నెహెమ్యా 2:1-20

  • నెహెమ్యాను యెరూషలేముకు పంపడం (1-10)

  • నెహెమ్యా నగర ప్రాకారాల్ని పరిశీలించడం (11-20)

2  అర్తహషస్త రాజు పరిపాలన+ 20వ సంవత్సరం+ నీసాను* నెలలో, రాజు ముందు ద్రాక్షారసం ఉంచబడింది. ఎప్పటిలాగే నేను ద్రాక్షారసం తీసుకుని రాజుకు అందించాను.+ నేను అంతకుముందు ఎప్పుడూ అతని ముందు దిగులుగా లేను. 2  దాంతో రాజు నాతో ఇలా అన్నాడు: “నువ్వు ఆరోగ్యంగానే ఉన్నా ఎందుకింత దిగులుగా కనబడుతున్నావు? నీ మనసులో ఏదో బాధ ఉంది, అందుకే దిగులుగా ఉన్నావు.” అప్పుడు నేను చాలా భయపడ్డాను. 3  నేను రాజుతో ఇలా అన్నాను: “రాజు దీర్ఘకాలం జీవించాలి! నా పూర్వీకుల సమాధులు ఉన్న నగరం పాడుబడివుంది, దాని ద్వారాలు అగ్నితో కాల్చేయబడ్డాయి; అలాంటప్పుడు నేను దిగులుగా ఎందుకు ఉండను?”+ 4  అప్పుడు రాజు, “నీకేం కావాలి?” అని అడిగాడు. వెంటనే నేను పరలోక దేవునికి ప్రార్థన చేసి,+ 5  రాజుతో ఇలా అన్నాను: “రాజా, నీకు ఇష్టమైతే, నీ సేవకుడి మీద నీ దయ ఉంటే, నా పూర్వీకుల సమాధులు ఉన్న నగరాన్ని నేను తిరిగి కట్టేలా నన్ను యూదాకు పంపించు.”+ 6  ఆ సమయంలో రాణి రాజు పక్కనే కూర్చొనివుంది. రాజు నన్ను, “నీ ప్రయాణానికి ఎంతకాలం పడుతుంది? నువ్వు మళ్లీ ఎప్పుడు వస్తావు?” అని అడిగాడు. అలా రాజు నన్ను పంపించడానికి ఇష్టపడ్డాడు,+ నేను ఇంతకాలమని రాజుతో చెప్పాను.+ 7  తర్వాత నేను రాజుతో ఇలా అన్నాను: “రాజుకు ఇష్టమైతే, నేను వాళ్ల ప్రాంతాల గుండా సురక్షితంగా ప్రయాణించి యూదాకు చేరుకునేలా నది అవతలి ప్రాంత*+ అధిపతులకు ఉత్తరాలు రాయించి నాకు ఇవ్వాలి. 8  అలాగే ‘మందిరపు కోట’+ ద్వారాల కోసం, నగర ప్రాకారాల+ కోసం, నేను ఉండబోయే ఇంటి కోసం కలపను ఇచ్చేలా రాజు అడవిని చూసుకునే ఆసాపుకు కూడా ఒక ఉత్తరం ఇవ్వాలి.” నా దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి రాజు వాటిని నాకు ఇచ్చాడు.+ 9  చివరికి నేను నది అవతలి ప్రాంత అధిపతుల దగ్గరికి వచ్చి రాజు ఇచ్చిన ఉత్తరాల్ని వాళ్లకు అందజేశాను. రాజు నాతోపాటు సైన్యాధిపతుల్ని, గుర్రపురౌతుల్ని కూడా పంపించాడు. 10  హోరోనీయుడైన సన్బల్లటు,+ అమ్మోనీయుడైన+ టోబీయా+ అనే అధికారి* దాని గురించి విన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు మేలు చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడని వాళ్లకు చాలా కోపం వచ్చింది. 11  నేను కొంతకాలం ప్రయాణించి యెరూషలేముకు వచ్చాను, అక్కడ మూడు రోజులు ఉన్నాను. 12  రాత్రిపూట నేనూ, ఇంకొంతమందీ లేచాం. యెరూషలేము విషయంలో ఏమి చేయాలనే దాని గురించి నా దేవుడు నా మనసులో పెట్టిన ఆలోచనను నేను ఎవ్వరికీ చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప నా దగ్గర వేరే ఏ జంతువూ లేదు. 13  నేను రాత్రిపూట బయల్దేరి లోయ ద్వారం+ గుండా పెద్ద పాము ఊట ఎదుట నుండి బూడిద కుప్పల ద్వారానికి వెళ్లాను. పడిపోయిన యెరూషలేము ప్రాకారాల్ని, అగ్నితో కాల్చేయబడిన దాని ద్వారాల్ని+ పరిశీలించాను. 14  తర్వాత, ఊట ద్వారం+ మీదుగా రాజు కోనేరు దగ్గరికి వెళ్లాను. నేను ఎక్కిన జంతువు ముందుకు వెళ్లడానికి అక్కడ సరిపడా స్థలం లేదు. 15  అయినా రాత్రివేళ ప్రాకారాన్ని పరిశీలించుకుంటూ లోయ*+ పై దాకా వెళ్లాను. తర్వాత వెనక్కి తిరిగి, లోయ ద్వారం గుండా తిరిగొచ్చాను. 16  నేను ఎక్కడికి వెళ్లానో, ఏమి చేశానో ఉప పాలకులకు తెలీదు. ఎందుకంటే యూదులకు, యాజకులకు, ప్రముఖులకు, ఉప పాలకులకు, మిగతా పనివాళ్లకు నేను ఇంకా ఏమీ చెప్పలేదు. 17  చివరికి నేను వాళ్లతో ఇలా అన్నాను: “మనం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామో, యెరూషలేము ఎలా పాడుబడిపోయిందో, దాని ద్వారాలు ఎలా అగ్నితో కాల్చేయబడ్డాయో మీరు చూస్తున్నారు. రండి, ఈ అవమానం ఇకమీదట కొనసాగకుండా యెరూషలేము ప్రాకారాల్ని తిరిగి కడదాం.” 18  ఆ తర్వాత, నా దేవుడు ఎలా నాకు తోడుగా ఉన్నాడో+ వాళ్లకు చెప్పాను. అలాగే రాజు నాతో చెప్పిన మాటలు+ కూడా వాళ్లకు చెప్పాను. దాంతో వాళ్లు, “పదండి, మనం కడదాం” అన్నారు. కాబట్టి వాళ్లు మంచిపని కోసం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు.*+ 19  హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన+ టోబీయా+ అనే అధికారి,* అరబీయుడైన+ గెషెము అది విన్నప్పుడు వాళ్లు మమ్మల్ని ఎగతాళి చేస్తూ,+ “మీరేం చేస్తున్నారు? రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారా?”+ అని అంటూ మమ్మల్ని చిన్నచూపు చూశారు. 20  అయితే నేను వాళ్లతో, “పరలోక దేవుడే మాకు విజయాన్ని ఇస్తాడు.+ ఆయన సేవకులమైన మేము లేచి కడతాం; కానీ మీకు యెరూషలేములో వంతుగానీ, హక్కుగానీ, దాని చరిత్రలో భాగంగానీ లేదు”+ అన్నాను.

అధస్సూచీలు

అనుబంధం B15 చూడండి.
ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.
అక్ష., “సేవకుడు.”
లేదా “వాగు.”
అక్ష., “తమ చేతుల్ని బలపర్చుకున్నారు.”
అక్ష., “సేవకుడు.”