సమూయేలు మొదటి గ్రంథం 1:1-28
1 ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని రామతయిం-సోఫీములో+ ఒక వ్యక్తి* ఉండేవాడు. అతని పేరు ఎల్కానా.+ ఎఫ్రాయిము వాడైన ఇతను యెరోహాము కుమారుడు. యెరోహాము ఎలీహు కుమారుడు. ఎలీహు తోహు కుమారుడు. తోహు సూపు కుమారుడు.
2 ఎల్కానాకు ఇద్దరు భార్యలు. ఒకామె పేరు హన్నా, ఇంకొకామె పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు లేరు.
3 ఎల్కానా, సైన్యాలకు అధిపతైన యెహోవాను ఆరాధించడానికి,* బలులు అర్పించడానికి ప్రతీ సంవత్సరం తన నగరం నుండి షిలోహుకు వెళ్లేవాడు.+ అక్కడే ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు+ యెహోవాకు యాజకులుగా సేవ చేసేవాళ్లు.+
4 ఒకరోజు ఎల్కానా బలి అర్పించినప్పుడు, దానిలోని భాగాల్ని అతను తన భార్య పెనిన్నాకు, అలాగే ఆమె కుమారులందరికీ, కూతుళ్లందరికీ ఇచ్చాడు.+
5 కానీ హన్నాకు ఒక ప్రత్యేక భాగాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎల్కానా హన్నాను ఎంతో ప్రేమించాడు; అయితే యెహోవా ఆమెకు పిల్లల్ని ఇవ్వలేదు.
6 అంతేకాదు, యెహోవా హన్నాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి, ఎల్కానా మరో భార్య పెనిన్నా హన్నాను బాధపెట్టాలని ఆమెను ఎప్పుడూ దెప్పిపొడిచేది.
7 ప్రతీ సంవత్సరం ఆమె అలాగే చేసేది; హన్నా యెహోవా మందిరానికి వెళ్లినప్పుడల్లా+ పెనిన్నా ఆమెను ఎంతగా దెప్పిపొడిచేదంటే హన్నా ఏడ్చేది, భోజనం కూడా చేసేది కాదు.
8 అయితే ఆమె భర్త ఎల్కానా ఆమెతో, “హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం చేయడం లేదు? ఎందుకంత బాధగా ఉన్నావు? పదిమంది కుమారుల కన్నా నేను నీకు ఎక్కువ కాదా?” అన్నాడు.
9 వాళ్లు షిలోహులో తినడం, తాగడం పూర్తయిన తర్వాత హన్నా లేచి బయటికి వచ్చింది. ఆ సమయంలో యాజకుడైన ఏలీ యెహోవా ఆలయ*+ ద్వారబంధం దగ్గర పీఠం మీద కూర్చొని ఉన్నాడు.
10 హన్నా ఎంతో దుఃఖంతో ఉంది. ఆమె యెహోవాకు ప్రార్థించడం+ మొదలుపెట్టి విపరీతంగా ఏడుస్తోంది.
11 అప్పుడు ఆమె ఇలా ప్రమాణం చేసింది: “సైన్యాలకు అధిపతైన యెహోవా, నువ్వు నీ సేవకురాలినైన నా బాధను చూసి, నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, నీ సేవకురాలినైన నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే,+ యెహోవా, ఆ అబ్బాయి తాను బ్రతికినన్ని రోజులు నిన్ను సేవించేలా అతన్ని నీకు ఇచ్చేస్తాను. అతని తలమీద మంగలికత్తి పడదు.”+
12 ఆమె చాలాసేపు యెహోవా ఎదుట ప్రార్థిస్తూ ఉండగా ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు.
13 హన్నా తన మనసులోనే మాట్లాడుకుంటోంది, ఆమె పెదాలు మాత్రం వణుకుతున్నాయి కానీ మాటలు బయటికి వినిపించడం లేదు. అందుకే ఆమె తాగివుందని ఏలీ అనుకున్నాడు.
14 ఏలీ ఆమెతో, “ఎంతసేపు మత్తులో ఉంటావు? వెళ్లి, మత్తు దిగాక రా” అన్నాడు.
15 దానికి హన్నా ఇలా అంది: “లేదు ప్రభూ! నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను; నేను ద్రాక్షారసాన్ని గానీ వేరే మద్యాన్ని గానీ తాగలేదు. కానీ యెహోవా ముందు నా హృదయాన్ని* కుమ్మరిస్తున్నాను.+
16 నీ సేవకురాలినైన నన్ను పనికిమాలినదానిగా ఎంచొద్దు. నేను ఇప్పటివరకు ఎంతో మనోవేదనతో, బాధతో మాట్లాడుతూ ఉన్నాను.”
17 అప్పుడు ఏలీ, “క్షేమంగా వెళ్లు, ఇశ్రాయేలు దేవుడు నీ విన్నపాన్ని విని, నువ్వు కోరుకున్నదాన్ని నీకు అనుగ్రహించాలి” అన్నాడు.+
18 అందుకు హన్నా, “నీ సేవకురాలి మీద నీ దయ ఉండాలి” అంది. తర్వాత ఆమె తన దారిన వెళ్లిపోయింది, ఆమె భోజనం చేసింది, ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆమె ముఖం బాధగా కనిపించలేదు.
19 తర్వాత వాళ్లు పొద్దున్నే లేచి, యెహోవా ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ తర్వాత రామాలో+ ఉన్న తమ ఇంటికి తిరిగొచ్చారు. ఎల్కానా తన భార్య హన్నాతో కలిశాడు,* యెహోవా ఆమెను గుర్తుచేసుకున్నాడు.+
20 హన్నా ఒక సంవత్సరంలోపే* గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అతనికి సమూయేలు* అని పేరు పెట్టింది.+ ఎందుకంటే ఆమె ఇలా అంది: “నేను ఇతని కోసం యెహోవాను అడిగాను.”
21 కొంతకాలానికి ఎల్కానా తన కుటుంబమంతటితో కలిసి యెహోవాకు వార్షిక బలులు అర్పించడానికి,+ తన మొక్కుబడి అర్పణ అర్పించడానికి వెళ్లాడు.
22 కానీ హన్నా వాళ్లతోపాటు వెళ్లలేదు.+ ఆమె తన భర్తతో, “బాబు పాలు మానేయగానే అతన్ని యెహోవా మందిరానికి తీసుకొస్తాను; ఇక అప్పటినుండి అతను అక్కడే ఉంటాడు”+ అని అంది.
23 అందుకు ఆమె భర్త ఎల్కానా ఆమెతో, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి. బాబుకు పాలు మాన్పించే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు చెప్పినదాన్ని యెహోవా నెరవేర్చాలి” అన్నాడు. దాంతో ఆమె ఇంట్లోనే ఉండి పాలు మాన్పించేంత వరకు తన కుమారుని ఆలనాపాలనా చూసుకుంది.
24 ఆమె పాలు మాన్పించగానే బాబును షిలోహుకు తీసుకెళ్లింది. ఆమె మూడేళ్ల ఎద్దును, ఒక ఈఫా* పిండిని, పెద్ద పాత్రలో ద్రాక్షారసాన్ని+ కూడా వెంట తీసుకెళ్లింది. ఆమె తన బాబును తీసుకొని షిలోహులో+ ఉన్న యెహోవా మందిరానికి వచ్చింది.
25 తర్వాత వాళ్లు ఎద్దును వధించి ఆ అబ్బాయిని ఏలీ దగ్గరికి తీసుకెళ్లారు.
26 అప్పుడు ఆమె ఇలా అంది: “ప్రభూ! నీ జీవం తోడు, యెహోవాకు ప్రార్థించడానికి ఈ స్థలంలో నీతోపాటు నిలబడిన ఆ స్త్రీని నేనే.+
27 ఈ బాబు కోసమే నేను ప్రార్థించాను, నేను యెహోవాకు చేసుకున్న విన్నపాన్ని ఆయన అనుగ్రహించాడు.+
28 కాబట్టి ఇప్పుడు నేను అతన్ని యెహోవాకే ఇచ్చేస్తున్నాను.* అతను బ్రతికినన్ని రోజులు యెహోవాకే చెందుతాడు.”
తర్వాత అతను* యెహోవాకు సాష్టాంగపడ్డాడు.
అధస్సూచీలు
^ లేదా “రామాకు చెందినవాడు, సూపు వంశస్థుడు.”
^ లేదా “వంగి నమస్కరించడానికి.”
^ అంటే, గుడారం.
^ లేదా “లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.”
^ లేదా “తగిన సమయంలో” అయ్యుంటుంది.
^ “దేవుని పేరు” అని అర్థం.
^ దాదాపు 22 లీటర్లు (13 కిలోలు). అనుబంధం B14 చూడండి.
^ అక్ష., “అప్పుగా ఇస్తున్నాను.”
^ ఎల్కానాను సూచిస్తుందని స్పష్టమౌతోంది.