లేవీయకాండం 25:1-55

  • విశ్రాంతి సంవత్సరం (1-7)

  • సునాద సంవత్సరం (8-22)

  • ఆస్తిని తిరిగి పొందడం (23-34)

  • పేదవాళ్లతో వ్యవహరించాల్సిన తీరు (35-38)

  • దాసత్వం గురించిన నియమాలు (39-55)

25  సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చినప్పుడు,+ విశ్రాంతి గురించి యెహోవా ఇచ్చిన నియమాన్ని పాటించాలి, దేశంలో మీరు పంట పండించకూడదు.+  ఆరు సంవత్సరాలు మీరు మీ పొలంలో విత్తనాలు విత్తాలి, మీ ద్రాక్షతోటలోని తీగల్ని కత్తిరించాలి. అలా మీరు మీ పంటను సమకూర్చుకుంటారు.+  కానీ ఏడో సంవత్సరం, విశ్రాంతి గురించి యెహోవా ఇచ్చిన నియమాన్ని పాటిస్తూ మీరు మీ భూమికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. మీరు మీ పొలంలో ​విత్త​నాలు విత్తకూడదు, మీ ద్రాక్షతోటలోని తీగల్ని కత్తిరించకూడదు.  కోత కోసిన తర్వాత మిగిలిన ధాన్యం వల్ల దానంత​టదే పండిన పంటను మీరు కోయకూ​డదు, కత్తిరిం​చకుండా వదిలేసిన మీ ద్రాక్షతోట నుండి ద్రాక్షల్ని సమకూర్చుకోకూడదు. ఒక సంవత్సరం పాటు భూమికి పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి.  అయితే, ఆ విశ్రాంతి కాలంలో దేశంలో దానంతటదే పండిన ఆహారాన్ని మీరు తినవచ్చు; నువ్వు, నీ దాసులు, దాసురాళ్లు, నీ కూలివాళ్లు, నీతో ఉంటున్న పరదేశులు దాన్ని ​తినవచ్చు.  అలాగే నీ దేశంలోని సాధు జంతువులు, అడవి జంతువులు కూడా దాన్ని ​తినవచ్చు. భూమిలో పండిన ప్రతీది మీరు తినవచ్చు.  “ ‘మీరు ఏడు విశ్రాంతి సంవత్సరాల్ని లెక్కించాలి, అంటే ఏడుసార్లు ఏడు సంవత్సరాల్ని ​లెక్కించాలి; అలా ఏడు విశ్రాంతి సంవత్సరాల్ని లెక్కిస్తే మొత్తం 49 సంవత్సరాలు అవుతుంది.  తర్వాత ఏడో నెల, పదో రోజున మీరు గట్టిగా బూర* శబ్దం చేయాలి; ప్రాయశ్చిత్త రోజున,+ మీరు మీ దేశమంతటా వినిపించేలా బూర శబ్దం చేయించాలి. 10  మీరు 50వ సంవత్సరాన్ని పవిత్రపర్చాలి, దేశంలోని నివాసులందరికీ విడుదలను ప్రకటించాలి.+ అది మీకు సునాద సంవ​త్సరంగా* ఉంటుంది. మీలో ప్రతీ ఒక్కరు మీ స్వాస్థ్యాన్ని తిరిగి పొందుతారు, మీలో ప్రతీ ఒక్కరు మీ కుటుంబం దగ్గరికి తిరిగెళ్లాలి.+ 11  అలా 50వ సంవత్సరం మీకు సునాద సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరం మీరు విత్తనాలు విత్తరు, కోత కోసిన తర్వాత మిగిలిన ధాన్యం వల్ల దానంత​టదే పండిన పంటను కోయరు, కత్తిరించకుండా వదిలేసిన మీ ద్రాక్షతోట నుండి ద్రాక్షల్ని సమకూర్చుకోరు.+ 12  ఎందుకంటే అది సునాద సంవత్సరం. అది మీకు పవిత్రమైనదిగా ఉండాలి. భూమిలో దానంతటదే పండిన పంటను మాత్రం మీరు తినవచ్చు.+ 13  “ ‘సునాద సంవత్సరంలో మీలో ప్రతీ ఒక్కరు మీ స్వాస్థ్యం దగ్గరికి తిరిగెళ్లాలి.+ 14  నువ్వు నీ సాటిమనిషికి ఏమైనా అమ్మాలనుకుంటే లేదా అతని దగ్గర ఏమైనా కొనాలనుకుంటే, మీరు ఒకరినొకరు దోచుకోకూడదు.+ 15  నువ్వు నీ సాటిమనిషి దగ్గర భూమిని ​కొనేటప్పుడు సునాద సంవత్సరం తర్వాత గడిచిన సంవత్సరాల్ని లెక్కలోకి తీసుకోవాలి. అతను, పంట వేయడానికి మిగిలి ఉన్న సంవత్సరాల్ని లెక్కలోకి తీసుకొని దాన్ని నీకు అమ్మాలి.+ 16  ఒకవేళ చాలా సంవత్సరాలు మిగిలివుంటే, అతను దాని వెలను పెంచవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలే మిగిలివుంటే అతను దాని వెలను తగ్గించాలి. ఎందుకంటే అతను ఆ భూమిలో పండే పంటల్ని నీకు అమ్ముతున్నాడు. 17  మీలో ఎవ్వరూ సాటిమనిషిని దోచుకోకూడదు,+ నువ్వు నీ దేవునికి భయపడుతూ ఉండాలి,+ ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను.+ 18  నా శాసనాల్ని, నా ​న్యాయనిర్ణయాల్ని పాటించడం ద్వారా మీరు దేశంలో సురక్షితంగా నివసిస్తారు.+ 19  భూమి దాని ఫలాల్ని ఇస్తుంది,+ మీరు ​కడుపునిండా తింటారు, దేశంలో సురక్షితంగా ​నివసిస్తారు.+ 20  “ ‘ “మేము విత్తనాలు విత్తకుండా, మా పంటను సమకూర్చుకోకుండా ఉంటే ఏడో సంవత్సరంలో ఏమి తింటాం?” అని మీరు అంటారేమో.+ 21  నేను ఆరో సంవత్సరంలో మీ మీదికి నా దీవెనను పంపిస్తాను, అప్పుడు భూమి మూడు సంవత్సరాలకు సరిపోయే పంటను ఇస్తుంది.+ 22  మీరు ఎనిమిదో సంవత్సరంలో విత్తనాలు విత్తుతారు, తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటారు. కొత్త పంట చేతికి వచ్చే వరకు మీరు పాత పంటనే తింటారు. 23  “ ‘మీరు భూమిని శాశ్వతంగా అమ్మకూ​డదు,+ ఎందుకంటే భూమి నాది.+ మీరు నా దృష్టిలో పరదేశులు, వలసదారులు.+ 24  మీరు స్వాస్థ్యంగా పొందే దేశమంతట్లో, భూమిని తిరిగి కొనే హక్కును మీరు కల్పించాలి. 25  “ ‘నీ సహోదరుడు పేదవాడై, తన స్వాస్థ్యంలో కొంత అమ్ముకోవాల్సి వస్తే, అతని దగ్గరి బంధువుల్లో దాన్ని తిరిగి కొనగల హక్కు ఉన్న వ్యక్తి వచ్చి తన సహోదరుడు అమ్మిన​దాన్ని తిరిగి కొనాలి.+ 26  అయితే ఎవరికైనా దాన్ని తిరిగి కొనగల దగ్గరి బంధువులు లేకపోతే, అతనే దాన్ని తిరిగి కొనేంత స్తోమత సంపాదించుకుంటే, 27  అతను దాన్ని అమ్మిన తర్వాత గడిచిన సంవత్సరాల వెలను లెక్క కట్టి, మిగిలిన డబ్బును దాన్ని కొన్న వ్యక్తికి ఇవ్వాలి. తర్వాత అతను తన స్వాస్థ్యం దగ్గరికి తిరిగెళ్లవచ్చు.+ 28  “ ‘అయితే కొన్న వ్యక్తి నుండి దాన్ని విడిపించే స్తోమత అతనికి లేకపోతే, సునాద సంవత్సరం వరకు అది దాన్ని కొన్న వ్యక్తి దగ్గరే ఉంటుంది;+ సునాద సంవత్సరంలో అది అతనికి తిరిగొస్తుంది, అతను తన స్వాస్థ్యం దగ్గరికి తిరిగెళ్తాడు.+ 29  “ ‘ఒక వ్యక్తి ప్రాకారం ఉన్న నగరంలో ఒక ఇల్లు అమ్మితే, అతను దాన్ని అమ్మిన దగ్గర నుండి ఒక సంవత్సరం వరకు దాన్ని తిరిగి కొనే హక్కు అతనికి ఉంటుంది; దాన్ని తిరిగి కొనే హక్కు+ అతనికి ఒక సంవత్సరమంతా ఉంటుంది. 30  ఒకవేళ ఒక సంవత్సరం పూర్తయ్యేలోగా దాన్ని తిరిగి కొనకపోతే, ప్రాకారం ఉన్న నగరం​లోని ఆ ఇల్లు శాశ్వత స్వాస్థ్యంగా తరతరాల​పాటు దాన్ని కొన్న వ్యక్తికే చెందుతుంది. సునాద సంవత్స​రంలో దాన్ని పాత యజమానికి తిరిగి ఇచ్చేయకూడదు. 31  అయితే ప్రాకారంలేని ఊళ్లలో ఉన్న ఇళ్లను గ్రామంలోని పొలంలా ​పరిగణించాలి. దాన్ని తిరిగి కొనే హక్కు ఎప్పుడూ అలాగే ఉండాలి, సునాద సంవత్సరంలో దాన్ని పాత యజమానికి తిరిగి ఇచ్చేయాలి. 32  “ ‘అయితే లేవీయుల నగరాల్లోని+ లేవీయుల ఇళ్ల విషయానికొస్తే, లేవీయులకు వాటిని తిరిగి కొనే హక్కు శాశ్వతంగా ఉంటుంది. 33  ఒకవేళ లేవీయులు తమ స్వాస్థ్యాన్ని తిరిగి కొనకపోతే, నగరంలో అమ్మేసిన ఇల్లు కూడా సునాద సంవత్సరంలో తిరిగి ఇచ్చేయబడుతుంది.+ ఎందుకంటే ఇశ్రాయేలీయుల మధ్య లేవీయుల నగరాల్లో ఉన్న లేవీయుల ఇళ్లు లేవీయుల స్వాస్థ్యం.+ 34  అంతేకాదు, వాళ్ల నగరాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లను+ అమ్మకూడదు, ఎందుకంటే అవి వాళ్ల శాశ్వతమైన ఆస్తి. 35  “ ‘నీకు దగ్గర్లో ఉంటున్న నీ తోటి ఇశ్రాయేలీయుడు పేదవాడై, అతనికి ఇల్లు గడవకపోతుంటే, నువ్వు పరదేశిని, వలసవచ్చిన వ్యక్తిని చూసుకున్నట్టే+ అతన్నీ చూసుకోవాలి.+ అప్పుడు అతను కూడా నీతోపాటు బ్రతికుం​టాడు. 36  అతని దగ్గర నువ్వు వడ్డీ తీసుకోకూడదు, అతని నుండి లాభం సంపాదించుకోకూడదు.*+ నువ్వు నీ దేవునికి భయపడుతూ ఉండాలి,+ అలా నీ సహోదరుడు కూడా నీతోపాటు బ్రతికుంటాడు. 37  అతనికి వడ్డీకి అప్పు ​ఇవ్వకూడదు+ లేదా నువ్వు ఇచ్చే ఆహారంతో లాభం సంపాదించుకోకూడదు. 38  నేను మీ దేవుడైన యెహోవాను. మీకు దేవునిగా ఉండడానికి+ మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయ​టికి తీసుకొచ్చి+ కనాను దేశంలోకి నడిపిస్తున్నది నేనే. 39  “ ‘నీకు దగ్గర్లో ఉంటున్న నీ తోటి ఇశ్రాయేలీయుడు పేదవాడై, తనను తాను నీకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే,+ అతనితో నువ్వు వెట్టిచాకిరి చేయించకూడదు.+ 40  నువ్వు కూలివాణ్ణి, వలసవచ్చిన వ్యక్తిని చూసినట్టు అతన్ని చూడాలి.+ సునాద సంవత్సరం వరకు అతను నీ దగ్గర సేవ చేయాలి. 41  తర్వాత అతను నిన్ను విడిచిపెట్టి, తన పిల్లల్ని* తీసుకొని తన బంధువుల దగ్గరికి వెళ్లిపోతాడు. అతను తన పూర్వీకుల స్వాస్థ్యం దగ్గరికి తిరిగెళ్లాలి.+ 42  ఎందుకంటే వాళ్లు నా దాసులు, నేను వాళ్లను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాను.+ ఒక దాసుడు అమ్మబడినట్టు వాళ్లు తమను తాము అమ్ముకోకూడదు. 43  నువ్వు అతనితో క్రూరంగా వ్యవహరించకూడదు,+ నువ్వు నీ దేవునికి భయపడుతూ ఉండాలి.+ 44  నువ్వు నీ చుట్టుపక్కల దేశాల నుండి దాసులను, దాసురాళ్లను తెచ్చుకోవచ్చు, వాళ్ల దగ్గర నుండి నువ్వు దాసుణ్ణి గానీ దాసురాలిని గానీ కొనుక్కోవచ్చు. 45  వేరే దేశం నుండి వచ్చి మీ మధ్య స్థిరపడిన వాళ్లను,+ వాళ్లకు నీ దేశంలో పుట్టినవాళ్లను నువ్వు దాసులుగా కొనుక్కోవచ్చు, వాళ్లు నీ సొత్తు అవుతారు. 46  నీ తర్వాత నీ కుమారులకు శాశ్వతమైన సొత్తు అయ్యేలా వాళ్లను స్వాస్థ్యంగా ఇవ్వవచ్చు. వాళ్లను నువ్వు పనివాళ్లుగా ఉపయోగించుకోవచ్చు, కానీ నీ సహోదరులైన ఇశ్రాయేలీయులతో మాత్రం నువ్వు క్రూరంగా వ్యవహరించకూడదు.+ 47  “ ‘ఒకవేళ నీ మధ్య నివసిస్తున్న పరదేశి గానీ వలసదారుడు గానీ ధనవంతుడై, నీ సహోదరుడేమో పేదవాడై, తనను తాను ఆ పరదేశికి గానీ వలసదారుడికి గానీ పరదేశి కుటుంబ సభ్యుల్లో ఒకరికి గానీ అమ్ముకోవాల్సి వస్తే, 48  అతను తనను తాను అమ్ముకున్న తర్వాత, తిరిగి కొనే హక్కు అతనికి అలాగే ఉంటుంది. అతని సహోదరుల్లో ఒకరు అతన్ని తిరిగి ​కొనవచ్చు.+ 49  లేదా అతని పెదనాన్న* గానీ పెదనాన్న కుమారుడు గానీ రక్తసంబంధియైన అతని కుటుంబ సభ్యుడు గానీ అతన్ని తిరిగి కొనవచ్చు. “ ‘లేదా ఒకవేళ అతనే డబ్బు సంపాదించి ధనవంతుడైతే, అతను తనను తాను తిరిగి కొనుక్కోవచ్చు.+ 50  అతను తనను కొన్న వ్యక్తి దగ్గర, తాను అమ్మబడిన సంవత్సరం నుండి సునాద సంవత్సరం+ వరకు సమయాన్ని లెక్కించాలి. ఆ సంవత్సరాల లెక్కను బట్టి అతని తిరిగి కొనే వెల ఉంటుంది.+ ఆ సంవత్సరాల్లో అతని పనిరోజుల వెల, కూలివాడికి ఇచ్చే జీతం ప్రకారం లెక్కించాలి.+ 51  ఒకవేళ సునాద సంవత్సరానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలివుంటే, అతను ఆ సంవత్సరాల లెక్కను బట్టి తిరిగి కొనే మూల్యాన్ని చెల్లించాలి. 52  ఒకవేళ సునాద సంవత్సరానికి కొన్ని సంవత్సరాలే మిగిలివుంటే, అతను ఆ సంవత్సరాల సంఖ్యను బట్టి తిరిగి కొనే మూల్యాన్ని లెక్క కట్టి, దాన్ని చెల్లించాలి. 53  ఆ యజమాని ఏటేటా పనిచేసే కూలివాణ్ణి చూసినట్టు అతన్ని చూడాలి; ఆ ​యజమాని అతనితో క్రూరంగా వ్యవహరించకుండా నువ్వు ​చూసుకోవాలి.+ 54  అయితే, ఈ షరతుల ప్రకారం అతను తనను తాను తిరిగి కొనుక్కోలేకపోతే అతను, అతని పిల్లలు* సునాద సంవత్సరంలో విడుదల పొందుతారు.+ 55  “ ‘ఎందుకంటే, ఇశ్రాయేలీయులు నా దాసులు. వాళ్లు, ఐగుప్తు దేశం నుండి నేను బయటికి తీసుకొచ్చిన నా దాసులు.+ నేను మీ దేవుడైన యెహోవాను.

అధస్సూచీలు

అక్ష., “కొమ్ము.”
పదకోశం చూడండి.
లేదా “అక్రమ వడ్డీ తీసుకోకూడదు.”
అక్ష., “కుమారుల్ని.”
లేదా “చిన్నాన్న; మామ.”
అక్ష., “కుమారులు.”