యోబు 6:1-30

  • యోబు జవాబు (1-30)

    • బాధతో అరవడాన్ని సమర్థించుకున్నాడు (2-6)

    • అతన్ని ఓదార్చేవాళ్లు మోసగాళ్లు (15-18)

    • “నిజాయితీగా మాట్లాడే మాటలు బాధపెట్టవు!” (25)

6  అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:   “నా వేదన+ పూర్తిగా తూచబడితే బావుండు!నా ఆపదతో పాటు దాన్ని త్రాసులో ఉంచితే బావుండు!   అది సముద్రపు ఇసుక కన్నా బరువుగా ఉంది. అందుకే నేను వెర్రిమాటలు* మాట్లాడాను.+   సర్వశక్తిమంతుని బాణాలు నాలోకి దూసుకెళ్లాయి,నా శరీరం వాటి విషాన్ని తాగుతోంది;+దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు, నేను చాలా భయపడుతున్నాను.   గడ్డి ఉండగా అడవి గాడిద+ ఓండ్ర పెడుతుందా?మేత ఉండగా ఎద్దు రంకె వేస్తుందా?   రుచిలేని ఆహారాన్ని ఉప్పు కలపకుండా తింటారా?గుడ్డు సొనకు రుచి ఉంటుందా?   వాటిని ముట్టుకోవడం కూడా నాకు ఇష్టముండదు. అవి నాకు కలుషితమైన ఆహారం లాంటివి.   నా విన్నపం నెరవేరితే బావుండు,దేవుడు నా కోరికను తీరిస్తే బావుండు!   నన్ను నలగ్గొట్టడం దేవునికి ఇష్టమవ్వాలి,ఆయన తన చెయ్యి చాపి నన్ను చంపేయాలి!+ 10  చివరికి అది కూడా నాకు ఓదార్పునిస్తుంది;తీవ్రమైన బాధలో ఉన్నా నేను ఆనందంతో గంతులు వేస్తాను,ఎందుకంటే, పవిత్రుడైన దేవుని+ మాటల్ని నేను తిరస్కరించలేదు. 11  ఇంకా ఎదురుచూస్తూ ఉండే శక్తి నాకుందా?+ నా కోసం ఏం మంచి మిగిలివుందని నేనింకా బ్రతకాలి? 12  నా బలం రాళ్ల లాంటిదా? నా శరీరం రాగితో చేయబడిందా? 13  ఎవరూ నాకు సహాయం చేయట్లేదు,మరి నాకు నేను ఏ విధంగా సహాయం చేసుకోగలను? 14  సాటిమనిషి పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించకుండా ఉండేవాడు,+సర్వశక్తిమంతునికి భయపడడం కూడా మానేస్తాడు.+ 15  నా స్నేహితులు* చలికాలపు వాగులా నమ్మదగని వాళ్లు,+వాళ్లు చలికాలంలో ప్రవహించి ఎండిపోయే కాలువల్లా ఉన్నారు. 16  అవి మంచు వల్ల నల్లబడతాయి,కరిగే మంచు వాటిలో దాగివుంటుంది. 17  అయితే వేసవికాలంలో అవి ఎండిపోయి లేకుండా పోతాయి;ఎండలు ఎక్కువైనప్పుడు ఇంకిపోతాయి. 18  అవి వంపులు తిరుగుతూ ప్రవహిస్తాయి;ఎడారిలోకి వెళ్లి కనుమరుగౌతాయి. 19  తేమా+ వర్తకులు వాటి కోసం చూస్తారు;షేబ+ ప్రయాణికులు* వాటి కోసం ఎదురుచూస్తారు. 20  వాటిని నమ్ముకున్నందుకు వాళ్లు సిగ్గుపడతారు;నిరాశపడడానికే వాళ్లు అక్కడికి వస్తారు. 21  మీరు కూడా నాకు అలానే ఉన్నారు;+నాకు వచ్చిన కష్టం ఎంత ఘోరమైనదో చూసి భయపడుతున్నారు.+ 22  ‘నాకేమైనా ఇవ్వండి’ అని నేను మీతో అన్నానా? లేదా మీ ఆస్తిలో నుండి నాకొక బహుమానం ఇవ్వమని అడిగానా? 23  శత్రువు చేతి నుండి నన్ను కాపాడమని గానీఅణచివేసేవాళ్ల నుండి రక్షించమని* గానీ అడిగానా? 24  నాకు ఉపదేశించండి, నేను మౌనంగా ఉంటాను;+నా తప్పేంటో తెలుసుకునేలా నాకు సహాయం చేయండి. 25  నిజాయితీగా మాట్లాడే మాటలు బాధపెట్టవు!+ కానీ మీ గద్దింపుల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?+ 26  నా మాటల్ని సరిదిద్దాలని మీరు అనుకుంటున్నారా?అవి కృంగిపోయినవాడి మాటలు,+ గాలికి కొట్టుకుపోయే మాటలు. 27  మీరు అనాథల కోసం చీట్లు* వేస్తారు,+మీ సొంత స్నేహితుణ్ణే అమ్మేస్తారు!+ 28  కాబట్టి ఇటు తిరిగి నా వైపు చూడండి,నేను మీతో అబద్ధాలు చెప్పను. 29  దయచేసి ఇంకోసారి ఆలోచించండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి;అవును, ఇంకోసారి ఆలోచించండి, నేను ఇప్పటికీ నీతిమంతుణ్ణే. 30  నా నాలుక అన్యాయంగా మాట్లాడుతోందా? నా అంగిలి తప్పును పసిగట్టలేదా?

అధస్సూచీలు

లేదా “దురుసుగా, ఆలోచించకుండా.”
అక్ష., “సొంత సహోదరులు.”
లేదా “సెబాయీయుల ప్రయాణికుల గుంపు.”
అక్ష., “విడిపించమని.”
పదకోశం చూడండి.