కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ

ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ

క్రైస్తవులు క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించమని ఆజ్ఞాపించబడ్డారు. ఈ ఆచరణ “ప్రభువు రాత్రి భోజనము” అని కూడా పిలువబడుతుంది. (1 కొరింథీయులు 11:20) దీనిలో అంత ప్రాముఖ్యమైనదేమిటి? దాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి?

సా.శ. 33న యూదుల పస్కా పండుగ రోజు రాత్రి యేసు ఈ ఆచరణను ప్రారంభించాడు. ఈ పస్కా పండుగ యూదుల నెలయైన నీసాను 14న సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆచరించబడే పండుగ. ఆ తేదీని లెక్కించడానికి యూదులు వేసవికాలంలో, రాత్రి పగలు సమానంగా ఉండే రోజు కోసం ఎదురుచూసే వారని తెలుస్తోంది. ఆ రోజున సరిగ్గా పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటాయి. ఆ రోజు తర్వాత వచ్చే మొదటి అమావాస్యను నీసాను నెల ఆరంభంగా పరిగణించేవారు. ఆ తర్వాత 14 రోజులకు, సూర్యాస్తమయం అయ్యాక పస్కా పండుగ ఆచరించేవారు.

యేసు తన అపొస్తలులతో పస్కా పండుగ ఆచరించి, ఇస్కరియోతు యూదాను పంపివేసి ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రారంభించాడు. ఈ భోజనం యూదుల పస్కా పండుగ స్థానాన్ని ఆక్రమించింది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆచరించాలి.

మత్తయి సువార్త ఇలా నివేదిస్తోంది: “యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి—మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె, పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి—దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము [అని చెప్పాడు].”—మత్తయి 26:26-28.

యేసు నిజంగానే రొట్టెను తన శరీరంగా, ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చేశాడని కొందరు నమ్ముతారు. యేసు ఈ రొట్టెను అందించే సమయానికి ఆయన శరీరం ఇంకా అలాగే నిక్షేపంగా ఉంది. యేసు అపొస్తలులు నిజంగా ఆయన అక్షరార్థ శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగారా? లేదు, అలా చేస్తే అది నరభక్షణ అవుతుంది, అంతేకాక దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లు కూడా అవుతుంది. (ఆదికాండము 9:3, 4; లేవీయకాండము 17:10) లూకా 22:20 ప్రకారం “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని యేసు చెప్పాడు. ఆ గిన్నె అక్షరార్థంగా “క్రొత్త నిబంధన” అయ్యిందా? అది అసాధ్యం, ఎందుకంటే నిబంధన అంటే ఒక ఒప్పందం, అది కంటికి కనిపించే వస్తువు కాదు.

కాబట్టి రొట్టె, ద్రాక్షారసం కేవలం చిహ్నాలు మాత్రమే. రొట్టె క్రీస్తు పరిపూర్ణ శరీరాన్ని సూచిస్తుంది. పస్కా భోజనంలో మిగిలిన రొట్టెను యేసు ఉపయోగించాడు. ఆ రొట్టె పులిపిండి లేదా ఈస్ట్‌ కలపకుండా చేసిన రొట్టె. (నిర్గమకాండము 12:8) బైబిలు తరచూ పులిపిండిని పాపానికి లేదా అవినీతికి సూచనగా ఉపయోగిస్తుంది. అందుకే రొట్టె యేసు బలిగా అర్పించిన పరిపూర్ణ శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అది పాపము లేనిది.—మత్తయి 16:11, 12; 1 కొరింథీయులు 5:6, 7; 1 పేతురు 2:22; 1 యోహాను 2:1, 2.

ఎర్రని ద్రాక్షారసం యేసు రక్తానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. రక్తం క్రొత్త నిబంధనను అమలులోకి తెస్తుంది. “పాపక్షమాపణ నిమిత్తము” తన రక్తం ధారపోయబడిందని యేసు చెప్పాడు. అలా మానవులు దేవుని దృష్టిలో నీతిమంతులు కాగలుగుతారు, యెహోవాతో క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించగలుగుతారు. (హెబ్రీయులు 9:14; 10:16, 17) ఈ నిబంధన లేదా ఒప్పందం 1,44,000 మంది విశ్వసనీయులైన క్రైస్తవులు పరలోకానికి వెళ్లడాన్ని సాధ్యం చేస్తుంది. అక్కడ వాళ్ళు మానవజాతి అంతటికీ ఆశీర్వాదకరంగా రాజులుగాను, యాజకులుగాను సేవ చేస్తారు.—ఆదికాండము 22:18; యిర్మీయా 31:31-33; 1 పేతురు 2:9; ప్రకటన 5:9, 10; 14:1-3.

ఈ జ్ఞాపకార్థ చిహ్నాలలో ఎవరు భాగం వహించవచ్చు? న్యాయసమ్మతంగా, క్రొత్త నిబంధనకు చెందినవారు మాత్రమే అంటే పరలోకానికి వెళ్ళే నిరీక్షణగలవారే ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. వారు పరలోకంలో రాజులుగా ఉండడానికి ఎంపిక చేసుకోబడ్డారని దేవుని ఆత్మ అలాంటి వారిని ఒప్పిస్తుంది. (రోమీయులు 8:16) వారు రాజ్య నిబంధనలో యేసుతో కూడా ఉంటారు.—లూకా 22:29.

పరదైసు భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష ఉన్నవారి విషయమేమిటి? వాళ్ళు యేసు ఆజ్ఞను పాటిస్తూ ప్రభువు రాత్రి భోజనానికి హాజరవుతారు, కానీ వారు అందులో భాగం వహించేవారిగా కాక దానిని గౌరవపూర్వకంగా గమనించేవారిగా ఉంటారు. సంవత్సరానికి ఒకసారి నీసాను 14న సూర్యాస్తమయం తర్వాత యెహోవాసాక్షులు ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమందికి మాత్రమే పరలోక నిరీక్షణ ఉన్నా ఈ ఆచరణ క్రైస్తవులందరికీ ప్రశస్తమైనది. అది యెహోవా దేవుడు, యేసుక్రీస్తు చూపిన ఉత్కృష్టమైన ప్రేమ గురించి అందరూ ధ్యానించవలసిన సందర్భం.—యోహాను 3:16.