రెండో కొరింథీయులు 12:1-21

  • పౌలుకు వచ్చిన దర్శనాలు (1-7ఎ)

  • పౌలు “శరీరంలో ఒక ముల్లు” (7బి-10)

  • అతిశ్రేష్ఠులైన అపొస్తలులకన్నా తక్కువ కాదు (11-13)

  • కొరింథీయుల మీద పౌలుకున్న ఆసక్తి (14-21)

12  నేను గొప్పలు చెప్పుకోవాలి. నిజమే, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అయినాసరే, ప్రభువు నుండి వచ్చిన దర్శనాల గురించి,+ సందేశాల గురించి+ నేను చెప్తాను. 2  క్రీస్తు శిష్యుడైన ఒక వ్యక్తి నాకు తెలుసు. 14 ఏళ్ల క్రితం, అతను మూడో పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు. అతను శరీరంతో వెళ్లాడో, శరీరం లేకుండా వెళ్లాడో నాకు తెలీదు, దేవునికి తెలుసు. 3  అవును, అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతను శరీరంతో వెళ్లాడో, శరీరం లేకుండా వెళ్లాడో నాకు తెలీదు, దేవునికి తెలుసు. 4  అతను పరదైసులోకి తీసుకెళ్లబడి, మనుషులు పలకకూడని, మాట్లాడకూడని మాటలు విన్నాడు. 5  అలాంటి వ్యక్తి గురించి నేను గొప్పలు చెప్తాను; కానీ నా విషయానికొస్తే, నా బలహీనతల గురించి తప్ప వేరే వాటి గురించి గొప్పలు చెప్పుకోను. 6  ఒకవేళ నాకు గొప్పలు చెప్పుకోవాలని అనిపించినా నేను అవివేకిలా ఉండను, ఎందుకంటే నేను నిజమే చెప్తాను. కానీ, నేను గొప్పలు చెప్పుకోను. ఎందుకంటే నాలో చూసినదాని కన్నా, నా దగ్గర విన్నదాని కన్నా ఎవ్వరూ నాకు ఎక్కువ ఘనతను ఇవ్వకూడదు. 7  కేవలం అలాంటి అసాధారణ సందేశాలు నాకు అందాయనే ఉద్దేశంతో ఎవ్వరూ నాకు ఎక్కువ ఘనత ఇవ్వకూడదు. నేను గర్వంతో ఉప్పొంగిపోకుండా ఉండడానికి నా శరీరంలో ఒక ముల్లు ఉంది.+ అది సాతాను దూతలా పనిచేస్తూ, నేను ఉప్పొంగిపోకుండా అదేపనిగా నన్ను బాధిస్తోంది. 8  దాన్ని నాలో నుండి తీసేయమని నేను మూడుసార్లు ప్రభువును బ్రతిమాలాను. 9  కానీ ఆయన నాతో ఇలా అన్నాడు: “నా అపారదయ నీకు చాలు. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే నా శక్తి ఇంకా బలంగా పనిచేస్తుంది.”*+ కాబట్టి క్రీస్తు శక్తి నా మీద డేరాలా నిలిచివుండేలా, నా బలహీనతల గురించి నేను ఇంకా సంతోషంగా గొప్పలు చెప్పుకుంటాను. 10  అందుకే నేను క్రీస్తును బట్టి, నా బలహీనతల విషయంలో, ఇతరులు నన్ను ఎగతాళి చేసినప్పుడు, నేను అవసరంలో ఉన్నప్పుడు, నాకు హింసలూ కష్టాలూ ఎదురైనప్పుడు సంతోషిస్తాను. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడే బలవంతుణ్ణి.+ 11  నేను అవివేకిలా మాట్లాడుతున్నాను. మీ వల్లే నేను ఇలా మాట్లాడాల్సి వస్తోంది. ఒకవేళ మీరు నన్ను సిఫారసు చేసివుంటే నేను ఇలా మాట్లాడేవాణ్ణి కాదు. మీ దృష్టిలో నాకు ఏమాత్రం విలువ లేకపోయినా, అతిశ్రేష్ఠులైన మీ అపొస్తలుల కంటే నేను ఎందులోనూ తక్కువవాణ్ణి కాను.+ 12  నిజానికి నేను సూచనలు, అద్భుతాలు, శక్తివంతమైన కార్యాలు చేస్తూ+ ఎంతో సహనంతో నా అపొస్తలత్వానికి రుజువులు మీకు చూపించాను.+ 13  నేను మీకు భారంగా లేనన్న ఒక్క కారణం వల్లే కదా మీరు మిగతా సంఘాల కన్నా తక్కువవాళ్లు అయింది?+ దయచేసి ఈ తప్పును మన్నించండి. 14  ఇదిగో! నేను మీ దగ్గరికి రావడానికి సిద్ధపడడం ఇది మూడోసారి, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. ఎందుకంటే నాకు కావాల్సింది మీ ఆస్తిపాస్తులు కాదు,+ మీరు. పిల్లలు+ తల్లిదండ్రుల కోసం కూడబెట్టడం కాదు, తల్లిదండ్రులే పిల్లల కోసం కూడబెట్టాలి. 15  నా వంతుగా నేను నాకున్నవన్నీ సంతోషంగా మీకోసం ఖర్చుపెడతాను, నా సర్వస్వం ధారపోస్తాను.+ నేను మిమ్మల్ని ఇంత ఎక్కువగా ప్రేమిస్తుంటే, మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా? 16  ఏదేమైనా, నేను మీ మీద భారం మోపలేదు.+ అయినాసరే మీరు, నేను మిమ్మల్ని “మోసంచేసి,” “మాయచేసి” బుట్టలో వేసుకున్నానని అంటున్నారు. 17  నేను మీ దగ్గరికి పంపించినవాళ్లలో ఏ ఒక్కరి ద్వారానైనా మిమ్మల్ని నా స్వార్థానికి వాడుకున్నానా? లేదు. 18  మీ దగ్గరికి వెళ్లమని నేను తీతును బ్రతిమాలాను, అతనితో ఒక సహోదరుణ్ణి పంపించాను. తీతు కూడా మిమ్మల్ని ఏమాత్రం తన స్వార్థానికి వాడుకోలేదు.+ మేము ఒకే స్ఫూర్తిని చూపించాం, ఒకేవిధంగా ప్రవర్తించాం. 19  ఇప్పటివరకు మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకుంటున్నామని అనుకుంటున్నారా? మేము క్రీస్తు శిష్యులుగా దేవుని ముందు మాట్లాడుతున్నాం. ప్రియ సహోదరులారా, మేము చేసేవన్నీ మిమ్మల్ని బలపర్చడానికే. 20  నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నేను అనుకున్నట్టు ఉండరేమోనని, నేను మీరు అనుకున్నట్టు ఉండనేమోనని భయపడుతున్నాను. బదులుగా మీ మధ్య గొడవలు, అసూయలు, కోపం వెళ్లగక్కడాలు, అభిప్రాయభేదాలు, వెనక మాట్లాడుకోవడాలు, గుసగుసలు,* గర్వంతో ఉప్పొంగిపోవడాలు, అల్లర్లు ఉంటాయేమో. 21  బహుశా నేను మళ్లీ అక్కడికి వచ్చినప్పుడు నా దేవుడు మీ ముందు నన్ను అవమానపరుస్తాడేమో. అంతకుముందు పాపపు మార్గంలో నడిచి, ఇంకా తమ అపవిత్రత విషయంలో, లైంగిక పాపం* విషయంలో, లెక్కలేనితనం* విషయంలో పశ్చాత్తాపపడని చాలామంది గురించి నేను ఏడ్వాల్సి వస్తుందేమో.

అధస్సూచీలు

లేదా “పరిపూర్ణం అవుతుంది.”
లేదా “పుకార్లు.”
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
లేదా “సిగ్గులేని ప్రవర్తన.” గ్రీకులో అసెల్జీయ. పదకోశం చూడండి.