యోబు 38:1-41

  • మనిషి ఎంత తక్కువవాడో యెహోవా ​నేర్పించాడు (1-41)

    • ‘భూమి సృష్టించబడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు?’ (4-6)

    • దేవుని కుమారులు సంతోషంగా పాటలు పాడారు (7)

    • ప్రకృతిలో ఉన్నవాటి గురించి ప్రశ్నలు (8-32)

    • “ఆకాశ నియమాలు” (33)

38  అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబిచ్చాడు:+  2  “నా ఆలోచనను చీకట్లోకి నెట్టేస్తూ,జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఇతను ఎవరు?  3  ఓ మనిషీ, దయచేసి నీ నడుం కట్టుకో;నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబివ్వు.  4  నేను భూమికి పునాది వేసినప్పుడు+ నువ్వు ఎక్కడున్నావు? నీకు అవగాహన ఉందనిపిస్తే చెప్పు.  5  దానికి కొలతలు నిర్ణయించింది ఎవరు?కొలనూలుతో దాన్ని కొలిచింది ఎవరు? నీకు తెలిస్తే చెప్పు.  6  దాని పునాదులు దేనిలో వేయబడ్డాయి?దాని మూలరాయి వేసింది ఎవరు?+  7  ఉదయ నక్షత్రాలు+ కలిసి ఆనందంతో కేకలు వేసినప్పుడు,దేవుని కుమారులందరూ*+ సంతోషంతో స్తుతిగీతాలు పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు?  8  సముద్రం దాని గర్భం నుండి పెల్లుబికినప్పుడు,తలుపులతో దాన్ని మూసింది ఎవరు?+  9  నేను మేఘాల్ని దానికి వస్త్రంగా వేసినప్పుడు,కటిక చీకటిని పొత్తిగుడ్డలా చుట్టినప్పుడు, 10  నేను దానికి హద్దును నియమించిఅడ్డగడియల్ని, తలుపుల్ని పెట్టి,+ 11  ‘నువ్వు ఇక్కడి వరకు రావచ్చు, దీన్ని దాటి రాకూడదు;గర్వంతో ఉప్పొంగే నీ అలలు ఇక్కడే ఆగిపోవాలి’ అని నేను అన్నప్పుడు+ నువ్వు ఎక్కడున్నావు? 12  నువ్వు ఎప్పుడైనా ఉదయాన్ని ఆజ్ఞాపించావా?ఎక్కడ మొదలవ్వాలో వేకువకు చెప్పావా?+ 13  భూమి అంచుల వరకు వెళ్లిదుష్టుల్ని తరిమేయమని దానికి చెప్పింది నువ్వేనా?+ 14  వెలుగు పడినప్పుడు భూమి, ముద్ర కింద ఉన్న బంకమట్టిలా మారుతుంది,దానిమీద ఉన్నవన్నీ వస్త్రం మీది అలంకారంలా స్పష్టంగా కనిపిస్తాయి. 15  అయితే దుష్టుల వెలుగు తీసేయబడుతుంది,వాళ్లు ఇక ప్రజల్ని బాధపెట్టలేరు. 16  నువ్వు సముద్రం ఊటల దగ్గరికి వెళ్లావా?లోతైన మహా సముద్రాల్ని పరిశోధించావా?+ 17  మరణ ద్వారాలు+ నీకు వెల్లడి చేయబడ్డాయా?కటిక చీకటి* ద్వారాల్ని+ నువ్వు చూశావా? 18  భూమి వైశాల్యం ఎంతో నువ్వు అర్థం చేసుకున్నావా?+ ఇవన్నీ నీకు తెలిస్తే చెప్పు. 19  వెలుగు ఏ దిక్కున నివసిస్తుందో,+ చీకటి నివాసం ఎక్కడ ఉందో నీకు తెలుసా? 20  నువ్వు వాటి స్థలానికి వాటిని తీసుకెళ్లగలవా?వాటి ఇళ్ల దారులు నీకు తెలుసా? 21  నువ్వు అప్పటికే పుట్టివుండడం వల్ల,చాలా సంవత్సరాలు జీవించినందువల్ల నీకది తెలుసా? 22  మంచు గోదాముల్లోకి నువ్వు అడుగుపెట్టావా?+వడగండ్ల గోదాముల్ని నువ్వు చూశావా?+ 23  నేను వాటిని విపత్తు సమయం కోసం,యుద్ధం, పోరాటం జరిగే రోజు కోసం నిల్వ ఉంచాను.+ 24  వెలుగు* ఏ దిక్కు నుండి వెదజల్లబడుతుందో,భూమ్మీద వీచే తూర్పు గాలి ఎక్కడ మొదలౌతుందో నీకు తెలుసా?+ 25  వరద కోసం కాలువ తవ్వింది ఎవరు?ఉరిమే మేఘాల కోసం దారి ఏర్పాటు చేసి+ 26  ఏ మనిషీ నివసించని చోట,మనుషులెవరూ లేని ఎడారిలో అవి వర్షించేలా చేస్తున్నది ఎవరు?+ 27  పాడుబడిన బీడు భూముల్ని తృప్తిపరుస్తూగడ్డి మొలిచేలా చేస్తున్నది ఎవరు?+ 28  వర్షానికి తండ్రి ఉన్నాడా?+మంచు బిందువుల్ని కన్నది ఎవరు?+ 29  మంచుకు తల్లి ఎవరు?ఆకాశం నుండి కురిసే మంచు కణాల్ని కన్నది ఎవరు?+ 30  అగాధ జలాల ఉపరితలాన్ని గడ్డకట్టేలా చేసినీటి ఉపరితలాన్ని రాయిలా గట్టిగా చేస్తున్నది ఎవరు?+ 31  కిమా నక్షత్రరాశి* తాళ్లను నువ్వు ముడివేయగలవా?కెసిల్‌ నక్షత్రరాశి* ముడులు విప్పగలవా?+ 32  ఒక నక్షత్రరాశిని* దాని కాలంలో బయటికి తీసుకురాగలవా?యాష్‌ నక్షత్రరాశిని* నడిపించగలవా? 33  ఆకాశ నియమాలు నీకు తెలుసా?+అవి* భూమ్మీద అమలయ్యేలా నువ్వు చేయగలవా? 34  నీటి ప్రవాహం నిన్ను ముంచెత్తేలాగొంతెత్తి మేఘాల్ని ఆజ్ఞాపించగలవా?+ 35  నువ్వు మెరుపుల్ని రప్పించగలవా? అవి వచ్చి ‘ఇదిగో, మేము ఉన్నాం!’ అని నీతో అంటాయా? 36  మేఘాల్లో* తెలివిని పెట్టింది ఎవరు?+ఆకాశానికి* అవగాహనను ఇచ్చింది ఎవరు?+ 37  మేఘాల్ని లెక్కపెట్టేంత తెలివి ఎవరికి ఉంది?ఆకాశపు నీళ్ల కుండల్ని ఎవరు కుమ్మరించగలరు?+ 38  మట్టిని బురదలా పారేట్టు చేసేది ఎవరు?మట్టిపెళ్లలు ఒకదానికొకటి అతుక్కునేట్టు చేసేది ఎవరు? 39  నువ్వు సింహం కోసం ఆహారం వేటాడగలవా?కొదమ సింహాల ఆకలి తీర్చగలవా?+ 40  అవి తమ విశ్రాంతి స్థలాల్లో నక్కి ఉన్నప్పుడు,తమ గుహల్లో పొంచి ఉన్నప్పుడు వాటిని పోషించగలవా? 41  కాకి పిల్లలు ఆహారం దొరకక తిరుగుతూదేవునికి మొరపెట్టినప్పుడుకాకి కోసం ఆహారం సిద్ధం చేసేది ఎవరు?+

అధస్సూచీలు

లేదా “దేవదూతలందరూ.”
లేదా “మరణఛాయ.”
లేదా “మెరుపు” అయ్యుంటుంది.
వృషభ నక్షత్రరాశిలోని సప్తఋషి నక్షత్రాలు కావచ్చు.
మృగశీర్ష నక్షత్రరాశి కావచ్చు.
అక్ష., “మజ్జారోత్‌.”
పెద్ద ఎలుగుబంటి (అర్స మేజర్‌) నక్షత్రరాశి కావచ్చు.
లేదా “ఆయన అధికారం” అయ్యుంటుంది.
లేదా “మనిషిలో” అయ్యుంటుంది.
లేదా “మనసుకు” అయ్యుంటుంది.