ద్వితీయోపదేశకాండం 28:1-68

  • లోబడితే దీవెనలు (1-14)

  • లోబడకపోతే శాపాలు (15-68)

28  “ఈ రోజు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా పాటించడం ద్వారా నీ దేవుడైన యెహోవా స్వరాన్ని తప్పకుండా వింటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఖచ్చితంగా భూమ్మీద ఉన్న ఇతర జనాలన్నిటి కన్నా చాలా ఉన్నత స్థానంలో ఉంచుతాడు.+  నువ్వు నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వింటూ ఉంటావు కాబట్టి ఈ దీవెనలన్నీ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడతాయి:+  “నువ్వు నగరంలో దీవెనలు పొందుతావు, పొలంలో దీవెనలు పొందుతావు.  “నీ పిల్లలు* దీవెనలు పొందుతారు;+ నీ భూమి పంట, నీ పశువుల సంతానం అంటే నీ దూడలు, నీ గొర్రెపిల్లలు దీవెనలు పొందుతాయి.  “నీ గంప,+ పిండి పిసికే నీ గిన్నె దీవెనలు పొందుతాయి.+  “నీ పనులన్నిట్లో* నువ్వు దీవెనలు పొందుతావు.  “నీ మీద దాడి చేసే నీ శత్రువులు నీ ముందు ఓడిపోయేలా యెహోవా చేస్తాడు.+ వాళ్లు ఒక్క వైపు నుండి నీ మీద దాడి చేస్తారు, కానీ ఏడు వైపుల్లో నీ ముందు నుండి పారిపోతారు.+  యెహోవా నీ కోసం నీ గోదాముల మీదికి, నువ్వు చేసే ప్రతీ పని మీదికి దీవెన వచ్చేలా ఆజ్ఞాపిస్తాడు;+ నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ఆయన నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు.  నువ్వు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల్ని పాటిస్తూ, ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటావు కాబట్టి యెహోవా నీకు ప్రమాణం చేసినట్టే+ ఆయన నిన్ను తన కోసం పవిత్రమైన జనంగా స్థాపిస్తాడు.+ 10  నువ్వు యెహోవా పేరుతో పిలవబడే జనమని+ తెలుసుకొని భూమ్మీదున్న జనాలన్నీ నీకు భయపడతాయి.+ 11  “యెహోవా నీకు ఇస్తానని నీ పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీకు చాలామంది పిల్లల్ని, ఎన్నో పశువుల్ని, ఫలవంతమైన భూమిని ఇచ్చి సమృద్ధి కలగజేస్తాడు.+ 12  యెహోవా తన మంచి నిధిని అంటే ఆకాశాన్ని తెరిచి నీ దేశం మీద సకాలంలో వర్షాన్ని కురిపిస్తాడు,+ నీ పనులన్నిటినీ దీవిస్తాడు. నువ్వు అనేక జనాలకు అప్పు ఇస్తావు, కానీ నీకు మాత్రం అప్పు తీసుకోవాల్సిన అవసరం రాదు. 13  నువ్వు పాటించడానికి, వాటి ప్రకారం జీవించడానికి ఈ రోజు నేను నీకు ఇస్తున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటికీ నువ్వు లోబడుతూ ఉంటే యెహోవా నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా కాదు; నువ్వు పైన ఉంటావు+ కానీ కింద కాదు. 14  ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటి నుండి నువ్వు కుడికి గానీ ఎడమకు గానీ తిరిగి,+ వేరే దేవుళ్లను అనుసరించి వాటిని పూజించకూడదు. 15  “ఈ రోజు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ, శాసనాలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా పాటించకుండా, నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వినకుండా ఉంటే ఈ శాపాలన్నీ నీ మీదికి వస్తాయి, నువ్వు వాటిని తప్పించుకోలేవు:+ 16  “నువ్వు నగరంలో శపించబడతావు, పొలంలో శపించబడతావు.+ 17  “నీ గంప, పిండి పిసికే నీ గిన్నె శపించబడతాయి.+ 18  “నీ పిల్లలు* శపించబడతారు;+ నీ భూమి పంట, నీ దూడలు, నీ గొర్రెపిల్లలు శపించబడతాయి.+ 19  “నీ పనులన్నిట్లో* నువ్వు శపించబడతావు. 20  “నువ్వు చేసిన చెడ్డపనుల వల్ల, నన్ను విడిచిపెట్టినందువల్ల నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు, త్వరగా తుడిచిపెట్టుకుపోయే వరకు నీ ప్రతీ పనిలో యెహోవా నీ మీదికి శాపాన్ని, అయోమయాన్ని, శిక్షను పంపిస్తాడు.+ 21  నువ్వు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నిన్ను తుడిచిపెట్టే వరకు రోగం నీకు అంటుకొని ఉండేలా యెహోవా నిన్ను మొత్తుతాడు.+ 22  యెహోవా నిన్ను క్షయతో, ఒళ్లు కాలిపోయే జ్వరంతో,+ మంటతో, జ్వరం వేడితో, ఖడ్గంతో,+ మంట పుట్టించే తెగులుతో, మొక్కల తెగులుతో*+ మొత్తుతాడు; నువ్వు తుడిచిపెట్టుకుపోయే వరకు అవి నిన్ను వెంటాడతాయి. 23  నీ ఆకాశం రాగిలా, నీ భూమి ఇనుములా మారతాయి.+ 24  యెహోవా నీ దేశం మీద కురిసే వర్షాన్ని ఇసుకలా, ధూళిలా మార్చేస్తాడు. నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు అవి ఆకాశం నుండి కురుస్తాయి. 25  నువ్వు నీ శత్రువుల ముందు ఓడిపోయేలా యెహోవా చేస్తాడు.+ నువ్వు ఒక్క వైపు నుండి వాళ్ల మీద దాడి చేస్తావు, కానీ ఏడు వైపుల్లో వాళ్ల ముందు నుండి పారిపోతావు; నీ పరిస్థితి చూసి భూమ్మీద ఉన్న రాజ్యాలన్నీ జడుసుకుంటాయి.+ 26  నీ కళేబరాలు ఆకాశంలో ఎగిరే ప్రతీ పక్షికి, నేలమీద తిరిగే ప్రతీ జంతువుకు ఆహారమౌతాయి, వాటిని అదిలించి వెళ్లగొట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ 27  “ఐగుప్తులో ఉండేలాంటి పొక్కులతో, అర్శమొలలతో, గజ్జితో, తామరతో యెహోవా నిన్ను మొత్తుతాడు, వాటిని నువ్వు నయం చేసుకోలేవు. 28  యెహోవా నిన్ను పిచ్చితో, గుడ్డితనంతో+ అయోమయంతో* మొత్తుతాడు. 29  గుడ్డివాడు చీకట్లో తడవులాడినట్టు, నువ్వు మిట్టమధ్యాహ్నం తడవులాడతావు,+ నువ్వు చేసే ఏ పనిలోనూ విజయం సాధించవు; ఇతరులు నిన్ను ఎప్పుడూ దగా చేస్తూ, దోచుకుంటూ ఉంటారు, నిన్ను కాపాడేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ 30  నీకు ఒక స్త్రీతో పెళ్లి నిశ్చయమౌతుంది కానీ వేరే వ్యక్తి ఆమెను చెరుపుతాడు. నువ్వు ఇల్లు కడతావు కానీ అందులో నివసించవు,+ ద్రాక్షతోట నాటుతావు కానీ దాని పండ్లు తినవు.+ 31  నీ ఎద్దు నీ కళ్ల ముందే వధించబడుతుంది, కానీ దాని మాంసంలో కొంచెం కూడా నువ్వు తినవు. నీ గాడిద నీ ముందే దొంగిలించబడుతుంది, కానీ నువ్వు దాన్ని తిరిగి తెచ్చుకోలేవు. నీ గొర్రెలు నీ శత్రువులకు ఇవ్వబడతాయి, కానీ వాటిని కాపాడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. 32  నువ్వు చూస్తుండగానే నీ కుమారుల్ని, కూతుళ్లను వేరే జనాలు తీసుకెళ్లిపోతారు,+ నువ్వు వాళ్ల కోసం ఎప్పుడూ ఆత్రంగా ఎదురుచూస్తావు, కానీ నువ్వు ఏమీ చేయలేవు. 33  నీకు తెలియని జనం నీ భూమి పంటను, నీ కష్టార్జితాన్ని తినేస్తుంది;+ ఇతరులు నిన్ను ఎప్పుడూ దగా చేస్తూ, అణగదొక్కుతూ ఉంటారు. 34  నీ కళ్లతో చూసేవాటిని బట్టి నీకు పిచ్చెక్కుతుంది. 35  “నీ మోకాళ్ల మీద, కాళ్ల మీద, అరికాలి నుండి నడినెత్తి వరకు బాధాకరమైన, నయం చేయలేని పొక్కులు వచ్చేలా చేసి యెహోవా నిన్ను మొత్తుతాడు. 36  యెహోవా నిన్ను, నువ్వు నియమించుకున్న రాజును నీకు గానీ, నీ పూర్వీకులకు గానీ తెలియని దేశానికి వెళ్లగొడతాడు.+ నువ్వు అక్కడ చెక్కతో, రాళ్లతో చేయబడిన వేరే దేవుళ్లను పూజిస్తావు.+ 37  యెహోవా నిన్ను ఏ జనాల మధ్యకైతే వెళ్లగొడతాడో ఆ జనాలన్నీ నీ పరిస్థితి చూసి జడుసుకుంటాయి, నిన్ను ఈసడించుకుంటాయి,* అపహాస్యం చేస్తాయి.+ 38  “నువ్వు నీ పొలంలో చాలా విత్తనాలు విత్తుతావు కానీ కొంచెం పంటనే సమకూర్చుకుంటావు,+ ఎందుకంటే మిడతలు నీ పంటను మింగేస్తాయి. 39  నువ్వు ద్రాక్షతోటలు నాటి సేద్యం చేస్తావు కానీ వాటి ద్రాక్షారసం తాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకోవు,+ ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి. 40  నీ ప్రాంతమంతట్లో ఒలీవ చెట్లు ఉంటాయి కానీ కొంచెం ఒలీవ నూనెను కూడా నువ్వు రాసుకోవు, ఎందుకంటే నీ ఒలీవ కాయలు రాలిపోతాయి. 41  నువ్వు కుమారుల్ని, కూతుళ్లను కంటావు కానీ వాళ్లు నీ వాళ్లుగా ఉండరు, ఎందుకంటే వాళ్లు బందీలుగా తీసుకెళ్లబడతారు.+ 42  నీ చెట్లన్నిటినీ, నీ భూమి పంట అంతటినీ మిడతల* దండ్లు తినేస్తాయి. 43  నీ మధ్య నివసిస్తున్న పరదేశి నీ కన్నా ఉన్నతస్థాయికి వెళ్తూ ఉంటాడు, నువ్వేమో అంతకంతకూ దిగజారుతూ ఉంటావు. 44  అతను నీకు అప్పు ఇస్తాడు కానీ నువ్వు అతనికి అప్పు ఇవ్వలేవు.+ అతను తల అవుతాడు, నువ్వు తోక అవుతావు.+ 45  “నువ్వు నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వినలేదు, ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞల్ని, శాసనాల్ని పాటించలేదు కాబట్టి నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు+ ఈ శాపాలన్నీ+ ఖచ్చితంగా నీ మీదికి వస్తాయి, నిన్ను వెంటాడి పట్టుకుంటాయి.+ 46  అవి నీ మీదికి, నీ సంతానం మీదికి వస్తాయి; అవి ప్రతీ ఒక్కరికి శాశ్వతమైన సూచనగా, హెచ్చరికగా పనిచేస్తాయి.+ 47  ఎందుకంటే నీకు ప్రతీది సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు నీ దేవుడైన యెహోవాను సంతోషంతో, హృదయానందంతో సేవించలేదు.+ 48  యెహోవా నీ శత్రువుల్ని నీ మీదికి పంపిస్తాడు; నువ్వు ఆకలిదప్పులతో+ వాళ్లకు సేవ చేస్తావు,+ నీకు సరైన బట్టలు ఉండవు, ప్రతీది నీకు లోటుగా ఉంటుంది. నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు ఆయన నీ మెడ మీద ఇనుప కాడి పెడతాడు. 49  “యెహోవా సుదూరాన ఉన్న అంటే భూమి అంచున ఉన్న ఒక జనాన్ని నీ మీదికి రప్పిస్తాడు.+ ఆ జనం గద్దలా దూసుకొచ్చి నిన్ను పట్టుకుంటుంది,+ వాళ్ల భాష నీకు అర్థంకాదు;+ 50  వాళ్లు చూడడానికి చాలా క్రూరంగా ఉంటారు; వాళ్లు వృద్ధుల మీద గానీ, పిల్లల మీద గానీ దయ చూపించరు.+ 51  నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు వాళ్లు నీ పశువుల పిల్లల్ని, నీ భూమి పంటను తినేస్తారు. వాళ్లు నిన్ను నాశనం చేసేవరకు ధాన్యాన్ని గానీ, కొత్త ద్రాక్షారసాన్ని గానీ, నూనెను గానీ, పశువుల పిల్లల్ని గానీ, గొర్రెల-మేకల పిల్లల్ని గానీ నీకు మిగల్చరు.+ 52  వాళ్లు నిన్ను ముట్టడించి, నువ్వు నమ్ముకున్న నీ ఎత్తైన ప్రాకారాలు కూలిపోయేవరకు నీ దేశంలోని నగరాలన్నిటి లోపల నిన్ను బంధిస్తారు. అవును, వాళ్లు ఖచ్చితంగా నిన్ను ముట్టడించి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశంలోని నగరాలన్నిటి లోపల నిన్ను బంధిస్తారు.+ 53  అప్పుడు నువ్వు నీ సొంత పిల్లల్ని,* అంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన నీ కుమారుల, కూతుళ్ల మాంసాన్ని తినాల్సి వస్తుంది.+ ఎందుకంటే వాళ్లు నిన్ను ముట్టడించినప్పుడు పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది, నీ శత్రువు పెట్టే బాధలు భయంకరంగా ఉంటాయి. 54  “నీ మధ్య ఉన్న అత్యంత మృదుస్వభావి, సున్నిత మనస్కుడు కూడా తన సహోదరుడి మీద గానీ, తన ప్రియమైన భార్య మీద గానీ, మిగిలివున్న తన కుమారుల మీద గానీ జాలి చూపించడు. 55  అతను తింటున్న తన కుమారుల మాంసంలో కొంచెం కూడా వాళ్లతో పంచుకోడు. ఎందుకంటే, శత్రువు ముట్టడించినప్పుడు ఉండే ఘోరమైన పరిస్థితుల వల్ల, నీ నగరాల మీదికి శత్రువు తెచ్చే కష్టాల వల్ల అతని దగ్గర ఇంకేమీ ఉండదు.+ 56  నీ మధ్య, చాలా సుకుమారంగా పెరగడం వల్ల అరికాలు నేలమీద పెట్టడానికి కూడా వెనకాడే మృదువైన, సున్నితమైన స్త్రీ+ సైతం తన ప్రియమైన భర్త మీద గానీ, కుమారుడి మీద గానీ, కూతురి మీద గానీ జాలి చూపించదు. 57  ఆమె తాను కనే కుమారుల మాంసాన్ని గానీ, చివరికి ప్రసవం తర్వాత తన కాళ్ల మధ్య నుండి వచ్చే మావిని* గానీ వాళ్లకు ఇవ్వాలనుకోదు; ఆమె రహస్యంగా వాటిని తినేస్తుంది. ఎందుకంటే, శత్రువు ముట్టడించినప్పుడు పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది, నీ నగరాల మీదికి శత్రువు తెచ్చే కష్టాలు అంత భయంకరంగా ఉంటాయి. 58  “ఈ గ్రంథంలో+ రాయబడిన ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా పాటించకపోతే, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే మహిమాన్వితమైన ఈ పేరుకు+ అంటే నీ దేవుడైన యెహోవా పేరుకు+ నువ్వు భయపడకపోతే, 59  చాలాకాలం పాటు పట్టి పీడించే ఘోరమైన తెగుళ్లను, బాధాకరమైన రోగాల్ని యెహోవా నీ మీదికి, నీ పిల్లల మీదికి రప్పిస్తాడు.+ 60  ఒకప్పుడు నువ్వు భయపడిన ఐగుప్తులోని రోగాలన్నిటినీ ఆయన నీ మీదికి తిరిగి రప్పిస్తాడు, అవి నీకు అంటుకునే ఉంటాయి. 61  అంతేకాదు, నువ్వు సమూలంగా నాశనమయ్యే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతీ రోగాన్ని, తెగులును కూడా యెహోవా నీ మీదికి రప్పిస్తాడు. 62  మీరు మీ దేవుడైన యెహోవా స్వరాన్ని వినలేదు కాబట్టి, మీ సంఖ్య ఆకాశ నక్షత్రాలంత ఉన్నా,+ అందులో చాలా కొద్దిమందే మిగులుతారు.+ 63  “ఒకప్పుడు మిమ్మల్ని వర్ధిల్లజేయడానికి, మీ సంఖ్య పెరిగేలా చేయడానికి యెహోవా ఎలాగైతే చాలా సంతోషించాడో, అలాగే మిమ్మల్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి కూడా యెహోవా చాలా సంతోషిస్తాడు; మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నుండి మీరు పెరికేయబడతారు. 64  “యెహోవా నిన్ను భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు అన్నిదేశాల్లోకి చెదరగొడతాడు;+ నువ్వు అక్కడ, నీకు గానీ నీ పూర్వీకులకు గానీ తెలియని దేవుళ్లను అంటే చెక్కతో, రాళ్లతో చేయబడిన దేవుళ్లను పూజించాల్సి వస్తుంది.+ 65  ఆ జనాల మధ్య నీకు నెమ్మది గానీ, నీ అరికాలికి విశ్రాంతిచోటు గానీ ఉండదు.+ బదులుగా, అక్కడ నీ హృదయం ఆందోళనతో నిండిపోయేలా,+ నీ కంటిచూపు మందగించేలా, నీకు నిరాశ కలిగేలా యెహోవా చేస్తాడు.+ 66  నీ ప్రాణాలు గొప్ప అపాయంలో పడతాయి, నువ్వు రాత్రింబగళ్లు భయంతో వణికిపోతావు; నువ్వు ప్రాణాలతో ఉంటావన్న నమ్మకం కూడా నీకు ఉండదు. 67  నువ్వు నీ హృదయంలో ఉన్న విపరీతమైన భయం వల్ల, నీ కంటికి కనిపించేవాటి వల్ల ఉదయమేమో ‘సాయంకాలమైతే బాగుండు!’ అని, సాయంకాలమేమో ‘⁠ఉదయమైతే బాగుండు!’ అని అనుకుంటావు. 68  ‘నువ్వు మళ్లీ ఎన్నడూ దాన్ని చూడవు’ అని నేను ఏ మార్గం గురించైతే చెప్పానో ఆ మార్గం గుండా యెహోవా ఖచ్చితంగా నిన్ను ఓడలో మళ్లీ ఐగుప్తుకు తీసుకొస్తాడు; అక్కడ మిమ్మల్ని మీరు మీ శత్రువులకు దాసులుగా, దాసురాళ్లుగా అమ్ముకోవాల్సి వస్తుంది, కానీ మిమ్మల్ని కొనేవాళ్లు ఎవ్వరూ ఉండరు.”

అధస్సూచీలు

అక్ష., “గర్భఫలం.”
లేదా “రాకపోకలన్నిట్లో.”
అక్ష., “గర్భఫలం.”
లేదా “రాకపోకలన్నిట్లో.”
అక్ష., “బూజుతో.”
లేదా “హృదయ దిగ్భ్రాంతితో.”
లేదా “నీమీద సామెత చెప్పుకుంటాయి.”
లేదా “రెక్కల ధ్వని చేసే పురుగుల.”
అక్ష., “గర్భఫలాన్ని.”
లేదా “మాయను.”