మత్తయి సువార్త 3:1-17

  • బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించడం (1-12)

  • యేసు బాప్తిస్మం (13-17)

3  ఆ రోజుల్లో, బాప్తిస్మమిచ్చే యోహాను+ యూదయ ఎడారిలో* ప్రకటించడం మొదలుపెట్టాడు;+ 2  అతను, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని చెప్తూ ఉన్నాడు.+ 3  నిజానికి యెషయా ప్రవక్త, “ ‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో ఒక వ్యక్తి* అరుస్తున్నాడు”+ అని చెప్పింది ఇతని గురించే.+ 4  యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రం వేసుకునేవాడు, నడుముకు తోలు దట్టీ కట్టుకునేవాడు;+ మిడతల్ని, అడవి తేనెను తినేవాడు.+ 5  యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, అలాగే యొర్దాను చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరికి వెళ్తూ ఉన్నారు.+ 6  వాళ్లు తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకుంటూ, యొర్దాను నదిలో అతని దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు.*+ 7  అతను బాప్తిస్మమిచ్చే స్థలం దగ్గరికి చాలామంది పరిసయ్యులు, సద్దూకయ్యులు+ వస్తుండడం చూసి అతను వాళ్లతో ఇలా అన్నాడు: “సర్పసంతానమా,+ రాబోయే ఉగ్రతను తప్పించుకోమని ఎవరు మిమ్మల్ని హెచ్చరించారు?+ 8  కాబట్టి పశ్చాత్తాపపడ్డారని చూపించే పనులు చేయండి. 9  ‘అబ్రాహాము మా తండ్రి’ అని అనుకోకండి.+ ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు. 10  చెట్లను వేళ్ల దగ్గర నుండి నరకడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. కాబట్టి మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో వేయబడుతుంది.+ 11  నేనైతే మీ పశ్చాత్తాపాన్ని బట్టి నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను.+ కానీ నా తర్వాత వస్తున్న వ్యక్తి నాకన్నా బలవంతుడు; ఆయన చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు.+ ఆయన మీకు పవిత్రశక్తితో,+ అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు.+ 12  ఆయన చేతిలో తూర్పారబట్టే పార* ఉంది, ఆయన తన కళ్లాన్ని* పూర్తిగా శుభ్రం చేసి, గోధుమల్ని గోదాములో సమకూరుస్తాడు; పొట్టును మాత్రం ఆరని మంటల్లో కాల్చేస్తాడు.”+ 13  ఆ సమయంలో యేసు, యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి గలిలయ నుండి యొర్దానుకు వచ్చాడు.+ 14  అయితే యోహాను యేసును ఆపడానికి ప్రయత్నిస్తూ, “నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాల్సిన వాణ్ణి, అలాంటిది నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చావా?” అని అన్నాడు. 15  అందుకు యేసు, “ఇప్పటికి ఇలా కానివ్వు, మనం ఈ విధంగా దేవుడు కోరే వాటన్నిటినీ చేయడం సరైనది” అన్నాడు. దాంతో యోహాను ఇక ఆయనకు అడ్డు చెప్పలేదు. 16  యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీళ్లలో నుండి బయటికి వచ్చాడు; అప్పుడు ఇదిగో! ఆకాశం తెరుచుకుంది, దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదికి దిగిరావడం+ యోహాను చూశాడు. 17  అంతేకాదు, ఇదిగో! ఆకాశం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఈయన నా ప్రియ కుమారుడు,+ ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.”*+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “వ్యక్తి స్వరం.”
లేదా “అతని చేత ముంచబడ్డారు.”
ధాన్యాన్ని, పొట్టును వేరుచేయడానికి ఉపయోగించే పనిముట్టు.
పదకోశం చూడండి.
అక్ష., “ఈయన్ని నేను ఆమోదించాను.”