సామెతలు 14:1-35

  • హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది (10)

  • సరైనదిగా కనిపించే మార్గం మరణానికి తీసుకెళ్లవచ్చు (12)

  • అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు (15)

  • ధనవంతుడికి చాలామంది స్నేహితులు (20)

  • ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం (30)

14  నిజంగా తెలివిగల స్త్రీ తన ఇంటిని కడుతుంది,*+తెలివితక్కువ స్త్రీ చేతులారా దాన్ని ​పడగొడుతుంది.   నిజాయితీగా నడుచుకునేవాడు యెహోవాకు భయపడుతున్నాడు,కపట మార్గాల్లో నడిచేవాడు ఆయన్ని నీచంగా చూస్తున్నాడు.   మూర్ఖుల నోట అహంకారమనే బెత్తం ఉంది;అయితే తెలివిగలవాళ్ల పెదాలు వాళ్లను కాపాడతాయి.   పశువులు లేకపోతే మేతతొట్టి శుభ్రంగా ఉంటుంది,అయితే ఎద్దుల బలంవల్ల సమృద్ధిగా పంట పండుతుంది.   నమ్మకమైన సాక్షి అబద్ధం చెప్పడు,దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే.+   ఎగతాళి చేసేవాడు తెలివిని వెదుకుతాడు కానీ అది దొరకదు,అవగాహన ఉన్న వ్యక్తికి జ్ఞానం ​సులభంగా దొరుకుతుంది.+   తెలివితక్కువవాళ్లకు దూరంగా ఉండు,వాళ్ల నోటి నుండి జ్ఞానంగల మాటలు రావు.+   వివేకం* గలవాళ్లు తాము ఏ మార్గంలో వెళ్తున్నారో తెలివితో గ్రహిస్తారు,కానీ మూర్ఖులు తమ తెలివితక్కువతనం వల్ల మోసపోతారు.*+   తెలివితక్కువవాళ్లు తమ తప్పుల్ని చూసి నవ్వుతారు,+కానీ నిజాయితీపరులు రాజీపడడానికి సిద్ధంగా ఉంటారు. 10  హృదయంలో ఉన్న బాధ హృదయానికే తెలుస్తుంది,వేరేవాళ్లెవ్వరూ దాని సంతోషాన్ని ​పంచుకోలేరు. 11  దుష్టుల ఇల్లు నాశనమౌతుంది,+నిజాయితీపరుల డేరా వర్ధిల్లుతుంది. 12  ఒక మార్గం మనిషికి సరైనదిగా ​కనిపిస్తుంది,+కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది.+ 13  పైకి నవ్వుతున్నా లోపల బాధ ​ఉండవచ్చు,సంతోషం చివరికి దుఃఖంగా మారవచ్చు. 14  హృదయం స్థిరంగా లేనివాడు తన పనుల పర్యవసానాలు అనుభవిస్తాడు,+కానీ మంచివాడు తన పనుల వల్ల వచ్చిన మంచి ఫలితాలు ఆనందిస్తాడు.+ 15  అనుభవం లేనివాడు ప్రతీ మాట ​నమ్ముతాడు,వివేకం* గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.+ 16  తెలివిగలవాడు జాగ్రత్తగా ఉంటూ, చెడు నుండి పక్కకు తప్పుకుంటాడు,కానీ మూర్ఖుడు నిర్లక్ష్య స్వభావం* చూపిస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. 17  త్వరగా కోప్పడేవాడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు,+ఆలోచనా సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ​ద్వేషించబడతాడు. 18  అనుభవం లేనివాళ్లు తెలివితక్కువ​తనాన్నే చూపిస్తారు,కానీ వివేకం* గలవాళ్లు జ్ఞానాన్ని ​కిరీటంలా ధరిస్తారు.+ 19  చెడ్డవాళ్లు మంచివాళ్ల ఎదుట వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది,దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగి నమస్కారం చేస్తారు. 20  పేదవాడిని ఇరుగుపొరుగువాళ్లు కూడా అసహ్యించుకుంటారు,+ధనవంతుడికి చాలామంది స్నేహితులు ఉంటారు.+ 21  తోటి మనిషిని నీచంగా చూసేవాడు పాపం చేస్తున్నాడు,పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు సంతోషంగా ఉంటాడు.+ 22  కుట్రపన్నేవాళ్లు దారి తప్పకుండా ఉంటారా? అయితే మంచి చేయాలని ప్రయత్నించేవాళ్ల మీద ప్రజలు విశ్వసనీయ ప్రేమ చూపిస్తారు, వాళ్లను నమ్ముతారు.+ 23  ఏ కష్టం చేసినా ప్రయోజనం ఉంటుంది,ఊరికే మాటలు చెప్పడం వల్ల లేమి ​కలుగుతుంది.+ 24  తెలివిగలవాళ్ల ధనం వాళ్లకు కిరీటం,తెలివితక్కువవాళ్ల పనులు మరింత తెలివి​తక్కువతనానికి దారితీస్తాయి.+ 25  నిజం చెప్పే సాక్షి ప్రాణాలు కాపాడతాడు,దొంగ సాక్షి నోరు తెరిస్తే అబద్ధాలే. 26  యెహోవాకు భయపడే వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు,+ఆ భయమే అతని పిల్లలకు ఆశ్రయంగా ఉంటుంది.+ 27  యెహోవా మీదుండే భయం జీవపు ఊట,అది మరణపు ఉరుల నుండి కాపాడుతుంది. 28  ఎక్కువమంది ప్రజలు ఉండడం రాజుకు ఘనత,+పౌరులు లేని పాలకుడు నాశనమౌతాడు. 29  కోప్పడే విషయంలో నిదానించే వ్యక్తికి గొప్ప వివేచన ఉంది,+ముక్కోపి తన తెలివితక్కువతనాన్ని ప్రదర్శిస్తాడు.+ 30  ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం,*అసూయ ఎముకలకు కుళ్లు.+ 31  దీనుల్ని మోసగించేవాడు వాళ్ల ​సృష్టికర్తను అవమానిస్తున్నాడు,+పేదవాళ్ల మీద కనికరం చూపించేవాడు ఆయన్ని మహిమపరుస్తున్నాడు.+ 32  దుష్టుడు తన చెడుతనం వల్లే పతన​మౌతాడు,నీతిమంతుని యథార్థత అతన్ని ​సంరక్షిస్తుంది.+ 33  అవగాహన గలవాడి హృదయంలో తెలివి ప్రశాంతంగా నివసిస్తుంది,+అయితే మూర్ఖుల మధ్య అది తనను తాను వెల్లడి చేసుకుంటుంది. 34  నీతి దేశానికి ఘనత తెస్తుంది,+పాపం దేశ ప్రజలకు అవమానం తెస్తుంది. 35  లోతైన అవగాహనతో ప్రవర్తించే ​సేవకుణ్ణి చూసి రాజు సంతోషిస్తాడు,+అవమానకరంగా నడుచుకునేవాడి మీద అతని కోపం రగులుకుంటుంది.+

అధస్సూచీలు

లేదా “బలపరుస్తుంది.”
లేదా “యుక్తి.”
లేదా “ఇతరుల్ని మోసం చేస్తారు” అయ్యుంటుంది.
లేదా “యుక్తి.”
లేదా “తీవ్రమైన కోపం.”
లేదా “యుక్తి.”
లేదా “జీవం.”