దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:1-43

  • మందసాన్ని డేరాలో పెట్టడం (1-6)

  • దావీదు కృతజ్ఞతా గీతం (7-36)

    • “యెహోవా రాజయ్యాడు!” (31)

  • మందసం ముందు జరిగే సేవ (37-43)

16  అలా వాళ్లు సత్యదేవుని మందసాన్ని తీసుకొచ్చి, దాని కోసం దావీదు వేయించిన డేరాలో ఉంచారు;+ వాళ్లు సత్యదేవుని ఎదుట దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పిం​చారు.+  దావీదు దహనబలుల్ని,+ సమాధాన బలుల్ని+ అర్పించాక, యెహోవా పేరున ప్రజల్ని దీవించాడు.  అంతేకాదు, దావీదు ఇశ్రాయేలీయులందరికీ అంటే ప్రతీ పురుషునికి, స్త్రీకి ఒక గుండ్రటి రొట్టె, ఒక ఖర్జూర రొట్టె, ఒక ఎండుద్రాక్ష రొట్టె పంచిపెట్టాడు.  తర్వాత అతను యెహోవా ఒప్పంద మందసం ముందు సేవ చేయడానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనపర్చడానికి,* ఆయనకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి లేవీయుల్లో కొంతమందిని నియమించాడు.+  వాళ్లలో ఆసాపు+ అధిపతి, అతని తర్వాతివాడు జెకర్యా; అలాగే యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు+ తంతివాద్యాలు, వీణలు*+ వాయించారు. ఆసాపు తాళాలు వాయించాడు.+  యాజకులైన బెనాయా, యహజీయేలు సత్యదేవుని ఒప్పంద మందసం ముందు బాకాలు ఊదుతూ ఉన్నారు.  దావీదు ఆ రోజే మొదటిసారి యెహోవాకు ఒక కృతజ్ఞతా గీతాన్ని రచించి, దాన్ని పాడమని ఆసాపును,+ అతని సహోదరుల్ని నిర్దేశించాడు. ఆ గీతం ఇది:  “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి,+ ఆయన పేరున ​ప్రార్థించండి,దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలు తెలియజేయండి!+  ఆయనకు పాటలు పాడండి, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి,*+ఆయన చేసిన అద్భుతమైన పనులన్నిటి గురించి ధ్యానించండి.*+ 10  ఆయన పవిత్రమైన పేరు గురించి గొప్పలు చెప్పుకోండి.+ యెహోవాను వెతికేవాళ్ల హృదయాలు ఉల్లసించాలి.+ 11  యెహోవాను, ఆయన బలాన్ని వెతకండి.+ ఎప్పుడూ ఆయన దయను* వెతకండి.+ 12  ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల్ని,* ​అద్భుతాల్ని,ఆయన ప్రకటించిన తీర్పుల్ని గుర్తుచేసుకోండి.+ 13  ఆయన సేవకుడైన ఇశ్రాయేలు ​సంతానమా,*+ఆయన ఎంచుకున్న యాకోబు వంశస్థులారా,+ గుర్తుచేసుకోండి. 14  ఆయనే మన దేవుడైన యెహోవా.+ ఆయన తీర్పులు లోకమంతటా అమలులో ఉన్నాయి.+ 15  ఆయన ఒప్పందాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి,ఆయన చేసిన వాగ్దానాన్ని* వెయ్యి తరాల వరకు గుర్తుపెట్టుకోండి,+ 16  అది ఆయన అబ్రాహాముతో చేసిన ఒప్పందం,+ఇస్సాకుకు ఒట్టేసి చేసిన ప్రమాణం,+ 17  ఆయన దాన్ని యాకోబుకు ఒక ​ఆదేశంలా,+ఇశ్రాయేలుకు శాశ్వత ఒప్పందంలా ​స్థిరపరుస్తూ 18  ఇలా అన్నాడు: ‘నేను కనాను దేశాన్ని నీకు ఇస్తాను,+వారసత్వ ఆస్తిగా దాన్ని మీకు పంచి ఇస్తాను.’+ 19  ఆయన ఈ మాట అన్నప్పుడు మీరు కొద్దిమందే ఉన్నారు,అవును, చాలా తక్కువమంది ఉన్నారు, ఆ దేశంలో పరదేశులుగా ఉన్నారు.+ 20  వాళ్లు ఒక దేశం నుండి ఇంకో దేశానికి,ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి తిరుగుతూ ఉన్నారు.+ 21  ఆయన ఏ మనిషినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు,+బదులుగా వాళ్ల కోసం రాజుల్ని ​గద్దించాడు,+ 22  ‘నా అభిషిక్తుల్ని ముట్టకండి,నా ప్రవక్తలకు ఏ హానీ చేయకండి’ అని వాళ్లతో అన్నాడు.+ 23  భూమ్మీదున్న సమస్త ప్రజలారా, యెహోవాకు పాటలు పాడండి! ప్రతీరోజు ఆయన రక్షణను ప్రకటించండి!+ 24  దేశాల మధ్య ఆయన మహిమను,దేశదేశాల ప్రజలందరి మధ్య ఆయన అద్భుతమైన పనుల్ని ​చాటించండి. 25  యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు. దేవుళ్లందరి కంటే పూజనీయుడు.*+ 26  దేశదేశాల ప్రజలు పూజించే దేవుళ్లందరూ వ్యర్థమైన దేవుళ్లు,+కానీ యెహోవా ఆకాశాన్ని తయారు​చేసిన దేవుడు.+ 27  ఘనత, వైభవం ఆయన సన్నిధిలో ఉన్నాయి;+బలం, సంతోషం ఆయన నివాస స్థలంలో ఉన్నాయి.+ 28  దేశదేశాల కుటుంబాల్లారా, యెహోవాకు తగిన ఘనత ఆయనకు ఇవ్వండి;యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ఆయనకు తగిన ఘనత ఇవ్వండి.+ 29  యెహోవా పేరుకు తగిన మహిమ ​ఆయనకు చెల్లించండి;+కానుక తీసుకొని ఆయన ముందుకు రండి.+ పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి.*+ 30  భూమ్మీదున్న సమస్త ప్రజలారా, ఆయన ముందు వణకండి! భూమి* స్థిరంగా స్థాపించబడింది; దాన్ని కదిలించలేరు.*+ 31  ఆకాశం సంతోషించాలి, భూమి ​ఆనందించాలి;+‘యెహోవా రాజయ్యాడు!’ అని దేశాల మధ్య చాటించండి.+ 32  సముద్రం, దానిలో ఉన్నవన్నీ సంతోషంతో ఘోషించాలి;పొలాలు, వాటిలో ఉన్నవన్నీ ​ఉల్లసించాలి. 33  అడవిలో ఉన్న చెట్లు యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి,ఎందుకంటే ఆయన, భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు.* 34  యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు;+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.+ 35  ఇలా చెప్పండి: ‘మా రక్షకుడివైన దేవా, మమ్మల్ని కాపాడు,+మమ్మల్ని సమకూర్చి, దేశాల నుండి మమ్మల్ని రక్షించు,అప్పుడు మేము నీ పవిత్రమైన పేరుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం,+నిన్ను సంతోషంగా స్తుతిస్తాం.*+ 36  ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలం* స్తుతించబడాలి.’ ”అప్పుడు ప్రజలంతా “ఆమేన్‌!”* అన్నారు; వాళ్లు యెహోవాను స్తుతించారు. 37  తర్వాత దావీదు ఆసాపును,+ అతని సహోదరుల్ని యెహోవా ఒప్పంద మందసం దగ్గర ఉంచాడు. ప్రతీరోజు జరగాల్సిన సేవ ప్రకారం,+ వాళ్లు మందసం ముందు ఎప్పుడూ సేవ చేయడానికి అలా ఉంచాడు.+ 38  అలాగే ఓబేదెదోమును, అతని సహోదరులు 68 మందిని, యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును, హోసాను కాపలాదారులుగా ఉంచాడు; 39  యాజకుడైన సాదోకును,+ అతని తోటి యాజకుల్ని గిబియోను దగ్గర ఉన్నత స్థలం+ మీదున్న యెహోవా గుడారం ముందు ఉంచాడు. 40  దహన​బలులు అర్పించే బలిపీఠం మీద యెహోవాకు క్రమంగా ఉదయం, సాయంత్రం దహనబలుల్ని అర్పించడానికి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో రాయబడిన వాటన్నిటిని చేయడానికి+ దావీదు వాళ్లను అక్కడ ఉంచాడు. 41  వాళ్లతోపాటు హేమాను, యెదూతూను,+ ఎంపిక చేయబడిన పురుషుల్లో మిగిలినవాళ్లు ఉన్నారు; వాళ్లు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిం​చేవాళ్లు,+ ఎందుకంటే “ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”+ 42  బాకాలు ఊదడం కోసం, తాళాలు వాయించడం కోసం, సత్యదేవుణ్ణి స్తుతించేందుకు* ఉపయోగించే ఇతర వాద్యాల్ని వాయించడం కోసం వాళ్ల దగ్గర హేమాను,+ యెదూతూను ఉన్నారు; యెదూతూను కుమారులు+ ద్వారం దగ్గర అధికారులు. 43  తర్వాత ప్రజలందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు, దావీదు తన ఇంటివాళ్లను దీవించడానికి వెళ్లాడు.

అధస్సూచీలు

అక్ష., “గుర్తు చేయడానికి.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “సంగీతం వాయించండి.”
లేదా “మాట్లాడండి” అయ్యుంటుంది.
అక్ష., “ముఖాన్ని.”
లేదా “అద్భుతమైన పనుల్ని.”
లేదా “వంశస్థులారా.” అక్ష., “విత్తనమా.”
అక్ష., “ఆయన ఆజ్ఞాపించిన మాటను.”
లేదా “సంభ్రమాశ్చర్యాలు పుట్టించేవాడు.”
లేదా “ఆయన పవిత్రతకు ఉన్న వైభవాన్ని బట్టి” అయ్యుంటుంది.
లేదా “ఆరాధించండి.”
లేదా “పండే భూమి.”
లేదా “అది ఊగిసలాడదు.”
లేదా “వచ్చాడు.”
లేదా “నీ స్తుతిని బట్టి సంతోషిస్తాం.”
లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”
లేదా “అలాగే జరగాలి!”
లేదా “కీర్తించడానికి.”