కీర్తనలు 91:1-16

  • దేవుని రహస్య స్థలంలో కాపుదల

    • వేటగాడి ఉరిలో నుండి రక్షించబడ్డాడు (3)

    • దేవుని రెక్కల కింద ఆశ్రయం (4)

    • వేలమంది పడినా సురక్షితంగా ఉండడం (7)

    • కాపాడమని దూతలకు ఆజ్ఞ (11)

91  సర్వోన్నతుని చాటున* నివసించేవాళ్లు+సర్వశక్తిమంతుని నీడలో విశ్రమిస్తారు.   “నువ్వే నా ఆశ్రయం, నా కోట,+నేను నమ్ముకున్న నా దేవుడు”+ అని నేను యెహోవాతో అంటాను.   ఆయన వేటగాడి ఉరిలో నుండి,నాశనకరమైన తెగులు నుండి నిన్ను రక్షిస్తాడు.   తన రెక్కలతో* నిన్ను కప్పుతాడు,ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందుతావు.+ ఆయన నమ్మకత్వం+ పెద్ద డాలులా,+ రక్షణ గోడలా* ఉంటుంది.   రాత్రి కలిగే భయాలకు గానీ,పగలు ఎగిరే బాణానికి+ గానీ నువ్వు భయపడవు;+   చీకట్లో తిరిగే తెగులుకు గానీ,మధ్యాహ్నం కలిగే నాశనానికి గానీ నువ్వు భయపడవు.   నీ పక్కన వెయ్యి మంది,నీ కుడిపక్కన పదివేల మంది పడిపోతారు,కానీ నీకు ఏ హానీ జరగదు.+   నువ్వు కేవలం నీ కళ్లతో దాన్ని చూస్తావు,దుష్టులు శిక్షించబడడం నువ్వు చూస్తావు.   “యెహోవాయే నా ఆశ్రయం” అని అంటూనువ్వు సర్వోన్నతుణ్ణి నీ నివాస స్థలంగా* చేసుకున్నావు;+ 10  అందుకే ఏ విపత్తూ నీ మీదికి రాదు,ఏ తెగులూ నీ డేరా దగ్గరికి రాదు. 11  నీ మార్గాలన్నిట్లో నిన్ను కాపాడమనిఆయన నీ గురించి తన దూతలకు+ ఆజ్ఞాపిస్తాడు.+ 12  నీ పాదానికి రాయి తగలకుండావాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు.+ 13  నువ్వు కొదమ సింహాన్ని, తాచుపామును తొక్కుతావు;జూలు ఉన్న సింహాన్ని, పెద్ద పామును కాళ్లకింద తొక్కుతావు.+ 14  దేవుడు ఇలా అన్నాడు: “అతనికి నేనంటే ప్రేమ* కాబట్టి నేను అతన్ని రక్షిస్తాను.+ అతనికి నా పేరు తెలుసు* కాబట్టి నేను అతన్ని కాపాడతాను.+ 15  అతను నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను.+ కష్టాల్లో అతనికి తోడుంటాను.+ అతన్ని రక్షిస్తాను, మహిమపరుస్తాను. 16  దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను,+అతను నా రక్షణ కార్యాల్ని* చూసేలా చేస్తాను.”+

అధస్సూచీలు

లేదా “రహస్య స్థలంలో.”
లేదా “ఈకలతో.”
లేదా “అడ్డు గోడలా.”
లేదా “కోటగా; ఆశ్రయంగా” అయ్యుంటుంది.
అక్ష., “అతను నన్ను అంటిపెట్టుకున్నాడు.”
లేదా “అతను నా పేరును గుర్తిస్తున్నాడు.”
లేదా “నేను అనుగ్రహించే రక్షణను.”