ఆదికాండం 17:1-27
17 అబ్రాముకు 99 ఏళ్లు ఉన్నప్పుడు, యెహోవా అతనికి కనిపించి ఇలా అన్నాడు: “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు నా మార్గాల్లో నడుస్తూ నిందలేని* వ్యక్తిగా ఉండు.
2 నేను నీతో చేసిన నా ఒప్పందాన్ని స్థిరపరుస్తాను,+ నీ వంశస్థుల్ని చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను.”+
3 అందుకు అబ్రాము సాష్టాంగపడ్డాడు, దేవుడు ఇంకా అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు:
4 “ఇదిగో! నేను నీతో ఒప్పందం చేశాను,+ నువ్వు ఖచ్చితంగా అనేక జనాలకు తండ్రివౌతావు.+
5 ఇప్పటినుండి నీ పేరు అబ్రాము* కాదు, అబ్రాహాము.* ఎందుకంటే, నేను నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తాను.
6 నేను నీ వంశస్థుల్ని చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, నీ నుండి అనేక జనాలు వస్తారు; రాజులు నీ నుండి వస్తారు.+
7 “నేను నీతో, అలాగే నీ తర్వాత తరతరాలపాటు నీ సంతానంతో* చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉంటాను;+ నీకు, నీ తర్వాత నీ సంతానానికి* నేను దేవుడిగా ఉండేందుకు ఇదొక శాశ్వత ఒప్పందం.
8 నువ్వు ఏ దేశంలోనైతే పరదేశిగా జీవించావో+ ఆ కనాను దేశమంతటినీ నీకు, నీ తర్వాత నీ సంతానానికి* శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను, నేను వాళ్లకు దేవుడిగా ఉంటాను.”+
9 దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు, నీ తర్వాత తరతరాలపాటు నీ సంతానం* నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలి.
10 నేను మీతో చేసే నా ఒప్పందం ఇదే; నువ్వు, నీ తర్వాత నీ సంతానం* దీనికి కట్టుబడి ఉండాలి: మీలో ఉన్న మగవాళ్లందరూ సున్నతి చేయించుకోవాలి.+
11 మీరు మీ ముందోలును* కోసి సున్నతి చేసుకోవాలి; ఇది నాకూ మీకూ మధ్య ఉన్న ఒప్పందానికి గుర్తుగా ఉంటుంది.+
12 మీలో ఎనిమిది రోజుల వయసు ఉన్న మగవాళ్లందరికీ సున్నతి చేయించాలి.+ మీ ఇంట్లో పుట్టినవాళ్లలో, నీ సంతానం* కాని వాళ్లలో, డబ్బు ఇచ్చి పరదేశి దగ్గర కొన్నవాళ్లలో మగవాళ్లందరికీ సున్నతి చేయించాలి. తరతరాలు మీరు దీన్ని పాటించాలి.
13 మీ ఇంట్లో పుట్టిన ప్రతీ పురుషునికి, మీ డబ్బుతో కొన్న ప్రతీ పురుషునికి సున్నతి చేయించాలి.+ మీ శరీరంలో కనిపించే నా ఒప్పందం శాశ్వతమైన ఒప్పందంగా ఉంటుంది.
14 మగవాళ్లలో ఎవరైనా సున్నతి చేయించుకోకపోతే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* ఎందుకంటే అతను నా ఒప్పందాన్ని మీరాడు.”
15 తర్వాత దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు: “నీ భార్య శారయి*+ విషయానికొస్తే, నువ్వు ఆమెను శారయి అని పిలవకూడదు. ఎందుకంటే ఇప్పటినుండి ఆమె పేరు శారా.*
16 నేను ఆమెను దీవిస్తాను, ఆమె ద్వారా నీకు ఒక కుమారుణ్ణి కూడా ఇస్తాను;+ అవును, నేను ఆమెను దీవిస్తాను, ఆమె నుండి జనాలు వస్తారు; రాజులు ఆమె నుండి వస్తారు.”
17 అందుకు అబ్రాహాము సాష్టాంగపడి, నవ్వుకుంటూ తన హృదయంలో ఇలా అనుకున్నాడు:+ “100 ఏళ్ల ముసలివాడికి పిల్లలు పుడతారా? 90 ఏళ్ల శారా పిల్లల్ని కంటుందా?”+
18 కాబట్టి అబ్రాహాము సత్యదేవునితో ఇలా అన్నాడు: “ఇష్మాయేలు మీద నీ దీవెన ఉండాలి!”+
19 అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నీ భార్య శారా ఖచ్చితంగా నీకు ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు*+ అని పేరు పెట్టాలి. నేను అతనితో నా ఒప్పందాన్ని స్థిరపరుస్తాను, అది అతనికి, అతని తర్వాత అతని సంతానానికి* శాశ్వత ఒప్పందంగా ఉంటుంది.+
20 ఇష్మాయేలు విషయానికొస్తే, అతని గురించి నువ్వు చేసిన విన్నపాన్ని నేను విన్నాను. ఇదిగో! నేను అతన్ని దీవిస్తాను; అతనికి పిల్లలు పుట్టేలా, అతని వంశస్థులు చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను. అతని నుండి 12 మంది ప్రధానులు వస్తారు, నేను అతన్ని ఒక గొప్ప జనంగా చేస్తాను.+
21 అయితే, నేను నా ఒప్పందాన్ని ఇస్సాకుతో స్థిరపరుస్తాను.+ వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా అతన్ని కంటుంది.”+
22 అబ్రాహాముతో మాట్లాడడం పూర్తయిన తర్వాత దేవుడు అక్కడి నుండి పైకి వెళ్లిపోయాడు.
23 అప్పుడు అబ్రాహాము తన కుమారుడు ఇష్మాయేలును, తన ఇంట్లో పుట్టిన మగవాళ్లందర్నీ, తాను డబ్బుతో కొన్న మగవాళ్లందర్నీ, తన ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ తీసుకొని దేవుడు తనకు చెప్పినట్టు అదే రోజున వాళ్లకు సున్నతి చేయించాడు.+
24 అబ్రాహాము సున్నతి చేయించుకున్నప్పుడు+ అతని వయసు 99 ఏళ్లు.
25 అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలుకు సున్నతి చేయబడినప్పుడు అతని వయసు 13 ఏళ్లు.+
26 అదే రోజున అబ్రాహాముకు, అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి చేయబడింది.
27 అతనితోపాటే అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ, అంటే అతని ఇంట్లో పుట్టిన మగవాళ్లందరికీ, డబ్బు ఇచ్చి పరదేశి దగ్గర కొన్న మగవాళ్లందరికీ సున్నతి చేయబడింది.
అధస్సూచీలు
^ లేదా “దోషంలేని.”
^ “తండ్రి ఉన్నతుడు (ఘనపర్చబడ్డాడు)” అని అర్థం.
^ “ఒక జనానికి (సమూహానికి) తండ్రి; అనేకులకు తండ్రి” అని అర్థం.
^ అక్ష., “విత్తనంతో.”
^ అక్ష., “విత్తనానికి.”
^ అక్ష., “విత్తనానికి.”
^ అక్ష., “విత్తనం.”
^ అక్ష., “విత్తనం.”
^ అంటే, పురుషాంగం ముందు భాగంలో ఉండే చర్మం.
^ అక్ష., “విత్తనం.”
^ లేదా “చంపబడాలి.”
^ బహుశా “కయ్యాలమారి” అనే అర్థం ఉండవచ్చు.
^ “రాకుమారి” అని అర్థం.
^ “నవ్వు” అని అర్థం.
^ అక్ష., “విత్తనానికి.”