కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’

దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’

దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’

“వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?”—హెబ్రీ. 1:14.

1. మత్తయి 18:10, హెబ్రీయులు 1:14 నుండి మనం ఏ ఓదార్పును పొందవచ్చు?

తన అనుచరులను అభ్యంతరపర్చే వారిని హెచ్చరిస్తూ యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.” (మత్త. 18:10) నమ్మకమైన దేవదూతల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?” (హెబ్రీ. 1:14) మానవులకు సహాయం చేయడానికి దేవుడు తన దూతలను ఉపయోగిస్తాడనే అభయాన్ని, ఓదార్పును ఆ మాటలు ఇస్తున్నాయి. దేవదూతల గురించి బైబిలు ఏమి చెబుతోంది? వారు మనకెలా సహాయం చేస్తారు? వారి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

2, 3. పరలోకంలోని దేవదూతలు నిర్వర్తించే విధులు ఏమిటి?

2 పరలోకంలో కోట్లాదిమంది నమ్మకమైన దేవదూతలు ఉన్నారు. వారంతా ‘ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులు.’ (కీర్త. 103:20; ప్రకటన 5:11 చదవండి.) వీరికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. వీరికి దేవునికున్న లక్షణాలే కాక స్వేచ్ఛాచిత్తం కూడా ఉంది. వారు ఓ క్రమం చొప్పున అద్భుతమైన రీతిలో వ్యవస్థీకరించబడ్డారు. యెహోవా ఏర్పాటులో వారికి విశేష స్థానాలు ఉన్నాయి. వారిలో ప్రధానదూత మిఖాయేలు (అది పరలోకంలో యేసుకున్న పేరు). (దాని. 10:13; యూదా 9) ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడైన’ ఈ దూతే దేవుని ‘వాక్యము’ లేక దేవుని ప్రతినిధి. ఆయనను ఉపయోగించే యెహోవా మిగతా సృష్టిని చేశాడు.—కొలొ. 1:15-17; యోహా. 1:1-3.

3 ప్రధానదూత కింద సెరాపులు ఉన్నారు. వీరు యెహోవా పరిశుద్ధతను ప్రకటిస్తూ ఆయన ప్రమాణాల ప్రకారం జీవించేలా ఆయన సేవకులకు సహాయం చేస్తారు. దేవునిసర్వాధిపత్యాన్ని సమర్థించే కెరూబులు కూడా ఉన్నారు. (ఆది. 3:24; యెష. 6:1-3, 6, 7) అంతేకాక, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో భాగంగా వివిధ పనులు చేసే ఇతర దేవదూతలూ లేదా ప్రతినిధులూ ఉన్నారు.—హెబ్రీ. 12:22, 23.

4. భూమికి పునాదులు వేయబడినప్పుడు దేవదూతలు ఎలా స్పందించారు? మానవులు తమ స్వేచ్ఛాచిత్తాన్ని సరిగ్గా ఉపయోగించివుంటే వారి జీవితం ఎలా ఉండేది?

4 ‘భూమికి పునాదులు’ వేయబడినప్పుడు దేవదూతలంతా ఎంతో ఆనందించారు. విశ్వంలో ప్రత్యేకమైన ముత్యంలా కనిపించే భూమి మానవుల గృహంగా రూపొందించబడుతున్నప్పుడు వారు సంతోషంగా తమతమ విధులను నిర్వర్తించారు. (యోబు 38:4, 7) యెహోవా మానవుణ్ణి ‘దేవదూతలకంటె కొంచెం తక్కువవానిగా’ చేసినా తన లక్షణాలను కనబరిచేలా వారిని తన ‘స్వరూపంలో’ సృష్టించాడు. (హెబ్రీ. 2:7; ఆది. 1:26) దేవుడు తమకిచ్చిన స్వేచ్ఛాచిత్తమనే బహుమతిని ఆదాముహవ్వలు సరిగ్గా ఉపయోగించివుంటే వారు, వారి సంతానం యెహోవా విశ్వకుటుంబంలో భాగంగా ఉంటూ పరదైసు గృహంలో జీవితాన్ని ఆనందించి ఉండేవారు.

5, 6. పరలోకంలో ఏ తిరుగుబాటు జరిగింది? దానికి దేవుడు ఎలా స్పందించాడు?

5 దేవుని పరలోక కుటుంబంలో తిరుగుబాటు ప్రారంభమవడాన్ని చూసి పరిశుద్ధ దేవదూతలందరు ఖచ్చితంగా విభ్రాంతి చెందివుంటారు. వారిలో ఓ దూత యెహోవాను స్తుతించడంతో తృప్తిపడక తానే ఆరాధించబడాలని కోరుకున్నాడు. పరిపాలించడానికి యెహోవాకున్న హక్కును సవాలు చేయడం ద్వారా, అధికారదాహంతో ఆయన సర్వాధిపత్యానికి వ్యతిరేకంగా ఓ పరిపాలనను స్థాపించడానికి ప్రయత్నించడం ద్వారా ఆ దూత సాతానుగా (“విరోధిగా”) మారాడు. తమ ప్రేమగల సృష్టికర్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా తనతో చేయికలిపేందుకు కుయుక్తితో సాతాను మొదటి మానవ జతతో అబద్ధమాడాడు.—ఆది. 3:4, 5; యోహా. 8:44.

6 యెహోవా వెంటనే ఈ మొదటి ప్రవచనం చెప్పడం ద్వారా సాతానుకు తీర్పుతీర్చాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” (ఆది. 3:15) ఆ ప్రవచనంలో చెప్పబడినట్లే సాతానుకు, దేవుని ‘స్త్రీకి’ మధ్య వైరం కొనసాగుతుంది. అవును, నమ్మకమైన దూతలతోకూడిన పరలోక సంస్థను యెహోవా తన ప్రియమైన భార్యగా పరిగణించాడు. ఈ ప్రవచనంలోని వివరాలు క్రమంగా వెల్లడికావాల్సిన పరిశుద్ధ ‘మర్మంగా’ ఉన్నా ఇది భవిష్యత్తు విషయంలో ఓ ఖచ్చితమైన నిరీక్షణను ఇచ్చింది. తన పరలోక సంస్థకు చెందిన ఒక దేవదూత తిరుగుబాటుదారులందరిని నాశనం చేయాలనీ ‘పరలోకములో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని’ సమకూర్చాలనీ దేవుడు ఉద్దేశించాడు.—ఎఫె. 1:8-10.

7. నోవహు దినాల్లో కొంతమంది దేవదూతలు ఏమి చేశారు? అప్పుడు యెహోవా వారిని ఏమి చేశాడు?

7 నోవహు దినాల్లో, చాలామంది దేవదూతలు భూమ్మీద తమ స్వార్థ కోరికలు తీర్చుకునేందుకు తమ ‘నివాసస్థలమును విడిచిపెట్టి’ మానవ శరీరాలను దాల్చారు. (యూదా 6; ఆది. 6:1-4) యెహోవా వారిని కటిక చీకటిలోకి త్రోసేశాడు. వారలా సాతానుతో చేయికలిపి ‘దురాత్మల సమూహంగా,’ దేవుని సేవకులకు భయంకరమైన శత్రువులుగా మారారు.—ఎఫె. 6:11-13; 2 పేతు. 2:4.

దేవదూతలు మనకు ఎలా సహాయం చేస్తారు?

8, 9. యెహోవా మానవులకు సహాయం చేయడానికి దేవదూతలను ఎలా ఉపయోగించాడు?

8 దేవదూతలు అబ్రాహాము, యాకోబు, మోషే, యెహోషువ, యెషయా, దానియేలు, యేసు, పేతురు, యోహాను, పౌలులాంటి అనేకమంది దేవుని సేవకులకు సహాయం చేశారు. నమ్మకమైన దేవదూతలు దేవుని తీర్పులను అమలు చేశారు, మోషే ధర్మశాస్త్రంతోపాటు ఇతర ప్రవచనాలను, నిర్దేశాలను చేరవేశారు. (2 రాజు. 19:35; దాని. 10:5, 11, 14; అపొ. 7:53; ప్రక. 1:1) ప్రస్తుతం మన దగ్గర పూర్తి బైబిలు ఉంది కాబట్టి దైవిక సందేశాలను చేరవేయాల్సిన అవసరం ఇప్పుడు వారికి లేదు. (2 తిమో. 3:16, 17) అయితే దేవదూతలు తెరవెనుక ఉంటూ ఎంతో చురుగ్గా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. దేవుని సేవకులకు సహాయం చేస్తున్నారు.

9 బైబిలు ఇలా అభయమిస్తోంది: “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును.” (కీర్త. 34:7; 91:11) సాతాను మానవుల యథార్థతను ప్రశ్నించాడు కాబట్టి మనకు అన్నిరకాల పరీక్షలు పెట్టేందుకు యెహోవా అతణ్ణి అనుమతిస్తున్నాడు. (లూకా 21:16-19) అయితే, మన యథార్థతకు సంబంధించిన పరీక్షలను ఎంతవరకు అనుమతించాలో దేవునికి తెలుసు. (1 కొరింథీయులు 10:13 చదవండి.) దేవుని చిత్త ప్రకారంగా జోక్యం చేసుకునేందుకు దేవదూతలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు, పేతురులను విడిపించారు గానీ స్తెఫను, యాకోబులను చంపుతున్నప్పుడు ఆ సేవకుల శత్రువులను అడ్డుకోలేదు. (దాని. 3:17, 18, 28; 6:22; అపొ. 7:59, 60; 12:1-3, 7, 11) ఆ రెండు సందర్భాల్లో, వారు ఎదుర్కొన్న పరిస్థితులకూ వారు ఎదుర్కొన్న పరీక్షలకు మధ్య వ్యత్యాసం ఉంది. అలాగే, నాజీ సామూహిక నిర్బంధ శిబిరాల్లో కొంతమంది సహోదరులు చంపబడ్డారు. అయితే, వారిలో చాలామంది రక్షించబడేలా యెహోవా చూశాడు.

10. దేవదూతల సహాయమేకాక ఏ విధమైన సహాయాన్ని కూడా యెహోవా మనకు ఇవ్వవచ్చు?

10 భూమ్మీదున్న ప్రతీ వ్యక్తికి ఒక సంరక్షక దూత ఉంటాడని బైబిలు చెప్పడం లేదు. అయితే, ‘ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడనే’ నమ్మకంతో మనం ప్రార్థిస్తాం. (1 యోహా. 5:14) మనకు సహాయం చేయడానికి యెహోవా తన దూతను పంపించగలిగినా వేరే విధాలుగా కూడా సహాయం చేయవచ్చు. మనకు సహాయం చేయడానికి, మనల్ని ఓదార్చడానికి ఆయన తోటి విశ్వాసులను ప్రేరేపించవచ్చు. ‘సాతాను దూత’ మనల్ని నలుగగొడుతున్నట్లు అనిపించే ‘శరీరంలోని ముల్లును’ సహించడానికి కావాల్సిన జ్ఞానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దేవుడు మనకు ఇవ్వవచ్చు.—2 కొరిం. 12:7-10; 1 థెస్స. 5:14.

యేసును అనుకరించండి

11. యేసుకు సహాయం చేయడానికి యెహోవా దేవదూతలను ఎలా ఉపయోగించాడు? దేవునికి నమ్మకంగా ఉండడం ద్వారా యేసు ఏమి సాధించాడు?

11 యేసు విషయంలో యెహోవా తన దూతలను ఎలా ఉపయోగించాడో గమనించండి. వారు ఆయన జననం గురించి, పునరుత్థానం గురించి ప్రకటించడమేకాక ఆయన భూమ్మీదున్నప్పుడు వారు ఆయనకు సహాయం కూడా చేశారు. ఆయన బంధించబడకుండా, క్రూరమైన విధంగా మరణించకుండా వారు ఆపగలిగేవారే. అయినా, వారలా చేయలేదు. బదులుగా, ఓ దేవదూత ఆయనను బలపరచడానికి పంపించబడ్డాడు. (మత్త. 28:5, 6; లూకా 2:8-11; 22:43) యెహోవా ఉద్దేశానికి అనుగుణంగా, యేసు బలిగా మరణించాడు. అలా ఆయన ఓ పరిపూర్ణ మానవుడు ఎంత తీవ్రంగా పరీక్షించబడినా తన యథార్థతను కాపాడుకోగలడని నిరూపించాడు. అందుకే, యెహోవా యేసును పునరుత్థానం చేసి ఆయనకు పరలోకంలో అమర్త్యమైన జీవితాన్ని అనుగ్రహించాడు. అంతేకాక, ఆయనకు “సర్వాధికారము” ఇచ్చి దేవదూతలందరూ ఆయనకు లోబడేలా చేశాడు. (మత్త. 28:18; అపొ. 2:32; 1 పేతు. 3:22) అలా యేసు, దేవుని ‘స్త్రీ సంతానంలోని’ ప్రథమ భాగమయ్యాడు.—ఆది. 3:15; గల. 3:16.

12. యేసు ‘స్వస్థబుద్ధిని’ ఎలా చూపించాడు?

12 అవివేకంగా ప్రవర్తించి దేవదూతల సహాయం కోరితే అది యెహోవాను పరీక్షించినట్లే అవుతుందనీ అలా పరీక్షించడం తప్పనీ యేసుకు తెలుసు. (మత్తయి 4:5-7 చదవండి.) కాబట్టి, మనం కూడా దుస్సాహసాలకు పోకుండా హింసలను ధైర్యంగా ఎదుర్కొంటూ ‘స్వస్థబుద్ధితో’ జీవించడం ద్వారా యేసును అనుకరిద్దాం.—తీతు 2:12, 13.

నమ్మకమైన దేవదూతల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

13. రెండవ పేతురు 2:9-11లో ప్రస్తావించబడిన నమ్మకమైన దేవదూతల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

13 యెహోవా అభిషిక్త సేవకులను ‘దూషించేవారిని’ గద్దించే విషయంలో నమ్మకమైన దేవదూతలు ఉంచిన మంచి మాదిరిని అపొస్తలుడైన పేతురు తెలియజేశాడు. దేవదూతలు ఎంతో శక్తిగలవారైనా, వారు వినయంగా ‘దేవుని ఎదుట [“యెహోవాపట్ల గౌరవంతో,” NW]’ ఎవ్వరికీ తీర్పు తీర్చరు. (2 పేతురు 2:9-11 చదవండి.) దేవదూతల్లాగే మనం కూడా అనవసరంగా ఇతరులకు తీర్పుతీర్చకుండా ఉందాం. సంఘంలో నాయకత్వం వహించే వారిని గౌరవిద్దాం. తీర్పుతీర్చడాన్ని అత్యంత న్యాయవంతుడైన యెహోవాకే వదిలేద్దాం.—రోమా. 12:18, 19; హెబ్రీ. 13:17.

14. వినయంతో సేవ చేసే విషయంలో దేవదూతల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

14 వినయంతో సేవ చేసే విషయంలో యెహోవా దూతలు మనకు ఓ మంచి మాదిరినుంచారు. కొంతమంది దేవదూతలు మానవులకు తమ పేర్లను చెప్పడానికి నిరాకరించారు. (ఆది. 32:29; న్యాయా. 13:17, 18) పరలోకంలో కోటానుకోట్ల దేవదూతలున్నా, మిఖాయేలు, గబ్రియేలు అనే ఇద్దరు దేవదూతల పేర్లు మాత్రమే బైబిలు తెలియజేస్తోంది. దీన్నిబట్టి, మనం దేవదూతలకు అనుచిత గౌరవం ఇవ్వకూడదని తెలుస్తోంది. (లూకా 1:26; ప్రక. 12:7) అపొస్తలుడైన యోహాను దేవదూతకు సాగిలపడినప్పుడు ఆ దూత ఇలా అన్నాడు: “వద్దుసుమీ. నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను.” (ప్రక. 22:8, 9) మన ప్రార్థనలతోసహా మన ఆరాధనంతా దేవునికే చెందాలి.—మత్తయి 4:8-10 చదవండి.

15. ఓపికను చూపించే విషయంలో దేవదూతలు మనకు ఎలాంటి మాదిరిని ఉంచారు?

15 ఓపికగా ఉండే విషయంలో కూడా దేవదూతలు మంచి మాదిరిగా ఉన్నారు. వారికి దేవుని పరిశుద్ధ మర్మాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎంతో ఉన్నా అవన్నీ వారికి తెలియజేయబడలేదు. “దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు” అని బైబిలు చెబుతోంది. (1 పేతు. 1:12) ఆ కుతూహలమున్నా వారేమి చేస్తున్నారు? దేవుడు తన నియమిత సమయంలో తన “సంఘముద్వారా” తెలియజేసే “నానావిధమైన జ్ఞానము” కోసం వారు ఓపికగా ఎదురుచూస్తున్నారు.—ఎఫె. 3:8-11.

16. మన ప్రవర్తన దేవదూతలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?

16 శ్రమలను అనుభవిస్తున్న క్రైస్తవులను ‘దేవదూతలు నాటకరంగ ప్రేక్షకుల్లా’ గమనిస్తున్నారు. (1 కొరిం. 4:9, NW) మన విశ్వాస క్రియలను వారు ఎంతో ఆనందంతో గమనించడమేకాక పాపి పశ్చాత్తాపపడడాన్ని చూసి కూడా సంతోషిస్తున్నారు. (లూకా 15:10) క్రైస్తవ స్త్రీల దైవిక ప్రవర్తనను దేవదూతలు గమనిస్తున్నారు. “దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను” అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 11:3, 10) అవును, క్రైస్తవ స్త్రీలతోసహా భూమ్మీదున్న దేవుని సేవకులంతా దైవపరిపాలనుకూ శిరస్సత్వానికీ లోబడడాన్ని చూసి దేవదూతలు సంతోషిస్తున్నారు. తాము కూడా అలాంటి విధేయతను చూపించాలని అది వారికి గుర్తుచేస్తోంది.

దేవదూతలు ప్రకటనా పనిలో సహాయం చేస్తున్నారు

17, 18. దేవదూతలు ప్రకటనాపనిలో మనకు సహాయం చేస్తున్నారని ఎలా చెప్పవచ్చు?

17 ‘ప్రభువు దినంలో’ జరిగే కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనల్లో దేవదూతల పాత్ర ఉంది. 1914లో రాజ్యం స్థాపించడంలో దేవదూతలు భాగం వహించారు. అంతేకాక ‘మిఖాయేలు అతని దూతలు’ సాతానును, అతని దయ్యాలను భూమ్మీదకు పడద్రోశారు. (ప్రక. 1:10; 11:15; 12:5-9) అపొస్తలుడైన యోహాను ‘భూనివాసులకు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుతున్న ఒక దేవదూతను’ చూశాడు. ఆ దూత “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి” అని ప్రకటించాడు. (ప్రక. 14:6, 7) సాతాను నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురౌతున్నా యెహోవా సేవకులు స్థాపించబడిన రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సేవకులకు దేవదూతల సహాయం ఉంటుందనే అభయం ఇవ్వబడింది.—ప్రక. 12:13, 17.

18 దేవదూత ఫిలిప్పును ఐతియోపీయుడైన నపుంసకుని దగ్గరకు నడిపించేందుకు ఆయనతో మాట్లాడినట్లుగా నేడు యథార్థవంతుల దగ్గరకు నడిపించేందుకు దేవదూతలు మనతో మాట్లాడరు. (అపొ. 8:26-29) అయితే దేవదూతలు తెరవెనుక ఉండి రాజ్యప్రకటనా పనిలో మనకు సహాయం చేస్తూ ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగలవారిని’ కనుగొనేందుకు మనల్ని నిర్దేశిస్తున్నారని మనకాలంలోని ఉదాహరణలు చూపిస్తున్నాయి. * (అపొ. 13:48, NW) ‘ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలని’ కోరుకునేవారిని కనుగొనేందుకు పరిచర్యలో క్రమంగా పాల్గొంటూ మనవంతు కృషి మనం చేయడం ఎంత ప్రాముఖ్యం!—యోహా. 4:23, 24.

19, 20. ‘యుగసమాప్తిని’ సూచించే సంఘటనల్లో దేవదూతలకు ఎలాంటి పాత్ర ఉంది?

19 మన కాలం గురించి చెబుతూ యేసు, ‘యుగసమాప్తియందు’ దేవదూతలు ‘నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరుస్తారు’ అని చెప్పాడు. (మత్త. 13:37-43, 49) అభిషిక్తుల్లోని చివరి సభ్యులను సమకూర్చే పనిలో, ముద్రించే పనిలో వారు పాల్గొంటారు. (మత్తయి 24:31 చదవండి; ప్రక. 7:1-3) అంతేకాక, వారు ‘మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచే’ పనిలో యేసుతోపాటు పాల్గొంటారు.—మత్త. 25:31-33, 46.

20 ‘ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరచు దూతలతోకూడ పరలోకమునుండి ప్రత్యక్షమైనప్పుడు దేవుని నెరుగని వారందరినీ మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారందరినీ’ నాశనం చేస్తాడు. (2 థెస్స. 1:6-10) యోహాను ఆ సంఘటనకు సంబంధించిన దర్శనంలో, యేసూ పరలోకంలోని దూతల సైన్యాలూ తెల్లని గుర్రాలమీద స్వారీ చేస్తూ నీతినిబట్టి యుద్ధం చేయడాన్ని చూశాడు.—ప్రక. 19:11-14.

21. “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల” దేవదూత సాతానును, అతని దయ్యాలను ఏమి చేస్తాడు?

21 “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట” కూడ యోహాను చూశాడు. ఆ దేవదూత ఎవరో కాదు, ప్రధానదూతయైన మిఖాయేలే. ఆయన అపవాదిని బంధించి అతణ్ణి, అతని దయ్యాలను అగాధంలోకి పడేస్తాడు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతంలో వారు కొంతకాలం విడిచిపెట్టబడతారు. అప్పుడు పరిపూర్ణ మానవులు అంతిమ పరీక్షను ఎదుర్కొంటారు. ఆ తర్వాత సాతాను, అతనితోపాటు ఇతర తిరుగుబాటుదారులందరూ నాశనం చేయబడతారు. (ప్రక. 20:1-3, 7-10; 1 యోహా. 3:8) అప్పుడు దేవునిమీద తిరుగుబాటు చేసినవారెవ్వరూ మిగిలివుండరు.

22. అతి త్వరలో జరగబోయే సంఘటనలో దేవదూతల పాత్ర ఏమిటి? వారి పాత్ర గురించి మనం ఎలా భావించాలి?

22 సాతాను దుష్టవిధానం నుండి గొప్ప విడుదల అతి త్వరలో జరగనుంది. యెహోవా సర్వాధిపత్యం సరైందని నిరూపించే, భూమిపట్లా మానవులపట్లా ఆయనకున్న ఉద్దేశం పూర్తిగా నెరవేర్చే ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు దేవదూతలు కీలకమైన పాత్ర నిర్వర్తిస్తారు. నిజంగానే నీతిమంతులైన దేవదూతలు, “రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు.” మనం ఆయన చిత్తం చేసి నిత్యజీవం పొందేలా మనకు సహాయం చేయడానికి యెహోవా దేవుడు తన దూతలను ఉపయోగిస్తున్న విధానాన్నిబట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 18 యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) 549-551 పేజీలు చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• దేవదూతలు ఎలా వ్యవస్థీకరించబడ్డారు?

• కొంతమంది దేవదూతలు నోవహు కాలంలో ఏమి చేశారు?

• మనకు సహాయం చేసేందుకు దేవుడు తన దూతలను ఎలా ఉపయోగించాడు?

• మన కాలంలో నీతిమంతులైన దేవదూతలు ఏ పాత్ర పోషిస్తున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

దేవదూతలు దేవుని చిత్తాన్ని సంతోషంగా చేస్తారు

[23వ పేజీలోని చిత్రం]

దానియేలు విషయంలో జరిగినట్లే దేవదూతలు దేవుని చిత్తానికి అనుగుణంగా జోక్యం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు

[24వ పేజీలోని క్యాప్షన్‌]

రాజ్య ప్రకటనా పనిలో దేవదూతలు సహాయం చేస్తున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి

[క్రెడిట్‌ లైను]

భూగోళం: NASA photo