ద్వితీయోపదేశకాండం 34:1-12

  • యెహోవా మోషేకు వాగ్దాన దేశం చూపించాడు (1-4)

  • మోషే మరణం (5-12)

34  తర్వాత మోషే మోయాబు ఎడారి మైదానాల నుండి నెబో కొండ పైకి,+ పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లాడు,+ అది యెరికోకు ఎదురుగా ఉంది. యెహోవా ఆ దేశమంతటినీ అతనికి చూపించాడు. అంటే గిలాదు నుండి దాను వరకు,  నఫ్తాలి అంతటినీ, ఎఫ్రాయిము-మనష్షేల ప్రాంతాన్ని, పడమటి సముద్రం*+ వరకు యూదా ప్రాంతమంతటినీ,  నెగెబును,+ యొర్దాను ప్రాంతాన్ని,+ ఖర్జూర చెట్లుగల నగరమైన యెరికో లోయ మైదానాన్ని సోయరు+ వరకు చూపించాడు.  తర్వాత యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ ‘నీ సంతానానికి* దీన్ని ఇస్తాను’ అని నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశం+ ఇదే. నిన్ను ఈ దేశాన్ని కళ్లారా చూడనిచ్చాను, కానీ నువ్వు నది దాటి అక్కడికి వెళ్లవు.”+  ఆ తర్వాత, యెహోవా అంతకుముందే చెప్పినట్టు, యెహోవా సేవకుడైన మోషే అక్కడే మోయాబు దేశంలో చనిపోయాడు.+  ఆయన అతన్ని బేత్పెయోరు ఎదుట, మోయాబు దేశంలోని ఒక మైదానంలో పాతిపెట్టాడు. అతని సమాధి ఎక్కడ ఉందో నేటివరకు ఎవ్వరికీ తెలీదు.+  మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 ఏళ్లు.+ అప్పటికి అతని చూపు మందగించలేదు, అతని బలం తగ్గిపోలేదు.  ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ఎడారి మైదానాల్లో 30 రోజులు మోషే గురించి ఏడ్చారు.+ చివరికి మోషే గురించి ఏడ్చే, దుఃఖించే రోజులు ముగిశాయి.  అంతకుముందు మోషే నూను కుమారుడైన యెహోషువ మీద తన చెయ్యి ఉంచాడు+ కాబట్టి అతను తెలివితో* నిండిపోయాడు; ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అతని మాట వినడం మొదలుపెట్టారు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు చేశారు.+ 10  కానీ యెహోవాకు ముఖాముఖిగా తెలిసిన+ మోషే లాంటి ప్రవక్త+ ఇశ్రాయేలులో మళ్లీ ఇప్పటివరకు పుట్టలేదు. 11  ఐగుప్తు దేశంలో ఫరో ముందు, అతని సేవకులందరి ముందు, అతని దేశమంతటి ముందు చేయమని యెహోవా చెప్పి పంపించిన సూచనలన్నిటినీ, అద్భుతాలన్నిటినీ మోషే చేశాడు. 12  అంతేకాదు అతను ఇశ్రాయేలీయులందరి కళ్లముందు బలమైన చేతిని, అసాధారణ శక్తిని ప్రదర్శించాడు.+

అధస్సూచీలు

అంటే, మహా సముద్రం, మధ్యధరా సముద్రం.
అక్ష., “విత్తనానికి.”
లేదా “దేవుని పవిత్రశక్తి ఇచ్చిన తెలివితో.”