కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పదిహేడవ అధ్యాయం

ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి

ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
  • మనం దేవునికి ఎందుకు ప్రార్థించాలి?

  • దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏమి చేయాలి?

  • దేవుడు మన ప్రార్థనలకు ఏ విధంగా జవాబిస్తాడు?

‘భూమ్యాకాశముల సృష్టికర్త’ మన ప్రార్థనలు వినడానికి సుముఖంగా ఉన్నాడు

1, 2. ప్రార్థనను మనం ఎందుకు ఒక ఆధిక్యతగా దృష్టించాలి, దాని గురించి బైబిలు చెబుతున్నది ఏమిటో మనం ఎందుకు తెలుసుకోవాలి?

 సువిశాల విశ్వంతో పోల్చిచూస్తే భూమి చాలా చిన్నగా ఉంటుంది. వాస్తవానికి, “భూమ్యాకాశములను సృజించిన” యెహోవా దృష్టిలో మానవ జనాంగాలు చేదనుండి జారిపడే చిన్న నీటిబిందువుల్లా మాత్రమే ఉంటాయి. (కీర్తన 115:15; యెషయా 40:15) అయినప్పటికీ, బైబిలు ఇలా చెబుతోంది: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొఱ్ఱ ఆలకిం[చును].” (కీర్తన 145:18, 19) దాని అర్థమేమిటో ఒక్కసారి ఆలోచించండి! సర్వశక్తిగల సృష్టికర్త మనకు సమీపంగా ఉండడమే కాక, మనం ఆయనకు ‘నిజంగా మొరపెడితే’ మన ప్రార్థనలు వింటాడు కూడా. కాబట్టి ప్రార్థనలో దేవుణ్ణి సమీపించే గొప్ప ఆధిక్యత మనకుంది.

2 అయితే యెహోవా మన ప్రార్థనలు వినాలంటే, ఆయన ఆమోదించే పద్ధతిలోనే మనం ప్రార్థించాలి. ప్రార్థన గురించి బైబిలు బోధిస్తున్నది ఏమిటో మనకు అర్థం కానప్పుడు, మనం ఆయన ఆమోదించే పద్ధతిలో ఎలా ప్రార్థించగలం? యెహోవాకు సన్నిహితమవడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది కాబట్టి, ఈ విషయం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.

యెహోవాకు ఎందుకు ప్రార్థించాలి?

3. మనం యెహోవాకు ప్రార్థించడానికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటి?

3 మనం ప్రార్థించడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే మనమలా ప్రార్థించాలని ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆయన వాక్యం మనలను ఇలా ప్రోత్సహిస్తోంది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) అందువల్ల, విశ్వసర్వాధిపతి మనకోసం చేసిన అలాంటి ప్రేమపూర్వక ఏర్పాటును మనం నిర్లక్ష్యం చేయాలని కోరుకోము.

4. యెహోవాకు క్రమంగా ప్రార్థించడం ఆయనతో మన సంబంధాన్ని ఎలా బలపరుస్తుంది?

4 ప్రార్థించడానికి మరో కారణం ఏమిటంటే, యెహోవాకు క్రమంగా ప్రార్థించడం ఆయనతో మనకున్న సంబంధాన్ని బలపరుస్తుంది. నిజ స్నేహితులు తమకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుకోరు. మంచి స్నేహితులు ఒకరిపట్ల ఒకరు శ్రద్ధాసక్తులతో ఉంటారు, వారు తమ ఆలోచనలను, చింతలను, భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే కొద్దీ వారి స్నేహం మరింత బలోపేతమవుతుంది. యెహోవా దేవునితో మన సంబంధం విషయానికొస్తే, కొన్ని విధాలుగా మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఈ పుస్తకం సహాయంతో యెహోవా గురించీ, ఆయన వ్యక్తిత్వం గురించీ, ఆయన సంకల్పాల గురించీ బైబిలు ఏమి బోధిస్తోందో మనం చాలా తెలుసుకున్నాం. ఆయనొక నిజమైన వ్యక్తి అని మీరు తెలుసుకున్నారు. ప్రార్థన మీ ఆలోచనలను, అంతరంగ భావాలను మీ పరలోకపు తండ్రికి వ్యక్తం చేసే అవకాశాన్ని మీకిస్తుంది. మీరలా వ్యక్తం చేసినప్పుడు యెహోవాకు మరింత సన్నిహితమవుతారు.—యాకోబు 4:8.

మనం ఏ నియమాలను పాటించాలి?

5. యెహోవా మనం చేసే అన్ని ప్రార్థనలూ వినడని ఏది చూపిస్తోంది?

5 యెహోవా మనం చేసే ప్రార్థనలన్నీ వింటాడా? యెషయా ప్రవక్త కాలంలో ఆయన తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులతో ఏమి చెప్పాడో పరిశీలించండి: “మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండియున్నవి.” (యెషయా 1:15) కాబట్టి కొన్నిరకాల క్రియల కారణంగా దేవుడు మన ప్రార్థనలు వినడు. కాబట్టి దేవుడు అనుగ్రహపూర్వకంగా మన ప్రార్థనలు వినాలంటే, మనం పాటించవలసిన ప్రాథమిక విషయాలు కొన్ని ఉన్నాయి.

6. దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, ఒక ప్రాథమిక విషయం ఏమిటి, మనం దానిని ఎలా చూపించవచ్చు?

6 ఒక ప్రాథమిక విషయం ఏమిటంటే, మనం విశ్వాసం చూపించాలి. (మార్కు 11:24 చదవండి.) అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.” (హెబ్రీయులు 11:6) నిజమైన విశ్వాసంతో ఉండడం అంటే కేవలం దేవుడు ఉనికిలో ఉన్నాడనీ, ఆయన ప్రార్థనలు వింటూ వాటికి జవాబులు ఇస్తాడనీ నమ్మడం మాత్రమే సరిపోదు. మనకున్న విశ్వాసాన్ని మన క్రియల ద్వారా నిరూపించాలి. మనం మన దైనందిన జీవిత విధానం ద్వారా మనకు విశ్వాసం ఉందని స్పష్టమైన రుజువు ఇవ్వాలి.—యాకోబు 2:26.

7. (ఎ) యెహోవాకు ప్రార్థన చేసేటప్పుడు మనం గౌరవపూర్వకంగా ఎందుకు ఉండాలి? (బి) దేవునికి ప్రార్థించేటప్పుడు, మనం వినయాన్ని, నిష్కపటాన్ని ఎలా చూపించవచ్చు?

7 ప్రార్థనలో తనను సమీపించేవారు వినయంగా, నిష్కపటంగా ఉండాలని కూడా యెహోవా కోరుతున్నాడు. మనం యెహోవాతో మాట్లాడేటప్పుడు వినయం ప్రదర్శించవద్దా? రాజుతోనో, ఒక అధ్యక్షునితోనో మాట్లాడే అవకాశం ప్రజలకు లభించినప్పుడు, వారు ఆ పరిపాలకుని ఉన్నతస్థానాన్ని గుర్తిస్తూ, సాధారణంగా గౌరవంతో మాట్లాడతారు. మరి మనం యెహోవాను సమీపించేటప్పుడు ఇంకా ఎంత గౌరవంగా ఉండాలో కదా! (కీర్తన 138:6) ఎంతైనా ఆయన “సర్వశక్తిగల దేవుడు.” (ఆదికాండము 17:1) మనం దేవునికి ప్రార్థించేటప్పుడు, మనం ఆయనను సమీపించే తీరు ఆయన ఎదుట మన స్థానాన్ని దీన స్వభావంతో గుర్తిస్తున్నట్లుగా చూపించాలి. అలాంటి వినయం మనం వాడుకగా, ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా, నిష్కపటంతో హృదయపూర్వకంగా ప్రార్థించడానికి కూడా పురికొల్పుతుంది.—మత్తయి 6:7, 8.

8. మనం చేసే ప్రార్థనలకు అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించవచ్చు?

8 దేవుడు మన ప్రార్థన వినాలంటే అవసరమైన మరో విషయం మన ప్రార్థనలకు అనుగుణంగా మనం ప్రవర్తించడం. మనం దేనికోసం ప్రార్థిస్తున్నామో ఆ మేరకు మనం మన శాయశక్తులా ప్రయత్నించాలని కూడా యెహోవా ఆశిస్తాడు. ఉదాహరణకు, “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము” అని ప్రార్థిస్తే, మనం చేయడానికి అందుబాటులో ఉన్న ఏ ఉద్యోగం చేయడానికైనా తీవ్రంగా కృషి చేయాలి. (మత్తయి 6:11; 2 థెస్సలొనీకయులు 3:10) ఏదైనా శరీర బలహీనతను అధిగమించే విషయంలో సహాయం కోసం మనం ప్రార్థిస్తే, మనలను శోధనకు గురిచేసే స్థలాలకు, పరిస్థితులకు దూరంగా ఉండేందుకు జాగ్రత్తపడాలి. (కొలొస్సయులు 3:5) ఈ ప్రాథమిక విషయాలకు తోడుగా, ప్రార్థనకు సంబంధించి మనం జవాబులు పొందవలసిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి.

ప్రార్థనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు జవాబులు

9. మనం ఎవరికి ప్రార్థించాలి, ఎవరి నామమున ప్రార్థించాలి?

9 ఎవరికి ప్రార్థించాలి? ‘పరలోకమందున్న మన తండ్రికి’ ప్రార్థించాలని యేసు తన అనుచరులకు బోధించాడు. (మత్తయి 6:9, 10) కాబట్టి మనం యెహోవా దేవునికి మాత్రమే ప్రార్థించాలి. అయితే, మనం ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు స్థానాన్ని గుర్తించాలని కూడా యెహోవా కోరుతున్నాడు. మనం 5వ అధ్యాయంలో నేర్చుకున్నట్లుగా, మనలను పాపమరణాల నుండి విడిపించేందుకు విమోచన క్రయధనముగా యేసు భూమికి పంపించబడ్డాడు. (యోహాను 3:16; రోమీయులు 5:12) ఆయన నియమిత ప్రధాన యాజకుడు, న్యాయాధిపతి. (యోహాను 5:22, 23; హెబ్రీయులు 6:20) కాబట్టి, మనం యేసు ద్వారా అంటే ఆయన నామమున ప్రార్థించాలని లేఖనాలు మనల్ని నిర్దేశిస్తున్నాయి. ఆయనే ఇలా చెప్పాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” (యోహాను 14:6) యెహోవా దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, మనం ఆయన కుమారుడైన యేసు ద్వారా అంటే యేసు నామమున యెహోవాకు మాత్రమే ప్రార్థించాలి.

10. మనం ప్రార్థించేటప్పుడు ఒక ప్రత్యేకమైన భంగిమ ఎందుకు అవసరం లేదు?

10 మనం ప్రార్థించేటప్పుడు ప్రత్యేకమైన భంగిమలో ఉండి ప్రార్థించాలా? అక్కర్లేదు. ఒక ప్రత్యేక పద్ధతిలో చేతులు జోడించి ప్రార్థించాలనో లేక ప్రత్యేక భంగిమలో ఉండి ప్రార్థించాలనో యెహోవా కోరడం లేదు. వివిధ భంగిమల్లో ఉండి ప్రార్థించడం ఆమోదయోగ్యమైనదేనని బైబిలు బోధిస్తోంది. కూర్చొని, తలవంచుకొని, మోకాళ్లూని, నిలబడి ఎలాగైనా ప్రార్థించవచ్చు. (1 దినవృత్తాంతములు 17:16; నెహెమ్యా 8:6; దానియేలు 6:10; మార్కు 11:25) ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇతరులు చూసేలా ఏదో ప్రత్యేక భంగిమ కాదుగానీ, సరైన మనోవైఖరి ఉండాలి. వాస్తవానికి, మన దైనందిన కార్యక్రమాల సమయాల్లో లేదా మనకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మనమెక్కడ ఉన్నా మౌనంగా ప్రార్థించుకోవచ్చు. అలాంటి ప్రార్థనలు మనచుట్టూ ఉన్నవారు ఏ మాత్రం గమనించకపోయినా యెహోవా వింటాడు.—నెహెమ్యా 2:1-6.

11. ప్రార్థనల్లో సరైన అంశాలుగా ఉండే కొన్ని వ్యక్తిగత విషయాలు ఏమిటి?

11 మనం దేనికోసం ప్రార్థించవచ్చు? బైబిలు ఇలా వివరిస్తోంది: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన [యెహోవా] మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహాను 5:14) కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఉన్న దేనినైనా మనం అడగవచ్చు. మన వ్యక్తిగత అవసరాల గురించి అడగడం ఆయన చిత్తమేనా? ఖచ్చితంగా! యెహోవాకు ప్రార్థించడం ఒక సన్నిహిత స్నేహితునితో మాట్లాడినట్లే ఉండగలదు. మనం దాచిపెట్టుకోకుండా దేవుని ఎదుట ‘మన హృదయాలు కుమ్మరించవచ్చు.’ (కీర్తన 62:8) సరైనది చేయడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది కాబట్టి దానికోసం మనం ప్రార్థించడం సముచితమైనదే. (లూకా 11:13) జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నిర్దేశం కోసం, కష్టాలను విజయవంతంగా ఎదుర్కోవడానికి కావలసిన బలం కోసం కూడా మనం అడగవచ్చు. (యాకోబు 1:5) మనం పాపం చేసినప్పుడు, క్రీస్తు బలి ఆధారంగా మనం క్షమాపణ కోసం అడగాలి. (ఎఫెసీయులు 1:3, 7) అయితే మన ప్రార్థనల్లో కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే ఉండకూడదు. మనం ఇతరుల గురించి అంటే మన కుటుంబ సభ్యుల గురించి, తోటి ఆరాధకుల గురించి కూడా ప్రార్థించాలి.—అపొస్తలుల కార్యములు 12:5; కొలొస్సయులు 4:12.

12. మనం మన ప్రార్థనల్లో మన పరలోకపు తండ్రికి సంబంధించిన విషయాలకు ప్రథమస్థానాన్ని ఎలా ఇవ్వవచ్చు?

12 మన ప్రార్థనల్లో యెహోవా దేవునికి సంబంధించిన అంశాలకు ప్రథమస్థానం ఇవ్వాలి. ఆయన చూపించిన మంచితనం విషయంలో హృదయపూర్వక స్తుతిని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి మనకు కారణం ఉంది. (1 దినవృత్తాంతములు 29:10-13) మత్తయి 6:9-13⁠లో వ్రాయబడివున్న, యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలో, దేవుని నామం పరిశుద్ధపరచబడాలని అంటే అది పవిత్రమైనదిగా లేదా పరిశుద్ధమైనదిగా పరిగణించబడాలని ప్రార్థించమని ఆయన మనకు బోధించాడు. (చదవండి.) దేవుని రాజ్యం రావాలనీ, పరలోకంలో ఆయన చిత్తం నెరవేరినట్లే ఈ భూమ్మీద కూడా నెరవేరాలనీ ఆ తర్వాత ప్రస్తావించాడు. యేసు యెహోవాకు సంబంధించిన ఈ ప్రాముఖ్యమైన అంశాలను ప్రస్తావించిన తర్వాతే, వ్యక్తిగత విషయాల మీదకు దృష్టి సారించాడు. అదేవిధంగా మనం కూడా మన ప్రార్థనల్లో దేవునికి అతి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చినప్పుడు, మనకు కేవలం మన సంక్షేమం విషయంలోనే ఆసక్తి లేదని చూపిస్తాం.

13. ఆమోదయోగ్యమైన ప్రార్థనలు ఎంతసేపు చేయాలనే విషయంలో లేఖనాలు ఏమి సూచిస్తున్నాయి?

13 మనం ఎంతసేపు ప్రార్థించాలి? వ్యక్తిగత, బహిరంగ ప్రార్థనలు ఎంతసేపు చేయాలనే విషయంలో బైబిలు ఎలాంటి పరిమితులను ఉంచడం లేదు. అవి భోజనానికి ముందు చేసే క్లుప్త ప్రార్థనలు మొదలుకొని, యెహోవా ఎదుట మన హృదయం కుమ్మరిస్తూ చేసే దీర్ఘ ప్రార్థనల వరకు, వివిధ రకాలుగా ఉండవచ్చు. (1 సమూయేలు 1:12, 15) అయితే ఇతరులకు కనబడేలా ఆర్భాటంగా, గొప్పతనం కోసం ప్రార్థించే స్వనీతిపరులను యేసు ఖండించాడు. (లూకా 20:46, 47) అలాంటి ప్రార్థనలు యెహోవాను సంతోషపెట్టవు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ప్రార్థనలు హృదయంలో నుండి రావాలి. కాబట్టి, అంగీకృత ప్రార్థనలు అవసరాలనుబట్టి, పరిస్థితులనుబట్టి మారుతూ ఉంటాయి.

మీరు ఏ సందర్భంలో చేసినా మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు

14. ‘నిత్యము ప్రార్థన చేస్తుండండి’ అని మనలను ప్రోత్సహించడంలో బైబిలు ఉద్దేశమేమిటి, ఈ విషయంలో మనకు ఏది ఓదార్పుగా ఉంది?

14 మనం ఎంత తరచుగా ప్రార్థించాలి? ‘నిత్యము ప్రార్థన చేస్తుండండి,’ ‘పట్టుదలతో ప్రార్థించండి,’ ‘ఎడతెగక ప్రార్థించండి’ అని బైబిలు మనలను ప్రోత్సహిస్తోంది. (లూకా 18:1; రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17) అంటే, మనం రోజంతా యెహోవాకు ప్రార్థిస్తూ ఉండాలని ఈ మాటల అర్థం కాదు. బదులుగా, యెహోవా మనపట్ల చూపించిన మంచితనం విషయంలో ఆయనకు నిరంతరం కృతజ్ఞతలు చెల్లిస్తూ నిర్దేశం, ఓదార్పు, బలం కోసం క్రమంగా ప్రార్థించాలని బైబిలు మనకు ఉద్భోదిస్తోంది. ప్రార్థనలో తనతో మనం ఎంతసేపు, ఎంత తరచుగా మాట్లాడవచ్చు అనే విషయంలో యెహోవా హద్దులు పెట్టలేదని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా? మనం నిజంగా ప్రార్థనాధిక్యతను విలువైనదిగా పరిగణించినప్పుడు, మన పరలోక తండ్రికి ప్రార్థించే అనేక అవకాశాలు మనకు లభిస్తాయి.

15. వ్యక్తిగత లేదా బహిరంగ ప్రార్థనల ముగింపులో మనం “ఆమేన్‌” అని ఎందుకు అనాలి?

15 ప్రార్థన ముగింపులో మనం “ఆమేన్‌” అని ఎందుకు అనాలి? “ఆమేన్‌” అనే మాటకు “నిశ్చయంగా” లేదా “అలాగే జరగాలి” అని అర్థం. వ్యక్తిగత, బహిరంగ ప్రార్థనల ముగింపులో “ఆమేన్‌” అనడం సముచితమని లేఖన ఉదాహరణలు చూపిస్తున్నాయి. (1 దినవృత్తాంతములు 16:36; కీర్తన 41:13) మనం చేసుకునే ప్రార్థన ముగింపులో “ఆమేన్‌” అని అనడం ద్వారా, మనం యథార్థంగా మన భావాలను వ్యక్తం చేశామని అంగీకరిస్తాం. వేరొకరు బహిరంగంగా చేసిన ప్రార్థన ముగింపులో మనం నిశ్శబ్దంగా లేదా బిగ్గరగా “ఆమేన్‌” అన్నప్పుడు, ప్రార్థనలో వ్యక్తపరచబడిన మాటలతో మనం ఏకీభవిస్తున్నామని సూచిస్తాం.—1 కొరింథీయులు 14:16.

మన ప్రార్థనలకు దేవుడు ఏ విధంగా జవాబిస్తాడు?

16. ప్రార్థన విషయంలో మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

16 యెహోవా మన ప్రార్థనలకు నిజంగా జవాబిస్తాడా? తప్పకుండా జవాబిస్తాడు! ‘ప్రార్థన ఆలకించువాడు’ లక్షలాదిమంది చేసే యథార్థ ప్రార్థనలకు జవాబిస్తాడని నమ్మేందుకు మనకు బలమైన ఆధారం ఉంది. (కీర్తన 65:2) మన ప్రార్థనలకు యెహోవా ఇచ్చే జవాబు వివిధ రీతుల్లో ఉండవచ్చు.

17. మన ప్రార్థనలకు జవాబిచ్చేందుకు దేవుడు తన దూతలను, భూమ్మీది తన సేవకులను ఉపయోగించుకుంటాడని ఎందుకు చెప్పవచ్చు?

17 ప్రార్థనలకు జవాబిచ్చేందుకు యెహోవా తన దూతలను, భూమ్మీది సేవకులను ఉపయోగిస్తాడు. (హెబ్రీయులు 1:13, 14) బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం కోసం దేవునికి ప్రార్థించిన వెంటనే వారిని యెహోవాసాక్షులు కలిసిన అనుభవాలు అనేకం ఉన్నాయి. అలాంటి అనుభవాలు రాజ్య ప్రకటనా పనికి దేవదూతల నిర్దేశం ఉందని రుజువు చేస్తున్నాయి. (ప్రకటన 14:6) నిజంగా అవసరమున్న సమయాల్లో చేసిన ప్రార్థనలకు జవాబుగా, యెహోవా మనకు సహాయం చేసేలా ఒక క్రైస్తవుణ్ణి పురికొల్పవచ్చు.—సామెతలు 12:25; యాకోబు 2:16.

మన ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా, మనకు సహాయం చేసే విధంగా యెహోవా క్రైస్తవులను పురికొల్పగలడు

18. యెహోవా తన సేవకుల ప్రార్థనలకు జవాబిచ్చేందుకు తన పరిశుద్ధాత్మను, తన వాక్యాన్ని ఎలా ఉపయోగిస్తాడు?

18 యెహోవా దేవుడు తన సేవకుల ప్రార్థనలకు జవాబిచ్చేందుకు తన పరిశుద్ధాత్మను, తన వాక్యమైన బైబిలును కూడా ఉపయోగిస్తాడు. పరీక్షలను తట్టుకోవడానికి సహాయంగా ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నిర్దేశమిస్తూ, బలపరచడం ద్వారా మన ప్రార్థనలకు జవాబివ్వవచ్చు. (2 కొరింథీయులు 4:7) మన ప్రార్థనలకు జవాబు తరచూ బైబిలు నుండే లభిస్తుంది, మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయాన్ని యెహోవా అందులో మనకు దయచేస్తున్నాడు. మన వ్యక్తిగత బైబిలు అధ్యయనం సమయంలో, ఈ పుస్తకం వంటి క్రైస్తవ సాహిత్యాలను చదివేటప్పుడు సహాయకరమైన లేఖనాలు మన దృష్టికి రావచ్చు. మనం పరిగణనలోకి తీసుకోవలసిన లేఖనాంశాలు, క్రైస్తవ కూటంలో లేదా సంఘంలో ఒక శ్రద్ధగల పెద్దచేసే వ్యాఖ్యానాల్లో మన అవధానానికి రావచ్చు.—గలతీయులు 6:1.

19. మన ప్రార్థనలకు జవాబు దొరకడం లేదన్నట్లు మనకు కొన్నిసార్లు అనిపించినప్పుడు మనం దేనిని గుర్తుంచుకోవాలి?

19 యెహోవా నుండి మన ప్రార్థనలకు జవాబు రావడంలో ఆలస్యం జరుగుతున్నట్లు అనిపిస్తే, ఆయన వాటికి జవాబివ్వలేడని ఎన్నటికీ దానర్థం కాదు. యెహోవా తన చిత్తానికి అనుగుణంగా, తనదైన సమయంలో మన ప్రార్థనలకు జవాబిస్తాడని గుర్తుంచుకోవాలి. మన అవసరతలు ఏమిటో, వాటిపట్ల ఎలా శ్రద్ధ చూపించాలో ఆయనకు మనకన్నా బాగా తెలుసు. తరచూ ఆయన మనం ‘అడుగుతూ, వెదకుతూ, తట్టుతూ’ ఉండేందుకు అనుమతిస్తాడు. (లూకా 11:5-10) అలాంటి పట్టుదల మన కోరిక ప్రగాఢమైనదనీ, మన విశ్వాసం యథార్థమైనదనీ దేవునికి చూపిస్తుంది. అంతేకాక, మనకు స్పష్టంగా తెలియని రీతిలో కూడా యెహోవా మన ప్రార్థనలకు జవాబివ్వవచ్చు. ఉదాహరణకు, ఒకానొక పరీక్ష విషయంలో, ఆయన ఆ కష్టాన్ని తొలగించడం ద్వారా కాక, దానిని సహించేందుకు అవసరమైన శక్తిని అనుగ్రహించడం ద్వారా మన ప్రార్థనకు జవాబివ్వవచ్చు.ఫిలిప్పీయులు 4:13 చదవండి.

20. అమూల్యమైన ప్రార్థనాధిక్యత నుండి మనం ఎందుకు పూర్తి ప్రయోజనం పొందాలి?

20 ఈ సువిశాల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త తనకు సరైన విధంగా ప్రార్థించే వారందరికీ సన్నిహితంగా ఉన్నందుకు మనమెంత కృతజ్ఞులుగా ఉండాలో కదా! (కీర్తన 145:18 చదవండి.) అమూల్యమైన ఈ ప్రార్థనాధిక్యత నుండి మనం పూర్తి ప్రయోజనం పొందుదము గాక! మనమలా చేసినప్పుడు, ప్రార్థన ఆలకించు యెహోవాకు మరింత సన్నిహితమయ్యే ఆనందకరమైన భావి నిరీక్షణ ఉంటుంది.