ఆదికాండం 42:1-38

  • యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్లడం (1-4)

  • యోసేపు తన సహోదరుల్ని కలవడం, ​పరీక్షించడం (5-25)

  • యోసేపు సహోదరులు యాకోబు దగ్గరికి ​తిరిగిరావడం (26-38)

42  ఐగుప్తులో ధాన్యం ఉందని+ విన్నప్పుడు యాకోబు తన కుమారులతో ఇలా అన్నాడు: “మీరెందుకు ఊరికే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు?”  అతను ఇంకా ఇలా అన్నాడు: “ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం ఆకలితో చనిపోకుండా బ్రతికుండేలా, మీరు అక్కడికి వెళ్లి మనకోసం కొంత ధాన్యం కొనుక్కురండి.”+  కాబట్టి యోసేపు సహోదరుల్లో పదిమంది+ ధాన్యం కొనుక్కురావడానికి ఐగుప్తుకు ప్రయాణమయ్యారు.  కానీ యాకోబు యోసేపు సొంత తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపించలేదు.+ ఎందుకంటే యాకోబు, “బహుశా ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతాడేమో”+ అని అనుకున్నాడు.  ఇశ్రాయేలు కుమారులు, ధాన్యాన్ని కొనడానికి వెళ్తున్న ఇతరులతో కలిసి ఐగుప్తుకు వచ్చారు. ఎందుకంటే కనాను దేశానికి కూడా కరువు వ్యాపించింది.+  అప్పుడు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉన్నది,+ భూమంతటా ఉన్న ప్రజలకు ధాన్యాన్ని అమ్ముతున్నది యోసేపే.+ కాబట్టి యోసేపు సహోదరులు వచ్చి, అతని ముందు నేలకు వంగి నమస్కారం చేశారు.+  యోసేపు తన సహోదరుల్ని చూడగానే గుర్తుపట్టాడు, కానీ తానెవరన్నది వాళ్లకు తెలియనివ్వలేదు.+ అతను వాళ్లతో కఠినంగా మాట్లాడుతూ, “మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “మేము ఆహారం కొనుక్కోవడానికి కనాను దేశం నుండి వచ్చాం”+ అని చెప్పారు.  అలా, యోసేపు తన సహోదరుల్ని గుర్తుపట్టాడు కానీ వాళ్లు అతన్ని గుర్తుపట్టలేదు.  యోసేపుకు వెంటనే తాను ఒకప్పుడు వాళ్ల గురించి కన్న కల గుర్తుకొచ్చింది.+ అతను వాళ్లతో, “మీరు గూఢచారులు! ఈ దేశం లోటుపాట్లను తెలుసుకోవడానికి వచ్చారు!” అన్నాడు. 10  అందుకు వాళ్లు ఇలా అన్నారు: “లేదు ప్రభూ, నీ సేవకులమైన మేము ఆహారం కొనుక్కోవడానికి వచ్చాం. 11  మేమంతా ఒకే తండ్రికి పుట్టినవాళ్లం. మేము నీతిగా నడుచుకునేవాళ్లం. నీ సేవకులమైన మేము గూఢచారులం కాదు.” 12  కానీ అతను వాళ్లతో, “లేదు! మీరు ఈ దేశం లోటుపాట్లను తెలుసుకోవడానికే వచ్చారు!” అన్నాడు. 13  అందుకు వాళ్లు, “మేము 12 మంది సహోదరులం.+ ఒకే తండ్రికి పుట్టినవాళ్లం.+ మా తండ్రి కనాను దేశంలో ఉన్నాడు. అందరికన్నా చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు,+ ఇంకొకతను ఇక లేడు”+ అన్నారు. 14  అయితే యోసేపు వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘మీరు గూఢచారులు!’ అని నేను చెప్పిన మాట నిజమే. 15  మీరు చెప్తున్నది నిజమో కాదో దీంతో తేలిపోతుంది: ఫరో జీవం తోడు, మీ చిన్న తమ్ముడు ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఇక్కడి నుండి వెళ్లరు.+ 16  మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకర్ని పంపించండి. అప్పటివరకు మిగతావాళ్లు ఇక్కడ బందీలుగా ఉంటారు. ఆ విధంగా, మీరు నిజం చెప్తున్నారో లేదో తేలిపోతుంది. ఒకవేళ మీరు చెప్పింది నిజం కాకపోతే, ఫరో జీవం తోడు మీరు గూఢచారులే.” 17  ఆ మాట అని అతను వాళ్లందర్నీ మూడు రోజుల పాటు బంధించి ఉంచాడు. 18  మూడో రోజు యోసేపు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను దేవునికి భయపడే మనిషిని. కాబట్టి నేను చెప్పింది చేసి మీ ప్రాణాలు కాపాడుకోండి. 19  మీరు నీతిగా నడుచుకునే మనుషులైతే, మీలో ఒకర్ని ఇక్కడే బందీగా ఉండనివ్వండి. మిగతావాళ్లు, కరువు నుండి మీ కుటుంబాల్ని కాపాడుకోవడానికి ధాన్యం తీసుకెళ్లవచ్చు.+ 20  అక్కడికి వెళ్లి, మీ చిన్న తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నమ్మదగినవని రుజువౌతుంది, మీరు మీ ప్రాణాల్ని దక్కించుకుంటారు.” వాళ్లు యోసేపు చెప్పినట్టే చేశారు. 21  వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “నిజంగా, మన సహోదరునికి మనం అలా చేశాం కాబట్టే మనకు ఈ శిక్ష పడుతోంది.+ కనికరం చూపించమని అతను మనల్ని బ్రతిమాలినప్పుడు మనం అతని బాధను చూసి కూడా పట్టించుకోలేదు. అందుకే మనకు ఈ కష్టం వచ్చింది.” 22  అప్పుడు రూబేను వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘ఆ పిల్లవాడి విషయంలో పాపం చేయకండి’ అని నేను మీకు చెప్పలేదా? అయినా మీరు నా మాట వినలేదు.+ ఇప్పుడు అతని రక్తం విషయంలో మనం జవాబు చెప్పాల్సి వస్తోంది.”+ 23  కానీ వాళ్లు మాట్లాడుకున్నదంతా యోసేపుకు అర్థమైందని వాళ్లకు తెలీదు. ఎందుకంటే యోసేపు అప్పటిదాకా ఒక అనువాదకుడి ద్వారా వాళ్లతో మాట్లాడాడు. 24  అప్పుడు యోసేపు పక్కకు వెళ్లి, ఏడ్వడం మొదలుపెట్టాడు.+ తర్వాత యోసేపు వెనక్కి వచ్చి వాళ్లతో మళ్లీ మాట్లాడి షిమ్యోనును+ పట్టుకొని వాళ్ల కళ్ల ముందే అతన్ని బంధించాడు.+ 25  యోసేపు ఆ తర్వాత వాళ్ల సంచుల్లో ధాన్యం నింపమని, ఎవరి డబ్బులు వాళ్ల గోనెసంచిలో పెట్టమని, వాళ్ల ప్రయాణానికి కావాల్సినవి ఇవ్వమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వాళ్లు అతను చెప్పినట్టే చేశారు. 26  అప్పుడు యోసేపు సహోదరులు ధాన్యాన్ని తమ గాడిదల మీదికి ఎక్కించుకొని, అక్కడి నుండి వెళ్లిపోయారు. 27  మధ్యలో వాళ్లు విడిది కోసం ఒకచోట ఆగారు. వాళ్లలో ఒకతను తన గాడిదకు మేత వేద్దామని తన గోనెసంచిని విప్పినప్పుడు, ఇదిగో అందులో అతని డబ్బు కనిపించింది. 28  దాంతో అతను, “నా డబ్బు తిరిగిచ్చేశారు, ఇదిగో అది నా సంచిలోనే ఉంది!” అని తన సహోదరులతో అన్నాడు. అప్పుడు వాళ్ల గుండెలు జారిపోయాయి. వాళ్లు వణికిపోతూ, “ఇదేంటి, దేవుడు మనకు ఇలా చేశాడు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. 29  వాళ్లు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు, తమకు జరిగినవన్నీ అతనికి చెప్పారు. వాళ్లు ఇలా అన్నారు: 30  “ఆ దేశానికి ప్రభువుగా ఉన్న వ్యక్తి మాతో కఠినంగా మాట్లాడాడు,+ మేము ఆ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చామని మమ్మల్ని నిందించాడు. 31  కానీ మేము అతనితో ఇలా అన్నాం: ‘మేము నీతిగా నడుచుకునేవాళ్లం, గూఢచారులం కాదు.+ 32  మేము 12 మంది సహోదరులం,+ ఒకే తండ్రికి పుట్టినవాళ్లం. ఒకడు ఇక లేడు.+ అందరికన్నా చిన్నవాడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు.’+ 33  కానీ, ఆ దేశానికి ప్రభువుగా ఉన్న వ్యక్తి మాతో ఇలా అన్నాడు: ‘ఇలా చేస్తే మీరు నీతిగా నడుచుకునే మనుషులని నాకు తెలుస్తుంది: మీలో ఒకర్ని నా దగ్గర వదిలేసి,+ మీ కుటుంబాల్ని కరువు నుండి కాపాడుకోవడానికి ఆహారం తీసుకొని వెళ్లండి.+ 34  తర్వాత, మీ చిన్న తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. దానివల్ల మీరు గూఢచారులు కాదని, నీతిగా నడుచుకునే మనుషులని నాకు తెలుస్తుంది. అప్పుడు మీ సహోదరుణ్ణి మీకు తిరిగి అప్పగిస్తాను, మీరు ఈ దేశంలో ధాన్యం కొనుక్కోవచ్చు.’ ” 35  వాళ్లు గోనెసంచుల్ని విప్పుతుండగా, ఇదిగో ఎవరి డబ్బుసంచి వాళ్ల గోనెసంచిలోనే ఉంది. ఆ డబ్బుసంచుల్ని చూసి వాళ్లు, వాళ్ల నాన్న భయపడిపోయారు. 36  వాళ్ల నాన్న యాకోబు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నాకు కుమారులు లేకుండా చేశారు!+ యోసేపు ఇక లేడు,+ షిమ్యోను కూడా ఇక లేడు,+ ఇప్పుడు మీరు బెన్యామీనును కూడా తీసుకెళ్లబోతున్నారు! ఈ కష్టాలన్నీ నా మీదికే వచ్చిపడ్డాయి!” 37  కానీ రూబేను తన తండ్రితో ఇలా అన్నాడు: “నేను ఇతన్ని తిరిగి నీ దగ్గరికి తీసుకురాకపోతే, నువ్వు నా ఇద్దరు కుమారుల్ని చంపేయవచ్చు.+ ఇతన్ని నా చేతుల్లో పెట్టు. నేను ఇతన్ని తిరిగి నీకు అప్పగిస్తాను.”+ 38  కానీ యాకోబు ఇలా అన్నాడు: “నా కుమారుడు నీతో రాడు. ఎందుకంటే ఇతని అన్న చనిపోయాడు, ఇతనొక్కడే మిగిలాడు.+ మీ ప్రయాణంలో ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే, మీరు ఖచ్చితంగా తల నెరసిన నన్ను దుఃఖంతో సమాధిలోకి*+ వెళ్లేలా చేస్తారు.”+

అధస్సూచీలు

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.