యెషయా 1:1-31

  • ఒక తండ్రి, తిరుగుబాటు చేసే అతని ​కుమారులు (1-9)

  • మొక్కుబడిగా చేసే ఆరాధన యెహోవాకు అసహ్యం (10-17)

  • “రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం” (18-20)

  • సీయోను మళ్లీ నమ్మకమైన నగరం అవుతుంది (21-31)

1  ఉజ్జియా,+ యోతాము,+ ఆహాజు,+ హిజ్కియా+ రాజులు యూదాను పరిపాలించిన రోజుల్లో+ యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయా* చూసిన దర్శనం:+   ఆకాశమా, విను! భూమీ, ఆలకించు!+యెహోవా ఇలా అంటున్నాడు: “నేను కుమారుల్ని పెంచి పెద్ద చేశాను,+కానీ వాళ్లు నాకు ఎదురుతిరిగారు.+   ఎద్దుకు తన యజమాని తెలుసు,గాడిదకు తన యజమాని మేత పెట్టే చోటు తెలుసు;కానీ ఇశ్రాయేలుకు నేను* తెలీదు,+నా సొంత ప్రజలు అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు.”   పాపిష్ఠి జనమా, మీకు శ్రమ,+మీ దోషం చాలా బరువుగా ఉంది,మీరు దుష్ట సంతానం, నాశనకరమైన పిల్లలు! మీరు యెహోవాను విడిచిపెట్టేశారు;+ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి ​అవమానించారు;ఆయన్ని విడిచి వెళ్లిపోయారు.   మీరు ఇంకా తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఈసారి మిమ్మల్ని ఎక్కడ కొట్టాలి?+ మీ తల అంతా రోగంతో నిండిపోయింది,గుండె అంతటికీ వ్యాధి సోకింది.+   అరికాలి నుండి నడినెత్తి వరకు ఏదీ ఆరోగ్యంగా లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లే.ఎవరూ వాటికి చికిత్స చేయలేదు,* కట్టు కట్టలేదు, నూనె రాయలేదు.+   మీ దేశం నిర్మానుష్యం అయింది. మీ నగరాలు అగ్నితో కాల్చేయబడ్డాయి. పరదేశులు మీ కళ్లముందే మీ దేశాన్ని మింగేస్తున్నారు.+ అది పరదేశులు నాశనం చేసిన ​పనికిరాని భూమిలా తయారైంది.+   సీయోను కూతురు ద్రాక్షతోటలోని మంచెలా,*దోసకాయ పొలంలోని గుడిసెలా,ముట్టడి వేయబడిన నగరంలా వదిలేయబడింది.+   సైన్యాలకు అధిపతైన యెహోవా మనలో కొంతమందిని మిగల్చకపోయి ఉంటే,మనం అచ్చం సొదొమలా అవ్వాల్సిన వాళ్లం,గొమొర్రాలా ఉండేవాళ్లం.+ 10  సొదొమ+ నియంతలారా,* యెహోవా చెప్పే మాట వినండి, గొమొర్రా ప్రజలారా,+ మన దేవుని ​ధర్మశాస్త్రాన్ని* ఆలకించండి. 11  “మీరు అర్పించే బలులన్నీ నాకెందుకు?”+ అని యెహోవా అంటున్నాడు. “మీ దహనబలి పొట్టేళ్ల+ మీద, బాగా మేపిన జంతువుల కొవ్వు+ మీద నాకు విరక్తి కలిగింది;కోడెదూడల+ రక్తం,+ గొర్రెపిల్లల రక్తం, మేకల+ రక్తం నన్ను సంతోషపెట్టవు. 12  నా సన్నిధిలో కనిపించడానికి+ రమ్మని,ఇలా నా ఆలయ ప్రాంగణాల్ని తొక్కమనిమిమ్మల్ని ఎవరు అడిగారు?+ 13  పనికిరాని ధాన్యార్పణల్ని తేవడం ఇక ఆపేయండి. మీ ధూపం నాకు అసహ్యం.+ మీరు అమావాస్య రోజుల్ని,+ విశ్రాంతి రోజుల్ని*+ ఆచరిస్తారు; సమావేశాల కోసం చాటింపు+ వేస్తారు.మీరు ఒకవైపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూనే మరోవైపు ​ఇంద్రజాల శక్తిని ఉపయోగించడం నేను ​సహించలేను.+ 14  మీ అమావాస్య రోజులు, పండుగలు అంటే నాకు అసహ్యం. అవి నాకు భారంగా తయారయ్యాయి;వాటిని మోసీ మోసీ నేను ​అలసిపోయాను. 15  మీరు ప్రార్థించడానికి చేతులు ​చాపినప్పుడు,నేను నా కళ్లను పక్కకు తిప్పుకుంటాను.+ మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నా,+నేను వినట్లేదు;+మీ చేతుల నిండా రక్తమే.+ 16  మిమ్మల్ని మీరు కడుక్కొని శుభ్రం ​చేసుకోండి;మీ దుష్ట పనుల్ని నా కళ్లముందు నుండి తీసేయండి;చెడు చేయడం మానండి.+ 17  మంచి చేయడం నేర్చుకోండి, న్యాయం జరిగించండి,+అణచివేసే వాళ్లను సరిదిద్దండి,తండ్రిలేని పిల్లల* హక్కుల్ని కాపాడండి,విధవరాళ్ల పక్షాన వాదించండి.”+ 18  “రండి, మన మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నాడు.+“మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా,మంచు అంత తెల్లగా అవుతాయి;+అవి ముదురు ఎరుపు రంగులో ఉన్నా, ఉన్ని అంత తెల్లగా అవుతాయి. 19  మీరు వినడానికి సిద్ధంగా ఉంటే,దేశంలోని మంచివాటిని తింటారు.+ 20  కానీ మీరు ఒప్పుకోకుండా తిరుగుబాటు చేస్తే,ఖడ్గం మిమ్మల్ని హతం చేస్తుంది;+ఎందుకంటే ఈ మాట యెహోవా నోటి నుండి వచ్చింది.” 21  నమ్మకమైన నగరం+ ఎలా వేశ్య అయిందో చూడండి!ఒకప్పుడు ఆమె న్యాయంతో నిండి ఉండేది;+నీతి ఆమెలో నివసించేది;+ కానీ ఇప్పుడు హంతకులు ​నివసిస్తున్నారు.+ 22  నీ వెండి మష్టులా తయారైంది,+నీ మద్యం* నీళ్లు కలిసి పలుచబడింది. 23  నీ అధిపతులు మొండివాళ్లు, దొంగలకు జతగాళ్లు.+ లంచం అంటే వాళ్లకు మహా ఇష్టం, వాళ్లు బహుమతుల వెనక పరుగులు తీస్తారు.+ తండ్రిలేని పిల్లలకు* వాళ్లు న్యాయం చేయరు,విధవరాలి వ్యాజ్యం వాళ్లదాకా వెళ్లనే వెళ్లదు.+ 24  కాబట్టి నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీఇశ్రాయేలు శక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఇదిగో! నేను నా విరోధుల అడ్డు తొలగించుకుంటాను,నా శత్రువుల మీద ప్రతీకారం తీర్చు​కుంటాను.+ 25  నా చేతిని నీకు వ్యతిరేకంగా తిప్పుతాను,సబ్బుతో కడిగినట్టు నీ మష్టును ​కడిగేస్తాను,* నీ మలినాలన్నీ తీసేస్తాను.+ 26  మొదట్లోలాగే నీకు మళ్లీ న్యాయమూర్తుల్ని ఇస్తాను,అప్పటిలాగే నీకు సలహాదారుల్ని ఇస్తాను.+ ఆ తర్వాత నువ్వు నీతిగల నగరం అని, నమ్మకమైన పట్టణం అని పిలవబడతావు.+ 27  సీయోను న్యాయం వల్ల విడిపించ​బడుతుంది,+తిరిగొచ్చే ఆమె ప్రజలు నీతి వల్ల విడిపించబడతారు. 28  తిరుగుబాటుదారులు, పాపులు కలిసి నాశనమౌతారు,+యెహోవాను విడిచిపెట్టే వాళ్లు అంత​మౌతారు.+ 29  నువ్వు ఆశించిన మహావృక్షాల్ని+ బట్టి ప్రజలు సిగ్గుపడతారు,నువ్వు ఎంచుకున్న తోటల్ని*+ బట్టి నువ్వు అవమానాలపాలు అవుతావు. 30  నువ్వు ఆకులు వాడిపోతున్న చెట్టులా,+నీళ్లులేని తోటలా తయారౌతావు. 31  బలవంతుడు నారపీచు* అవుతాడు,అతని పని నిప్పురవ్వ అవుతుంది.అతనూ అతని పనీ మంటల్లో ​కాలిపోతాయి,ఆ మంటల్ని ఆర్పేవాళ్లు ఎవరూ ఉండరు.”

అధస్సూచీలు

“యెహోవా ఇచ్చే రక్షణ” అని అర్థం.
లేదా “దాని యజమాని.”
అక్ష., “వాటిని పిండలేదు.”
లేదా “పర్ణశాలలా; పాకలా.”
లేదా “పాలకులారా.”
లేదా “ఉపదేశాన్ని.”
లేదా “సబ్బాతు రోజుల్ని.”
లేదా “అనాథల.”
లేదా “గోధుమలతో తయారైన మద్యం.”
లేదా “అనాథలకు.”
లేదా “కరిగించేస్తాను.”
విగ్రహపూజకు సంబంధించిన వృక్షాలు, తోటలు అని తెలుస్తోంది.
మండే గుణం ఉన్న దారం లాంటి పోగు.