ఫిలిప్పీయులు 4:1-23

  • ఐక్యత, సంతోషం, సరైన ఆలోచనలు (1-9)

    • ఏ విషయం గురించీ ఆందోళన పడకండి (6, 7)

  • ఫిలిప్పీయులు ఇచ్చిన బహుమతుల విషయంలో కృతజ్ఞత (10-20)

  • చివర్లో శుభాకాంక్షలు (21-23)

4  కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఇలాగే క్రీస్తుతో ఐక్యంగా ఉంటూ స్థిరంగా ఉండండి.+ నా సహోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని చూడాలని తపిస్తున్నాను; మీరే నా సంతోషం, నా కిరీటం.  ప్రభువు సేవలో ఒకే ఆలోచనతో ఉండమని+ యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.  ఆ స్త్రీలకు సహాయం చేస్తూ ఉండమని నా నిజమైన తోటి పనివాడివైన నిన్ను కూడా కోరుతున్నాను. ఆ ఇద్దరు నాతో, క్లెమెంతుతో, నా తోటి పనివాళ్లయిన మిగతావాళ్లతో కలిసి మంచివార్త కోసం ఎంతో ప్రయాసపడ్డారు.* వాళ్లందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.+  ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించండి. మళ్లీ చెప్తున్నాను, ఆనందించండి!+  మీరు పట్టుబట్టే ప్రజలు కాదని*+ అందరికీ తెలియనివ్వండి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.  ఏ విషయం గురించీ ఆందోళన పడకండి.+ కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి;+  అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి+ క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు* కాపలా ఉంటుంది.+  చివరిగా సహోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో,* ఏవి ప్రేమించదగినవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి మంచివో, ఏవి పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ* ఉండండి.+  వేటినైతే మీరు నా దగ్గర నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో, నాలో చూశారో, వాటిని పాటించండి.+ అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. 10  ఇప్పుడు మీరు మళ్లీ నా గురించి ఆలోచిస్తున్నందుకు+ ప్రభువు సేవకుడినైన నాకు చాలా సంతోషంగా ఉంది. నా బాగోగుల విషయంలో మీకు ఎప్పుడూ శ్రద్ధ ఉంది, కానీ దాన్ని చూపించే అవకాశం కొంతకాలం మీకు దొరకలేదు. 11  నాకు ఏదో అవసరం ఉండి నేనిలా మాట్లాడట్లేదు; ఎందుకంటే నా పరిస్థితులు ఎలా ఉన్నా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను.+ 12  తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో,+ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండినా, ఆకలిగా ఉన్నా, సమృద్ధిగా ఉన్నా, ఏమీ లేకున్నా తృప్తిగా జీవించడమనే రహస్యం నేర్చుకున్నాను. 13  ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.+ 14  అయినాసరే, నా కష్టాల్లో మీరు నాకు సహాయం చేశారు, అది మంచి విషయం. 15  నిజానికి ఫిలిప్పీయులారా, మీరు మొదటిసారి మంచివార్త తెలుసుకున్న తర్వాత, నేను మాసిదోనియ నుండి బయల్దేరుతున్నప్పుడు, మీరు తప్ప ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు, నా సహాయం తీసుకోలేదు.+ ఈ విషయం మీకూ తెలుసు. 16  ఎందుకంటే, నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు మీరు నా అవసరాల్లో సహాయం చేశారు, ఒక్కసారి కాదు, రెండుసార్లు అలా సహాయం చేశారు. 17  మీ నుండి బహుమతిని ఆశించి నేనిలా చెప్పట్లేదు, బదులుగా దేవుని దగ్గర మీ సంపదను పెంచే మంచిపనుల్ని మీరు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను. 18  నాకు కావాల్సిన ప్రతీది నా దగ్గర ఉంది, చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. నాకు ఏ లోటూ లేదు, ఎందుకంటే మీరు ఎపఫ్రొదితు+ ద్వారా పంపించింది నాకు అందింది. అది దేవుడు అంగీకరించే, ఇష్టపడే, పరిమళభరిత బలి.+ 19  మీరు చేసినదానికి ప్రతిఫలంగా, మహిమాన్విత సంపదలుగల దేవుడు మీకు కావాల్సినవన్నీ క్రీస్తుయేసు ద్వారా పూర్తిగా దయచేస్తాడు.+ 20  మన తండ్రైన దేవునికి యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్‌. 21  క్రీస్తుయేసు శిష్యులుగా ఉన్న పవిత్రుల్లో ప్రతీ ఒక్కరికి నా శుభాకాంక్షలు చెప్పండి. నాతో ఉన్న సహోదరులు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 22  పవిత్రులంతా, ముఖ్యంగా కైసరు* ఇంటివాళ్లు+ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 23  ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి.

అధస్సూచీలు

లేదా “తీవ్రంగా పోరాడారు.”
లేదా “అర్థం చేసుకునేవాళ్లని; సహేతుకత గలవాళ్లని.”
లేదా “ఆలోచనలకు; మానసిక సామర్థ్యాలకు.”
లేదా “ధ్యానిస్తూ.”
లేదా “స్వచ్ఛమైనవో.”
లేదా “రోమా చక్రవర్తి.”