కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జపాన్‌లోని సాక్షులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ బహుమతి

జపాన్‌లోని సాక్షులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ బహుమతి

జపాన్‌లోని నగోయాలో 2013, ఏప్రిల్‌ 28న జరిగిన ఓ ప్రత్యేక కూటంలో, పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్‌ సంతోషకరమైన ఒక ప్రకటన చేశాడు. హాజరైనవాళ్లంతా దాన్ని విని ఎంతో పులకించిపోయారు. ద బైబిల్‌—ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు మాథ్యూ అనే పుస్తకాన్ని జపాన్‌ భాషలో విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. అది వినగానే, కూటానికి హాజరైనవాళ్లతో సహా ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న 2,10,000 మంది ఆగకుండా చప్పట్లు కొట్టారు.

జపాన్‌ భాషలో ఉన్న నూతనలోక అనువాదంలోని మత్తయి సువార్తను, 128 పేజీల ఓ పుస్తకంగా రూపొందించారు. ఆ పుస్తకం ఎంతో ప్రత్యేకమైనది. సహోదరుడు మారిస్‌ ఆ పుస్తకం గురించి వివరిస్తూ, ‘జపాన్‌ ప్రజల అవసరాలను మనసులో పెట్టుకునే’ దాన్ని తయారు చేశారని చెప్పాడు. ఇంతకీ ఆ పుస్తకంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? దాన్ని ఎందుకు తయారు చేశారు? ప్రజలు ఎలా స్పందించారు?

ఆ పుస్తకం ప్రత్యేకత ఏంటి?

మాథ్యూ పుస్తకం రూపురేఖలు చూసి హాజరైనవాళ్లు ఆశ్చర్యపోయారు. జపనీస్‌ భాషలో వాక్యాలను నిలువుగా [పైనుండి కిందకు] లేదా అడ్డంగా రాయవచ్చు. ఆ భాషలోని చాలా పుస్తకాల్లో అడ్డంగా రాసే పద్ధతిని ఉపయోగించారు, అలాగే ఈ మధ్య వచ్చిన మన ప్రచురణల్లో కూడా అదే పద్ధతి ఉపయోగించాం. కానీ ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే, జపనీస్‌ వార్తాపత్రికల్లో, ఇతర గ్రంథాల్లో ఎక్కువగా ఉపయోగించే పద్ధతిని అంటే నిలువుగా రాసే పద్ధతిని ఇందులో ఉపయోగించాం. ఈ పద్ధతిలో రాసిన వాటిని చదవడం తేలికని చాలామంది జపాన్‌ ప్రజలు అంటారు. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ పుస్తకంలో ప్రతీ పేజీలో శీర్షికలకు బదులు ఉపశీర్షికలను పెట్టారు. అందువల్ల, పాఠకులు ముఖ్యమైన అంశాలను తేలిగ్గా గుర్తించగలుగుతారు.

జపాన్‌లోని సహోదరసహోదరీలు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాథ్యూ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టారు. 80లలో ఉన్న ఓ సహోదరి ఇలా చెప్తుంది, “ఇంతకుముందు చాలాసార్లు నేను మత్తయి సువార్త చదివాను. కానీ ఈ పుస్తకంలో వాక్యాలు నిలువుగా ఉండడం వల్ల అలాగే ఉపశీర్షికల వల్ల, యేసు కొండ మీద ఇచ్చిన ప్రసంగాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలిగాను.” ఒక యువ సహోదరి ఇలా రాసింది, ‘నేను మాథ్యూ పుస్తకం మొత్తాన్ని ఆపకుండా ఒకేసారి చదివేశాను. అడ్డంగా రాసివున్న వాక్యాలను చదవడానికి నేను అలవాటుపడ్డాను. కానీ జపాన్‌లో చాలామంది, నిలువుగా రాస్తేనే చదవడానికి ఇష్టపడతారు.’

ప్రత్యేకంగా జపాన్‌ ప్రజల కోసమే

ఈ పుస్తకం జపాన్‌ ప్రజల అవసరాలను ఎలా తీరుస్తుంది? ఆ దేశంలోని చాలామందికి బైబిలు గురించి తెలియకపోయినా, దాన్ని చదవడానికి ఇష్టపడతారు. బైబిల్ని ఎప్పుడూ చూడని వాళ్లు, ఆ పరిశుద్ధ గ్రంథంలోని ఓ భాగాన్ని తమ చేతులతో పట్టుకుని, చదివే అవకాశాన్ని ఈ కొత్త పుస్తకం ఇస్తుంది.

మరి మత్తయి సువార్తనే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే, జపాన్‌ దేశంలోని చాలామందికి “బైబిలు” అనే మాట వినగానే యేసుక్రీస్తు గుర్తొస్తాడు. వాళ్లకు ఆసక్తి కలిగించే విషయాలు అంటే యేసు వంశావళి, ఆయన పుట్టుక, అందరికీ తెలిసిన కొండమీద ప్రసంగం, చివరి రోజులు గురించి ఆయన చెప్పిన ప్రవచనం వంటివి మత్తయి సువార్తలో ఉన్నాయి.

ఆ దేశంలోని రాజ్య ప్రచారకులు, ఇంటింటి పరిచర్యలో అలాగే పునర్దర్శనాల్లో ఈ కొత్త పుస్తకాన్ని ఎంతో ఉత్సాహంగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఓ సహోదరి ఏమి చెప్తుందంటే, “మా ప్రాంతంలోని వాళ్లకు దేవుని వాక్యాన్ని అందించడానికి ఇప్పుడు నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిజానికి, ప్రత్యేక కూటంలో ఆ పుస్తకాన్ని తీసుకున్న మధ్యాహ్నమే ఒక కాపీని అందించగలిగాను.”

ప్రజలు ఎలా స్పందించారు?

ప్రచారకులు ఆ పుస్తకాన్ని ఎలా అందించారు? ‘ఇరుకు ద్వారం,’ ‘ముత్యాలను పందుల ఎదుట వేయడం,’ ‘రేపటి గురించి చింతింపకుడి’ వంటి మాటలు జపాన్‌లోని చాలామందికి పరిచయమే. (మత్త. 6:34; 7:6, 13, 14) అయితే ఆ మాటల్ని చెప్పింది యేసుక్రీస్తు అని తెలుసుకున్నప్పుడు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆ మాటల్ని మత్తయి సువార్తలో చూసిన చాలామంది, “బైబిల్ని కనీసం ఒక్కసారైనా చదవాలని చాలాసార్లు అనిపించింది” అని అన్నారు.

ఆ పుస్తకాన్ని తీసుకున్నవాళ్లను ప్రచారకులు మళ్లీ కలిసినప్పుడు, దాన్ని అందుకున్న వెంటనే కొంతభాగాన్ని చదివేశామని చాలామంది చెప్పారు. 60లలో ఉన్న ఓ వ్యక్తి, “నేను ఈ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను, నాకు ఊరటగా అనిపించింది. నాకు బైబిలు గురించి ఇంకా ఎక్కువ నేర్పించండి” అని ఒక ప్రచారకుణ్ణి అడిగాడు.

మన సహోదరసహోదరీలు బహిరంగ సాక్ష్యంలో కూడా ఈ పుస్తకాన్ని అందిస్తున్నారు. ఓ సహోదరి, బహిరంగ సాక్ష్యంలో ఒక యువతికి ఈ పుస్తకాన్ని ఇచ్చి, తన ఈ-మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చింది. ఒక గంట తర్వాత ఆ యువతి మన సహోదరికి మెయిల్‌ పంపించింది. ఆ పుస్తకంలో కొంత భాగాన్ని చదివానని, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉందని అందులో రాసింది. తర్వాత వారమే ఆమె బైబిలు అధ్యయనం మొదలుపెట్టింది. వెంటనే కూటాలకు రావడం కూడా ప్రారంభించింది.

జపాన్‌లోని సంఘాలకు, ద బైబిల్‌—ద గాస్పెల్‌ అకార్డింగ్‌ టు మాథ్యూ పుస్తకాలను 16,00,000కు పైగా పంపించారు. అక్కడి సాక్షులు ప్రతీనెల కొన్ని వేల పుస్తకాలను పరిచర్యలో అందిస్తున్నారు. ఈ పుస్తకంలోని ముందుమాటలో ఉన్న ఈ మాటలు, దాన్ని ప్రచురించిన వాళ్ల మనోభావాలకు అద్దం పడుతున్నాయి, “బైబిలు పట్ల మీకున్న ఆసక్తిని ఈ పుస్తకం మరింత పెంచుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.”