మత్తయి సువార్త 18:1-35

  • పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు (1-6)

  • పాపం చేయడానికి కారణమయ్యేవి (7-11)

  • తప్పిపోయిన గొర్రె ఉదాహరణ (12-14)

  • ఒక సహోదరుణ్ణి ఎలా సంపాదించుకోవాలి (15-20)

  • క్షమించని దాసుడి ఉదాహరణ (21-35)

18  ఆ సమయంలో శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు?” అని అడిగారు.+  అప్పుడు ఆయన ఒక చిన్న బాబును తన దగ్గరికి పిలిచి, వాళ్ల మధ్యలో నిలబెట్టి,  ఇలా అన్నాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను, మీరు పరలోక రాజ్యంలోకి వెళ్లాలంటే మీ మనస్తత్వాన్ని పూర్తిగా మార్చుకొని చిన్నపిల్లల్లా మారాలి.+  కాబట్టి ఈ చిన్న బాబులా తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు.+  నా పేరున ఈ చిన్నపిల్లల్లో ఒకర్ని చేర్చుకునే వ్యక్తి నన్ను కూడా చేర్చుకుంటున్నాడు.  కానీ ఎవరైతే నామీద విశ్వాసంగల ఈ చిన్నవాళ్లలో ఒకరు విశ్వాసం కోల్పోవడానికి* కారణమౌతారో, అతను మెడకు పెద్ద తిరుగలి రాయి* కట్టబడి, సముద్రం మధ్యలో పడేయబడడమే అతనికి మంచిది.+  “ప్రజలు పాపం చేయడానికి ఈ లోకం కారణమౌతుంది కాబట్టి దానికి శ్రమ! నిజమే, ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవి తప్పకుండా వస్తాయి, అయితే అవి ఎవరి ద్వారా వస్తాయో ఆ మనిషికి శ్రమ!  కాబట్టి నీ చెయ్యి గానీ కాలు గానీ నీతో పాపం చేయిస్తుంటే,* దాన్ని నరికేసి దూరంగా పడేయి.+ రెండు చేతులతో, రెండు కాళ్లతో నిత్యాగ్నిలో* పడేయబడడం కన్నా ఒక చెయ్యి, ఒక కాలుతో జీవాన్ని పొందడం నీకు మంచిది.+  అంతేకాదు, నీ కన్ను నీతో పాపం చేయిస్తుంటే,* దాన్ని పీకేసి దూరంగా పడేయి. రెండు కళ్లతో మండే గెహెన్నాలో* పడేయబడడం కన్నా ఒక కన్నుతో జీవాన్ని పొందడం నీకు మంచిది.+ 10  ఈ చిన్నవాళ్లలో ఏ ఒక్కర్నీ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, పరలోకంలోవున్న వీళ్ల దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తుంటారు.+ 11  *—— 12  “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే,+ అతను మిగతా 99 గొర్రెల్ని కొండల మీదే విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్లడా?+ 13  అది దొరికినప్పుడు, తప్పిపోని మిగతా 99 గొర్రెల విషయంలో కన్నా ఆ గొర్రె విషయంలో ఎక్కువ సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 14  అదేవిధంగా, ఈ చిన్నవాళ్లలో ఒక్కరు కూడా నాశనమవ్వడం పరలోకంలో ఉన్న నా* తండ్రికి ఇష్టంలేదు.+ 15  “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి.*+ అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే.+ 16  కానీ అతను నీ మాట వినకపోతే, నీతోపాటు ఒకరిద్దర్ని తీసుకెళ్లు. అలా ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ప్రతీ విషయం నిర్ధారించబడుతుంది.+ 17  అతను వాళ్ల మాట వినకపోతే, సంఘానికి ఆ విషయం తెలియజేయి. అతను సంఘం మాట కూడా వినకపోతే, అతన్ని నీకు అన్యజనుల్లో ఒకడిగా,+ పన్ను వసూలుచేసేవాడిగా ఉండనీ.+ 18  “నేను మీతో నిజంగా చెప్తున్నాను, మీరు భూమ్మీద వేటినైనా బంధిస్తే అవి అప్పటికే పరలోకంలో బంధించబడి ఉంటాయి; మీరు భూమ్మీద వేటినైనా విప్పితే అవి అప్పటికే పరలోకంలో విప్పబడి ఉంటాయి. 19  నేను మళ్లీ నిజంగా మీతో చెప్తున్నాను. భూమ్మీద, మీలో ఇద్దరు కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి ప్రార్థించాలని అనుకుంటే, పరలోకంలో ఉన్న నా తండ్రి దాన్ని మీకు* దయచేస్తాడు.+ 20  ఎందుకంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరున కలుసుకుంటారో+ అక్కడ నేను వాళ్ల మధ్య ఉంటాను.” 21  అప్పుడు పేతురు యేసు దగ్గరికి వచ్చి, “ప్రభువా, నా సహోదరుడు నా విషయంలో పాపం చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు. 22  అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను నీతో చెప్తున్నాను ఏడుసార్లు కాదు, 77 సార్లు.+ 23  “అందుకే పరలోక రాజ్యాన్ని, తన దాసుల్ని లెక్క చెప్పమని అడిగిన ఒక రాజుతో పోల్చవచ్చు. 24  అతను లెక్క చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు, అతనికి 10,000 తలాంతులు* అప్పు ఉన్న ఒక దాసుణ్ణి అతని దగ్గరికి తీసుకొచ్చారు. 25  ఆ అప్పు తీర్చే స్తోమత ఆ దాసుడికి లేకపోవడంతో అతన్ని, అతని భార్యాపిల్లల్ని, అతనికి ఉన్నవన్నీ అమ్మి అప్పు తీర్చమని రాజు ఆజ్ఞాపించాడు.+ 26  అప్పుడు ఆ దాసుడు రాజు ఎదుట మోకాళ్లూని, ‘నాకు కాస్త సమయం ఇవ్వు, అప్పంతా తీర్చేస్తాను’ అన్నాడు. 27  దాంతో రాజు జాలిపడి ఆ దాసుణ్ణి వదిలేశాడు, అతని అప్పును రద్దు చేశాడు.+ 28  అయితే ఆ దాసుడు బయటికి వెళ్లి తనకు 100 దేనారాలు* అప్పు ఉన్న తోటి దాసుణ్ణి చూసి, గట్టిగా గొంతు పట్టుకొని, ‘నా అప్పు తీర్చేయి’ అన్నాడు. 29  అప్పుడు ఆ తోటి దాసుడు అతని ముందు మోకాళ్లూని, ‘నాకు కాస్త సమయం ఇవ్వు, నీ అప్పు తీర్చేస్తాను’ అని బ్రతిమాలడం మొదలుపెట్టాడు. 30  కానీ అతను ఒప్పుకోకుండా, తన అప్పు తీర్చేంతవరకు ఆ దాసుణ్ణి చెరసాలలో వేయించాడు. 31  జరిగింది చూసినప్పుడు అతని తోటి దాసులు చాలా బాధపడి, రాజు దగ్గరికి వెళ్లి దాని గురించి చెప్పారు. 32  అప్పుడు రాజు అతన్ని పిలిపించి ఇలా అన్నాడు: ‘చెడ్డ దాసుడా, నువ్వు నన్ను బ్రతిమాలినప్పుడు నేను నీ అప్పంతా రద్దు చేశాను. 33  నేను నీమీద కరుణ చూపించినట్టే, నువ్వు కూడా నీ తోటి దాసుడి మీద కరుణ చూపించాలి కదా?’+ 34  రాజుకు విపరీతమైన కోపం వచ్చి, అప్పంతా తీర్చేవరకు అతన్ని చెరసాలలో ఉంచమని చెరసాల భటులకు అప్పగించాడు. 35  మీలో ప్రతీ ఒక్కరు మీ సహోదరుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీ విషయంలో అలాగే చేస్తాడు.”+

అధస్సూచీలు

అక్ష., “తడబడడానికి.”
లేదా “గాడిదకు కట్టి తిప్పే తిరుగలి రాయి.”
ఇది శాశ్వత నాశనాన్ని సూచిస్తోంది. పదకోశంలో “గెహెన్నా” చూడండి.
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
పదకోశం చూడండి.
అనుబంధం A3 చూడండి.
లేదా “మీ” అయ్యుంటుంది.
అక్ష., “అతన్ని గద్దించు.”
అక్ష., “నోట.”
అక్ష., “వాళ్లకు.”
అప్పట్లో 10,000 తలాంతులు, 6 కోట్ల దేనారాలతో సమానం. అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.