కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిచర్యలో మీ ఉత్సాహాన్ని కాపాడుకోండి

పరిచర్యలో మీ ఉత్సాహాన్ని కాపాడుకోండి

సువార్త ప్రకటించడమే నేడు భూమ్మీద జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని. ఓ యెహోవాసాక్షిగా, శిష్యులను చేసే ఈ పనిలో పాల్గొనడం గొప్ప గౌరవంగా మనం భావిస్తాం. అయితే, పయినీర్లకు, ప్రచారకులకు పరిచర్యలో తమ ఉత్సాహాన్ని కాపాడుకోవడం కొన్నిసార్లు కష్టంకావచ్చు. ఎందుకు?

పరిచర్యలో ఉత్సాహాన్ని కాపాడుకోవాలంటే మీరేమి చేయాలి?

కొంతమంది ప్రచారకులు ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు, ప్రజలు ఎక్కువగా ఇళ్లల్లో ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్లు ఇంట్లో ఉన్నా, మనం చెప్పే రాజ్యసందేశాన్ని ఇష్టపడకపోవచ్చు, కొన్నిసార్లు కోప్పడవచ్చు కూడా. ఇంకొంతమంది ప్రచారకులు, సువార్తకు చక్కగా స్పందించే ప్రజలున్న పెద్ద క్షేత్రంలో ప్రకటిస్తున్నారు. అయితే, ఆ క్షేత్రంలో ఉన్న ప్రతీఒక్కరికి ప్రకటించడం తమవల్ల కాదేమోనని భయపడుతుంటారు. చాలా సంవత్సరాల నుండి ప్రకటిస్తున్న మరికొంతమంది, అంతం ఇంకా రాలేదనే నిరుత్సాహంలో ఉన్నారు.

ప్రకటనా పనిలో మన ఉత్సాహాన్ని నీరుగార్చే అనేక సవాళ్లు మనకు ఎదురౌతాయి. మనం జీవిస్తున్న ఈ లోకం “దుష్టుని” గుప్పిట్లో ఉంది. కాబట్టి సువార్త ప్రకటించడం అంత సులభం కాదని మనకు తెలుసు.—1 యోహా. 5:19.

ప్రకటనా పనిలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా, వాటిని అధిగమించడానికి యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. అయితే, మీరు మరింత ఉత్సాహంగా ఎలా పరిచర్య చేయవచ్చు? కొన్ని సలహాలు పరిశీలిద్దాం.

కొత్త ప్రచారకులకు సహాయం చేయండి

ప్రతీ సంవత్సరం, ప్రజలు లక్షల సంఖ్యలో బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులు అవుతున్నారు. మీరు ఈ మధ్యే బాప్తిస్మం తీసుకున్నారా? అయితే, చాలా సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న వాళ్లనుండి మీరు ఎంతో నేర్చుకోవచ్చు. లేదా మీరు ఎన్నో ఏళ్లుగా సువార్త ప్రకటిస్తున్నట్లయితే, మీ సహాయం కొత్తవాళ్లకు చాలా అవసరం. అలా చేయడం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది.

తన శిష్యులు మంచి బోధకులవ్వాలంటే వాళ్లకు నిర్దేశం అవసరమని యేసుకు తెలుసు. అందుకే, ఇతరులకు ఎలా ప్రకటించాలో యేసు వాళ్లకు చూపించాడు. (లూకా 8:1) కొత్త ప్రచారకులు చక్కగా ప్రకటించగలిగేలా మనం కూడా వాళ్లకు అలాంటి శిక్షణే ఇవ్వాలి.

ఒక కొత్త ప్రచారకుడు పరిచర్యకు వెళ్తున్నాడు కాబట్టి ఎలా మాట్లాడాలో ఆయనే నేర్చుకుంటాడులే అని అనుకోకూడదు. ప్రేమగా, దయగా నేర్పించే ఓ అనుభవంగల ప్రచారకుడు ఆయనకు సహాయం చేయాలి. (1) ఇంటివాళ్లతో ఏమి మాట్లాడాలో సిద్ధపడి, ప్రాక్టీసు చేయడం, (2) ఇంటివాళ్ల అభిప్రాయాల్ని రాబట్టడం, (3) పత్రిక అందించడం, (4) ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలవడం, (5) బైబిలు స్టడీ మొదలుపెట్టడం వంటివాటిని కొత్త ప్రచారకులకు నేర్పించాలి. అనుభవమున్న ప్రచారకులు ఎలా మాట్లాడుతున్నారో గమనిస్తూ, వాళ్లలా మాట్లాడడం నేర్చుకుంటే కొత్తవాళ్లు పరిచర్యలో నైపుణ్యం పెంచుకోవచ్చు. (లూకా 6:40) తమకు సహాయం చేసేవాళ్లు పక్కనే ఉన్నప్పుడు, కొత్త ప్రచారకులు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేకాదు, వాళ్లను మెచ్చుకుంటూ, సలహాలు ఇస్తుంటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.—ప్రసం. 4:9, 10.

మీతో కలిసి పరిచర్య చేస్తున్నవాళ్లతో మాట్లాడండి

కొన్నిసార్లు మీకు పరిచర్యలో ఎదురయ్యే అనుభవాలకన్నా, మీతో కలిసి పరిచర్య చేసే వాళ్లతో మాట్లాడిన మాటలే మీకు ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. ప్రకటనా పనికి యేసు తన శిష్యుల్ని “ఇద్దరిద్దరినిగా” పంపించాడని గుర్తుచేసుకోండి. (లూకా 10:1) అలా వాళ్లు కలిసి పనిచేస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. మనం కూడా పరిచర్యలో తోటి సహోదరసహోదరీలతో కలిసి పనిచేసినప్పుడు “ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ” పొందుతాము.—రోమా. 1:11.

మీరు వేటి గురించి మాట్లాడుకోవచ్చు? ఈ మధ్య కాలంలో, మీకు ఎదురైన ప్రోత్సాహకరమైన అనుభవం గురించి, వ్యక్తిగత అధ్యయనంలో లేదా కుటుంబ ఆరాధనలో మీరు నేర్చుకున్న ఆసక్తికరమైన విషయం గురించి, కూటాల్లో మీరు విన్న ఓ ప్రోత్సాహకరమైన అంశం గురించి మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు, మీకు అంతగా తెలియని ప్రచారకులతో కలిసి పరిచర్య చేస్తుండవచ్చు. వాళ్లు ఎలా సత్యంలోకి వచ్చారో, ఇదే యెహోవా సంస్థ అని వాళ్లకు నమ్మకం ఎలా కుదిరిందో అడిగి తెలుసుకోవచ్చు. యెహోవా సేవలో వాళ్లకు వచ్చిన అవకాశాలు, ఎదురైన అనుభవాలు అడగవచ్చు. మీకు ఎదురైన అనుభవాలు గురించి కూడా వాళ్లతో చెప్పవచ్చు. పరిచర్యలో ప్రజలు ఎలా ప్రతిస్పందించినా, మీరిద్దరూ ‘ఒకనికొకడు క్షేమాభివృద్ధి’ కలిగేలా మాట్లాడుకునే అవకాశం ఉంది.—1 థెస్స. 5:11.

మీ అధ్యయన అలవాట్లను మెరుగుపర్చుకోండి

పరిచర్యలో ఉత్సాహాన్ని కాపాడుకోవాలంటే మన అధ్యయన అలవాట్లను మెరుగుపర్చుకోవాలి. మన వ్యక్తిగత అధ్యయనంలో పరిశీలించగల అనేక అంశాల గురించి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎంతో సమాచారం అందిస్తున్నాడు. (మత్త. 24:45) అలాంటి ఒక చక్కని అంశం: ప్రకటనా పని ఎందుకంత ప్రాముఖ్యం? కొన్ని కారణాలు, “పరిచర్యలో మీ ఉత్సాహాన్ని ఎందుకు కాపాడుకోవాలి?” అనే బాక్సులో ఉన్నాయి.

అందులోని విషయాలు పరిచర్యలో మీ ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తాయి. వీలైతే, ఉత్సాహంగా ప్రకటించడానికి ఇంకా ఏయే కారణాలున్నాయో మీ వ్యక్తిగత అధ్యయనంలో పరిశీలించండి. ఆ తర్వాత వాటిగురించి లోతుగా ఆలోచించండి. అలా చేస్తే, పరిచర్య పట్ల మీ ఉత్సాహం మరింత పెరుగుతుంది.

కొత్త పద్ధతుల్లో ప్రకటించడానికి ప్రయత్నించండి

పరిచర్య మరింత బాగా చేయడానికి ఉపయోగపడే సలహాలను యెహోవా సంస్థ ఎప్పటికప్పుడు ఇస్తుంది. ఉదాహరణకు, ఇంటింటి పరిచర్యతోపాటు, ఉత్తరాల ద్వారా సాక్ష్యం, టెలిఫోన్‌ సాక్ష్యం, వీధి లేదా బహిరంగ సాక్ష్యం, అనియత సాక్ష్యం లేదా వ్యాపార స్థలాల్లో ప్రకటించడం వంటి పద్ధతులు కూడా ప్రయత్నించవచ్చు. సాక్షులు తక్కువగావున్న లేదా అస్సలు లేని ప్రాంతాల్లో కూడా ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు.

ఇలాంటి పద్ధతుల్లో ప్రకటించడం మీకిష్టమేనా? ఈ సలహాలను పాటించిన చాలామంది చక్కని ఫలితాలు పొందారు. అలాంటి మూడు అనుభవాలు చూద్దాం.

ఏప్రియల్‌ అనే సహోదరి, బైబిలు అధ్యయనాలు ఎలా ప్రారంభించాలి అనే అంశంమీద మన రాజ్య పరిచర్యలో వచ్చిన సలహాను పాటించాలని నిర్ణయించుకుంది. తనతోపాటు పనిచేస్తున్న ముగ్గురితో బైబిలు అధ్యయనం గురించి చెప్పింది. వాళ్లు ముగ్గురూ స్టడీకి ఒప్పుకోవడంతోపాటు, సంఘ కూటాలకు కూడా హాజరవ్వడం చూసి ఆమె ఎంతో సంతోషించింది.

మన పత్రికల్లో వచ్చే కొన్ని ప్రత్యేక ఆర్టికల్స్‌ను ఇష్టపడేవాళ్ల కోసం వెదకమని కూడా సంస్థ మనల్ని ప్రోత్సహిస్తుంది. అమెరికాలోని ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు, టైర్లు గురించిన ఆర్టికల్‌ ఉన్న ఓ తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికను ఒక ప్రాంతంలోని టైర్ల షాపుల మేనేజర్లందరికీ ఇచ్చాడు. అంతేకాదు, ఆయన తన భార్యతోపాటు, “మీ డాక్టరును అర్థం చేసుకోండి” అనే శీర్షిక ఉన్న తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికను 100కు పైగా హాస్పిటల్స్‌లో అందించాడు. ఆ ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా అన్నాడు, ‘అలా కలవడం వల్ల మన ప్రకటనా పని గురించి, మన ప్రచురణల గురించి వాళ్లకు చెప్పగలిగాం. అంతేకాదు, అక్కడున్న వాళ్లతో మాకు పరిచయం పెరగడం వల్ల వాళ్లను చాలాసార్లు మళ్లీ కలవగలిగాం.’

జూడి అనే సహోదరి, టెలిఫోన్‌ సాక్ష్యం ఇవ్వమని సంస్థ ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు చెప్తూ ప్రపంచ ప్రధాన కార్యాలయానికి ఉత్తరం రాసింది. 86 ఏళ్లున్న వాళ్ల అమ్మ, ఎన్నో అనారోగ్య సమస్యలున్నా క్రమంగా టెలిఫోన్‌ సాక్ష్యం ఇస్తుందని, 92 ఏళ్లున్న ఓ మహిళతో బైబిలు అధ్యయనం చేస్తూ సంతోషిస్తుందని ఆ ఉత్తరంలో రాసింది.

మన ప్రచురణల్లో వచ్చే సలహాలు పాటిస్తే చక్కని ఫలితాలు వస్తాయి. వాటిని ప్రయత్నించండి. పరిచర్యలో మీ సంతోషాన్ని, ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి అవి సహాయం చేస్తాయి.

చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోండి

పరిచర్య ఎంత బాగా చేస్తున్నామనేది దేన్నిబట్టి చెప్పవచ్చు? మనం ఎన్ని పత్రికలు అందించాం, ఎన్ని బైబిలు అధ్యయనాలు చేస్తున్నాం, యెహోవాసాక్షులు అయ్యేలా ఎంతమందికి సహాయం చేశాం అనే వాటినిబట్టి కాదు. నోవహు గురించి ఆలోచించండి. ఆయన యెహోవా ఆరాధకులయ్యేలా తన కటుంబం సభ్యులకు కాక ఎంతమందికి సహాయం చేశాడు? అయినప్పటికీ, నోవహు సమర్థవంతమైన సువార్తికుడని బైబిలు చెప్తుంది. కాబట్టి, మనం ఎంత నమ్మకంగా యెహోవాకు సేవ చేస్తున్నామన్నదే ముఖ్యం.—1 కొరిం. 4:2.

పరిచర్యను ఉత్సాహంగా చేయాలంటే, చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోవాలని చాలామంది ప్రచారకులు గుర్తించారు. అలాంటి కొన్ని లక్ష్యాలు ఏమిటి? “చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోండి” అనే బాక్సులోని కొన్ని సలహాల్ని గమనించండి.

మీరు పరిచర్యలో ఆనందించేలా, మంచి ఫలితాలు సాధించేలా సహాయం చేయమని యెహోవాను అడగండి. మీ లక్ష్యాలు చేరుకున్నప్పుడు, సువార్త ప్రకటించడానికి చేయగలిగినదంతా చేస్తున్నారనే సంతృప్తి మీకుంటుంది.

నిజమే, సువార్త ప్రకటించడం కొన్నిసార్లు సవాలే. అయినప్పటికీ కొన్ని సలహాలు పాటిస్తే మీరు పరిచర్యలో ఉత్సాహంగా కొనసాగవచ్చు. మీతో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్లతో మాట్లాడుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. వ్యక్తిగత అధ్యయనాన్ని క్రమంగా, ప్రయోజనం కలిగే విధంగా చేయండి, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసుడు ఇస్తున్న సలహాల్ని పాటించండి. మీరు చేరుకోగల లక్ష్యాలు పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా, తన సాక్షులుగా సువార్త ప్రకటించే గొప్ప అవకాశాన్ని యెహోవా మీకిచ్చాడని గుర్తుంచుకోండి. (యెష. 43:10) అవును, పరిచర్యలో ఉత్సాహాన్ని కాపాడుకోవడం వల్ల మీరు ఎంతో సంతోషం పొందుతారు.