మొదటి యోహాను 2:1-29

  • దేవునితో శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి తోడ్పడే బలి యేసే (1, 2)

  • ఆయన ఆజ్ఞల్ని పాటించడం (3-11)

    • పాత ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ (7, 8)

  • ఉత్తరం రాయడానికి కారణాలు (12-14)

  • లోకాన్ని ప్రేమించకండి (15-17)

  • క్రీస్తువిరోధి గురించి హెచ్చరిక (18-29)

2  నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు* ఉన్నాడు, ఆయనే నీతిమంతుడైన యేసుక్రీస్తు.+  ఆయన మన పాపాల కోసం ప్రాయశ్చిత్త* బలిని అర్పించాడు.+ కేవలం మన పాపాల కోసమే కాదు, లోకమంతటా ఉన్న ప్రజల పాపాల కోసం ఆ బలిని అర్పించాడు.+  మనం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటే, మనకు ఆయన తెలుసని గ్రహిస్తాం.  ఎవరైనా, “నేను ఆయన్ని తెలుసుకున్నాను” అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించకపోతే ఆ వ్యక్తి అబద్ధాలకోరు, అతనిలో సత్యం లేదు.  కానీ ఎవరైనా ఆయన వాక్యాన్ని పాటిస్తుంటే, దేవుని ప్రేమ అతనిలో నిజంగా పరిపూర్ణం చేయబడింది. దీన్నిబట్టి మనం ఆయనతో ఐక్యంగా ఉన్నామని మనకు తెలుస్తుంది.+  ఆయనతో ఐక్యంగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి ఆయనలాగే నడుచుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఉంది.+  ప్రియ సహోదరులారా, నేను మీకు రాస్తున్న ఆజ్ఞ కొత్తదేమీ కాదు, పాతదే, మొదటి నుండీ మీ దగ్గర ఉన్నదే.+ మీరు విన్న వాక్యమే ఆ పాత ఆజ్ఞ.  యేసు, అలాగే మీరు పాటించిన ఆ ఆజ్ఞనే మళ్లీ కొత్త ఆజ్ఞలా మీకు రాస్తున్నాను. ఎందుకంటే చీకటి వెళ్లిపోతోంది, నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది.+  వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి ఇంకా చీకట్లోనే ఉన్నాడు.+ 10  తన సహోదరుణ్ణి ప్రేమించే వ్యక్తి వెలుగులో ఉంటాడు, అతను దేనివల్లా తడబడడు. 11  కానీ తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి చీకట్లో ఉన్నాడు, చీకట్లోనే నడుస్తున్నాడు,+ చీకటి వల్ల అతని కళ్లకు ఏమీ కనిపించదు కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలీదు.+ 12  చిన్నపిల్లలారా, ఆయన* పేరును బట్టి దేవుడు మీ పాపాల్ని క్షమించాడు+ కాబట్టి మీకు రాస్తున్నాను. 13  తండ్రులారా, మొదటి నుండి ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు దుష్టుడిపై+ విజయం సాధించారు కాబట్టి మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. 14  తండ్రులారా, మొదటి నుండి ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉంది,+ మీరు దుష్టుడిపై విజయం సాధించారు+ కాబట్టి మీకు రాస్తున్నాను. 15  లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి.+ ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, ఆ వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదు;+ 16  ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతీదానికి, అంటే శరీరాశ,+ నేత్రాశ,*+ వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం* అనేవాటికి మూలం తండ్రి కాదు, లోకమే. 17  అంతేకాదు లోకం, దాని ఆశ నాశనం కాబోతున్నాయి,+ అయితే దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు.+ 18  చిన్నపిల్లలారా, ఇది చివరి గంట. క్రీస్తువిరోధి వస్తున్నాడని మీరు విన్నట్టే,+ ఇప్పటికే చాలామంది క్రీస్తువిరోధులు వచ్చారు.+ ఈ వాస్తవాన్ని బట్టి ఇది చివరి గంట అని మనకు తెలుసు. 19  వాళ్లు మన మధ్యే ఉండేవాళ్లు, కానీ మనల్ని వదిలి వెళ్లిపోయారు, వాళ్లు మనవాళ్లు* కాదు.+ వాళ్లు మనవాళ్లయితే మనతోనే ఉండేవాళ్లు. కానీ వాళ్లు అలా వెళ్లిపోయి, అందరూ మనవాళ్లు కాదని చూపించారు.+ 20  మీరు పవిత్రుడైన దేవుని చేత అభిషేకించబడ్డారు,+ అంతేకాదు మీ అందరికీ జ్ఞానం ఉంది. 21  మీకు సత్యం తెలీదని కాదుగానీ+ మీకు సత్యం తెలుసు కాబట్టి, సత్యం నుండి ఏ అబద్ధం పుట్టదు+ కాబట్టి నేను మీకు రాస్తున్నాను. 22  యేసే క్రీస్తని ఒప్పుకోని వ్యక్తి తప్ప అబద్ధాలకోరు ఎవరు?+ తండ్రిని, కుమారుణ్ణి ఒప్పుకోని వ్యక్తే క్రీస్తువిరోధి.+ 23  కుమారుణ్ణి ఒప్పుకోని ప్రతీ వ్యక్తికి తండ్రి ఆమోదం కూడా ఉండదు.+ కానీ కుమారుణ్ణి ఒప్పుకునే వ్యక్తికి+ తండ్రి ఆమోదం కూడా ఉంటుంది.+ 24  మీ విషయానికొస్తే, మొదటి నుండి మీరు విన్న విషయాలు మీ హృదయాల్లో ఉండాలి.+ మొదటి నుండి మీరు విన్న విషయాలు మీ హృదయాల్లో ఉంటే, మీరు కుమారుడితో, తండ్రితో ఐక్యంగా ఉంటారు. 25  అంతేకాదు, ఆయనే స్వయంగా మనకు శాశ్వత జీవితాన్ని+ వాగ్దానం చేశాడు. 26  మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ల గురించి నేను ఈ విషయాలు మీకు రాస్తున్నాను. 27  మీ విషయానికొస్తే, దేవుడు తన పవిత్రశక్తితో మిమ్మల్ని అభిషేకించాడు,+ ఆ పవిత్రశక్తి మీలో ఉంది. ఇప్పుడు మీకు ఇంకొకరు బోధించాల్సిన అవసరం లేదు; అయితే మిమ్మల్ని అభిషేకించడం ద్వారా దేవుడే మీకు అన్ని విషయాలు బోధిస్తున్నాడు.+ ఆ అభిషేకం సత్యం, అది అబద్ధం కాదు, అది మీకు బోధించినట్టే మీరు ఆయనతో ఐక్యంగా ఉండండి.+ 28  కాబట్టి చిన్నపిల్లలారా, మీరు ఆయనతో ఐక్యంగా ఉండండి. అలాచేస్తే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ధైర్యంగా ఉంటాం,+ సిగ్గుపడి ఆయనకు దూరంగా వెళ్లం. 29  ఆయన నీతిమంతుడని మీకు తెలిసివుంటే, నీతిగా నడుచుకునే వాళ్లందరూ ఆయన పిల్లలని+ కూడా మీకు తెలుసు.

అధస్సూచీలు

లేదా “మన తరఫున వాదించే వ్యక్తి.”
లేదా “దేవునితో శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి తోడ్పడే; దేవుణ్ణి శాంతింపజేసే.”
అంటే, యేసు.
లేదా “తమకు ఉన్నవాటి గురించి గొప్పలు చెప్పుకోవడం.”
లేదా “కంటికి నచ్చేది కావాలనుకోవడం.”
లేదా “మనలాంటి వాళ్లు.”