యోహానుకు ఇచ్చిన ప్రకటన 22:1-21

  • జీవజలాల నది (1-5)

  • ముగింపు (6-21)

    • ‘రండి! ఉచితంగా జీవజలాలు తాగండి’ (17)

    • “ప్రభువైన యేసూ, రా” (20)

22  తర్వాత ఆ దేవదూత నాకు జీవజలాల నదిని+ చూపించాడు. ఆ నది స్ఫటికంలా స్పష్టంగా ఉంది. అది దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం నుండి ప్రవహిస్తోంది.  ఆ నది, నగర ముఖ్యవీధి మధ్యలో ప్రవహిస్తోంది. నదికి రెండువైపులా జీవవృక్షాలు ఉన్నాయి. అవి ప్రతీనెల ఫలిస్తూ సంవత్సరానికి 12 కాపులు కాస్తున్నాయి. ఆ వృక్షాల ఆకులు దేశాల్ని స్వస్థపర్చడం కోసం ఉన్నాయి.+  ఇక ఎప్పటికీ ఆ నగరం మీద శాపం అనేదే ఉండదు. అయితే దేవునికి, గొర్రెపిల్లకు చెందిన సింహాసనం+ ఆ నగరంలో ఉంటుంది. దేవుని దాసులు ఆయనకు పవిత్రసేవ చేస్తారు.  వాళ్లు ఆయన ముఖం చూస్తారు,+ ఆయన పేరు వాళ్ల నొసళ్ల మీద ఉంటుంది.  అంతేకాదు, రాత్రి ఇక ఉండదు. దీపకాంతి గానీ సూర్యకాంతి గానీ వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే యెహోవా* దేవుడే వాళ్లమీద వెలుగు ప్రసరిస్తాడు.+ వాళ్లు యుగయుగాలు రాజులుగా పరిపాలిస్తారు.+  ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి,* సత్యమైనవి.+ అవును, ప్రవక్తల్ని ప్రేరేపించిన యెహోవా* దేవుడే,+ త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపించాడు.  ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను.+ ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని పాటించే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.”+  యోహాను అనే నేను ఈ విషయాలు విన్నాను, చూశాను. నేను వాటిని విన్నప్పుడు, చూసినప్పుడు నాకు వాటిని చూపించిన దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు మోకరించాను.  అయితే అతను నాతో ఇలా అన్నాడు: “వద్దు! అలా చేయొద్దు! నేను కూడా నీలాగే, ప్రవక్తలైన నీ సహోదరుల్లాగే, ఈ గ్రంథపు చుట్టలోని మాటల్ని పాటిస్తున్న వాళ్లలాగే ఒక దాసుణ్ణి మాత్రమే. దేవుణ్ణే ఆరాధించు.”+ 10  అతను నాతో ఇంకా ఇలా అన్నాడు: “ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని రహస్యంగా ఉంచొద్దు. ఎందుకంటే, నిర్ణయించిన సమయం దగ్గర్లో ఉంది. 11  అన్యాయస్థుణ్ణి అన్యాయంగానే నడుచుకోనివ్వు, అపవిత్రుణ్ణి అపవిత్రంగానే నడుచుకోనివ్వు; అయితే, నీతిమంతుణ్ణి నీతిగానే నడుచుకోనివ్వు, పవిత్రుణ్ణి పవిత్రంగానే నడుచుకోనివ్వు. 12  “ ‘ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను. నేనిచ్చే బహుమతి నా దగ్గరే ఉంది. నేను ప్రతీ ఒక్కరికి వాళ్ల పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాను.+ 13  నేనే ఆల్ఫాను, ఓమెగను;*+ మొదటివాణ్ణి, చివరివాణ్ణి; ఆరంభాన్ని, ముగింపును. 14  తమ వస్త్రాలు ఉతుక్కున్న వాళ్లు+ సంతోషంగా ఉంటారు. వాళ్లకు జీవవృక్షాల దగ్గరికి వెళ్లే అధికారం ఉంటుంది,+ వాళ్లు గుమ్మాల+ ద్వారా నగరంలోకి వెళ్లగలుగుతారు. 15  అయితే కుక్కల లాంటివాళ్లు,* మంత్రతంత్రాలు చేసేవాళ్లు, లైంగిక పాపం* చేసేవాళ్లు, హంతకులు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాలాడే ప్రతీ ఒక్కరు నగరం బయట ఉంటారు.’+ 16  “ ‘యేసు అనే నేను, సంఘాల ప్రయోజనం కోసం ఈ విషయాల గురించి మీకు సాక్ష్యమివ్వడానికి నా దూతను పంపించాను. నేను దావీదు వేరును, దావీదు సంతానాన్ని;+ ప్రకాశవంతమైన వేకువ చుక్కను.’ ”+ 17  పవిత్రశక్తి, పెళ్లికూతురు,+ “రండి!” అని అంటూ ఉన్నారు. దాన్ని వింటున్నవాళ్లు ఎవరైనా సరే “రండి!” అని చెప్పాలి. దాహంగా ఉన్న ఎవరినైనా సరే రానివ్వండి.+ ఇష్టమున్న ఎవరినైనా ఉచితంగా జీవజలాలు తాగనివ్వండి.+ 18  “ఈ గ్రంథపు చుట్టలోని ప్రవచన మాటల్ని వినే ప్రతీ ఒక్కరికి నేను సాక్ష్యమిస్తున్నాను: వీటికి ఎవరైనా ఏదైనా కలిపితే,+ ఈ గ్రంథపు చుట్టలో రాసివున్న తెగుళ్లను దేవుడు అతని మీదికి రప్పిస్తాడు.+ 19  ఎవరైనా ఈ ప్రవచనానికి సంబంధించిన గ్రంథపు చుట్టలోని మాటల్లో నుండి ఏదైనా తీసేస్తే, దేవుడు అతన్ని ఈ గ్రంథపు చుట్టలో వర్ణించిన మంచివాటిని పొందనివ్వడు. అంటే దేవుడు అతన్ని జీవవృక్షాల పండ్లు+ తిననివ్వడు, పవిత్ర నగరంలో+ అడుగుపెట్టనివ్వడు. 20  “ఈ విషయాల గురించి సాక్ష్యమిచ్చే వ్యక్తి ఇలా అంటున్నాడు: ‘అవును, నేను త్వరగా వస్తున్నాను.’ ”+ “ఆమేన్‌! ప్రభువైన యేసూ, రా.” 21  యేసు ప్రభువు అపారదయ పవిత్రులకు తోడుండాలి.

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
లేదా “నమ్మకమైనవి.”
అనుబంధం A5 చూడండి.
ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.
అంటే, ఎవరి పనులైతే దేవుని దృష్టికి అసహ్యంగా ఉన్నాయో వాళ్లు.
పదకోశం చూడండి.