లేవీయకాండం 17:1-16

  • గుడారం; బలులు అర్పించే చోటు (1-9)

  • రక్తం తినకూడదు (10-14)

  • చచ్చిన జంతువుల గురించిన ​నియమాలు (15, 16)

17  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు:  “ ‘ “ఇశ్రాయేలు ఇంటివాళ్లలో ఎవరైనా ఒక ఎద్దును గానీ గొర్రెను గానీ మేకను గానీ పాలెం లోపల లేదా పాలెం బయట వధిస్తే,  అంటే యెహోవా గుడారం ముందు యెహోవాకు అర్పణగా ఇవ్వడానికి దాన్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తేకుండా వధిస్తే, అతను రక్తాపరాధి అవుతాడు. అతను రక్తం చిందించాడు కాబట్టి అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.*  ఇశ్రాయేలీయులు ప్రస్తుతం ​మైదానంలో అర్పిస్తున్న బలుల్ని ఇకనుండి యెహోవా దగ్గరికి అంటే ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న యాజకుని దగ్గరికి తీసుకురావాలి. వాళ్లు ఆ బలుల్ని యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాలి.+  యాజకుడు వాటి రక్తాన్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం ​దగ్గరున్న యెహోవా బలిపీఠం మీద ​చిలకరిస్తాడు, వాటి కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు, అది యెహోవాకు ఇంపైన* సువాసన.+  కాబట్టి వాళ్లు ఇక​మీదట మేకల్లాంటి చెడ్డదూతలకు*+ బలులు ​అర్పించకూడదు, ఆ చెడ్డదూతల్ని పూజించడం ద్వారా వాళ్లు వ్యభిచారం చేస్తున్నారు. ఇది మీరు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.” ’  “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లలో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా దహనబలిని గానీ వేరే బలిని గానీ అర్పిస్తుంటే,  ఆ వ్యక్తి దాన్ని యెహోవాకు అర్పించడానికి ప్రత్యక్ష గుడా​రపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకురాకపోతే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయ​బడాలి.*+ 10  “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లలో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే,+ అలా రక్తం తినే వ్యక్తిని నేను తిరస్కరిస్తాను, అతన్ని తన ప్రజల్లో నుండి కొట్టివేస్తాను.* 11  ఎందుకంటే, ఒక జీవి ప్రాణం దాని రక్తంలో ఉంటుంది;+ మీరు బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దాన్ని మీకు ఇచ్చాను.+ ఎందుకంటే రక్తం దానిలో ఉన్న ప్రాణం ద్వారా ప్రాయశ్చిత్తం చేస్తుంది.+ 12  అందుకే నేను ఇశ్రాయేలీయులకు, “మీలో ఎవ్వరూ రక్తం తినకూడదు, మీ మధ్య ఉండే ​పరదేశుల్లో కూడా ఎవ్వరూ రక్తం తినకూడదు”+ అని చెప్పాను. 13  “ ‘ఇశ్రాయేలీయుల్లో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా వేటాడి, తినదగిన జంతువును గానీ పక్షిని గానీ పట్టుకుంటే, అతను దాని రక్తాన్ని పారబోసి,+ మట్టితో కప్పేయాలి. 14  ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం, ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంటుంది. అందుకే నేను ఇశ్రాయేలీయులతో, “మీరు దేని రక్తాన్నీ తినకూడదు, ఎందుకంటే ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం. ​ఎవరైనా రక్తాన్ని తింటే అతను కొట్టివేయబడాలి”* అని చెప్పాను.+ 15  ఇశ్రాయేలీయుల్లో లేదా పరదేశుల్లో ఎవరైనా చచ్చిన జంతువును గానీ క్రూరమృగం చీల్చేసిన జంతువును గానీ తింటే,+ అతను తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు,+ తర్వాత పవిత్రుడౌతాడు. 16  ఒకవేళ అతను తన వస్త్రాల్ని ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా ఉంటే అతను తన తప్పుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.’ ”+

అధస్సూచీలు

లేదా “చంపబడాలి.”
లేదా “శాంతపర్చే.”
అక్ష., “మేకలకు.” పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
లేదా “చంపబడాలి.”
లేదా “చంపేస్తాను.”
లేదా “చంపబడాలి.”