యోబు 29:1-25
29 యోబు కావ్యరూపంలో ఇంకా ఇలా అన్నాడు:
2 “నేను గడిచిన నెలల్లో ఉన్నట్టు,దేవుడు నన్ను కాపాడుతున్న రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత బావుండు!
3 అప్పట్లో ఆయన తన దీపాన్ని నా తలమీద ప్రకాశింపజేసేవాడు,ఆయన వెలుగు సహాయంతో నేను చీకట్లో నడిచేవాణ్ణి,+
4 నేను మంచి వయసులో ఉండేవాణ్ణి,నాకు దేవునితో మంచి స్నేహం ఉండేది,+
5 సర్వశక్తిమంతుడు అప్పటికింకా నాతోనే ఉన్నాడు,నా పిల్లలు* నా చుట్టూ ఉండేవాళ్లు,
6 నా ప్రతీ అడుగు నేతిలోనే పడేది,నా కోసం బండల్లో నుండి నూనె ప్రవహించేది.+
7 నేను నగర ద్వారం దగ్గరికి వెళ్లి+సంతవీధిలో నా స్థానంలో కూర్చున్నప్పుడు,+
8 యువకులు నన్ను చూసి పక్కకు తప్పుకునేవాళ్లు,*వృద్ధులు కూడా లేచి నిలబడి ఉండేవాళ్లు.+
9 అధిపతులు మాట్లాడడం ఆపేసేవాళ్లు;తమ నోటిమీద చెయ్యి పెట్టుకునేవాళ్లు.
10 ప్రముఖుల నోళ్లు మూతపడేవి;వాళ్ల నాలుక అంగిలికి అంటుకుపోయేది.
11 నా మాటలు విన్నవాళ్లంతా నన్ను పొగిడేవాళ్లు,నన్ను చూసినవాళ్లు, నా గురించి మంచిగా సాక్ష్యమిచ్చేవాళ్లు.
12 ఎందుకంటే, సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను,తండ్రిలేని పిల్లల్ని, నిస్సహాయుల్ని నేను రక్షించేవాణ్ణి.+
13 చావుకు దగ్గరైనవాళ్లు నన్ను దీవించేవాళ్లు,+విధవరాళ్ల హృదయాన్ని నేను సంతోషపెట్టేవాణ్ణి.+
14 నేను నీతిని వస్త్రంలా ధరించేవాణ్ణి;న్యాయం నాకు చొక్కాలా,* తలపాగాలా ఉండేది.
15 నేను గుడ్డివాళ్లకు కళ్లలా,కుంటివాళ్లకు కాళ్లలా ఉండేవాణ్ణి.
16 నేను పేదవాళ్లకు తండ్రిలా ఉండేవాణ్ణి;+నాకు తెలియనివాళ్ల వ్యాజ్యాన్ని పరిశీలించేవాణ్ణి.+
17 నేను తప్పుచేసినవాళ్ల దవడలు పగలగొట్టేవాణ్ణి,+వాళ్ల పళ్ల మధ్య నుండి బాధితుల్ని లాగేసేవాణ్ణి.
18 నేను ఇలా అనుకునేవాణ్ణి: ‘నేను నా ఇంట్లోనే* చనిపోతాను,+నా రోజులు ఇసుక రేణువులంత ఎక్కువగా ఉంటాయి.
19 నా వేర్లు నీళ్లలోకి వ్యాపిస్తాయి,నా కొమ్మల మీద రాత్రంతా మంచు ఉంటుంది.
20 నా వైభవం అంతకంతకూ కొత్తదౌతుంది,నా చేతిలోని విల్లు బాణాల్ని సంధిస్తూనే ఉంటుంది.’
21 ప్రజలు నేను ఏం చెప్తానా అని ఎదురుచూసేవాళ్లు,నా సలహా కోసం మౌనంగా వేచివుండేవాళ్లు.+
22 నేను మాట్లాడిన తర్వాత, వాళ్లు మాట్లాడడానికి ఇంకేమీ ఉండేది కాదు;నా మాటలు వాళ్ల చెవులకు మృదువుగా ఉండేవి.
23 వర్షం కోసం ఎదురుచూసినట్టు వాళ్లు నాకోసం ఎదురుచూసేవాళ్లు;కడవరి వాన* కోసం చూసినట్టు నా మాటల కోసం ఆత్రంగా చూసేవాళ్లు.+
24 నేను వాళ్లను చూసి నవ్వినప్పుడు, వాళ్లు నమ్మలేకపోయేవాళ్లు;నా ముఖకాంతి వాళ్లకు అభయాన్నిచ్చేది.*
25 నేను వాళ్లకు ప్రధానుడిగా ఉండి నిర్దేశం ఇచ్చేవాణ్ణి,తన సైన్యాల మధ్య ఉన్న రాజులా జీవిస్తూ,+ఏడ్చేవాళ్లను ఓదార్చేవాణ్ణి.+
అధస్సూచీలు
^ లేదా “సేవకులు.”
^ అక్ష., “దాక్కునేవాళ్లు.”
^ లేదా “చేతుల్లేని నిలువుటంగీలా.”
^ అక్ష., “గూటిలోనే.”
^ కడవరి వానలు దాదాపు ఏప్రిల్ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
^ లేదా “వాళ్లు నా ముఖకాంతిని పోగొట్టేవాళ్లు కాదు” అయ్యుంటుంది.