యోబు 42:1-17

  • యోబు యెహోవాకు జవాబివ్వడం (1-6)

  • ముగ్గురు సహచరుల్ని గద్దించడం (7-9)

  • యెహోవా యోబును మళ్లీ పూర్వస్థితికి ​తీసుకొచ్చాడు (10-17)

    • యోబు కుమారులు, కూతుళ్లు (13-15)

42  అప్పుడు యోబు యెహోవాతో ఇలా అన్నాడు:   “నువ్వు అన్నీ చేయగలవని,నువ్వు చేయాలనుకున్నదేదీ నీకు అసాధ్యం కాదని ఇప్పుడు నాకు అర్థమైంది.+   నువ్వు, ‘నా ఆలోచనను చీకట్లోకి నెట్టేస్తూ, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఇతను ఎవరు?’ అని అన్నావు.+నిజమే నేను మాట్లాడాను, కానీ అవగాహన లేకుండా మాట్లాడాను. నా ఆలోచనకు మించినవాటి గురించి, నాకు తెలియనివాటి గురించి మాట్లాడాను.+   నువ్వు, ‘దయచేసి విను, నేను మాట్లాడతాను. నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబివ్వు’ అన్నావు.+   నా చెవులు నీ గురించి విన్నాయి,అయితే ఇప్పుడు నేను నిన్ను కళ్లారా చూస్తున్నాను.   అందుకే నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను,+ధూళిలో, బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడుతున్నాను.”+  యెహోవా యోబుతో ఈ మాటలు మాట్లాడిన తర్వాత, తేమానీయుడైన ఎలీఫజుతో యెహోవా ఇలా అన్నాడు: “నీ మీద, నీ ఇద్దరు సహచరుల+ మీద నా కోపం మండుతోంది. ఎందుకంటే, నా సేవకుడైన యోబులా మీరు నా గురించి నిజాలు మాట్లాడలేదు.+  ఇప్పుడు మీరు ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను తీసుకుని నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్లి మీ కోసం దహనబలి అర్పించండి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థిస్తాడు.+ నేను తప్పకుండా అతని విన్నపాన్ని అంగీకరిస్తాను, మీ తెలివితక్కువతనాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించకుండా ఉంటాను. ఎందుకంటే, నా సేవకుడైన యోబులా మీరు నా గురించి నిజాలు మాట్లాడలేదు.”  కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు చెప్పినట్టే చేశారు. యెహోవా యోబు ప్రార్థనను అంగీకరించాడు. 10  యోబు తన సహచరుల కోసం ప్రార్థించిన తర్వాత,+ యెహోవా యోబు శ్రమను తీసేసి+ అతని వైభవాన్ని అతనికి తిరిగిచ్చాడు. యెహోవా అతనికి ముందుకన్నా రెట్టింపు ఇచ్చాడు.+ 11  అతని బంధువులందరూ, ఒకప్పటి స్నేహితులందరూ+ అతని దగ్గరికి వచ్చి, అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు. వాళ్లు అతని మీద సానుభూతి చూపించి, యెహోవా అతని మీదికి రానిచ్చిన విపత్తు అంతటి గురించి అతన్ని ఓదార్చారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు అతనికి ఒక వెండి రూకను, ఒక బంగారు ఉంగరాన్ని ఇచ్చారు. 12  యెహోవా యోబు జీవితంలోని తర్వాతి సంవత్సరాల్ని ముందటి సంవత్సరాల కన్నా ఎక్కువగా దీవించాడు,+ దాంతో యోబు దగ్గర మొత్తం 14,000 గొర్రెలు; 6,000 ఒంటెలు; 2,000* పశువులు; 1,000 ఆడ గాడిదలు ఉన్నాయి.+ 13  అంతేకాదు, అతనికి మళ్లీ ఏడుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు పుట్టారు.+ 14  అతను మొదటి కూతురికి యెమీమా అని, రెండో కూతురికి కెజీయా అని, మూడో కూతురికి కెరెంహప్పుకు అని పేర్లు పెట్టాడు. 15  ఆ దేశమంతట్లో యోబు కూతుళ్లంత అందగత్తెలు ఎవ్వరూ లేరు, వాళ్ల నాన్న వాళ్ల అన్నదమ్ములతో పాటు వాళ్లకు కూడా ఆస్తి పంచి ఇచ్చాడు. 16  ఆ తర్వాత యోబు 140 సంవత్సరాలు జీవించి తన పిల్లల్ని, వాళ్ల పిల్లల్ని అలా మొత్తం నాలుగు తరాల్ని చూశాడు. 17  యోబు సుదీర్ఘమైన, సంతృప్తికరమైన జీవితం గడిపి చనిపోయాడు.

అధస్సూచీలు

అక్ష., “1,000 జతల.”