నిర్గమకాండం 12:1-51

  • పస్కా ఆచరణను స్థాపించడం (1-28)

    • గుమ్మపు కమ్ముల మీద రక్తాన్ని చిమ్మాలి (7)

  • 10వ తెగులు: మొదటి సంతానం చంపబడింది (29-32)

  • విడుదలై బయటికి రావడం మొదలౌతుంది (33-42)

    • 430 సంవత్సరాల ముగింపు (40, 41)

  • పస్కా భోజనం గురించి నిర్దేశాలు (43-51)

12  తర్వాత యెహోవా ఐగుప్తు దేశంలో మోషే, అహరోనులతో ఇలా అన్నాడు:  “ఈ నెల మీకు మొదటి నెలగా ఉంటుంది. దీన్ని మీరు సంవత్సరంలో మొదటి నెలగా ఎంచాలి.+  మీరు ఇశ్రాయేలీయులందరితో ఇలా అనండి: ‘ఈ నెల పదో రోజున మీలో ప్రతీ ఒక్కరు, కుటుంబానికి* ఒక గొర్రె+ చొప్పున, ఇంటికి ఒక గొర్రెను తీసుకోవాలి.  అయితే ఒక ఇంట్లో ఆ గొర్రెను తినలేనంత తక్కువమంది ఉంటే, వాళ్లూ వాళ్లకు దగ్గర్లో ఉన్న పొరుగువాళ్లూ కలిసి తమ ఇంట్లో దాన్ని పంచుకోవాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కరు ఎంత తినగలరు అనే దాన్నిబట్టి వాళ్లు లెక్కగట్టాలి.  మీరు ఏ లోపంలేని+ ఏడాది వయసున్న మగ గొర్రెపిల్లను తీసుకోవాలి. గొర్రెపిల్లకు బదులు మీరు మేకపిల్లను కూడా తీసుకోవచ్చు.  ఈ నెల 14వ రోజు వరకు+ దాన్ని మీ దగ్గరే ఉంచుకొని, ఆ రోజు సంధ్య వెలుగు సమయంలో*+ ఇశ్రాయేలీయులందరూ దాన్ని వధించాలి.  వాళ్లు దాని రక్తంలో కొంచెం తీసుకొని, తాము ఏ ఇంట్లో ఆ గొర్రెను తింటారో ఆ ఇంటి గుమ్మపు రెండు నిలువు కమ్ముల మీద, పైకమ్మి మీద ఆ రక్తాన్ని చిమ్మాలి.+  “ ‘ఆ రాత్రి వాళ్లు దాని మాంసం తినాలి.+ దాన్ని నిప్పుల మీద కాల్చి, పులవని రొట్టెలతో,+ చేదుగా ఉండే పచ్చి ఆకుకూరలతో తినాలి.+  దానిలో కొంచెం కూడా పచ్చిగా గానీ నీళ్లలో ఉడకబెట్టి గానీ తినకూడదు. బదులుగా దాన్ని తల, కాళ్లు,* లోపలి భాగాలతో పాటు నిప్పుల మీద కాల్చి తినాలి. 10  దానిలో కొంచెం కూడా పొద్దున వరకు ఉంచుకోకూడదు. పొద్దున వరకు ఏమైనా మిగిలితే దాన్ని మీరు అగ్నిలో కాల్చేయాలి.+ 11  మీరు మీ నడుము* కట్టుకొని, కాళ్లకు చెప్పులు తొడుక్కొని, మీ చేతికర్ర పట్టుకొని హడావిడిగా దాన్ని తినాలి. అది యెహోవాకు పస్కా పండుగ. 12  ఎందుకంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం గుండా సంచరిస్తూ, మనుషుల మొదటి సంతానం నుండి జంతువుల మొదటి సంతానం వరకు ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని చంపుతాను.+ అంతేకాదు, ఐగుప్తు దేవుళ్లందరి మీద నా తీర్పులు అమలు చేస్తాను.+ నేను యెహోవాను. 13  అయితే ఆ రక్తం మీరున్న ఇళ్లకు గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూసి మీ ఇళ్లను దాటి వెళ్తాను. నేను ఐగుప్తు దేశాన్ని శిక్షించినప్పుడు, ఆ తెగులు మిమ్మల్ని నాశనం చేయడానికి మీ మీదికి రాదు.+ 14  “ ‘ఆ రోజు మీకు జ్ఞాపకార్థంగా ఉంటుంది, మీరు తరతరాలపాటు యెహోవాకు పండుగగా దీన్ని జరుపుకోవాలి. ఇది శాశ్వత శాసనం. 15  మీరు ఏడురోజులు పులవని రొట్టెలు తినాలి.+ అవును, మొదటి రోజున మీరు మీ ఇళ్లలో నుండి పులిసిన పిండిని తీసేయాలి. ఎందుకంటే, మొదటి రోజు నుండి ఏడో రోజు వరకు ఎవరైనా పులిసినదాన్ని తింటే, ఆ వ్యక్తి ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి.* 16  మొదటి రోజున మీరు పవిత్ర సమావేశం ఏర్పాటుచేయాలి, ఏడో రోజున ఇంకో పవిత్ర సమావేశం ఏర్పాటుచేయాలి. ఆ రోజుల్లో ఏ పనీ చేయకూడదు.+ ప్రతీ ఒక్కరు తాము తినడానికి కావల్సింది మాత్రం సిద్ధం చేసుకోవచ్చు. 17  “ ‘మీరు పులవని రొట్టెల పండుగను ఆచరించాలి.+ ఎందుకంటే, ఆ రోజే నేను మీ సమూహాల్ని* ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తాను. మీరు తరతరాలపాటు ఆ రోజును ఆచరించాలి. ఇది శాశ్వత శాసనం. 18  మొదటి నెల 14వ రోజు సాయంత్రం నుండి 21వ రోజు సాయంత్రం వరకు మీరు పులవని రొట్టెలు తినాలి.+ 19  ఏడురోజుల పాటు మీ ఇళ్లలో పులిసిన పిండి ఏమాత్రం కనిపించకూడదు. ఎందుకంటే, ఎవరైనా పులిసినదాన్ని తింటే, అతను విదేశీయుడైనా స్వదేశీయుడైనా,+ అతను ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడాలి.*+ 20  మీరు పులిసింది ఏదీ తినకూడదు. మీ ఇళ్లన్నిట్లో మీరు పులవని రొట్టెలు తినాలి.’ ” 21  మోషే వెంటనే ఇశ్రాయేలు పెద్దలందర్నీ పిలిపించి+ వాళ్లతో ఇలా అన్నాడు: “మీలో ప్రతీ ఒక్కరు వెళ్లి మీ మీ కుటుంబాల కోసం మందలో నుండి జంతువును* ఎంచుకొని, పస్కా బలిని వధించండి. 22  తర్వాత మీరు దాని రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని, ఆ రక్తంలో హిస్సోపు రెమ్మల కట్టను ముంచి, గుమ్మపు పైకమ్మి మీద, రెండు నిలువు కమ్ముల మీద చిమ్మాలి. ఉదయం వరకు మీలో ఎవ్వరూ మీ ఇంటి గడప దాటి వెళ్లకూడదు. 23  తర్వాత యెహోవా ఐగుప్తీయుల్ని తెగులుతో శిక్షించడానికి ఆ దేశం గుండా సంచరిస్తూ గుమ్మపు పైకమ్మి మీద, రెండు నిలువు కమ్ముల మీద రక్తాన్ని చూసినప్పుడు, యెహోవా తప్పకుండా ఆ గుమ్మాన్ని దాటి వెళ్లిపోతాడు, నాశనం చేసే* తెగులును ఆయన మీ ఇళ్లలోకి ప్రవేశించనివ్వడు.+ 24  “మీరు దీన్ని మీ కోసం, మీ కుమారుల కోసం ఒక నియమంగా ఎప్పటికీ ఆచరించాలి.+ 25  యెహోవా ముందే చెప్పినట్టుగా, ఆయన మీకిచ్చే దేశంలోకి మీరు వచ్చినప్పుడు మీరు ఈ ఆచరణను జరుపుకోవాలి.+ 26  మీ కుమారులు, ‘మీరు ఈ ఆచరణ ఎందుకు జరుపుకుంటున్నారు?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు+ 27  మీరు ఇలా చెప్పాలి: ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయుల్ని తెగులుతో శిక్షించినప్పుడు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్లను దాటివెళ్లిపోయాడు, మన ఇళ్లలో ఉన్నవాళ్లను వదిలేశాడు.’ ” అప్పుడు ప్రజలు వంగి, సాష్టాంగ నమస్కారం చేశారు. 28  కాబట్టి ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా మోషే, అహరోనులకు ఆజ్ఞాపించినట్టే చేశారు.+ వాళ్లు సరిగ్గా అలాగే చేశారు. 29  తర్వాత అర్ధరాత్రి సమయంలో, యెహోవా ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని చంపేశాడు.+ తన సింహాసనంలో కూర్చొని ఉన్న ఫరో మొదటి సంతానం నుండి చెరసాలలో ఉన్న ఖైదీ మొదటి సంతానం వరకు అందర్నీ చంపేశాడు. జంతువుల్లో కూడా ప్రతీ మొదటి సంతానాన్ని చంపేశాడు.+ 30  ఆ రాత్రి ఫరో తన సేవకులందరితో పాటు, మిగతా ఐగుప్తీయులందరితో పాటు నిద్రలేచాడు. ఐగుప్తీయుల మధ్య గొప్ప ఏడ్పు వినిపించింది. ఎందుకంటే, ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారు.+ 31  ఫరో రాత్రికిరాత్రే మోషే, అహరోనుల్ని పిలిపించి+ ఇలా అన్నాడు: “లెండి, మీరూ మిగతా ఇశ్రాయేలీయులూ నా ప్రజల మధ్య నుండి వెళ్లిపోండి. మీరు అడిగినట్టే వెళ్లి యెహోవాను సేవించండి.+ 32  మీరు అడిగినట్టే మీ మందల్ని, పశువుల్ని కూడా తీసుకెళ్లండి.+ కానీ మీరు నన్ను దీవించాలి.” 33  అప్పుడు ఐగుప్తీయులు ఆ ప్రజలతో, “మీరు వెళ్లిపోండి, లేకపోతే మేమంతా చనిపోయేలా ఉన్నాం!”+ అని అంటూ ఆ దేశం నుండి త్వరగా+ వెళ్లిపొమ్మని వాళ్లను బలవంతం చేయడం మొదలుపెట్టారు. 34  కాబట్టి ప్రజలు తమ పిండి ముద్ద ఇంకా పులవకముందే, పిండి పిసికే పాత్రలతో* పాటు దాన్ని తమ వస్త్రంలో చుట్టుకొని భుజాలమీద పెట్టుకున్నారు. 35  మోషే ముందే తమకు చెప్పినట్టు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల దగ్గర వెండి-బంగారు వస్తువుల్ని, బట్టల్ని అడిగి తీసుకున్నారు.+ 36  యెహోవా ఐగుప్తీయుల దృష్టిలో ఆ ప్రజలు అనుగ్రహం పొందేలా చేశాడు, కాబట్టి ఐగుప్తీయులు ఆ ప్రజలు అడిగినవి వాళ్లకు ఇచ్చారు. అలా వాళ్లు ఐగుప్తీయుల్ని కొల్లగొట్టారు.+ 37  తర్వాత ఇశ్రాయేలీయులు రామెసేసు+ నుండి బయల్దేరి సుక్కోతుకు+ ప్రయాణమయ్యారు; పిల్లలు కాకుండా పురుషులే* దాదాపు 6,00,000 మంది ఉన్నారు.+ 38  చాలామంది విదేశీయులు*+ కూడా వాళ్లతోపాటు వెళ్లారు; పశువులు, మందలు కూడా పెద్ద సంఖ్యలో వాళ్లతోపాటు వెళ్లాయి. 39  వాళ్లు ఐగుప్తు నుండి తమతోపాటు తెచ్చుకున్న పులవని పిండి ముద్దతో గుండ్రని రొట్టెలు చేసి కాల్చడం మొదలుపెట్టారు. అది పులవలేదు, ఎందుకంటే వాళ్లను ఉన్నపళంగా ఐగుప్తు నుండి వెళ్లగొట్టారు. దానివల్ల, వాళ్లు తమ కోసం ఏ ఆహారం సిద్ధం చేసుకోలేదు.+ 40  ఐగుప్తు నుండి బయటికి వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో+ 430 సంవత్సరాలు ఉన్నారు.+ 41  ఆ 430 సంవత్సరాలు గడిచాక, సరిగ్గా అదే రోజున, యెహోవా సమూహాలన్నీ* ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చాయి. 42  అది యెహోవా మహిమ కోసం పండుగ చేసుకునే రాత్రి. ఎందుకంటే, ఆ రాత్రి ఆయన వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులందరూ తరతరాలపాటు యెహోవా మహిమ కోసం ఆ రాత్రిని ఆచరించాలి.+ 43  తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: “పస్కా పండుగ గురించిన శాసనం ఇదే: పరదేశులు ఎవరూ పస్కా భోజనం తినకూడదు.+ 44  అయితే ఎవరికైనా డబ్బుతో కొన్న దాసుడు ఉంటే, ఆ దాసుడికి సున్నతి చేయాలి.+ తర్వాతే అతను దాన్ని తినొచ్చు. 45  వలస వచ్చినవాళ్లు గానీ జీతానికి పనిచేసేవాళ్లు గానీ దాన్ని తినకూడదు. 46  ఒక ఇంటి లోపలే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా మీరు ఆ ఇంటినుండి బయటికి తీసుకెళ్లకూడదు. అంతేకాదు, దాని ఎముకల్లో ఒక్కటి కూడా మీరు విరగ్గొట్టకూడదు.+ 47  ఇశ్రాయేలీయులందరూ ఈ పండుగ జరుపుకోవాలి. 48  ఒకవేళ మీతోపాటు నివసించే పరదేశుల్లో ఎవరైనా యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలని అనుకుంటే, అతనికి చెందిన ప్రతీ పురుషుడు సున్నతి చేయించుకోవాలి. తర్వాత అతను పండుగ ఆచరించవచ్చు, అప్పుడు అతను స్వదేశీయుల్లో ఒకడిలా అవుతాడు. అయితే సున్నతి చేయించుకోని వాళ్లెవ్వరూ దాన్ని తినకూడదు.+ 49  స్వదేశీయుడికీ, మీ మధ్య నివసించే పరదేశికీ ఒకే నియమం వర్తిస్తుంది.”+ 50  కాబట్టి ఇశ్రాయేలీయులందరూ యెహోవా మోషే, అహరోనులకు ఆజ్ఞాపించినట్టే చేశారు. వాళ్లు సరిగ్గా అలాగే చేశారు. 51  అదే రోజున యెహోవా ఇశ్రాయేలీయుల్ని వాళ్ల సమూహాలతో* పాటు ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు.

అధస్సూచీలు

అక్ష., “తండ్రుల ఇంటికి.”
అక్ష., “రెండు సాయంత్రాల మధ్య.” సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడడానికి ముందు ఉండే సమయాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.
లేదా “దట్టీ.”
లేదా “చంపబడాలి.”
అక్ష., “సైన్యాల్ని.”
లేదా “చంపబడాలి.”
అంటే, గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ.
లేదా “చంపేసే.”
లేదా “తొట్లతో.”
అక్ష., “కాల్బలమే.” సైనిక సేవకు తగిన పురుషుల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అంటే, ఐగుప్తీయులు, అలాగే ఇశ్రాయేలీయులుకాని ఇతరులు.
అక్ష., “సైన్యాలన్నీ.”
అక్ష., “సైన్యాలతో.”