హెబ్రీయులు 6:1-20

  • పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి (1-3)

  • విశ్వాసం నుండి పడిపోయేవాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొడుతున్నారు (4-8)

  • మీ నిరీక్షణను దృఢంగా ఉంచుకోండి (9-12)

  • దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది (13-20)

    • దేవుడు చేసిన వాగ్దానం, వేసిన ఒట్టు మారవు (17, 18)

6  మనం క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు నేర్చుకునే స్థాయి దాటేశాం+ కాబట్టి ఇప్పుడు పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోదాం.+ వేసిన పునాదినే మళ్లీ వేయకుండా ఉందాం; అంటే, పనికిరాని పనుల* విషయంలో పశ్చాత్తాపం, దేవుని మీద విశ్వాసం,  వివిధ రకాల బాప్తిస్మాల గురించిన బోధ, తలమీద చేతులుంచడం,+ మృతుల పునరుత్థానం,+ శాశ్వతమైన తీర్పు వంటివాటిని మళ్లీ కొత్తగా నేర్చుకోకుండా ఉందాం.  దేవుడు అనుమతిస్తే మనం అలా పరిణతి సాధిస్తూ ఉంటాం.  ఎవరైతే ఒకసారి సత్యమనే వెలుగును పొంది,+ పరలోక సంబంధమైన ఉచిత బహుమతిని రుచిచూసి, పవిత్రశక్తిని పొంది,  శ్రేష్ఠమైన దేవుని వాక్యాన్ని, రానున్న వ్యవస్థకు* సంబంధించిన ఆశీర్వాదాల్ని* రుచిచూసి కూడా  విశ్వాసం నుండి పడిపోయారో,+ వాళ్లను మళ్లీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకంటే వాళ్లు దేవుని కుమారుణ్ణి మళ్లీ మేకులతో కొయ్యకు దిగగొట్టి, ఆయన్ని నలుగురిలో అవమానానికి గురిచేస్తున్నారు.+  తరచూ పడే వర్షాలు నేలకు దేవుడు ఇచ్చే వరం. నేల ఆ వర్షపు నీళ్లను పీల్చుకుని, అది ఎవరి కోసం సాగుచేయబడుతుందో వాళ్లకు మంచి పంటనిస్తుంది.  కానీ అది ముళ్ల చెట్లను, పిచ్చి మొక్కల్ని మొలిపిస్తే తిరస్కరించబడుతుంది, త్వరలోనే శపించబడుతుంది, చివరికి కాల్చేయబడుతుంది.  ప్రియ సహోదరులారా, మేము ఇలా మాట్లాడుతున్నా సరే, మీరు వాళ్లకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారని, రక్షణకు నడిపించే పనులు చేస్తున్నారని మాకు నమ్మకం ఉంది. 10  మీరు పవిత్రులకు సేవచేశారు, ఇంకా సేవ చేస్తున్నారు; ఈ విధంగా మీరు చేసే పనిని, తన పేరు విషయంలో మీరు చూపించే ప్రేమను+ దేవుడు మర్చిపోడు, ఎందుకంటే ఆయన అన్యాయస్థుడు కాడు. 11  మీ నిరీక్షణ+ అంతం వరకు దృఢంగా ఉండేలా, మీలో ప్రతీ ఒక్కరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉండాలని మా కోరిక.+ 12  అప్పుడు మీరు బద్దకస్తుల్లా తయారవ్వకుండా+ విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా వాగ్దానాలకు వారసులైనవాళ్లను అనుసరించగలుగుతారు. 13  దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, తాను ఒట్టేయడానికి తనకన్నా గొప్పవాళ్లెవరూ లేనందువల్ల తనమీదే ఒట్టు పెట్టుకొని,+ 14  ఇలా అన్నాడు: “నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నీ సంతానం* ఖచ్చితంగా ఎక్కువయ్యేలా చేస్తాను.”+ 15  అబ్రాహాము ఓర్పు చూపించిన తర్వాత ఆ వాగ్దానం పొందాడు. 16  మనుషులు తమకన్నా గొప్పవాళ్ల మీద ఒట్టేస్తారు. వాళ్ల ఒట్టు ప్రతీ వివాదాన్ని పరిష్కరిస్తుంది. ఎందుకంటే అది చట్టబద్ధమైన హామీగా పనిచేస్తుంది.+ 17  అదేవిధంగా, దేవుడు తన సంకల్పం* మారదనే విషయాన్ని వాగ్దానానికి వారసులైనవాళ్లకు+ మరింత స్పష్టంగా చూపించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన ఒట్టేసి హామీ ఇచ్చాడు. 18  దేవుడు చేసిన ఈ రెండు పనులు* ఎప్పటికీ మారవు, ఆయన అబద్ధమాడడం అసాధ్యం;+ తన ఆశ్రయంలోకి పరుగెత్తిన మనం మన ముందున్న నిరీక్షణను స్థిరంగా ఉంచుకునేలా అవి మనల్ని బలపర్చాలని ఆయన అలా చేశాడు. 19  నిశ్చయమైన, స్థిరమైన ఈ నిరీక్షణ+ మన ప్రాణాలకు లంగరులా ఉంది. అది మనల్ని తెర* అవతలికి తీసుకెళ్తుంది.+ 20  మన తరఫున మనకన్నా ముందు యేసు అక్కడికి వెళ్లాడు,+ ఆయన మెల్కీసెదెకు లాంటి ప్రధానయాజకునిలా నిరంతరం సేవ చేస్తాడు.+

అధస్సూచీలు

లేదా “నిర్జీవ క్రియల.”
లేదా “యుగానికి.” పదకోశం చూడండి.
అక్ష., “శక్తుల్ని.”
అక్ష., “నిన్ను.”
లేదా “ఆలోచన.”
అంటే, దేవుడు చేసిన వాగ్దానం, ఆయన వేసిన ఒట్టు.
ఇది గుడారంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరుచేసే తెరను సూచిస్తోంది.