మత్తయి సువార్త 9:1-38
9 యేసు పడవ ఎక్కి, సముద్రం అవతలి వైపున్న తన సొంత ఊరికి వచ్చాడు.+
2 అప్పుడు ఇదిగో! పక్షవాతం ఉన్న ఒకతన్ని కొంతమంది మంచం* మీద ఆయన దగ్గరికి తీసుకొస్తున్నారు. యేసు వాళ్ల విశ్వాసం చూసి, పక్షవాతం ఉన్న వ్యక్తితో, “బాబూ, ధైర్యంగా ఉండు! నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నాడు.+
3 అప్పుడు కొందరు శాస్త్రులు, “ఈయన దేవుణ్ణి దూషిస్తున్నాడు” అని తమలో తాము అనుకున్నారు.
4 యేసు వాళ్ల ఆలోచనల్ని పసిగట్టి ఇలా అన్నాడు: “మీరెందుకు ఇలా చెడుగా ఆలోచిస్తున్నారు?+
5 ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడం తేలికా? ‘లేచి, నడువు’ అని చెప్పడం తేలికా?+
6 అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలని ...” తర్వాత, ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో, “లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు” అన్నాడు.+
7 అతను లేచి తన ఇంటికి వెళ్లాడు.
8 జరిగింది చూసి ప్రజలు చాలా భయపడ్డారు; అంతేకాదు మనుషులకు ఇంత గొప్ప అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపర్చారు.
9 ఆ తర్వాత యేసు అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలుచేసే కార్యాలయంలో కూర్చున్న మత్తయిని చూసి, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. అప్పుడు అతను లేచి ఆయన్ని అనుసరించాడు.+
10 తర్వాత యేసు అతని ఇంట్లో భోంచేస్తున్నప్పుడు చాలామంది పన్ను వసూలుచేసే వాళ్లు, పాపులు అక్కడికి వచ్చి యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోంచేస్తున్నారు.+
11 పరిసయ్యులు అది చూసి యేసు శిష్యులతో, “మీ బోధకుడు పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు?” అని అన్నారు.+
12 యేసు వాళ్ల మాటలు విని ఇలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.
13 మీరు వెళ్లి, ‘నేను కరుణనే కోరుకుంటున్నాను కానీ బలిని కాదు’ అనే మాటకు అర్థం ఏంటో తెలుసుకోండి.+ నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.”
14 అప్పుడు యోహాను శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మేము, పరిసయ్యులు ఉపవాసం ఉంటాం, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?” అని అడిగారు.+
15 అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “పెళ్లికుమారుడు+ తమతో ఉన్నంతకాలం, అతని స్నేహితులు దుఃఖపడాల్సిన అవసరం ఉంటుందా? అయితే పెళ్లికుమారుణ్ణి వాళ్ల దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి,+ అప్పుడు వాళ్లు ఉపవాసం ఉంటారు.
16 పాత వస్త్రానికి ఎవ్వరూ కొత్త గుడ్డముక్కతో అతుకు వేయరు. అలా వేస్తే, కొత్త గుడ్డముక్క ముడుచుకుపోయి చిరుగు ఇంకా పెద్దదౌతుంది.
17 అలాగే, ప్రజలు కొత్త ద్రాక్షారసాన్ని పాత ద్రాక్షతిత్తుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, ద్రాక్షతిత్తులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది; ద్రాక్షతిత్తులు కూడా పాడౌతాయి. అందుకే కొత్త ద్రాక్షారసాన్ని కొత్త ద్రాక్షతిత్తుల్లోనే పోస్తారు, అప్పుడు ఆ రెండూ పాడవకుండా ఉంటాయి.”
18 ఆయన వాళ్లకు ఈ విషయాలు చెప్తుండగా, ఇదిగో! ఒక అధికారి వచ్చి ఆయనకు వంగి నమస్కారం చేసి, “ఈపాటికి మా అమ్మాయి చనిపోయి ఉంటుంది, అయినాసరే నువ్వు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచు, ఆమె బ్రతుకుతుంది” అన్నాడు.+
19 దాంతో యేసు లేచి అతని వెంట వెళ్లాడు, ఆయన శిష్యులు కూడా ఆయనతోపాటు వెళ్లారు.
20 అప్పుడు ఇదిగో! 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒకామె,+ వెనక నుండి వచ్చి ఆయన పైవస్త్రం అంచును ముట్టుకుంది.+
21 ఆమె, “నేను ఆయన పైవస్త్రాన్ని ముట్టుకుంటే చాలు బాగౌతాను” అని అనుకుంటూ ఉంది.
22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మా,* ధైర్యంగా ఉండు! నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు.+ వెంటనే ఆమె బాగైంది.+
23 యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు, పిల్లనగ్రోవి* ఊదేవాళ్లను, పెద్దగా ఏడుస్తున్న ప్రజల్ని చూసి,+
24 “ఇక్కడి నుండి వెళ్లండి. పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు.+ ఆ మాట విన్నప్పుడు వాళ్లు వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు.
25 వాళ్లు వెళ్లిపోగానే యేసు లోపలికి వెళ్లి ఆ పాప చేతిని పట్టుకున్నాడు,+ దాంతో ఆమె లేచి కూర్చుంది.+
26 ఈ విషయం గురించి ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది.
27 యేసు అక్కడి నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివాళ్లు+ ఆయన వెనక వెళ్తూ, “దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు” అని అరుస్తున్నారు.
28 ఆయన ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ గుడ్డివాళ్లు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు, “నేను మీకు చూపు తెప్పించగలనని మీకు విశ్వాసం ఉందా?”+ అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “ఉంది ప్రభువా” అన్నారు.
29 తర్వాత ఆయన వాళ్ల కళ్లను ముట్టుకొని,+ “మీ విశ్వాసం ప్రకారమే మీకు జరగాలి” అన్నాడు.
30 అప్పుడు వాళ్లకు చూపు వచ్చింది. అయితే యేసు వాళ్లను, “ఈ విషయం గురించి ఎవరికీ తెలియనివ్వకండి” అని గట్టిగా హెచ్చరించాడు.+
31 కానీ వాళ్లు బయటికి వెళ్లాక, దాని గురించి ఆ ప్రాంతమంతా తెలియజేశారు.
32 వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు, ఇదిగో! చెడ్డదూత* పట్టిన ఒక మూగవాణ్ణి ప్రజలు యేసు దగ్గరికి తీసుకొచ్చారు.+
33 యేసు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయి, “మనం ఇశ్రాయేలులో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే” అని అనుకున్నారు.
34 అయితే పరిసయ్యులు, “ఇతను చెడ్డదూతల నాయకుడి సహాయంతోనే చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు” అని అంటూ ఉన్నారు.+
35 తర్వాత యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.+
36 ఆయన ప్రజల్ని చూసినప్పుడు వాళ్లమీద జాలిపడ్డాడు,+ ఎందుకంటే వాళ్లు కాపరిలేని గొర్రెల్లా అణచివేయబడి, నిర్లక్ష్యం చేయబడ్డారని* ఆయన గమనించాడు.+
37 అప్పుడు ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “అవును, కోయాల్సిన పంట చాలా ఉంది, కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు.+
38 కాబట్టి తన పంట కోయడానికి పనివాళ్లను పంపించమని కోత యజమానిని వేడుకోండి.”+
అధస్సూచీలు
^ రోగుల్ని మోసుకెళ్లే చిన్న పరుపు.
^ అక్ష., “కూతురా.”
^ అంటే, ఫ్లూటు.
^ అక్ష., “చర్మం ఒలిచేయబడి, వదిలేయబడ్డారని.”