాను హృదయంలోకి తీసుకోకపోతే, అదెంత విచారకరంగా ఉంటుంది! అనుభవం, ముఖ్యంగా సొంత అనుభవమే గొప్ప గురువు అని అందరూ అనుకుంటున్నది నిజం కాదు.​—⁠కీర్తన 19:⁠7.

7. యెహోవా తన ఆలంకారిక గుడారంలోకి ఎవరిని ఆహ్వానిస్తాడు?

7 మనం దేవుని భయాన్ని అలవరచుకునేందుకు మరొక శక్తివంతమైన కారణం, దేవునితో మనకున్న సంబంధాన్ని కాపాడుకోవాలని మనకుండే కోరిక. మనం యెహోవా స్నేహాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాము కనుక, ఆయనను అప్రీతిపరచడానికి భయపడతాము. ఆలంకారికమైన తన గుడారానికి ఆహ్వానించేందుకు తన స్నేహితునిగా దేవుడు ఎవరిని ఎంచుతాడు? “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించు”వారిని మాత్రమే ఆయనలా ఎంచుతాడు. (కీర్తన 15:​1,2) మనకు మన సృష్టికర్తతో సంబంధముండడం ఒక ఆధిక్యత. మనం దానికి విలువిస్తే, మనమాయన దృష్టిలో యథార్థవంతులముగా నడుచుకోవడానికి శ్రద్ధ చూపుతాము.

8. మలాకీ కాలంలోని కొందరు ఇశ్రాయేలీయులు దేవునితో తమకున్న స్నేహాన్ని ఎలా తేలికగా తీసుకున్నారు?

8 విచారకరంగా, మలాకీ కాలంలోని కొందరు ఇశ్రాయేలీయులు దేవునితో తమకున్న స్నేహాన్ని తేలికగా తీసుకున్నారు. యెహోవాకు భయపడడానికీ, ఆయనను ఘనపరచడానికీ బదులు, వాళ్ళు ఆయన బలిపీఠం మీద రోగము, అంగవైకల్యము గల జంతువులను బలిగా అర్పించారు. వారికి దేవుని భయం కొరవడిందన్నది, వివాహ బంధం పట్ల వారికున్న దృక్పథంలో కూడా ప్రతిబింబించబడింది. పడుచు అమ్మాయిలను పెళ్ళి చేసుకునేందుకు, తాము యౌవనంలో పెళ్ళి చేసుకున్న భార్యలకు స్వల్ప కారణాల మీద విడాకులిచ్చారు. భార్యలను “పరిత్యజించుట”ను యెహోవా ఎంతో అసహ్యించుకున్నాడని, మోసపూరితమైన వారి దృక్పథం వారిని దేవునికి దూరం చేసిందని మలాకీ చెప్పాడు. ఆలంకారికంగా చెప్పాలంటే, వదిలేయబడినందువల్ల తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తున్న భార్యల కన్నీటితో బలిపీఠం నిండివుండగా, వారి బలులకు యెహోవా ఎలా ఆనందించగలడు? తన ప్రమాణాలకు అంత ఘోరంగా అగౌరవం చూపినప్పుడు, “నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు?” అని అడిగేందుకు యెహోవా కదిలించబడ్డాడు.​—⁠మలాకీ 1:6-8; 2:13-16.

9, 10. మనం యెహోవా స్నేహానికి విలువిస్తామని ఎలా చూపించగలం?

9 నేడు కూడా, స్వార్థపరులు, దుర్నీతిపరులు అయిన భర్తలు, తండ్రులు, లేదా భార్యలు, తల్లుల చేత వదిలేయబడిన నిర్దోషులైన అనేక మంది వివాహ జతలు, పిల్లలు అనుభవిస్తున్న హృదయ విదారక పరిస్థితిని యెహోవా చూస్తున్నాడు. అది ఆయనకు ఖచ్చితంగా దుఃఖం కలిగిస్తుంది. దేవుని స్నేహితుడు, విషయాలను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టిస్తాడు, తన వివాహ బంధాన్ని బలపరచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తాడు, వివాహ బంధం యొక్క ప్రాముఖ్యతను తేలిగ్గా తీసుకునేలా చేసే లోక ఆలోచనా సరళిని తిరస్కరిస్తాడు, ‘జారత్వానికి దూరంగా పారిపోతాడు.’​—⁠1 కొరింథీయులు 6:⁠18.

10 యెహోవా స్నేహం పట్ల కృతజ్ఞతాభావమూ, దానితోపాటు, వైవాహిక జీవితంలోను, జీవితంలోని ఇతర రంగాల్లోను, యెహోవా దృష్టిలో చెడ్డదైన ప్రతిదాని పట్ల అసహ్యమూ ఉంటే యెహోవా అనుగ్రహాన్ని, అంగీకారాన్ని పొందవచ్చు. “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని అపొస్తలుడైన పేతురు దృఢంగా పేర్కొన్నాడు. (అపొస్తలుల కార్యములు 10:​34,35) విషమకరమైన వివిధ పరిస్థితుల్లోను సరైనదానినే చేసేందుకు దేవుని భయం వ్యక్తులనెలా కదిలించిందో చూపించే అనేక ఉదాహరణలు లేఖనాల్లో ఉన్నాయి.

దేవునికి భయపడిన ముగ్గురు వ్యక్తులు

11. అబ్రాహాము “దేవునికి భయపడువాడ”ని ఎలాంటి పరిస్థితుల్లో ప్రకటించబడ్డాడు?

11 తన స్నేహితుడని బైబిలులో యెహోవాయే స్వయంగా చెప్పిన వ్యక్తి ఒకరున్నారు, ఆయన పూర్వికుడైన అబ్రాహాము. (యెషయా 41:⁠8) అబ్రాహాము సంతానం గొప్ప జనముగా మారుతుందని యెహోవా చేసిన వాగ్దానం ఎవరి ద్వారా నెరవేరనుందో ఆ ఏకైక కుమారుడైన ఇస్సాకునే తనకు బలిగా అర్పించమని యెహోవా ఆయనను అడిగినప్పుడు ఆయనకున్న దేవుని భయము పరీక్షించబడింది. (ఆదికాండము 12:2, 3; 17:​19) ‘దేవుని స్నేహితుడు’ ఈబాధాకరమైన పరీక్షలో నెగ్గాడా? (యాకోబు 2:​23) అబ్రాహాము ఇస్సాకును చంపడానికి కత్తి ఎత్తిన క్షణంలోనే, యెహోవా దూత ఆయనతో, “ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.”​—⁠ఆదికాండము 22:10-12.

12. అబ్రాహాముకున్న దేవుని భయం ఏమి చేయడానికి పురికొల్పింది, మనం కూడా అలాంటి దృక్పథాన్నెలా కనబరచగలము?

12 తనకు యెహోవా భయముందని అబ్రాహాము అంతకుముందే నిరూపించుకున్నప్పటికీ, ఆసందర్భంలో ఆయన దేవుని భయాన్ని అత్యంత ఉత్కృష్టమైన విధంగా కనబరచాడు. ఇస్సాకును బలివ్వడానికి ఆయన చూపించిన సుముఖత, గౌరవపూర్వకమైన విధేయతను ప్రదర్శించడం కన్నా చాలా ఎక్కువే. అవసరమైతే, తన పరలోక తండ్రి, ఇస్సాకును పునరుత్థానం చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చగలడన్న సంపూర్ణ నమ్మకం చేత అబ్రాహాము పురికొల్పబడ్డాడు. పౌలు వ్రాసినట్లు, ‘తాను వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని అబ్రాహాము రూఢిగా విశ్వసిం[చాడు].’ (రోమీయులు 4:​16-21) చాల గొప్ప త్యాగాలను చేయవలసి వచ్చినప్పటికీ, దేవుని చిత్తాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉంటామా? యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” అలాంటి విధేయత దీర్ఘకాల ప్రయోజనాలను తెస్తుందని మనకు సంపూర్ణమైన నమ్మకం ఉందా? (హెబ్రీయులు 11:⁠6) అదే నిజమైన దేవుని భయం.​—⁠కీర్తన 115:⁠11.

13. “నేను దేవునికి భయపడువాడను” అని యోసేపు స్వయంగా ఎందుకు చెప్పుకోగలిగాడు?

13 క్రియల్లో దైవ భయాన్ని చూపిన మరొకరిని అంటే యోసేపు ఉదాహరణను పరిశీలిద్దాం. పోతీఫరు ఇంటిలో దాసుడిగా ఉన్న యోసేపు, వ్యభిచారం చేయడానికి ప్రతిరోజూ ఒత్తిడి చేయబడ్డాడు. తనతో శయనించమని పట్టుబడుతున్న యజమాని భార్యకు తాను తారసపడకుండా ఉండే మార్గమే లేదన్నది స్పష్టమవుతుంది. చివరికి, ఆమె “అతని వస్త్రము పట్టుకొని”నప్పుడు, ఆయన ‘తప్పించుకొని బయటికి పారిపోయాడు.’ చెడుతనమునుండి వెంటనే తొలగిపోవడానికి ఆయనను పురికొల్పినదేమిటి? నిస్సందేహంగా ఆయనను పురికొల్పిన ముఖ్య కారకం, దేవుని భయం, ‘అంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము’ చేయకుండా తప్పించుకోవాలన్న కోరిక. (ఆదికాండము 39:​7-12) అందుకే, యోసేపు “నేను దేవునికి భయపడువాడను” అని యుక్తంగా చెప్పుకోగలిగాడు.​—⁠ఆదికాండము 42:⁠18.

14. యోసేపు చూపిన కరుణ, దేవుని పట్ల నిజమైన భయాన్నెలా కనబరచింది?

14 తనను దాసునిగా నిర్దయగా అమ్మివేసిన తన సహోదరులను సంవత్సరాల తర్వాత యోసేపు ముఖాముఖిగా కలిశాడు. వాళ్ళు తనకు చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశంగా, ఆయన వాళ్ళ కరవును సులభంగా ఉపయోగించుకోగలిగేవాడు. కానీ ప్రజలతో కఠినంగా వ్యవహరించడం దేవుని భయాన్ని ప్రతిబింబించదు. (లేవీయకాండము 25:​43) అందుకే, తన సహోదరుల హృదయం మారిందనేదానికి కావలసినన్ని రుజువులు కనిపించినప్పుడు, యోసేపు వారిని కరుణాపూర్వకంగా క్షమించాడు. యోసేపులాగే, మన దేవుని భయం, కీడును మంచితో జయించేందుకు, అలాగే, శోధనలో పడకుండా వెనుదిరిగేందుకు మనలను పురికొల్పుతుంది.​—⁠ఆదికాండము 45:1-11; కీర్తన 130:3, 4; రోమీయులు 12:17-21.

15. యోబు ప్రవర్తన యెహోవా హృదయాన్నెందుకు సంతోషపెట్టింది?

15 దేవునికి భయపడిన మరొక ఉత్కృష్టమైన ఉదాహరణ యోబు. “నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు” అని యెహోవా అపవాదితో అన్నాడు. (యోబు 1:⁠8) అనేక సంవత్సరాలుగా, యోబు చూపిన యథార్థ ప్రవర్తన ఆయన పరలోక తండ్రి హృదయాన్ని సంతోషపరచింది. యోబు దేవునికి భయపడ్డాడు, ఎందుకంటే, అదే సరైనదనీ, జీవించవలసిన శ్రేష్ఠమైన విధానమనీ ఆయనకు తెలుసు. “యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు” యోబు చెప్పాడు. (యోబు 28:​28) వివాహితుడైన యోబు, యువతులను అనుచితంగా చూడనూ లేదు, వ్యభిచార చింతలు ఆయన హృదయంలో చోటుచేసుకోనూ లేదు. ఆయన ఎంతో ధనవంతుడైనప్పటికీ, ఆయన తన ధనాన్ని నమ్ముకోవడానికి నిరాకరించాడు, ఆయన అన్ని రకాల విగ్రహారాధనలకూ దూరంగా ఉన్నాడు.​—⁠యోబు 31:1, 9-11, 24-28.

16. (ఎ) యోబు ఏయే విధాల్లో ప్రేమపూర్వక దయను కనబరచాడు? (బి)తాను క్షమాభిక్ష పెట్టకుండా ఉండలేదని యోబు ఏ విధంగా కనబరచాడు?

16 ఏది ఏమైనప్పటికీ, దేవుని భయమంటే, సరైనది చేయడమూ, చెడుతనాన్ని విడిచిపెట్టడమే. కాబట్టి, యోబు గ్రుడ్డి, కుంటి, బీదల మీద దయాపూర్వక శ్రద్ధ చూపించాడు. (లేవీయకాండము 19:14; యోబు 29:​15,16) “తన తోటివాడికి ప్రేమపూర్వక దయను చూపనివాడు, సర్వశక్తుని భయాన్ని కూడా వదిలిపెడతాడు” అని యోబు గ్రహించాడు. (యోబు 6:​14, NW) క్షమాభిక్ష పెట్టకపోవడమూ లేక పగపెట్టుకోవడం కూడా ప్రేమపూర్వక దయను కనబరచకపోవడంలో భాగమే. తనను ఎంతగానో బాధపెట్టిన తన ముగ్గురు సహచరుల పక్షాన, దేవుని నిర్దేశానుసారంగా యోబు ప్రార్థన చేశాడు. (యోబు 42:​7-10) ఏదో ఒక విధంగా మనలను బాధపెట్టిన తోటి విశ్వాసిని మన్నించడం ద్వారా మనం కూడా క్షమించే స్ఫూర్తిని కనబరుస్తామా? మనలను బాధపెట్టిన వారి పక్షాన హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం, కోపాన్ని అధిగమించడానికి చాలా సహాయపడుతుంది. దేవుని భయం మూలంగా యోబు పొందిన ఆశీర్వాదాలు, ‘తనయందు భయభక్తులుగలవారి నిమిత్తము యెహోవా దాచివుంచిన మేలు యెంతో గొప్పది’ అని మనకు చూపిస్తున్నాయి.​—⁠కీర్తన 31:19; యాకోబు 5:⁠11.

దేవుని భయమూ - మనుష్య భయమూ

17. మనుష్య భయం మనకేమి చేయగలదు, అలాంటి భయానికి దూరపు చూపు లేదని ఎందుకు చెప్పవచ్చు?

17 దేవుని భయం, మనం సరైనది చేసేలా పురికొల్పుతుంది, కానీ మనుష్య భయం మన విశ్వాసాన్ని అణచివేయగలదు. ఈకారణాన, యేసు, అత్యంతాసక్తితో సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని అపొస్తలులను ప్రోత్సహించినప్పుడు, “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి” అని చెప్పాడు. (మత్తయి 10:​28) మానవులు భవిష్యత్‌ జీవిత నిరీక్షణలను లేకుండా చేయలేరు కనుక, మనుష్య భయానికి దూరపు చూపు లేదని యేసు స్పష్టం చేశాడు. అంతేకాక, మనం దేవునికి భయపడడానికి కారణం, ఆయనకున్న సంభ్రమాశ్చర్యాలను కలిగించే శక్తిని గుర్తించడమే, ఆశక్తితో పోల్చితే, సమస్త జనాంగాల శక్తంతా కలిపినా స్వల్పంగానే ఉంటుంది. (యెషయా 40:​15) అబ్రాహాములాగే, మనకు కూడా, తన నమ్మకమైన సేవకులను పునరుత్థానం చేసే యెహోవా శక్తిపై సంపూర్ణ విశ్వాసముంది. (ప్రకటన 2:​10) కనుక, “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?” అని మనం నమ్మకంగా చెబుతాము.​—⁠రోమీయులు 8:⁠31.

18. తనకు భయపడేవారికి యెహోవా ఏ విధంగా ప్రతిఫలమిస్తాడు?

18 మన వ్యతిరేకి, కుటుంబ సభ్యుడైనా సరే, స్కూల్లో మనలను ఏడిపిస్తున్నవారైనా సరే, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును” అని మనం కనుగొంటాం. (సామెతలు 14:​26) దేవుడు మన ప్రార్థనలను వింటాడని తెలుసుకుని, బలం కోసం ఆయనకు ప్రార్థించగలము. (కీర్తన 145:19) తనకు భయపడేవారిని యెహోవా ఎన్నడూ మరిచిపోడు. “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను” అని తన ప్రవక్తయైన మలాకీ ద్వారా యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు.​—⁠మలాకీ 3:⁠16.

19. ఎలాంటి భయాలు అంతమౌతాయి, కానీ ఎవరి భయం నిరంతరం నిలుస్తుంది?

19 భూమి మీద ఉండే ప్రతి ఒక్కరూ యెహోవాను ఆరాధించే సమయం, మనుష్య భయం లేని సమయం ఆసన్నమైంది. (యెషయా 11:⁠9) ఆకలి, వ్యాధి, నేరాలు, యుద్ధాలు మొదలైనవాటిని గురించిన భయం గతించిపోతుంది. పరలోకంలోను, భూమిమీదా, యెహోవా యొక్క నమ్మకమైన సేవకులు ఆయనకు గౌరవాన్ని, విధేయతనూ, ఘనతనూ చూపడంలో కొనసాగుతుండగా యెహోవా భయం మాత్రం శాశ్వతకాలం ఉంటుంది. (ప్రకటన 15:⁠3,4) ఈలోగా, మనమందరమూ, “పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు” అని సొలొమోను ఇచ్చిన ప్రేరేపిత ఉపదేశాన్ని హృదయంలోకి తీసుకుందాం.​—⁠సామెతలు 23:17,18.

[అధస్సూచీలు]

^ పేరా 2 కొందరు పెద్దవాళ్ళు నిరంతరం అపాయకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నందువల్ల ప్రమాదాన్ని గురించిన భయాన్ని కోల్పోతున్నారు. చాలా మంది వడ్రంగివాళ్ళు వేళ్ళను ఎందుకు పోగొట్టుకుంటున్నారని అడిగినప్పుడు, “వాళ్ళకు హై స్పీడ్‌ విద్యుత్‌ రంపాలను గురించిన భయం కోల్పోవడమే” కారణమని అనుభవజ్ఞుడైన ఒక క్రాఫ్ట్స్‌మ్యాన్‌ చెప్పాడు.

^ పేరా 4 యెహోవా కూడా అలాగే అసహ్యించుకుంటాడు. ఉదాహరణకు, మన నోట “దుర్భాష” ఏదీ రాకూడదని ఎఫెసీయులు 4:⁠29 మనకు ఉద్బోధిస్తుంది. ‘దుర్‌’ అన్న మాటకు గ్రీకు లేఖనాల్లో ఉపయోగించబడిన మాట, కుళ్ళిపోయి వాసన వస్తున్న పండ్లను చేపలను లేదా మాంసాన్ని సూచిస్తుంది. అలాంటి మాట, దుర్భాషను లేదా అసభ్యమైన మాటలను విన్నప్పుడు, మనకు కలగవలసిన అసహ్యాన్ని స్పష్టంగా సూచిస్తుంది. అదేవిధంగా, ద్వితీయోపదేశకాండము 29:​17, యెహెజ్కేలు 6:⁠9వంటి లేఖనాల్లో కనిపిస్తున్న “విగ్రహాలు” అన్నమాట నిజానికి హీబ్రూలో “పెంట విగ్రహాలు” అని కనిపిస్తుంది. ఏ విధమైన విగ్రహారాధననైనా యెహోవా ఎంతగా అసహ్యించుకుంటాడన్నది, పెంట లేదా మలం చూస్తే మనకు సహజంగా కలిగే ఏవగింపును బట్టి అర్థం అవుతుంది.

^ పేరా 6 ఉదాహరణకు, లేఖనాల్లో ఉన్న కయీను (ఆదికాండము 4:3-12); దావీదు (2 సమూయేలు 11:2–12:14); గేహజీ (2 రాజులు 5:20-27); ఉజ్జియా (2 దినవృత్తాంతములు 26:​16-21) మొదలైనవారి వృత్తాంతాలను పరిశీలించండి.

మీకు జ్ఞాపకముందా?

• చెడుతనాన్ని అసహ్యించుకోవడం మనమెలా నేర్చుకుంటాం?

• మలాకీ కాలంలోని కొందరు ఇశ్రాయేలీయులు యెహోవా స్నేహాన్నెలా తేలికగా తీసుకున్నారు?

• అబ్రాహాము, యోసేపు, యోబుల నుండి దేవుని భయాన్ని గురించి మనమేమి నేర్చుకోగలం?

• ఎవరి భయం ఎల్లప్పుడూ ఉంటుంది, ఎందుకని?

[అధ్యయన ప్రశ్నలు]

[19వ పేజీలోని చిత్రం]

జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఆరోగ్యకరమైన భయాన్ని అలవరుస్తారు

[20వ పేజీలోని చిత్రం]

భయం, ప్రమాదం నుండి వెనక్కి మళ్ళించినట్లే, దేవుని భయం మనలను చెడ్డవాటి నుండి వెనక్కి మళ్ళిస్తుంది

[23వ పేజీలోని చిత్రం]

ముగ్గురు అబద్ధ స్నేహితులను కలిశాక కూడా యోబు దేవుని భయాన్ని కాపాడుకున్నాడు

[చిత్రసౌజన్యం]

From the Bible translation Vulgata Latina, 1795