యోబు 1:1-22
1 ఊజు దేశంలో యోబు*+ అనే ఒకతను ఉండేవాడు. అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు;*+ అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉండేవాడు.
2 అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉండేవాళ్లు.
3 అతనికి 7,000 గొర్రెలు; 3,000 ఒంటెలు; 1,000* పశువులు; 500 ఆడ గాడిదలు ఉండేవి; అతనికి చాలామంది పనివాళ్లు కూడా ఉండేవాళ్లు. తూర్పు దేశస్థులందరిలో అతను గొప్పవాడు.
4 అతని కుమారుల్లో ప్రతీ ఒక్కరు తమ వంతు ప్రకారం* తమ ఇంట్లో విందు ఏర్పాటు చేసి, దానికి తమ ముగ్గురు సహోదరీలను ఆహ్వానించేవాళ్లు.
5 ఆ విందు రోజులు పూర్తయిన తర్వాత యోబు వాళ్లను పవిత్రపర్చడానికి పిలిపించేవాడు. ఎందుకంటే, “నా పిల్లలు* పాపం చేశారేమో, తమ హృదయంలో దేవుణ్ణి దూషించారేమో” అని యోబు అనుకునేవాడు. అతను ఉదయాన్నే లేచి వాళ్లలో ప్రతీ ఒక్కరి కోసం దహనబలులు అర్పించేవాడు.+ యోబు ఎప్పుడూ అలాగే చేసేవాడు.+
6 సత్యదేవుని కుమారులు*+ యెహోవా సన్నిధిలో నిలబడే+ రోజు ఒకటి వచ్చింది, అప్పుడు సాతాను+ కూడా వాళ్లతోపాటు వచ్చి నిలబడ్డాడు.+
7 యెహోవా సాతానును, “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు సాతాను యెహోవాతో, “నేను భూమ్మీద అటూఇటూ తిరుగుతూ అంతటా సంచరించి వచ్చాను”+ అన్నాడు.
8 అప్పుడు యెహోవా సాతానుతో ఇలా అన్నాడు: “నువ్వు నా సేవకుడైన యోబును గమనించావా? భూమ్మీద అతని లాంటివాళ్లు ఎవరూ లేరు. అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు;*+ అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నాడు.”
9 అందుకు సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: “యోబు ఊరికే దేవునిపట్ల భయభక్తులు కలిగి ఉన్నాడా?+
10 నువ్వు అతని చుట్టూ, అతని ఇంటివాళ్ల చుట్టూ, అతనికున్న వాటన్నిటి చుట్టూ కంచె వేశావు కదా.+ నువ్వు అతని చేతుల కష్టాన్ని దీవించావు,+ దానివల్ల అతని పశుసంపద దేశంలో ఎంతగానో విస్తరించింది.
11 అయితే, ఇప్పుడు నువ్వు నీ చెయ్యి చాపి అతనికున్న వాటన్నిటినీ తీసేయి, అతను ఖచ్చితంగా నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు.”
12 అప్పుడు యెహోవా సాతానుతో, “ఇదిగో! అతనివన్నీ నీ వశంలో* ఉన్నాయి. అయితే అతనికి మాత్రం ఏ హానీ చేయకు!” అన్నాడు. దాంతో సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు.+
13 ఒకరోజు యోబు కుమారులు, కూతుళ్లు అతని పెద్ద కుమారుడి ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా,+
14 ఒక సేవకుడు యోబు దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: “పశువులు పొలం దున్నుతున్నాయి, గాడిదలు వాటి పక్కన మేస్తున్నాయి.
15 ఇంతలో సెబాయీయులు దాడిచేసి వాటిని పట్టుకుపోయారు, సేవకుల్నేమో కత్తితో చంపేశారు. ఆ విషయం నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను.”
16 అతను మాట్లాడుతుండగానే ఇంకొకతను వచ్చి ఇలా చెప్పాడు: “ఆకాశం నుండి దేవుని అగ్ని* దిగివచ్చి గొర్రెల్ని, సేవకుల్ని పూర్తిగా దహించేసింది! ఆ విషయం నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను.”
17 అతను ఇంకా మాట్లాడుతుండగానే మరొకతను వచ్చి ఇలా చెప్పాడు: “కల్దీయులు+ మూడు గుంపులుగా వచ్చి దాడిచేసి ఒంటెల్ని పట్టుకుపోయారు, సేవకుల్నేమో కత్తితో చంపేశారు. ఆ విషయం నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను.”
18 అతను ఇంకా మాట్లాడుతుండగానే మరో సేవకుడు వచ్చి ఇలా చెప్పాడు: “నీ కుమారులు, కూతుళ్లు నీ పెద్ద కుమారుడి ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా,
19 అకస్మాత్తుగా ఎడారి* నుండి పెద్ద సుడిగాలి వచ్చి ఇంటి నాలుగు మూలల్ని కొట్టడంతో అది ఆ యౌవనుల మీద కూలి వాళ్లు చనిపోయారు. ఆ విషయం నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను.”
20 అప్పుడు యోబు లేచి తన వస్త్రాన్ని చింపుకొని, తలవెంట్రుకలు గొరిగించుకున్నాడు; తర్వాత అతను నేలమీద పడి, వంగి నమస్కారం చేసి
21 ఇలా అన్నాడు:
“నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను,దిగంబరిగానే వెళ్లిపోతాను.+
యెహోవాయే ఇచ్చాడు,+ యెహోవాయే తీసేసుకున్నాడు.
యెహోవా పేరు స్తుతించబడుతూ ఉండాలి.”
22 ఈ విషయాలన్నిటిలో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు తప్పు చేశాడని నిందించలేదు.
అధస్సూచీలు
^ బహుశా “శత్రుత్వానికి గురైనవాడు” అనే అర్థం ఉండవచ్చు.
^ లేదా “నిజాయితీగా నడుచుకునే యథార్థవంతుడు.”
^ అక్ష., “500 జతల.”
^ లేదా “నియమిత రోజున.”
^ అక్ష., “కుమారులు.”
^ లేదా “దేవదూతలు.”
^ లేదా “నిజాయితీగా నడుచుకునే యథార్థవంతుడు.”
^ అక్ష., “చేతిలో.”
^ లేదా “మెరుపులు” అయ్యుంటుంది.