యూదా రాసిన ఉత్తరం 1:1-25
1 యేసుక్రీస్తు దాసుడూ యాకోబు సహోదరుడూ అయిన యూదా+ పిలవబడినవాళ్లకు,+ అంటే మన తండ్రైన దేవుడు ప్రేమిస్తున్న, యేసుక్రీస్తు కోసం కాపాడబడుతున్న వాళ్లకు+ రాస్తున్న ఉత్తరం.
2 దేవుడు మీకు ఇంకా ఎక్కువ కరుణను, శాంతిని, ప్రేమను దయచేయాలి.
3 ప్రియ సహోదరులారా, మనందరం ఎదురుచూస్తున్న రక్షణ+ గురించి మీకు ఉత్తరం రాయాలని ఇంతకుముందు చాలా ప్రయత్నించాను. కానీ ఇప్పుడు, పవిత్రులకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కోసం గట్టిగా పోరాడమని+ మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఉత్తరం రాయడం అవసరమని నాకు అనిపిస్తుంది.
4 ఎందుకంటే, కొందరు రహస్యంగా మీలో చొరబడ్డారు. వాళ్లకు ఎంతోకాలం క్రితమే లేఖనాలు ఈ తీర్పు విధించాయి; వాళ్లు భక్తిహీనులు, వాళ్లు దేవుని అపారదయను అలుసుగా తీసుకుని లెక్కలేనట్టు* ప్రవర్తిస్తున్నారు;+ తమ ప్రవర్తనతో మన ఒకేఒక్క యజమానీ ప్రభువూ అయిన యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు.+
5 ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు, అయినాసరే వాటిని మళ్లీ మీకు గుర్తుచేయాలని అనుకుంటున్నాను. యెహోవా* ఐగుప్తు* దేశం నుండి ఒక జనాన్ని కాపాడి తీసుకొచ్చాడు,+ అయితే వాళ్లలో విశ్వాసం చూపించనివాళ్లను తర్వాత నాశనం చేశాడు.+
6 అలాగే, తమ అసలు స్థానాన్ని కాపాడుకోకుండా, తాము ఉండాల్సిన చోటును వదిలేసిన దేవదూతల్ని+ ఆయన మహారోజున జరిగే తీర్పు కోసం కటిక చీకట్లో శాశ్వత సంకెళ్లతో బంధించివుంచాడు.+
7 అదేవిధంగా, సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపక్కల నగరాలు విపరీతంగా లైంగిక పాపానికి* పాల్పడ్డాయి, అసహజమైన శరీర కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయాయి;+ అవి నిత్యాగ్ని* శిక్షకు గురై మనకు హెచ్చరికగా ఉన్నాయి.+
8 అయినాసరే, ఈ మనుషులు ఊహాలోకాల్లో విహరిస్తున్నారు, శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు, అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ల గురించి అమర్యాదగా మాట్లాడుతున్నారు.+
9 అయితే ప్రధానదూత+ మిఖాయేలు+ మోషే శరీరం+ గురించి అపవాదితో వాదిస్తున్నప్పుడు అమర్యాదకరమైన మాటలతో+ అతనికి తీర్పు తీర్చే సాహసం చేయలేదు కానీ “యెహోవాయే* నిన్ను గద్దించాలి” అన్నాడు.+
10 ఈ మనుషులు మాత్రం తమకు అస్సలు అర్థంకాని వాటన్నిటి గురించి అమర్యాదగా మాట్లాడుతున్నారు; విచక్షణలేని జంతువుల్లా సహజ జ్ఞానంతో వేటినైతే అర్థంచేసుకుంటున్నారో+ వాటన్నిటి ద్వారా తమను తాము పాడుచేసుకుంటూ ఉన్నారు.
11 వాళ్లకు నాశనం తప్పదు. ఎందుకంటే వాళ్లు కయీను దారిలో నడిచారు,+ బహుమతి కోసం బిలాము వెళ్లిన తప్పుడు దారిలో పరుగెత్తారు,+ కోరహులా ఎదిరించి మాట్లాడి+ నాశనం కొనితెచ్చుకున్నారు!+
12 వాళ్లు మీ విందుల్లో* మీతో కలిసి తింటారు, తాగుతారు కానీ వాళ్లు నీళ్ల కింద కనిపించకుండా ఉండే రాళ్లలాంటి వాళ్లు;* తమ కడుపు నిండితే చాలు అనుకునే సిగ్గులేని కాపరులు;+ గాలికి అటూఇటూ కొట్టుకుపోయే నీళ్లులేని మేఘాలు;+ కాపు కాయాల్సిన కాలంలో* కాయకుండా, పూర్తిగా* చచ్చిపోయి వేళ్లతోసహా పెకిలించబడిన చెట్లు;
13 తమ అవమానమనే నురగను వెళ్లగక్కే ప్రచండమైన అలలు;+ శాశ్వతంగా కటిక చీకట్లో ఉంచబడే దారితప్పిన నక్షత్రాలు.+
14 ఆదాము నుండి ఏడో తరంవాడైన హనోకు+ వాళ్ల గురించి ఇలా ప్రవచించాడు: “ఇదిగో! యెహోవా* తన లక్షలాది పవిత్ర దూతలతో వచ్చాడు.+
15 ఆయన అందరికీ తీర్పు తీర్చడానికి వచ్చాడు.+ భక్తిహీనులు దైవభక్తి లేకుండా చేసిన భక్తిహీన పనులన్నిటిని బట్టి, అలాగే భక్తిహీన పాపులు దేవుని గురించి నీచంగా మాట్లాడిన మాటలన్నిటిని బట్టి వాళ్లను శిక్షించడానికి ఆయన వచ్చాడు.”+
16 ఈ మనుషులు సణుగుతారు,+ తమ పరిస్థితి గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తారు, సొంత కోరికల ప్రకారం ప్రవర్తిస్తారు,+ తమ గురించి విపరీతంగా గొప్పలు చెప్పుకుంటారు, తమ ప్రయోజనం కోసం ఇతరుల్ని పొగుడుతారు.+
17 ప్రియ సహోదరులారా, మీరైతే మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు గతంలో చెప్పిన* విషయాల్ని గుర్తుచేసుకోండి;
18 వాళ్లు మీతో, “చివరి రోజుల్లో తమ సొంత* కోరికల ప్రకారం ప్రవర్తిస్తూ ఎగతాళి చేసే మనుషులు ఉంటారు”+ అని చెప్పేవాళ్లు.
19 ఈ మనుషులు విభజనలు సృష్టిస్తారు, వాళ్లు జంతువుల లాంటివాళ్లు,* వాళ్లలో దేవుని పవిత్రశక్తి* లేదు.
20 కానీ ప్రియ సహోదరులారా, మీరైతే అతి పవిత్రమైన మీ విశ్వాసం అనే పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి, పవిత్రశక్తికి అనుగుణంగా ప్రార్థించండి.+
21 అలాచేస్తే, మీరు దేవుడు ప్రేమించే ప్రజలుగా ఉంటూ,*+ శాశ్వత జీవితానికి నడిపించే+ మన ప్రభువైన యేసుక్రీస్తు కరుణ కోసం ఎదురుచూస్తూ ఉండగలుగుతారు.
22 సందేహాలు ఉన్నవాళ్ల+ మీద కరుణ చూపిస్తూ ఉండండి,+
23 మంటల్లో నుండి లాగినట్టు వాళ్లను కాపాడండి.+ అయితే ఇతరుల మీద, అంటే చెడ్డపనుల వల్ల తమ బట్టలు మురికైన వాళ్ల మీద కూడా కరుణ చూపిస్తూ ఉండండి. కానీ జాగ్రత్త, వాళ్ల బట్టల మురికి మీకు అంటుకోకుండా చూసుకోండి.+
24 మిమ్మల్ని పడిపోకుండా కాపాడి, మీలో గొప్ప సంతోషాన్ని నింపి, మిమ్మల్ని కళంకం లేనివాళ్లుగా తన మహిమాన్విత సన్నిధిలో నిలబెట్టగల+
25 మన రక్షకుడైన ఏకైక దేవునికి గతంలో, ఇప్పుడూ, ఎల్లప్పుడూ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, వైభవం, బలం, అధికారం చెందాలి. ఆమేన్.
అధస్సూచీలు
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “ఈజిప్టు.”
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “ప్రేమ విందుల్లో.”
^ నీటి కింద ఉండే మొనదేలిన రాళ్లు పడవల అడుగుభాగాన్ని కోసేయగలవు. ఈ రాళ్ల వల్ల ఈతగాళ్లు గాయపడే లేదా చనిపోయే ప్రమాదం ఉంది.
^ అక్ష., “శరదృతువు చివర్లో.”
^ అక్ష., “రెండుసార్లు.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “ముందే చెప్పిన.”
^ లేదా “భక్తిహీన.”
^ లేదా “శారీరక విషయాలపై మనసుపెట్టే మనుషులు.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “దేవుని ప్రేమలో నిలిచివుంటూ.”