ద్వితీయోపదేశకాండం 29:1-29

  • మోయాబు దగ్గర ఇశ్రాయేలుతో ఒప్పందం (1-13)

  • అవిధేయత గురించి హెచ్చరిక (14-29)

    • దాచబడిన విషయాలు, వెల్లడి చేయబడిన విషయాలు (29)

29  హోరేబు దగ్గర తాను ఇశ్రాయేలీయులతో చేసిన ఒప్పందం+ కాకుండా, మోయాబు దేశంలో ఇశ్రాయేలీయులతో ఈ ఒప్పందం కూడా చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. అందులోని మాటలు ఇవి.  మోషే ఇశ్రాయేలీయులందర్నీ ఒకచోటికి పిలిపించి వాళ్లతో ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశంలో మీ కళ్లముందు యెహోవా ఫరోకు, అతని సేవకులందరికీ, అతని దేశమంతటికీ చేసిన వాటన్నిటినీ మీరు చూశారు.+  అంటే, ఆ గొప్ప తీర్పుల్ని,* ఆ గొప్ప సూచనల్ని, అద్భుతాల్ని మీరు కళ్లారా చూశారు.+  అయితే యెహోవా నేటివరకు మీకు అర్థంచేసుకోవడానికి హృదయాన్ని, చూడడానికి కళ్లను, వినడానికి చెవులను ఇవ్వలేదు.+  ‘నేను 40 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎడారిలో నడిపిస్తున్నప్పుడు + మీ ఒంటిమీదున్న బట్టలు పాతబడి చిరిగిపోలేదు, మీ కాళ్లకున్న చెప్పులు అరిగిపోలేదు.+  అప్పుడు మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసం గానీ ఏ మత్తుపానీయం గానీ తాగలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకోవడానికే అలా జరిగింది.’  చివరికి మీరు ఈ చోటికి చేరుకున్నప్పుడు హెష్బోను రాజైన సీహోను,+ బాషాను రాజైన ఓగు+ మనతో యుద్ధం చేయడానికి వచ్చారు, కానీ మనం వాళ్లను ఓడించాం.+  తర్వాత మనం వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొని, దాన్ని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రం వాళ్లకు స్వాస్థ్యంగా ఇచ్చాం.+  కాబట్టి మీరు చేసే ప్రతీ పని సఫలం అయ్యేలా మీరు ఈ ఒప్పందంలోని మాటల్ని పాటించండి, వీటికి లోబడండి.+ 10  “ఈ రోజు మీరంతా మీ దేవుడైన యెహోవా ముందు నిలబడి ఉన్నారు; మీ గోత్ర ప్రధానులు, మీ పెద్దలు, మీ అధికారులు, ఇశ్రాయేలులోని ప్రతీ పురుషుడు, 11  మీ పిల్లలు, మీ భార్యలు,+ మీ పాలెంలో ఉన్న పరదేశులు,+ మీ కోసం కట్టెలు కొట్టేవాళ్ల దగ్గర నుండి నీళ్లు చేదేవాళ్ల వరకు అందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. 12  మీరు మీ దేవుడైన యెహోవా ఒప్పందంలోకి ప్రవేశించడానికి ఇక్కడ ఉన్నారు, నేడు మీ దేవుడైన యెహోవా ఒట్టేసి మీతో ఆ ఒప్పందం చేస్తున్నాడు.+ 13  ఆయన మీకు వాగ్దానం చేసినట్టే, మీ పూర్వీకులైన అబ్రాహాము,+ ఇస్సాకు,+ యాకోబులకు+ ప్రమాణం చేసినట్టే మిమ్మల్ని తన ప్రజలుగా స్థాపించడానికి,+ తాను మీకు దేవునిగా ఉండడానికి+ ఆయన అలా చేస్తున్నాడు. 14  “నేను ఈ ఒప్పందం చేస్తున్నది, ఈ ఒట్టు వేస్తున్నది మీ ఒక్కరితోనే కాదు, 15  నేడు మన దేవుడైన యెహోవా ముందు ఇక్కడ మనతోపాటు నిలబడివున్న వాళ్లతో, అలాగే నేడు ఇక్కడ మనతోపాటు లేనివాళ్లతో కూడా చేస్తున్నాను. 16  (ఎందుకంటే, మనం ఐగుప్తు దేశంలో ఎలా జీవించామో, ప్రయాణంలో మనం ఆయా దేశాల్ని ఎలా దాటుకుంటూ వచ్చామో+ మీకు బాగా తెలుసు. 17  అప్పుడు మీరు వాళ్లమధ్య ఉన్న హేయమైన వస్తువుల్ని; చెక్కతో, రాళ్లతో, వెండిబంగారాలతో చేయబడిన అసహ్యమైన విగ్రహాల్ని*+ చూసేవాళ్లు.) 18  ఆ జనాల దేవుళ్లను పూజించడానికి మన దేవుడైన యెహోవా నుండి తన హృదయం పక్కకుమళ్లుతున్న పురుషుడు గానీ, స్త్రీ గానీ, కుటుంబం గానీ, గోత్రం గానీ నేడు మీ మధ్య ఉండకుండా జాగ్రత్తపడండి;+ విషపూరితమైన ఫలాల్ని, మాచిపత్రిని* ఉత్పత్తి చేసే వేరు మీ మధ్య ఉండకుండా జాగ్రత్తపడండి.+ 19  “ఒట్టేసి చెప్పిన ఈ మాటల్ని విని కూడా ఎవరైనా, ‘నేను నా మనసుకు నచ్చినట్టే నడుచుకుంటాను, అయినా నాకు నెమ్మది ఉంటుంది’ అని తన హృదయంలో గొప్పలుపోతే, అతను తన బాటలో ఉన్న ప్రతీదాన్ని* సర్వనాశనం చేసుకుంటాడు. 20  యెహోవా అతన్ని క్షమించడానికి ఇష్టపడడు.+ బదులుగా, యెహోవా గొప్ప కోపాగ్ని అతని మీద రగులుకుంటుంది, ఈ గ్రంథంలో రాయబడిన శాపాలన్నీ ఖచ్చితంగా అతని మీదికి వస్తాయి,+ యెహోవా అతని పేరును ఆకాశం కింద లేకుండా తుడిచిపెడతాడు. 21  యెహోవా అతన్ని ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో నుండి వేరు చేసి, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఒప్పందపు శాపాలన్నిటి ప్రకారం అతన్ని శిక్షిస్తాడు. 22  “మీ భావి తరాలవాళ్లు, దూరదేశంలో ఉన్న పరదేశులు ఈ దేశంలోని తెగుళ్లను, దీని మీదికి యెహోవా రప్పించిన ఉపద్రవాల్ని చూసినప్పుడు, 23  అంటే యెహోవా తన కోపంతో, ఆగ్రహంతో సొదొమ గొమొర్రాలను, అద్మా సెబోయీములను+ నాశనం చేసినట్టే+ ఉప్పుతో, అగ్నిగంధకాలతో ఈ దేశాన్ని నాశనం చేయడం, దేశమంతట్లో ఎక్కడా విత్తడం గానీ, మొలకెత్తడం గానీ, మొక్కలు మొలవడం గానీ జరగకపోవడం చూసినప్పుడు 24  వాళ్లు, అలాగే అన్నిదేశాల వాళ్లు, ‘యెహోవా ఈ దేశానికి ఎందుకిలా చేశాడు?+ ఆయన ఇలా తన కోపాగ్నిని కుమ్మరించడానికి కారణమేమిటి?’ అని అడుగుతారు. 25  అప్పుడు ప్రజలు ఇలా అంటారు: ‘ఎందుకంటే వాళ్లు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా తమను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు తమతో చేసిన ఒప్పందాన్ని విడిచిపెట్టేశారు.+ 26  వాళ్లు వెళ్లి, తమకు తెలియని దేవుళ్లను, ఆయన పూజించకూడదని చెప్పిన దేవుళ్లను పూజించారు, వాటికి మొక్కారు.+ 27  దాంతో యెహోవా ఈ గ్రంథంలో రాయబడిన శాపాలన్నిటినీ ఈ దేశం మీదికి తీసుకురావడం ద్వారా వాళ్లమీద తన కోపాగ్నిని కుమ్మరించాడు.+ 28  అలా యెహోవా కోపంతో, ఆగ్రహంతో, మహా ఉగ్రతతో వాళ్లను తమ నేలలో నుండి పెకిలించి,+ వేరే దేశానికి వెళ్లగొట్టాడు, నేటివరకు వాళ్లు అక్కడే ఉన్నారు.’+ 29  “దాచబడిన విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందుతాయి,+ కానీ వెల్లడి చేయబడిన విషయాలు శాశ్వతంగా మనకు, మన కుమారులకు చెందుతాయి. మనం ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ పాటించాలన్న ఉద్దేశంతోనే ఆయన వాటిని మనకు వెల్లడిచేశాడు.+

అధస్సూచీలు

లేదా “పరీక్షల్ని.”
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
పదకోశం చూడండి.
అక్ష., “ఎండిన దానితోపాటు చక్కగా నీరుపెట్టిన దాన్ని కూడా.”