కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నాల్గవ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?
  • యేసు ప్రత్యేక పాత్ర ఏమిటి?

  • ఆయన ఎక్కడనుండి వచ్చాడు?

  • ఆయన ఎలాంటి వ్యక్తి?

1, 2. (ఎ) ఒక ప్రముఖుని పేరు తెలిసినంత మాత్రాన ఆయన బాగా తెలుసు అని ఎందుకు చెప్పలేము? (బి) యేసు గురించి చాలామంది ఎలా భావిస్తున్నారు?

 లోకంలో ప్రసిద్ధులైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో కొందరు తమ సమాజంలో, నగరంలో లేదా దేశంలో పేరుగాంచారు. మరి కొందరు ప్రపంచ ప్రసిద్ధులు. అయితే ఒక ప్రముఖుని పేరు తెలిసినంత మాత్రాన ఆ వ్యక్తి మీకు బాగా తెలుసు అని చెప్పలేము. అతని నేపథ్యానికి సంబంధించిన వివరాలు, అతను నిజంగా ఎలాంటి వ్యక్తి అనే వివరాలు మీకు తెలుసని కూడా చెప్పలేము.

2 యేసుక్రీస్తు దాదాపు 2,000 సంవత్సరాల పూర్వం జీవించినా, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆయన గురించి ఎంతో కొంత తెలుసు. అయితే యేసు అసలు ఎవరు అనే విషయం మాత్రం చాలామందికి సరిగ్గా తెలియదు. ఆయనొక మంచి వ్యక్తి అని కొందరు చెబుతారు. మరి కొందరు ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే అంటారు. ఇంకా కొందరు యేసు దేవుడని, ఆయనను ఆరాధించాలని నమ్ముతారు. మనం ఆయనను ఆరాధించాలా?

3. మీరు యెహోవా గురించి, యేసు క్రీస్తు గురించి తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

3 మీరు యేసు గురించిన సత్యం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును యెహోవా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి బాగా తెలుసుకోవడం పరదైసు భూమిపై నిత్యజీవానికి నడిపించగలదు. (యోహాను 14:6) అంతేకాక మనం ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనే విషయాల్లో కూడా యేసు మనకు ఉత్తమమైన మాదిరిని ఉంచాడు. (యోహాను 13:34, 35) ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో మనం దేవుని గురించిన సత్యాన్ని చర్చించాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో పరిశీలిద్దాం.

వాగ్దానం చేయబడిన మెస్సీయ

4. “మెస్సీయ,” “క్రీస్తు” అనే పదాలకు అర్థమేమిటి?

4 యేసు జన్మించడానికి చాలాకాలం ముందే, దేవుడు మెస్సీయగా లేదా క్రీస్తుగా పంపించే వ్యక్తి రాక గురించి బైబిలు ప్రవచించింది. “మెస్సీయ” (హీబ్రూ పదం నుండి వచ్చింది), “క్రీస్తు” (గ్రీకు పదం నుండి వచ్చింది) అనే ఈ రెండు పదాలకు “అభిషిక్తుడు” అని అర్థం. ఈ వాగ్దాన పురుషుడు ఒక ప్రత్యేకస్థానం కోసం అభిషేకించబడిన వ్యక్తిగా, దేవుడు నియమించిన వ్యక్తిగా ఉంటాడు. ఈ పుస్తకంలోని తర్వాతి అధ్యాయాల్లో, దేవుని వాగ్దానాల నెరవేర్పులో మెస్సీయకున్న ప్రాముఖ్యమైన స్థానం గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. అలాగే యేసు మనకు ఇప్పుడు కూడా తీసుకురాగల ఆశీర్వాదాల గురించి కూడా మనం తెలుసుకుంటాం. అయితే యేసు జన్మించక పూర్వమే, చాలామంది ‘ఆ మెస్సీయ ఎవరు’ అని ఎదురుచూశారనడంలో సందేహం లేదు.

5. యేసు ఎవరని ఆయన శిష్యులు బలంగా విశ్వసించారు?

5 సా.శ. మొదటి శతాబ్దంలో నజరేయుడైన యేసు శిష్యులు, యేసే ప్రవచించబడిన మెస్సీయ అని దృఢంగా విశ్వసించారు. (యోహాను 1:41) సీమోను పేతురు అనే శిష్యుడు యేసుతో బాహాటంగా ఇలా అన్నాడు: ‘నీవు క్రీస్తువు.’ (మత్తయి 16:16) అయితే, వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసే అని ఆ శిష్యులు ఎలా గుర్తుపట్టగలిగారు, మనం ఎలా గుర్తుపట్టవచ్చు?

6. మెస్సీయను గుర్తించడానికి యెహోవా విశ్వాసులకు ఎలా సహాయం చేశాడో సోదాహరణంగా చెప్పండి.

6 యేసుకు ముందు జీవించిన దేవుని ప్రవక్తలు మెస్సీయకు సంబంధించిన అనేక వివరాలు ప్రవచించారు. ఆ వివరాలు ఆయనను గుర్తించేందుకు సహాయపడతాయి. విషయాన్ని మనం ఇలా ఉదాహరించవచ్చు: మీరు ఇంతకు ముందెన్నడూ కలవని వ్యక్తిని తీసుకురావడానికి బస్టాండ్‌కు లేదా రైల్వే స్టేషన్‌కు లేదా విమానాశ్రయానికి వెళ్లమని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి. ఆయన మీకు ఆ వ్యక్తి గురించి కొన్ని వివరాలు చెప్పడం సహాయకరంగా ఉండదా? అదేవిధంగా, యెహోవా బైబిలు ప్రవక్తల ద్వారా మెస్సీయ ఏమి చేస్తాడు, ఆయనేమి అనుభవిస్తాడు అనే విషయాల గురించిన వివరాలను తెలియజేశాడు. ఆ అనేక ప్రవచనాల నెరవేర్పు మెస్సీయను స్పష్టంగా గుర్తించడానికి విశ్వాసులకు సహాయం చేస్తుంది.

7. యేసు విషయంలో నెరవేరిన రెండు ప్రవచనాలు ఏవి?

7 మచ్చుకు రెండు ఉదాహరణలు పరిశీలించండి. మొదటిది, వాగ్దానం చేయబడినవాడు యూదా దేశంలోని బేత్లెహేము అనే చిన్న పట్టణంలో జన్మిస్తాడని మీకా ప్రవక్త 700 సంవత్సరాలకన్నా ఎక్కువకాలం ముందు చెప్పాడు. (మీకా 5:2) మరి యేసు ఎక్కడ జన్మించాడు? ఆ పట్టణంలోనే! (మత్తయి 2:1, 3-9) రెండవది, అనేక శతాబ్దాల ముందే దానియేలు 9:25 లోని ప్రవచనం మెస్సీయ కనబడే ఖచ్చితమైన సంవత్సరాన్ని సూచించింది, అదే సా.శ. 29వ సంవత్సరం. a ఆ ప్రవచనాలు, వాటితోపాటు ఇంకా ఇతర ప్రవచనాల నెరవేర్పు యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని నిరూపించింది.

యేసు బాప్తిస్మం తర్వాత మెస్సీయ లేదా క్రీస్తు అయ్యాడు

8, 9. యేసే మెస్సీయ అని ఆయన బాప్తిస్మమప్పుడు ఎలా స్పష్టమైంది?

8 యేసే మెస్సీయ అని నిరూపించే అదనపు రుజువు సా.శ. 29వ సంవత్సరాంతంలో స్పష్టమైంది. ఆ సంవత్సరంలోనే యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్లాడు. మెస్సీయను గుర్తుపట్టగలిగే ఒక సూచన ఇస్తానని యెహోవా యోహానుకు వాగ్దానం చేశాడు. యేసు బాప్తిస్మం తీసుకున్న సమయంలో యోహానుకు ఆ సూచన కనిపించింది. అప్పుడు జరిగిన దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” (మత్తయి 3:16, 17) జరిగింది చూసి, ఆ మాటలు విన్న తర్వాత, యేసును దేవుడే పంపించాడని యోహాను గట్టిగా నమ్మాడు. (యోహాను 1:32-34) ఆ రోజున దేవుని ఆత్మ లేదా చురుకైన శక్తి యేసు మీద కుమ్మరించబడిన మరుక్షణమే ఆయన మెస్సీయ లేదా క్రీస్తు అయ్యాడు, అంటే నియమిత అధిపతి, రాజు అయ్యాడు.—యెషయా 55:4.

9 బైబిలు ప్రవచనాల నెరవేర్పు, యెహోవా దేవుడు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే బైబిలు యేసుక్రీస్తు గురించి మరో రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తోంది: ఆయన ఎక్కడనుండి వచ్చాడు? ఆయన ఎలాంటి వ్యక్తి?

యేసు ఎక్కడనుండి వచ్చాడు?

10. యేసు భూమ్మీదకు రాకముందు ఎక్కడ జీవించాడని బైబిలు బోధిస్తోంది?

10 యేసు భూమ్మీదకు రాకముందు పరలోకంలో జీవించాడని బైబిలు బోధిస్తోంది. మెస్సీయ బేత్లెహేములో జన్మిస్తాడనే కాక, ఆయన “పురాతన కాలము” నుండి ఉన్నాడని కూడా మీకా ప్రవచించాడు. (మీకా 5:2) తాను మానవునిగా జన్మించక ముందు పరలోకంలో జీవించానని యేసే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. (యోహాను 3:13; 6:38, 62 చదవండి; 17:4, 5) పరలోకంలో ఆత్మ ప్రాణిగా యేసుకు యెహోవాతో ఒక ప్రత్యేక సంబంధముంది.

11. యేసు, యెహోవాకు అతి ప్రియమైన కుమారుడని బైబిలు ఎలా చూపిస్తోంది?

11 యేసు, యెహోవాకు అతి ప్రియమైన కుమారుడు అని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆయన దేవుని మొదటి సృష్టి కాబట్టి, “సర్వసృష్టికి ఆదిసంభూతుడు” అని పిలువబడ్డాడు. b (కొలొస్సయులు 1:15) ఈ కుమారుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన “అద్వితీయకుమారుడు.” (యోహాను 3:16) అంటే యేసును మాత్రమే దేవుడు స్వయంగా సృష్టించాడని దీని భావం. అలాగే దేవుడు మిగతా సృష్టినంతా చేసినప్పుడు ఆయన యేసును మాత్రమే ఉపయోగించుకున్నాడు. (కొలొస్సయులు 1:16) అంతేగాక యేసు “వాక్యము” అని కూడా పిలువబడ్డాడు. (యోహాను 1:14) అంటే ఆయన దేవుని ప్రతినిధిగా మాట్లాడాడు. ఆ పనిలో భాగంగా ఆయన తండ్రియొక్క ఇతర ఆత్మ కుమారులకు, మానవ కుమారులకు సందేశాలను, ఆదేశాలను అందజేశాడు.

12. ఆదిసంభూతుడు దేవునితో సమానుడు కాడని మనకెలా తెలుసు?

12 కొందరు అనుకుంటున్నట్లుగా ఆదిసంభూతుడు దేవునితో సమానుడా? బైబిలు అలా బోధించడం లేదు. మనం ముందు పేరాలో గమనించినట్లుగా, కుమారుడు సృష్టించబడ్డాడు. కాబట్టి ఆయనకు ఒక ఆరంభం ఉంది, కానీ యెహోవా దేవునికి ఆరంభం గానీ అంతం గానీ లేవు. (కీర్తన 90:2) ఆ అద్వితీయ కుమారుడు తన తండ్రితో సమానంగా ఉండడానికి ప్రయత్నించాలని కూడా ఎన్నడూ అనుకోలేదు. కుమారునికన్నా తండ్రే గొప్పవాడని బైబిలు స్పష్టంగా బోధిస్తోంది. (యోహాను 14:28 చదవండి; 1 కొరింథీయులు 11:3) యెహోవా మాత్రమే “సర్వశక్తిగల దేవుడు.” (ఆదికాండము 17:1) కాబట్టి ఆయనకు సాటియైన వారు ఎవ్వరూ లేరు. c

13. కుమారుడు “అదృశ్యదేవుని స్వరూపి” అని సూచించినప్పుడు బైబిలు భావమేమిటి?

13 నక్షత్రాలు నిండిన ఆకాశాన్ని, భూమిని సృష్టించడానికి ఎంతోకాలం పూర్వమే యెహోవా, ఆయన కుమారుడు వందలకోట్ల సంవత్సరాలపాటు ఎంతో సన్నిహితమైన సహవాసాన్ని అనుభవించారు. వారిద్దరి మధ్యా ఉన్న ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో కదా! (యోహాను 3:35; 14:31) ఈ ప్రియకుమారుడు అచ్చం తండ్రిలాగే ఉన్నాడు. అందుకే ఆ కుమారుడు “అదృశ్యదేవుని స్వరూపి” అని బైబిలు చెబుతోంది. (కొలొస్సయులు 1:15) అవును, మానవ కుమారుడు ఎన్నో విధాలుగా తన తండ్రిని పోలి ఉన్నట్లే, ఈ పరలోక కుమారుడు కూడా తన తండ్రి లక్షణాలకు, వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా ఉన్నాడు.

14. యెహోవా అద్వితీయకుమారుడు ఈ భూమ్మీద మానవునిగా ఎలా జన్మించాడు?

14 యెహోవా అద్వితీయకుమారుడు ఇష్టపూర్వకంగా పరలోకాన్ని విడిచి మానవునిగా జీవించడానికి ఈ భూమ్మీదికి వచ్చాడు. అయితే ‘ఒక ఆత్మ ప్రాణి మానవునిగా జన్మించడం ఎలా సాధ్యం’ అని మీరనుకోవచ్చు. దీనిని సాధించేందుకు యెహోవా ఒక అద్భుతం చేశాడు. ఆయన తన ఆదిసంభూతుని ప్రాణాన్ని పరలోకం నుండి యూదా కన్య అయిన మరియ గర్భానికి మార్చాడు. ఆమె పురుషుని ప్రమేయం లేకుండానే గర్భవతి అయ్యింది. ఆ విధంగా మరియ పరిపూర్ణ కుమారునికి జన్మనిచ్చి ఆయనకు యేసు అని పేరు పెట్టింది.—లూకా 1:30-35.

యేసు ఎలాంటి వ్యక్తి?

15. యేసు ద్వారా మనం యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుంటామని ఎందుకు చెప్పవచ్చు?

15 భూమ్మీద ఉన్నప్పుడు యేసు చెప్పింది, చేసింది ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. అంతేకాక మనం యేసు ద్వారా యెహోవా గురించి కూడా మరింత ఎక్కువగా తెలుసుకుంటాం. ఏ విధంగా? ఈ కుమారుడు తన తండ్రికి పరిపూర్ణ ప్రతిబింబమనే విషయం గుర్తుచేసుకోండి. ఆ కారణంగానే యేసు తన శిష్యుల్లో ఒకరితో ఇలా అన్నాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9) సువార్తలుగా పేరుగాంచిన మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే నాలుగు బైబిలు పుస్తకాలు యేసుక్రీస్తు జీవితం, కార్యకలాపాలు, వ్యక్తిగత లక్షణాల గురించి మనకెన్నో విషయాలు చెబుతాయి.

16. యేసు ముఖ్యంగా దేని గురించి ప్రకటించాడు, ఆయన బోధించిన సందేశం ఎవరిది?

16 యేసు “బోధకుడు” అని పేరుగాంచాడు. (యోహాను 1:38; 13:13) ఆయన ఏమి బోధించాడు? ముఖ్యంగా ఆయన “రాజ్యమును గూర్చిన సువార్తను” అంటే ఈ భూమి అంతటిపై పరిపాలించి విధేయులైన మానవులకు అంతులేని ఆశీర్వాదాలు తీసుకొచ్చే పరలోక ప్రభుత్వమైన దేవుని రాజ్యం గురించిన సందేశాన్ని ప్రకటించాడు. (మత్తయి 4:23) అది ఎవరి సందేశం? యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.” అంటే సందేశం యెహోవాదే. (యోహాను 7:16) మానవులు ఆ రాజ్య సువార్త వినాలని తన తండ్రి కోరుతున్నాడని యేసుకు తెలుసు. ఎనిమిదవ అధ్యాయంలో మనం దేవుని రాజ్యం గురించి, అది సాధించే వాటి గురించి ఎక్కువ తెలుసుకుంటాం.

17. యేసు ఎక్కడ బోధించాడు, ఇతరులకు బోధించడానికి ఆయన ఎందుకు అంతగా ప్రయాసపడ్డాడు?

17 యేసు ఎక్కడ బోధించాడు? గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో, పల్లెల్లో, సంత వీధుల్లో, గృహాల్లో అలా ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటించాడు. ప్రజలు తన దగ్గరకు రావాలని యేసు ఆశించలేదు. ఆయనే వారి దగ్గరకు వెళ్లాడు. (మార్కు 6:56; లూకా 19:5, 6) యేసు ప్రకటించడానికి, బోధించడానికి ఎందుకు అంత సమయం తీసుకొని ప్రయాసపడ్డాడు? ఎందుకంటే తాను అలా చేయాలనేదే దేవుని చిత్తం అని ఆయనకు తెలుసు. యేసు అన్ని సందర్భాల్లోనూ తన తండ్రి చిత్తం చేశాడు. (యోహాను 8:28, 29) అయితే ఆయన ప్రకటించడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన తనను చూడడానికి వచ్చిన జనసమూహాలను చూసి కనికరపడ్డాడు. (మత్తయి 9:35, 36 చదవండి.) దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి వారికి సత్యం బోధించవలసిన మతనాయకులే వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రజలు రాజ్య సందేశాన్ని వినవలసిన అవసరం ఎంతగా ఉందో యేసుకు తెలుసు.

18. యేసులోని ఏ లక్షణాలు మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి?

18 యేసు ఆప్యాయత నిండిన, ప్రగాఢమైన భావాలున్న వ్యక్తి. అందువల్ల ఆయన సమీపించదగిన దయాపరుడని ప్రజలు గ్రహించారు. చిన్నపిల్లలు సహితం ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చేవారు. (మార్కు 10:13-16) యేసు పక్షపాతం చూపించలేదు. అవినీతిని, అన్యాయాన్ని సహించలేదు. (మత్తయి 21:12, 13) స్త్రీలకు గౌరవం, ఆధిక్యతలు అంతగా ఇవ్వబడని కాలంలో ఆయన వారిని గౌరవించాడు. (యోహాను 4:9, 27) యేసు నిజమైన వినయాన్ని ప్రదర్శించాడు. ఒక సందర్భంలో ఆయన అల్పుడైన ఒక సేవకుడు చేసే పనిని చేశాడు, తన అపొస్తలుల కాళ్లు కడిగాడు.

ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ యేసు ప్రకటించాడు

19. యేసు ఇతరుల అవసరాలను సులభంగా అర్థం చేసుకునేవాడని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

19 యేసు ఇతరుల అవసరాలను సులభంగా అర్థం చేసుకున్నాడు. ఆయన దేవుని ఆత్మ శక్తితో అద్భుత రీతిలో స్వస్థత చేసినప్పుడు ఇది ప్రత్యేకంగా స్పష్టమైంది. (మత్తయి 14:14) ఉదాహరణకు, ఒక కుష్ఠరోగి యేసువద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు.” ఆ వ్యక్తి అనుభవిస్తున్న బాధను, కష్టాన్ని యేసు వ్యక్తిగతంగా అర్థం చేసుకున్నాడు. యేసు కనికరంతో కదిలించబడి తన చెయ్యి చాచి ఆ వ్యక్తిని ముట్టుకొని “నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.” ఆ వెంటనే ఆ రోగి బాగయ్యాడు! (మార్కు 1:40-42) ఆ వ్యక్తి ఎలా భావించి ఉంటాడో మీరు ఊహించగలరా?

అంతం వరకు నమ్మకంగా ఉండడం

20, 21. దేవునిపట్ల విశ్వసనీయ విధేయతను చూపించడంలో యేసు ఎలా మాదిరి ఉంచాడు?

20 దేవునిపట్ల విశ్వసనీయ విధేయత చూపించడంలో యేసు శ్రేష్ఠమైన మాదిరి ఉంచాడు. ఆయన ఎన్నో రకాలుగా వ్యతిరేకతను, బాధను అనుభవించినప్పటికీ, తన పరలోక తండ్రిపట్ల నమ్మకంగా ఉన్నాడు. ఆయన సాతాను శోధనలను స్థిరంగా, విజయవంతంగా ఎదుర్కొన్నాడు. (మత్తయి 4:1-11) ఒక సమయంలో, యేసు ఇంటివారే ఆయనకు “మతి చలించియున్నదని” చెబుతూ ఆయనను విశ్వసించలేదు. (మార్కు 3:21) అయితే యేసు వారి మాటలకు బాధపడి నిరుత్సాహపడకుండా దేవుని పని చేయడాన్ని నిరాటంకంగా కొనసాగించాడు. దూషణలు, అవమానాల మధ్య కూడా ఆయన తన వ్యతిరేకులకు హాని తలపెట్టడానికి ప్రయత్నించలేదు, బదులుగా ఆశానిగ్రహాన్ని పాటించాడు.—1 పేతురు 2:21-23.

21 యేసు తన శత్రువుల చేతుల్లో క్రూరమైన, బాధాకరమైన మరణం అనుభవించినా, తన మరణం వరకు నమ్మకంగా నిలబడ్డాడు. (ఫిలిప్పీయులు 2:8 చదవండి.) మానవునిగా ఆయన తన భూజీవితపు చివరి రోజున ఎంతగా సహించాడో ఆలోచించండి. ఆయన బంధించబడి, అబద్ధసాక్షుల నిందలకు, అవినీతిపరులైన న్యాయాధిపతుల తీర్పుకు, జనసమూహాల ఎగతాళికి, సైనికుల హింసలకు గురయ్యాడు. ఆయనను కొయ్యమీద మేకులకు వ్రేలాడదీసినప్పుడు తన చివరి శ్వాస విడుస్తూ బిగ్గరగా “సమాప్తమైనది” అని కేకవేశాడు. (యోహాను 19:30) అయితే, యేసు మరణించిన మూడవ రోజున, ఆయన పరలోకపు తండ్రి ఆయనను తిరిగి ఆత్మ సంబంధమైన జీవానికి పునరుత్థానం చేశాడు. (1 పేతురు 3:18) కొన్ని వారాల తర్వాత, ఆయన పరలోకానికి తిరిగివెళ్లాడు. అక్కడ ఆయన “దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై” రాజ్యాధికారం పొందేందుకు వేచిచూశాడు.—హెబ్రీయులు 10:12, 13.

22. మరణం వరకు నమ్మకంగా ఉండడం ద్వారా యేసు ఏమి సాధ్యపరిచాడు?

22 మరణం వరకు నమ్మకంగా ఉండడం ద్వారా యేసు ఏమి సాధ్యపరిచాడు? నిజానికి యేసు మరణం, యెహోవా ఆది సంకల్పానికి అనుగుణంగా మనం భూపరదైసుపై నిత్యం జీవించే అవకాశాన్ని అందిస్తోంది. యేసు మరణం దానినెలా సాధ్యం చేసిందో తర్వాతి అధ్యాయం చర్చిస్తుంది.

a యేసు విషయంలో నెరవేరిన దానియేలు ప్రవచనానికి సంబంధించిన వివరణ కోసం అనుబంధంలోని 198-199 పేజీలు చూడండి.

b యెహోవా సృష్టికర్త కాబట్టి, తండ్రి అని పిలువబడ్డాడు. (యెషయా 64:8) యేసును దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అదే కారణాన్నిబట్టి ఇతర ఆత్మ ప్రాణులు, మానవుడైన ఆదాము కూడా దేవుని కుమారులు అని పిలువబడ్డారు.—యోబు 1:6, అధస్సూచి; లూకా 3:38.

c ఆదిసంభూతుడు దేవునితో సమానుడు కాడు అనేందుకు అదనపు రుజువు కోసం, అనుబంధంలోని 202-204 పేజీలు చూడండి.