ఆదికాండం 3:1-24

  • పాపం పుట్టుక (1-13)

    • మొదటి అబద్ధం (4, 5)

  • తిరుగుబాటుదారుల మీద యెహోవా తీర్పు (14-24)

    • స్త్రీ సంతానం గురించి ప్రవచించడం (15)

    • ఏదెను తోట నుండి వెళ్లగొట్టడం (23, 24)

3  యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిట్లో సర్పం+ అత్యంత యుక్తిగలది.* కాబట్టి అది స్త్రీని, “ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?”+ అని అడిగింది.  దానికి స్త్రీ ఆ సర్పంతో ఇలా అంది: “మేము ఈ తోటలోని చెట్ల పండ్లను తినొచ్చు.+  కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు+ పండ్ల గురించి దేవుడు, ‘మీరు దాని పండ్లను తినకూడదు, అసలు దాన్ని ముట్టకూడదు; లేకపోతే మీరు చనిపోతారు’ అని చెప్పాడు.”  అందుకు సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావనే చావరు.+  మీరు దాని పండ్లను తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయని, మీకు మంచిచెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారని+ దేవునికి తెలుసు.”  స్త్రీ ఆ చెట్టు పండ్లను చూసినప్పుడు అవి ఆహారానికి మంచిగా, కంటికి ఇంపుగా ఉన్నాయి; అవును, ఆ చెట్టు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి, ఆమె దాని పండును తీసుకొని తినడం మొదలుపెట్టింది.+ ఆ తర్వాత ఆమె, తన భర్త తనతో ఉన్నప్పుడు అతనికి కూడా ఇచ్చింది, అతను కూడా దాన్ని తినడం మొదలుపెట్టాడు.+  అప్పుడు వాళ్లిద్దరి కళ్లు తెరుచుకున్నాయి, తాము నగ్నంగా ఉన్నామని వాళ్లకు అర్థమైంది. కాబట్టి వాళ్లు అంజూర చెట్టు ఆకుల్ని కుట్టుకొని తమ నడుము చుట్టూ కట్టుకున్నారు.+  తర్వాత, చల్లగాలి వీచే సమయంలో* దేవుడు ఆ తోటలో నడుస్తున్నప్పుడు పురుషుడు, అతని భార్య యెహోవా దేవుని స్వరం విని, యెహోవా దేవునికి* కనిపించకుండా ఉండాలని తోట చెట్ల మధ్య దాక్కున్నారు.  యెహోవా దేవుడు అతన్ని పదేపదే పిలుస్తూ, “నువ్వు ఎక్కడ ఉన్నావు?” అని అంటూ ఉన్నాడు. 10  చివరికి అతను, “నేను తోటలో నీ స్వరం విన్నాను, కానీ నేను నగ్నంగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను” అన్నాడు. 11  అప్పుడు దేవుడు, “నువ్వు నగ్నంగా ఉన్నావని+ నీకు ఎవరు చెప్పారు? నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన చెట్టు పండ్లను+ నువ్వు తిన్నావా?” అని అడిగాడు. 12  అందుకు పురుషుడు ఇలా అన్నాడు: “నాతోపాటు ఉండడానికి నువ్వు ఇచ్చిన స్త్రీయే ఆ చెట్టు పండును నాకు ఇచ్చింది, కాబట్టి నేను తిన్నాను.” 13  అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నువ్వు చేసిన పనేంటి?” అని అడిగాడు. దానికి స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది, అందుకే నేను తిన్నాను”+ అని చెప్పింది. 14  తర్వాత యెహోవా దేవుడు సర్పంతో+ ఇలా అన్నాడు: “నువ్వు ఈ పని చేశావు కాబట్టి, సాధు జంతువులన్నిట్లో, అడవి జంతువులన్నిట్లో నువ్వు శపించబడినదానివి. నువ్వు నీ పొట్టతో పాకుతావు, బ్రతికినన్ని రోజులు మట్టి తింటావు. 15  అంతేకాదు నేను నీకూ+ స్త్రీకీ,+ నీ సంతానానికీ*+ ఆమె సంతానానికీ*+ మధ్య శత్రుత్వం+ పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు,+ నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”+ 16  దేవుడు స్త్రీతో ఇలా అన్నాడు: “నీ గర్భవేదనను నేను విపరీతంగా పెంచుతాను; నువ్వు వేదనతోనే పిల్లల్ని కంటావు, నువ్వు నీ భర్త కోసం తపిస్తావు, అతను నీ మీద అధికారం చెలాయిస్తాడు.” 17  దేవుడు ఆదాముతో* ఇలా అన్నాడు: “నువ్వు ఆ చెట్టు పండ్లను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినా,+ నువ్వు నీ భార్య మాట విని తిన్నావు కాబట్టి నీ వల్ల నేల శపించబడింది.+ నువ్వు బ్రతికినన్ని రోజులు ఎంతో కష్టపడి దాని పంట తింటావు.+ 18  నేల నీకు ముళ్ల తుప్పల్ని, గచ్చపొదల్ని మొలిపిస్తుంది; నువ్వు పొలంలో పండిన పంటను తినాలి. 19  నువ్వు ఏ నేల నుండైతే తీయబడ్డావో+ ఆ నేలకు తిరిగి చేరేవరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. నువ్వు మట్టే కాబట్టి తిరిగి మట్టికి చేరుతావు.”+ 20  ఆ తర్వాత ఆదాము తన భార్యకు హవ్వ* అని పేరు పెట్టాడు. ఎందుకంటే, జీవించే ప్రతీ ఒక్కరికి ఆమె తల్లి అవుతుంది.+ 21  ఆదాము, అతని భార్య వేసుకోవడానికి యెహోవా దేవుడు వాళ్ల కోసం జంతు చర్మాలతో పొడవాటి వస్త్రాలు చేశాడు.+ 22  తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “మంచిచెడులు తెలుసుకునే విషయంలో మనిషి మనలా* అయ్యాడు.+ ఇప్పుడు అతను తన చెయ్యి చాపి జీవవృక్షం+ పండును కూడా తీసుకొని, తిని, నిరంతరం జీవించకుండా ఉండేలా ఏదోకటి చేయాలి.” 23  దాంతో యెహోవా దేవుడు, మనిషి ఏ నేల నుండైతే తీయబడ్డాడో+ ఆ నేలను సేద్యం చేయడానికి అతన్ని ఏదెను తోట+ నుండి వెళ్లగొట్టాడు. 24  ఆయన ఆ మనిషిని బయటికి గెంటేసి, ఏదెను తోటకు తూర్పున కెరూబుల్ని+ నిలబెట్టాడు; అలాగే జీవవృక్షం దగ్గరికి వెళ్లే దారికి కాపలాగా, మండుతూ గుండ్రంగా తిరిగే ఖడ్గాన్ని పెట్టాడు.

అధస్సూచీలు

లేదా “తెలివిగలది; జిత్తులమారి.”
అంటే, సాయంత్రం కావస్తుండగా.
అక్ష., “దేవుని ముఖానికి.”
అక్ష., “విత్తనానికీ.”
అక్ష., “విత్తనానికీ.”
“మట్టిమనిషి; మానవజాతి” అని అర్థం.
“జీవిస్తున్న వ్యక్తి” అని అర్థం.
అక్ష., “మనలో ఒకడిలా.”