యాకోబు రాసిన ఉత్తరం 5:1-20

  • ధనవంతులకు హెచ్చరిక (1-6)

  • ఓర్పుతో సహిస్తే దేవుడు దీవిస్తాడు (7-11)

  • మీ మాట “అవును” అంటే అవును అన్నట్టు ఉండాలి (12)

  • విశ్వాసంతో చేసే ప్రార్థన శక్తివంతమైనది (13-18)

  • తిరిగొచ్చేలా పాపికి సహాయం చేయడం (19, 20)

5  ధనవంతులారా, మీ మీదికి రాబోతున్న కష్టాల్ని బట్టి దుఃఖించండి, బోరున ఏడ్వండి.+  మీ సిరిసంపదలు కుళ్లిపోయాయి, మీ బట్టల్ని చెదలు తినేశాయి.+  మీ వెండిబంగారాలకు తుప్పు పట్టింది. వాటికి పట్టిన తుప్పు మీ మీద సాక్ష్యం చెప్తుంది, అది మీ శరీరాన్ని తినేస్తుంది. మీరు కూడబెట్టుకున్నవి చివరి రోజుల్లో అగ్నిలా తయారౌతాయి.+  ఇదిగో, మీ పొలాల్లో పంట కోసిన పనివాళ్లకు ఇవ్వకుండా మీరు మీ దగ్గరే ఉంచుకున్న కూలి కేకలు వేస్తోంది, వాళ్ల మొరలు సైన్యాలకు అధిపతైన యెహోవా* చెవులకు చేరాయి.+  మీరు ఈ భూమ్మీద భోగభాగ్యాలతో జీవించారు, సుఖాల కోసం బ్రతికారు. వధించే రోజు కోసం+ మీ హృదయాల్ని కొవ్వెక్కేలా చేసుకున్నారు.  మీరు నీతిమంతుణ్ణి దోషి అని తీర్పుతీర్చి, హత్య చేశారు. ఆయన* మిమ్మల్ని వ్యతిరేకించడం లేదా?  కాబట్టి సహోదరులారా, ప్రభువు ప్రత్యక్షత+ వరకు ఓర్పు చూపించండి. రైతు విషయమే తీసుకోండి, అతను భూమి ఇచ్చే విలువైన పంట కోసం ఎదురుచూస్తూ, తొలకరి వానలు,* కడవరి వానలు*+ కురిసే వరకు ఓర్పు చూపిస్తాడు.  మీరు కూడా ఓర్పు చూపించండి;+ మీ హృదయాల్ని స్థిరపర్చుకోండి, ఎందుకంటే ప్రభువు ప్రత్యక్షత దగ్గరపడింది.+  సహోదరులారా, మీరు తీర్పుకు గురవ్వకుండా ఉండేలా ఒకరి మీద ఒకరు సణుక్కోకండి.*+ ఇదిగో, న్యాయమూర్తి గుమ్మం దగ్గరే ఉన్నాడు. 10  సహోదరులారా, కష్టాల్ని సహించే విషయంలో, ఓర్పు చూపించే విషయంలో,+ యెహోవా* పేరున మాట్లాడిన ప్రవక్తల్ని+ ఆదర్శంగా తీసుకోండి.+ 11  మనం, సహించినవాళ్లను ధన్యులని* అంటాం.+ మీరు యోబు సహనం గురించి విన్నారు,+ యెహోవా* అతన్ని ఎలా ఆశీర్వదించాడో మీకు తెలుసు.+ యెహోవా* ఎంతో వాత్సల్యం* గలవాడని, కరుణామయుడని+ మీరు తెలుసుకున్నారు. 12  నా సహోదరులారా, అన్నిటికన్నా ముఖ్యంగా, ఒట్టేయడం మానేయండి. ఆకాశంమీద గానీ, భూమ్మీద గానీ, ఇంక దేనిమీద గానీ ఒట్టేయకండి. మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టు ఉండాలి.+ అప్పుడు మీరు తీర్పుకు గురవ్వరు. 13  మీలో ఎవరైనా కష్టాలు పడుతున్నారా? అతను ప్రార్థిస్తూ ఉండాలి.+ ఎవరైనా ఉల్లాసంగా ఉన్నారా? అతను స్తుతిగీతాలు* పాడాలి.+ 14  మీలో ఎవరైనా అనారోగ్యంగా* ఉన్నారా? అతను సంఘ పెద్దల్ని పిలవాలి,+ వాళ్లు యెహోవా* పేరున అతనికి నూనె రాసి,+ అతని కోసం ప్రార్థన చేయాలి. 15  విశ్వాసంతో చేసే ప్రార్థన ఆ రోగిని* బాగుచేస్తుంది, యెహోవా* అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఒకవేళ అతను పాపాలు చేసివుంటే, క్షమాపణ పొందుతాడు. 16  కాబట్టి, ఒకరి దగ్గర ఒకరు పాపాల్ని ఒప్పుకోండి,+ ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి, అప్పుడు మీరు బాగౌతారు. నీతిమంతుడు పట్టుదలగా చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది.+ 17  ఏలీయా కూడా మనలాంటి భావాలు ఉన్న మనిషే. అయినా, అతను వర్షం పడకూడదని పట్టుదలగా ప్రార్థించినప్పుడు, మూడు సంవత్సరాల ఆరు నెలలు దేశంలో వర్షం పడలేదు.+ 18  తర్వాత, అతను మళ్లీ ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి పంటనిచ్చింది.+ 19  నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి పక్కదారి పట్టినప్పుడు* ఇంకొకరు అతన్ని తిరిగి సత్యం వైపు మళ్లిస్తే, 20  అలా పాపిని చెడు మార్గం నుండి మళ్లించే వ్యక్తి,+ అతన్ని మరణం నుండి రక్షిస్తున్నాడు, ఎన్నో పాపాల్ని కప్పేస్తున్నాడు.+

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
లేదా “దేవుడు” అయ్యుంటుంది.
తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
లేదా “ఏడ్వకండి; ఫిర్యాదు చేసుకోకండి.”
అనుబంధం A5 చూడండి.
లేదా “కనికరం.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “సంతోషంగా ఉంటారని.”
లేదా “కీర్తనలు.”
ఇది దేవునితో ఉన్న సంబంధం బలహీనపడడాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అనుబంధం A5 చూడండి.
లేదా “అలసిపోయిన వ్యక్తిని” అయ్యుంటుంది.
అనుబంధం A5 చూడండి.
లేదా “పట్టించబడినప్పుడు.”