ఆదికాండం 1:1-31

 • ఆకాశాన్ని, భూమిని సృష్టించడం (1, 2)

 • ఆరు రోజుల్లో భూమిని సిద్ధం చేయడం (3-31)

  • 1వ రోజు: వెలుగు; పగలు, రాత్రి (3-5)

  • 2వ రోజు: విశాలం (6-8)

  • 3వ రోజు: ఆరిన నేల, మొక్కలు (9-13)

  • 4వ రోజు: ఆకాశ జ్యోతులు (14-19)

  • 5వ రోజు: చేపలు, పక్షులు (20-23)

  • 6వ రోజు: భూజంతువులు, ​మనుషులు (24-31)

1  మొదట్లో దేవుడు ఆకాశాన్ని,* భూమిని సృష్టించాడు.+  భూమి ఖాళీగా, పనికిరాకుండా ఉండేది; చీకటి అగాధ జలాల్ని*+ కమ్ముకొని ఉండేది; దేవుని చురుకైన శక్తి*+ నీళ్ల మీద+ అటూఇటూ కదులుతూ ఉండేది.  దేవుడు, “వెలుగు కలగాలి” అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది.+  ఆ తర్వాత, దేవుడు వెలుగును చూసినప్పుడు అది బాగుంది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు.  దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి+ అని పిలిచాడు. సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది మొదటి రోజు.  తర్వాత దేవుడు, “జలాల మధ్య విశాలం+ ఏర్పడాలి; ఆ జలాలు, ఈ జలాలు వేరవ్వాలి” అన్నాడు.+  ఆ తర్వాత దేవుడు విశాలాన్ని చేసి, దానికి కింద ఉన్న జలాల్ని దానికి పైనున్న జలాల నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు.+ అది అలాగే జరిగింది.  దేవుడు ఆ విశాలాన్ని ఆకాశం అని పిలిచాడు. సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది రెండో రోజు.  తర్వాత దేవుడు, “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకచోటికి చేరాలి, ఆరిన నేల కనిపించాలి” అన్నాడు.+ అది అలాగే జరిగింది. 10  దేవుడు ఆరిన నేలను భూమి అని,+ ఒకచోటికి చేరిన జలాల్ని సముద్రాలు అని పిలిచాడు.+ దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది.+ 11  తర్వాత దేవుడు, “భూమి వాటివాటి జాతుల ప్రకారం గడ్డిని, మొక్కల్ని, చెట్లను మొలిపించాలి. మొక్కలు విత్తనాల్ని, చెట్లు విత్తనాలున్న పండ్లను ఇస్తాయి” అన్నాడు. అది అలాగే జరిగింది. 12  అప్పుడు భూమి వాటివాటి జాతుల ప్రకారం గడ్డిని, మొక్కల్ని,+ చెట్లను మొలిపించడం మొదలుపెట్టింది. మొక్కలు విత్తనాల్ని, చెట్లు విత్తనాలున్న పండ్లను ఇచ్చాయి. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 13  సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది మూడో రోజు. 14  తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “పగటిని, రాత్రిని వేరు చేయడానికి+ ఆకాశ విశాలంలో జ్యోతులు+ కలగాలి; అవి కాలాల్ని, రోజుల్ని, సంవత్సరాల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.+ 15  భూమ్మీద ప్రకాశించడానికి అవి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి.” అది అలాగే జరిగింది. 16  దేవుడు రెండు గొప్ప జ్యోతుల్ని చేశాడు. వాటిలో పెద్ద జ్యోతినేమో పగటిని ఏలడానికి,+ చిన్న జ్యోతినేమో రాత్రిని ఏలడానికి చేశాడు, అలాగే నక్షత్రాల్ని కూడా చేశాడు.+ 17  అవి భూమ్మీద ప్రకాశించడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో పెట్టాడు; 18  అంతేకాదు పగటినీ రాత్రినీ ఏలడానికి, వెలుగునూ చీకటినీ వేరు చేయడానికి+ దేవుడు వాటిని అలా పెట్టాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 19  సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది నాలుగో రోజు. 20  తర్వాత దేవుడు, “జలాలు జలచరాలతో* నిండిపోవాలి; ఎగిరే ప్రాణులు భూమికి పైన ఆకాశ విశాలంలో ఎగరాలి” అన్నాడు.+ 21  దేవుడు గొప్ప సముద్ర జీవుల్ని, నీళ్లలో కదిలే ప్రాణుల్ని, అలాగే నీళ్లలో గుంపులుగుంపులుగా తిరిగే ప్రాణుల్ని వాటివాటి జాతుల ప్రకారం సృష్టించాడు; అలాగే రెక్కలతో ఎగిరే ప్రతీ ప్రాణిని దానిదాని జాతి ప్రకారం సృష్టించాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 22  ఇక అప్పుడు దేవుడు వాటిని ఇలా దీవించాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువయ్యి, సముద్ర జలాల్ని నింపండి;+ భూమ్మీద ఎగిరే ప్రాణుల సంఖ్య పెరగాలి.” 23  సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది ఐదో రోజు. 24  తర్వాత దేవుడు, “భూమి వాటివాటి జాతుల ప్రకారం జీవుల్ని పుట్టించాలి; సాధు జంతువుల్ని, పాకే జంతువుల్ని,* అడవి జంతువుల్ని వాటివాటి జాతుల ప్రకారం పుట్టించాలి” అన్నాడు.+ అది అలాగే జరిగింది. 25  దేవుడు వాటివాటి జాతుల ప్రకారం అడవి జంతువుల్ని, వాటివాటి జాతుల ప్రకారం సాధు జంతువుల్ని, వాటివాటి జాతుల ప్రకారం పాకే జంతువులన్నిటినీ చేశాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 26  తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “మన+ స్వరూపంలో,+ మనలా+ మనిషిని తయారుచేద్దాం. వాళ్లు సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, సాధు జంతువుల్ని, భూమినంతటినీ, అలాగే భూమ్మీద కదిలే ప్రతీ పాకే జంతువును ఏలాలి.”+ 27  దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు, దేవుని స్వరూపంలో అతన్ని సృష్టించాడు; పురుషునిగా, స్త్రీగా వాళ్లను సృష్టించాడు.+ 28  అంతేకాదు దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి,+ దాన్ని లోబర్చుకోండి;+ సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలండి.”+ 29  తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “భూమంతటా ఉన్న విత్తనాలుగల ప్రతీ మొక్కను, విత్తనాలుగల పండ్లున్న ప్రతీ చెట్టును నేను మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారంగా ఉంటాయి.+ 30  భూమ్మీదున్న ప్రతీ అడవి జంతువుకు, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణికి, భూమ్మీద జీవంతో కదిలే ప్రతీదానికి పచ్చని మొక్కలన్నిటినీ నేను ఆహారంగా ఇచ్చాను.”+ అది అలాగే జరిగింది. 31  ఆ తర్వాత దేవుడు తాను చేసిన ప్రతీదాన్ని చూసినప్పుడు, ఇదిగో! అది చాలా బాగుంది.+ సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది ఆరో రోజు.

అధస్సూచీలు

అంటే, నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్రవీధులు మొదలైనవి ఉన్న విశ్వం.
లేదా “పొంగిపొర్లుతున్న జలాల్ని.”
లేదా “దేవుని పవిత్రశక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
పదకోశంలో “ప్రాణం” చూడండి.
లేదా “కదిలే జంతువుల్ని.” వీటిలో సరీసృపాలు, పైన పేర్కొన్న జంతువులకు భిన్నమైన జంతువులు ఉన్నాయని తెలుస్తోంది.