కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసులా వినయం, కనికరం చూపించండి

యేసులా వినయం, కనికరం చూపించండి

“క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.”—1 పేతు. 2:21.

1. యేసును అనుకరిస్తే మనం యెహోవాకు ఎందుకు దగ్గరౌతాం?

 సాధారణంగా, మనకిష్టమైన వాళ్లను అనుకరించడానికి మనం ప్రయత్నిస్తాం. అయితే, ఇప్పటిదాకా జీవించినవాళ్లలో మనం అనుకరించదగిన అత్యుత్తమ వ్యక్తి యేసుక్రీస్తు. ఎందుకంటే యేసు ఓసారి ఇలా అన్నాడు, “నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే.” (యోహా. 14:9, పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యేసు తన తండ్రి లక్షణాలను అచ్చుగుద్దినట్లు చూపించాడు. కాబట్టి మనం యేసు గురించి ఎంత ఎక్కువ నేర్చుకుంటే యెహోవా గురించి అంత ఎక్కువ తెలుసుకుంటాం. అంతేకాదు, యేసును అనుకరిస్తే విశ్వమంతటిలో అత్యంత గొప్పవాడైన యెహోవాకు దగ్గరౌతాం. అది ఎంత గొప్ప గౌరవం!

2, 3. (ఎ) యేసు జీవితం గురించి చాలా వివరాలను యెహోవా బైబిల్లో ఎందుకు రాయించాడు? మనమేమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు? (బి) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

2 యేసు జీవితం గురించి ఎన్నో వివరాలను యెహోవా బైబిల్లో రాయించాడు. ఎందుకు? ఎందుకంటే మనం తన కుమారుని గురించి తెలుసుకుని, ఆయనను అనుకరించాలన్నదే యెహోవా కోరిక. (1 పేతురు 2:21 చదవండి.) బైబిలు, యేసు ఉంచిన ఆదర్శాన్ని ‘అడుగుజాడలతో’ పోలుస్తుంది. మనం ఆ అడుగుజాడల్లో నడవాలని అంటే ప్రతీ విషయంలో యేసును అనుకరించాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే యేసు పరిపూర్ణుడు కాబట్టి మనం ఆయనను పూర్తిగా అనుకరించలేమని యెహోవాకు తెలుసు. కానీ యేసు అడుగుజాడల్లో నడిచేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.

3 యేసుకున్న అద్భుతమైన లక్షణాల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్‌లో, ఆయనకున్న వినయం, కనికరం గురించి చర్చిస్తాం. ఆయన చూపించిన ధైర్యం, వివేచన గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం. వాటిని పరిశీలిస్తున్నప్పుడు, ఆ లక్షణానికున్న అర్థం ఏమిటో, దాన్ని యేసు ఎలా చూపించాడో, దాన్ని మనమెలా చూపించవచ్చో తెలుసుకుందాం.

యేసు వినయం చూపించాడు

4. వినయం అంటే ఏమిటి?

4 వినయం అంటే ఏమిటి? కొంతమంది దృష్టిలో, వినయం అంటే ఓ బలహీనత, మనమీద మనకు నమ్మకం లేకపోవడం. అయితే, అలా అనుకోవడం సరైనదేనా? నిజం చెప్పాలంటే, వినయం చూపించడానికి చాలా బలం, ధైర్యం కావాలి. వినయం అంటే గర్వం, అహంకారం లేకపోవడం. బైబిల్లో “వినయం” అనే మాటకు దీనమనస్సు అనే అర్థం కూడా ఉంది. (ఫిలి. 2:3) వినయం ఉన్నవాళ్లు, తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకోరు. “దేవుని ముందు మనమెంత అల్పులమో గుర్తించడమే వినయం” అని ఒక బైబిలు డిక్షనరీ చెప్తుంది. మనకు వినయం ఉంటే ఇతరుల కన్నా గొప్పవాళ్లమని అనుకోం. (రోమా. 12:3) అపరిపూర్ణులైన మనుషులకు వినయం చూపించడం అంత సులభం కాదు. అయితే యెహోవా గొప్పతనం గురించి ఆలోచిస్తూ, యేసు అడుగుజాడల్లో నడిస్తే మనం వినయం చూపించగలుగుతాం.

5, 6. (ఎ) ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరు? (బి) ఆయన తన ఆలోచనా తీరులో ఎలా వినయాన్ని చూపించాడు?

5 యేసు ఎలా వినయం చూపించాడు? ఆయన ఎల్లప్పుడూ, అంటే పరలోకంలో శక్తిమంతమైన దేవదూతగా ఉన్నప్పుడు, ఆ తర్వాత భూమ్మీద పరిపూర్ణ మానవునిగా జీవించినప్పుడు కూడా వినయంగానే ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.

6 ఆయన ఆలోచనా తీరు. యేసు భూమ్మీదకు రాకముందు జరిగిన ఓ సంఘటన గురించి మనం యూదా పత్రికలో చదువుతాం. (యూదా 9 చదవండి.) ప్రధానదూతయైన మిఖాయేలుగా యేసు, అపవాదితో ‘మోషే శరీరం గురించి తర్కించాడని’ లేదా వాదించాడని బైబిలు చెప్తుంది. మోషే చనిపోయాక ఆయన శరీరాన్ని ఎవరికీ తెలియని చోట యెహోవా పాతిపెట్టాడు. (ద్వితీ. 34:5, 6) మోషే శరీరాన్ని ఉపయోగించి అబద్ధ ఆరాధనను ప్రోత్సహించాలని సాతాను బహుశా అనుకొని ఉంటాడు. సాతాను ఉద్దేశం ఏదైనా మిఖాయేలు దాన్ని ధైర్యంగా అడ్డుకున్నాడు. ఆ విషయం గురించి ఓ పుస్తకం ఇలా చెప్తుంది, ‘వాదించడం, తర్కించడం వంటి మాటల్ని “న్యాయపరమైన వాదనల గురించి” చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తారు. కాబట్టి, మోషే శరీరం మీద అపవాదికి ఏమి హక్కు ఉందని మిఖాయేలు ప్రశ్నించివుంటాడు.’ అయితే, సాతానుకు తీర్పుతీర్చే పని తనది కాదని మిఖాయేలుకు తెలుసు. అందుకే ఆ విషయాన్ని సర్వోన్నత న్యాయాధిపతియైన యెహోవాకే వదిలేశాడు. యేసు ఎంత వినయం చూపించాడో కదా!

7. యేసు తన మాటల్లో, పనుల్లో వినయం ఎలా చూపించాడు?

7 యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన మాటల్లో, చేతల్లో కూడా వినయం చూపించాడు. ఆయన మాటలు. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని యేసు ఎప్పుడూ కోరుకోలేదు, కానీ ఘనతంతా తన తండ్రికే చెందాలని కోరుకున్నాడు. (మార్కు 10:17, 18; యోహా. 7:16) ఆయనెప్పుడూ తన శిష్యులను చులకన చేసి మాట్లాడలేదు. బదులుగా వాళ్లను గౌరవించాడు. వాళ్లలో ఉన్న మంచి లక్షణాలను మెచ్చుకుంటూ, వాళ్లమీద తనకెంత నమ్మకం ఉందో చూపించాడు. (లూకా 22:31, 32; యోహా. 1:47) ఆయన పనులు. యేసు ఎక్కువ వస్తువులు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపాడు. (మత్త. 8:20) ఇతరులు ఏమాత్రం ఇష్టపడని పనులు చేయడానికి కూడా యేసు ముందుకు వచ్చాడు. (యోహా. 13:3-15) ఆయన విధేయత చూపించడం ద్వారా అసాధారణమైన విధంగా వినయం చూపించాడు. (ఫిలిప్పీయులు 2:5-8 చదవండి.) అహంకారులు, ఇతరులకు లోబడడానికి ఏమాత్రం ఇష్టపడరు, కానీ యేసు అన్ని సందర్భాల్లోనూ యెహోవాకు వినయంగా లోబడ్డాడు. చివరికి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. వీటన్నిటిని చూస్తే, యేసు “దీనమనస్సుగలవాడు” అని అర్థమౌతుంది.—మత్త. 11:29.

యేసులా వినయం చూపించండి

8, 9. మనమెలా వినయం చూపించవచ్చు?

8 మనం యేసులా వినయాన్ని ఎలా చూపించవచ్చు? మన ఆలోచనా తీరు. వినయం ఉంటే, మనం హద్దులు దాటకుండా ఉంటాం. ఇతరులకు తీర్పుతీర్చే అధికారం మనకు లేదని తెలుసు కాబట్టి, మనం వాళ్లను విమర్శించం లేదా వాళ్ల ఉద్దేశాలను తప్పుపట్టం. (లూకా 6:37; యాకో. 4:12) వినయం ఉంటే ‘అతి నీతిమంతులుగా’ ప్రవర్తించం. అంటే, మనకున్నలాంటి సామర్థ్యాలు, అవకాశాలు లేనివాళ్లను చిన్నచూపు చూడం. (ప్రసం. 7:16) వినయంగల పెద్దలు, తాము తోటి సహోదరసహోదరీల కన్నా గొప్పవాళ్లమని అనుకోరు. బదులుగా ఇతరులు ‘తమకంటె యోగ్యులని’ అంటే, తమకంటే ముఖ్యమైనవాళ్లని ఈ ప్రేమగల కాపరులు అనుకుంటారు.—ఫిలి. 2:3; లూకా 9:48.

9 డబ్ల్యు. జే. థాన్‌ అనే సహోదరుని విషయమే తీసుకోండి. ఆయన 1894⁠లో ప్రయాణ పర్యవేక్షకునిగా సేవ మొదలుపెట్టాడు. ఎన్నో సంవత్సరాలు ఆ సేవ చేశాక, ఆయనకు న్యూయార్క్‌ దగ్గర్లోని మన వ్యవసాయ క్షేత్రంలో కోళ్లను చూసుకునే పని అప్పగించారు. నేను ఇంత చిన్నపని చేయడం ఏంటి? అని ఆయనకు అనిపించిన ప్రతీసారి, ‘నువ్వు ధూళితో సమానం. ఏమి చూసుకుని అంత గర్వపడుతున్నావు?’ అని తనకు తాను చెప్పుకునేవాడు. (యెషయా 40:12-15 చదవండి.) అది ఎంతటి వినయం!

10. మనం మన మాటల్లో, పనుల్లో వినయాన్ని ఎలా చూపించవచ్చు?

10 మన మాటలు. మనకు వినయం ఉంటే, అది మనం మాట్లాడే తీరులో కనిపిస్తుంది. (లూకా 6:45) ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనకున్న ప్రత్యేక అవకాశాల గురించి, చేసిన పనులు గురించి గొప్పలు చెప్పుకోం. (సామె. 27:2) బదులుగా, సహోదరసహోదరీలు చేస్తున్న మంచి పనుల్ని మెచ్చుకుంటూ, వాళ్లకున్న మంచి లక్షణాలు, సామర్థ్యాల గురించి ఎక్కువగా మాట్లాడతాం. (సామె. 15:23) మన పనులు. వినయంగల క్రైస్తవులు ఈ లోకంలో పేరుప్రఖ్యాతల కోసం ప్రయత్నించరు కానీ సాధారణమైన జీవితం గడుపుతారు. వాళ్లు యెహోవాకు వీలైనంత ఎక్కువ సేవచేయడం కోసం, ప్రజలు తక్కువగా చూసే పనులను కూడా చేస్తారు. (1 తిమో. 6:6-8) అన్నిటికన్నా ముఖ్యంగా, మనం లోబడడం ద్వారా వినయం చూపిస్తాం. మనకు వినయం ఉన్నప్పుడే, సంఘంలో ‘నాయకులుగా ఉన్నవాళ్లకు’ లోబడతాం. యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని అంగీకరించి, వాటిని పాటిస్తాం.—హెబ్రీ. 13:17.

యేసు కనికరం చూపించాడు

11. కనికరం అంటే ఏమిటో వివరించండి.

11 కనికరం అనే లక్షణం ప్రేమలో ఒక భాగం. కనికరం కూడా జాలిలాగే ఓ ‘సున్నితమైన భావం.’ ఉదాహరణకు, యెహోవా “ఎంతో జాలియు కనికరమును గలవాడని” లేఖనాలు చెప్తున్నాయి. (యాకో. 5:11) ఓ బైబిలు రెఫరెన్స్‌ పుస్తకం ఇలా చెప్తుంది, ‘కనికరం అంటే బాధలో ఉన్నవాళ్లను చూసి కేవలం జాలి పడడం మాత్రమే కాదు. వాళ్లమీద సరైన శ్రద్ధ చూపిస్తూ అవసరమైన సహాయాన్ని అందించి, వాళ్ల జీవితాలు మెరుగయ్యేలా చేయడం.’ అవును, ఇతరుల జీవితాలను మెరుగుపర్చేలా కనికరం ఓ వ్యక్తిని కదిలిస్తుంది.

12. ఇతరులమీద తనకు కనికరం ఉందని యేసు ఎలా చూపించాడు?

12 యేసు ఎలా కనికరం చూపించాడు? ఆయన భావాలు, పనులు. యేసు ఇతరుల మీద కనికరం చూపించాడు. ఉదాహరణకు, చనిపోయిన లాజరు గురించి ఏడుస్తున్నమరియను, ఇతరులను చూసి యేసు కంటతడి పెట్టుకున్నాడు. (యోహాను 11:32-35 చదవండి.) యేసు అంతకుముందు, కనికరంతో ఓ విధవరాలి కొడుకును బ్రతికించాడు. ఇప్పుడు కూడా అదే కనికరంతో లాజరును బ్రతికించాడు. (లూకా 7:11-15; యోహా. 11:38-44) యేసు చేసిన ఆ పని, లాజరుకు పరలోక నిరీక్షణను ఇచ్చివుంటుంది. యేసు ఒక సందర్భంలో, తన దగ్గరకు వచ్చిన జనసమూహం మీద “కనికరపడి” ‘వాళ్లకు అనేక సంగతులు బోధించాడు.’ (మార్కు 6:34) ఆయన చెప్పిన వాటిని పాటించినవాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందారు. యేసుకు కనికరం ఉంది కాబట్టి ఇతరుల బాధను చూసి కేవలం జాలిపడి ఊరుకోలేదు కానీ వాళ్లకు సహాయం చేశాడు.—మత్త. 15:32-38; 20:29-34; మార్కు 1:40-42.

13. యేసు మృదువైన మాటలు ఎలా ఉపయోగించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

13 ఆయన మాటలు. యేసు కనికరం వల్ల ఇతరులతో, మరి ముఖ్యంగా కృంగినవాళ్లతో మృదువుగా మాట్లాడేవాడు. యేసు గురించిన ఓ ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ మత్తయి ఇలా రాశాడు, “నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు.” (యెష. 42:3; మత్త. 12:20) ఆ మాటల అర్థమేమిటి? నలిగిన రెల్లులా, ఆరిపోయే వత్తిలా ఉన్న బలహీనులకు ఓదార్పునిచ్చే విధంగా యేసు మాట్లాడేవాడు. ఆయన ‘నలిగిన హృదయంగలవాళ్లకు’ సేదదీర్పిచ్చే సందేశం ప్రకటించాడు. (యెష. 61:1) తనదగ్గరకు వచ్చి “విశ్రాంతి” పొందమని “భారం మోస్తూ అలసిపోయిన” ప్రజలందర్నీ ఆహ్వానించాడు. (మత్త. 11:28-30, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అంతేకాదు, ‘చిన్నవాళ్లతో’ సహా అంటే లోకం చులకనగా చూసే వాళ్లతోసహా, తన సేవకుల్లో ప్రతీఒక్కరి మీద యెహోవాకు శ్రద్ధ ఉందని యేసు తన శిష్యులకు భరోసా ఇచ్చాడు.—మత్త. 18:11-14; లూకా 12:6, 7.

యేసులా కనికరం చూపించండి

14. ఇతరులపట్ల మనం కనికరం ఎలా చూపించవచ్చు?

14 మనం యేసులా కనికరం ఎలా చూపించవచ్చు? మన భావాలు. మనలో సహజంగా కనికరం అనే లక్షణం ఉండకపోవచ్చు. అయితే దాన్ని చూపించడానికి కృషి చేయమని బైబిలు ప్రోత్సహిస్తుంది. క్రైస్తవులు నూతన స్వభావాన్ని అలవర్చుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆ నూతన స్వభావంలో “జాలిగల మనస్సు” కూడా ఉంది. (కొలొస్సయులు 3:9, 10, 12 చదవండి.) మీరు కనికరం ఎలా చూపించవచ్చు? ‘మీ హృదయాలను విశాలపర్చుకోవడం’ ద్వారా కనికరం చూపించవచ్చు. (2 కొరిం. 6:11-13) ఎవరైనా తమ ఆలోచనలను, బాధలను మీతో చెప్పుకున్నప్పుడు శ్రద్ధగా వినండి. (యాకో. 1:19) వాళ్ల పరిస్థితిలో మీరున్నట్లు ఊహించుకుంటూ, మీకెలా అనిపిస్తుందో, ఆ పరిస్థితుల్లో మీకెలాంటి సహాయం అవసరమో ఆలోచించండి.—1 పేతు. 3:8.

15. బాధల్లో ఉన్నవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

15 మన పనులు. మనకు కనికరం ఉంటే ఇతరులకు, ముఖ్యంగా బాధల్లో ఉన్న వాళ్లకు సహాయం చేస్తాం. ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు? “ఏడ్చువారితో ఏడువుడి” అని రోమా 12:16 చెప్తుంది. సాధారణంగా, కష్టాల్లో ఉన్న ప్రజలు పరిష్కారం కన్నా ఓదార్పునే ఎక్కువగా కోరుకుంటారు. ఓ స్నేహితునిలా వాళ్లమీద శ్రద్ధ చూపిస్తూ, వాళ్లు చెప్పేది వినడమే వాళ్లకు కావాల్సింది. తన కూతురు చనిపోయినప్పుడు తోటి సహోదరసహోదరీల వల్ల ఓదార్పు పొందిన ఓ సహోదరి ఇలా అంటుంది, ‘వాళ్లు వచ్చి నాతోపాటు ఏడ్చారు, అప్పుడు నాకు చాలా ఊరటగా అనిపించింది.’ కనికరం చూపించే మరో మార్గం, ఇతరుల అవసరాల్లో సహాయపడడం. ఉదాహరణకు, భర్తను కోల్పోయిన ఓ సహోదరికి ఇంటి రిపేరు విషయంలో సహాయం చేయవచ్చు. లేదా వయసుపైబడిన ఓ సహోదరుణ్ణి లేదా సహోదరిని కూటాలకు, పరిచర్యకు, హాస్పిటల్‌కు తీసుకెళ్లవచ్చు. మనం దయతో చేసేది చిన్న సహాయమే అయినా అది వాళ్లకెంతో మేలు చేస్తుంది. (1 యోహా. 3:17, 18) అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రజలకు సువార్త ప్రకటించడానికి చేయగలిగినదంతా చేయడం ద్వారా మనం కనికరం చూపించవచ్చు. మంచి మనసున్నవాళ్లకు సహాయం చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గం.

తోటి సహోదరసహోదరీల పట్ల మీకు నిజమైన శ్రద్ధ ఉందా? (15వ పేరా చూడండి)

16. కృంగినవాళ్లను మనమెలా ప్రోత్సహించవచ్చు?

16 మన మాటలు. ‘ధైర్యం చెడినవాళ్లను ధైర్యపర్చేలా’ కనికరం మనల్ని కదిలిస్తుంది. (1 థెస్స. 5:14) అలాంటివాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు? వాళ్లమీద మీకెంత శ్రద్ధ ఉందో చెప్పండి. వాళ్లను మెచ్చుకోండి, తమలోని మంచి లక్షణాలను, సామర్థ్యాలను గుర్తించేందుకు వాళ్లకు సహాయం చేయండి. సత్యం తెలుసుకునేలా యెహోవా వాళ్లకు సహాయం చేశాడంటే వాళ్లు ఆయనకు చాలా విలువైనవాళ్లని గుర్తుచేయండి. (యోహా. 6:44) “విరిగిన హృదయం,” “నలిగిన మనస్సు” ఉన్న తన సేవకుల మీద యెహోవాకు ఎంతో శ్రద్ధ ఉందని భరోసా ఇవ్వండి. (కీర్త. 34:18) మనం కనికరంతో మాట్లాడే మాటలు, బాధల్లో ఉన్నవాళ్లకు నిజంగా ఎంతో ఊరటనిస్తాయి.—సామె. 16:24.

17, 18. (ఎ) సంఘ పెద్దలు తన గొర్రెల్ని ఎలా చూసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం?

17 సంఘపెద్దలారా, మీరు తన గొర్రెల్ని కనికరంతో చూసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (అపొ. 20:28, 29) సంఘ సభ్యులకు బోధించాల్సిన, ప్రోత్సహించాల్సిన, ఓదార్చాల్సిన బాధ్యత మీదేనని గుర్తుంచుకోండి. (యెష. 32:1, 2; 1 పేతు. 5:2-4) కనికరంగల పెద్దలు, సహోదరసహోదరీలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించరు. అంటే వాళ్లకు నియమాలు పెడుతూ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎక్కువ సేవ చేయాలని బలవంతపెట్టరు. బదులుగా, సంఘ సభ్యులు నిజంగా సంతోషంగా ఉండాలని పెద్దలు కోరుకుంటారు. అంతేకాదు, వాళ్లు వీలైనంత ఎక్కువ సేవ చేసేలా యెహోవా మీదున్న ప్రేమే కదిలిస్తుందని పెద్దలు నమ్ముతారు.—మత్త. 22:37.

18 యేసు చూపించిన వినయం, కనికరం గురించి ఆలోచించేకొద్దీ మనం ఇంకా ఎక్కువగా ఆయనలా ఉండడానికి కృషి చేస్తాం. తర్వాతి ఆర్టికల్‌లో, మనం యేసులా ధైర్యాన్ని, వివేచనను ఎలా చూపించవచ్చో చర్చిస్తాం.