దినవృత్తాంతాలు రెండో గ్రంథం 26:1-23

  • ఉజ్జియా, యూదా రాజు (1-5)

  • ఉజ్జియా సైనిక విజయాలు (6-15)

  • గర్విష్ఠి ఉజ్జియాకు కుష్ఠువ్యాధి రావడం (16-21)

  • ఉజ్జియా మరణం (22, 23)

26  తర్వాత యూదా ప్రజలందరూ అమజ్యా స్థానంలో అతని కుమారుడు ఉజ్జియాను+ రాజును చేశారు. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు.  అమజ్యా రాజు చనిపోయిన* తర్వాత, ఉజ్జియా ఏలతు+ నగరాన్ని తిరిగి నిర్మించి, దాన్ని మళ్లీ యూదా వశం చేశాడు.+  రాజైనప్పుడు ఉజ్జియా+ వయసు 16 ఏళ్లు, అతను యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి యెరూషలేముకు చెందిన యెకొల్యా.+  అతను తన తండ్రి అమజ్యాలాగే యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.+  జెకర్యా బ్రతికున్నంత కాలం అతను దేవుణ్ణి వెదుకుతూ ఉన్నాడు; సత్యదేవునికి భయపడడం జెకర్యా అతనికి నేర్పించాడు. ఉజ్జియా యెహోవాను వెదికినంత కాలం సత్యదేవుడు అతన్ని ఆశీర్వదించాడు.+  అతను ఫిలిష్తీయుల+ మీదికి వెళ్లి వాళ్లతో యుద్ధం చేసి గాతు,+ యబ్నె,+ అష్డోదు+ ప్రాకారాల్ని పడగొట్టాడు. తర్వాత అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయుల ప్రాంతంలో నగరాలు కట్టించాడు.  ఫిలిష్తీయులతో, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతో,+ మెయోనీయులతో అతను యుద్ధం చేసినప్పుడు సత్యదేవుడు అతనికి సహాయం చేశాడు.  అమ్మోనీయులు+ ఉజ్జియాకు కప్పం చెల్లించడం మొదలుపెట్టారు. అతను చాలా శక్తిమంతుడు అవ్వడంతో అతని పేరుప్రఖ్యాతులు క్రమంగా ఐగుప్తు వరకు వ్యాపించాయి.  అంతేకాదు ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం+ దగ్గర, లోయ ద్వారం+ దగ్గర, ఆధార గోడ దగ్గర బురుజులు కట్టించి,+ వాటిని పటిష్ఠం చేశాడు. 10  అతను ఎడారిలో గోపురాలు+ కట్టించాడు, ఎన్నో బావులు తవ్వించాడు* (ఎందుకంటే, అతనికి విస్తారంగా పశుసంపద ఉంది); అతను షెఫేలాలో, మైదానంలో* కూడా అదేవిధంగా చేశాడు. అతనికి వ్యవసాయమంటే ఇష్టం కాబట్టి పర్వతాల్లో, కర్మెలులో అతనికి వ్యవసాయదారులు, ద్రాక్షతోట పనివాళ్లు ఉండేవాళ్లు. 11  అంతేకాదు, ఉజ్జియా దగ్గర యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక సైన్యం ఉండేది. వాళ్లు విభాగాలుగా యుద్ధాలకు వెళ్లేవాళ్లు. రాజు అధిపతుల్లో ఒకడైన హనన్యా పర్యవేక్షణలో, కార్యదర్శి+ యెహీయేలు అలాగే అధికారి మయశేయా వాళ్లను లెక్కించి నమోదు చేశారు.+ 12  ఈ బలమైన యోధుల మీద 2,600 మంది పూర్వీకుల కుటుంబాల పెద్దలు ఉన్నారు. 13  వాళ్ల కింద యుద్ధానికి సిద్ధంగా ఉన్న 3,07,500 మంది సైనికులు ఉన్నారు. రాజు తరఫున శత్రువుతో పోరాడే ఈ సైన్యం చాలా శక్తివంతమైనది.+ 14  ఉజ్జియా సైన్యమంతటికీ డాళ్లు, ఈటెలు,+ శిరస్త్రాణాలు,* కవచాలు,+ విల్లులు, వడిసెలలు+ ఇచ్చాడు. 15  అంతేకాదు, నిపుణులు రూపొందించిన యుద్ధ యంత్రాల్ని యెరూషలేములో చేయించాడు; వాటిని బురుజుల+ మీద, ప్రాకారాల మూలల మీద పెట్టించాడు. అవి బాణాల్ని, పెద్దపెద్ద రాళ్లను విసరగలవు. దేవుడు అతనికి ఎంతగానో సహాయం చేశాడు కాబట్టి అతను బలవంతుడయ్యాడు. దాంతో అతని ఖ్యాతి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది. 16  అయితే, అతను శక్తిమంతుడు అవ్వగానే అతని హృదయం గర్వించింది, అది అతని నాశనానికి దారితీసింది. అతను ధూపవేదిక మీద ధూపం వేయడానికి యెహోవా ఆలయంలోకి ప్రవేశించి తన దేవుడైన యెహోవా పట్ల నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు.+ 17  వెంటనే యాజకుడైన అజర్యా, అలాగే ధైర్యవంతులైన 80 మంది ఇతర యెహోవా యాజకులు అతని వెనకే లోపలికి వెళ్లారు. 18  వాళ్లు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఇలా అన్నారు: “ఉజ్జియా, నువ్వు యెహోవాకు ధూపం వేయడం సరికాదు!+ యాజకులు మాత్రమే ధూపం వేయాలి, ఎందుకంటే వాళ్లు అహరోను వంశస్థులు,+ పవిత్రపర్చబడినవాళ్లు. పవిత్రమైన స్థలం నుండి బయటికి వెళ్లు. నువ్వు నమ్మకద్రోహానికి పాల్పడ్డావు, దీనివల్ల యెహోవా దేవుని నుండి నీకు ఏ ఘనతా రాదు.” 19  కానీ ధూపం వేయాలని ధూపపాత్ర పట్టుకొని ఉన్న ఉజ్జియాకు చాలా కోపం వచ్చింది;+ అతను యెహోవా మందిరంలో ధూపవేదిక పక్కన యాజకులతో కోపంగా మాట్లాడుతుండగా, వాళ్ల కళ్లముందే అతని నుదుటి మీద కుష్ఠువ్యాధి+ వచ్చింది. 20  ముఖ్య యాజకుడైన అజర్యా, యాజకులందరూ అతనివైపు చూసినప్పుడు, అతని నుదుటి మీద కుష్ఠు కనిపించింది! యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతన్ని అక్కడి నుండి త్వరగా బయటికి పంపించేశారు, అతను కూడా త్వరత్వరగా వెళ్లిపోయాడు. 21  ఉజ్జియా రాజు తాను చనిపోయే రోజు వరకు కుష్ఠురోగిగానే ఉన్నాడు, అతను కుష్ఠురోగిగా వేరే ఇంట్లో నివసించాడు.+ అతను యెహోవా మందిరానికి వెళ్లడానికి అనుమతించబడలేదు. అతని కుమారుడైన యోతాము రాజభవనాన్ని చూసుకుంటూ దేశ ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు.+ 22  ఉజ్జియా మిగతా చరిత్రను మొదటి నుండి చివరి వరకు ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త నమోదు చేశాడు.+ 23  తర్వాత ఉజ్జియా చనిపోయాడు,* అతన్ని అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు. “అతను కుష్ఠురోగి” అని చెప్పి రాజుల సమాధుల బయట ఉన్న స్థలంలో అతన్ని పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కుమారుడు యోతాము+ రాజయ్యాడు.

అధస్సూచీలు

అక్ష., “తన పూర్వీకులతో నిద్రించిన.”
లేదా “పీఠభూమిలో.”
లేదా “తొలిపించాడు,” బహుశా రాతిలో నుండి కావచ్చు.
అంటే, హెల్మెట్‌.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”