మొదటి థెస్సలొనీకయులు 5:1-28

  • యెహోవా రోజు రావడం (1-5)

    • “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” (3)

  • మెలకువగా ఉండండి, ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి (6-11)

  • ప్రోత్సాహం (12-24)

  • చివర్లో శుభాకాంక్షలు (25-28)

5  సహోదరులారా, సమయాల గురించి, కాలాల గురించి మీకు ఏమీ రాయాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే, యెహోవా* రోజు+ రాత్రిపూట దొంగ వచ్చినట్టు వస్తుందని+ మీకు బాగా తెలుసు.  ప్రజలు ఎప్పుడైతే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని అంటూ ఉంటారో అప్పుడు, గర్భిణీ స్త్రీకి పురిటినొప్పులు వచ్చినట్టు, హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది,+ వాళ్లు అస్సలు తప్పించుకోలేరు.  అయితే సహోదరులారా, ఆ రోజు అకస్మాత్తుగా మీ మీదికి రావడానికి మీరేమీ దొంగల్లా చీకట్లో లేరు.  ఎందుకంటే, మీరంతా వెలుగు పుత్రులు, పగటి పుత్రులు.+ మనం రాత్రికో, చీకటికో చెందినవాళ్లం కాదు.+  కాబట్టి, ఇతరుల్లా మనం నిద్రపోకుండా మెలకువగా ఉందాం,+ మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం.  ఎందుకంటే, నిద్రపోయేవాళ్లు రాత్రిపూట నిద్రపోతారు, మద్యం మత్తులో ఉండేవాళ్లు రాత్రిపూట మత్తుగా ఉంటారు.  అయితే పగటికి చెందిన మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం; విశ్వాసం, ప్రేమ అనే కవచాన్ని* ధరించుకుందాం; రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని* పెట్టుకుందాం.+  ఎందుకంటే, దేవుడు మనల్ని ఎంచుకున్నది తన ఆగ్రహం చూపించడానికి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించడానికి.+ 10  మనం మెలకువగా ఉన్నా, నిద్రపోయినా* తనతో కలిసి జీవించాలని+ క్రీస్తు మన కోసం చనిపోయాడు. 11  కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,* ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.+ 12  సహోదరులారా, ఇప్పుడు మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, మీ మధ్య కష్టపడి పనిచేస్తూ, ప్రభువు సేవలో మీకు నాయకత్వం వహిస్తూ, మీకు ఉపదేశిస్తున్న వాళ్లను గౌరవించండి; 13  వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.+ ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.+ 14  అదే సమయంలో సహోదరులారా, మేము మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, పద్ధతిగా నడుచుకోనివాళ్లను హెచ్చరించండి,+ కృంగినవాళ్లతో* ఊరటనిచ్చేలా మాట్లాడండి, బలహీనులకు మద్దతివ్వండి, అందరితో ఓర్పుగా ఉండండి.+ 15  మీలో ఎవ్వరూ హాని చేసినవాళ్లకు తిరిగి హాని చేయకూడదు.+ బదులుగా తోటి విశ్వాసులకు, అలాగే అందరికీ ఏది మంచిదో దాన్నే ఎప్పుడూ చేయండి.+ 16  ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి.+ 17  ఎప్పుడూ ప్రార్థించండి.+ 18  ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.+ క్రీస్తుయేసు శిష్యులుగా మీరు అలా చేయడమే దేవుని ఇష్టం. 19  దేవుని పవిత్రశక్తి జ్వాలను ఆర్పకండి.+ 20  ప్రవచనాల్ని చులకనగా చూడకండి.+ 21  అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో నిర్ధారించుకోండి,+ దాన్ని గట్టిగా పట్టుకోండి. 22  అన్నిరకాల దుష్టత్వానికి దూరంగా ఉండండి.+ 23  శాంతికి మూలమైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని పూర్తిగా పవిత్రపర్చాలి. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు* మీ స్ఫూర్తి, మీ ప్రాణం,* మీ శరీరం అంతా ఏ విషయంలోనూ కళంకం* లేకుండా కాపాడబడాలి.+ 24  మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు నమ్మకమైనవాడు, ఆయన తప్పకుండా అలా చేస్తాడు. 25  సహోదరులారా, మా కోసం ప్రార్థిస్తూ ఉండండి.+ 26  సహోదరులందర్నీ పవిత్రమైన ముద్దు పెట్టుకొని పలకరించండి. 27  ఈ ఉత్తరాన్ని సహోదరులందరికీ చదివి వినిపించమని ప్రభువు పేరున మిమ్మల్ని వేడుకుంటున్నాను.+ 28  మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీకు తోడుండాలి.

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
అంటే, హెల్మెట్‌.
లేదా “ఛాతి కవచాన్ని.”
లేదా “మరణంలో నిద్రించినా.”
లేదా “ఒకరికొకరు ఊరటను ఇచ్చుకుంటూ.”
లేదా “నిరుత్సాహంలో ఉన్నవాళ్లతో.”
అక్ష., “ప్రత్యక్షమైనప్పుడు.”
పదకోశం చూడండి.
లేదా “నింద.”