లూకా సువార్త 9:1-62

  • పరిచర్య కోసం పన్నెండుమందికి నిర్దేశాలు (1-6)

  • యేసును బట్టి హేరోదు కంగారుపడడం (7-9)

  • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (10-17)

  • పేతురు క్రీస్తును గుర్తించడం (18-20)

  • యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (21, 22)

  • యేసును అనుసరించాలంటే ఏంచేయాలి (23-27)

  • యేసు రూపాంతరం (28-36)

  • చెడ్డదూత పట్టిన అబ్బాయి బాగవ్వడం (37-43ఎ)

  • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (43బి-45)

  • తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకోవడం (46-48)

  • మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మనవైపే ఉన్నాడు (49, 50)

  • సమరయలోని ఒక గ్రామంవాళ్లు యేసును తిరస్కరించడం (51-56)

  • యేసును ఎలా అనుసరించాలి (57-62)

9  తర్వాత ఆయన ఆ పన్నెండుమందిని పిలిచి, చెడ్డదూతలందర్నీ* వెళ్లగొట్టడానికి, రోగుల్ని బాగుచేయడానికి వాళ్లకు శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు.+ 2  అలాగే, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, రోగుల్ని బాగుచేయడానికి వాళ్లను పంపిస్తూ 3  ఇలా చెప్పాడు: “ప్రయాణం కోసం ఏమీ తీసుకెళ్లొద్దు. చేతికర్రను గానీ, ఆహారం మూటను గానీ, రొట్టెను గానీ, డబ్బులు* గానీ తీసుకెళ్లొద్దు. అదనపు వస్త్రాన్ని* కూడా ఉంచుకోవద్దు.+ 4  అయితే ఎక్కడైనా మీరొక ఇంట్లో అడుగుపెడితే, ఆ ఊరిని విడిచి వెళ్లిపోయేవరకు ఆ ఇంట్లోనే ఉండండి.+ 5  ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఆ ఊరిని విడిచి వెళ్లేటప్పుడు వాళ్లమీద సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేయండి.”+ 6  తర్వాత ఆ పన్నెండుమంది బయల్దేరి, ఆ ప్రాంతంలోని గ్రామాలన్నిట్లో తిరుగుతూ ప్రతీచోట మంచివార్త ప్రకటిస్తూ, రోగుల్ని బాగుచేస్తూ వెళ్లారు.+ 7  గలిలయ ప్రాంత పరిపాలకుడైన* హేరోదు* జరుగుతున్న వాటన్నిటి గురించి విని, చాలా కంగారుపడ్డాడు. ఎందుకంటే, యోహాను మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని కొంతమంది చెప్పుకుంటున్నారు.+ 8  అయితే ఇంకొంతమంది ఏలీయా మళ్లీ వచ్చాడని, మరికొంతమంది ప్రాచీన ప్రవక్తల్లో ఒకరు మళ్లీ బ్రతికారని చెప్పుకుంటున్నారు.+ 9  హేరోదు ఇలా అన్నాడు: “నేను యోహాను తలను నరికించాను కదా.+ మరి ఈయన ఎవరు? ఈయన గురించి నేను రకరకాల విషయాలు వింటున్నాను.” కాబట్టి హేరోదు ఆయన్ని చూడాలని ఎంతో కోరుకున్నాడు.+ 10  అపొస్తలులు తిరిగొచ్చినప్పుడు, తాము చేసినవాటన్నిటి గురించి యేసుకు చెప్పారు.+ కాబట్టి ఆయన వాళ్లను వెంటబెట్టుకొని, వాళ్లు ఏకాంతంగా ఉండడం కోసం బేత్సయిదా నగరానికి తీసుకెళ్లాడు.+ 11  అయితే ప్రజలు ఆ సంగతి తెలుసుకొని, ఆయన వెనక వెళ్లారు. ఆయన వాళ్లను ప్రేమతో చేర్చుకొని, దేవుని రాజ్యం గురించి వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు; రోగాలతో బాధపడుతున్న వాళ్లను బాగుచేశాడు.+ 12  సాయంత్రం కావస్తున్నప్పుడు ఆ పన్నెండుమంది ఆయన దగ్గరికి వచ్చి, “మనం మారుమూల ప్రాంతంలో ఉన్నాం. కాబట్టి నువ్వు ప్రజల్ని పంపించేస్తే, వాళ్లు చుట్టుపక్కల గ్రామాల్లోకి, ఊళ్లలోకి వెళ్లి ఉండడానికి స్థలం వెతుక్కుంటారు, ఆహారం కొనుక్కుంటారు” అని అన్నారు.+ 13  అయితే యేసు వాళ్లతో, “మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి” అన్నాడు.+ దానికి వాళ్లు, “మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు. మేము వెళ్లి వీళ్లందరి కోసం ఆహారం కొనుక్కురావాలా?” అన్నారు. 14  నిజానికి అక్కడ దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. యేసు తన శిష్యులతో, “ఒక్కో గుంపులో దాదాపు 50 మంది ఉండేలా వాళ్లందర్నీ గుంపులుగుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పాడు. 15  వాళ్లు ఆయన చెప్పినట్టే ప్రజలందర్నీ కూర్చోబెట్టారు. 16  ఆయన ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి వాటిని దీవించాడు. తర్వాత ఆయన వాటిని విరిచి, ప్రజలకు పెట్టడానికి శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. 17  దాంతో వాళ్లంతా తృప్తిగా తిన్నారు. మిగిలిన ముక్కల్ని పోగుచేసినప్పుడు 12 గంపలు అయ్యాయి.+ 18  ఒకరోజు యేసు ఒంటరిగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడాయన, “ప్రజలు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు.+ 19  దానికి వాళ్లు, “బాప్తిస్మమిచ్చే యోహానువని చెప్పుకుంటున్నారు. కొందరేమో ఏలీయావని చెప్పుకుంటున్నారు. ఇంకొందరేమో, ప్రాచీనకాల ప్రవక్తల్లో ఒకరు మళ్లీ బ్రతికారని చెప్పుకుంటున్నారు” అని అన్నారు.+ 20  అప్పుడు ఆయన, “మరి మీరు, నేనెవరినని అనుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి”* అన్నాడు.+ 21  తర్వాత యేసు, ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+ 22  అంతేకాదు ఆయన ఇలా అన్నాడు: “మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలి; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి, చంపబడాలి;+ తర్వాత మూడో రోజున బ్రతికించబడాలి.”+ 23  తర్వాత ఆయన అందరితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా,+ ప్రతీరోజు తన హింసాకొయ్యను* మోస్తూ, నన్ను అనుసరిస్తూ ఉండాలి.+ 24  ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.+ 25  నిజానికి, ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే లేదా హాని చేసుకుంటే, అతనికి ఏం లాభం?+ 26  ఎవరైనా నా శిష్యుణ్ణని, నా మాటలు నమ్ముతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే మానవ కుమారుడు తన మహిమతో, తన తండ్రి మహిమతో, తన పవిత్ర దూతల మహిమతో వచ్చినప్పుడు అతని విషయంలో సిగ్గుపడతాడు.+ 27  నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవాళ్లలో కొంతమంది దేవుని రాజ్యాన్ని చూసేవరకు చనిపోరు.”+ 28  నిజానికి, ఆ మాటలు చెప్పిన దాదాపు ఎనిమిది రోజుల తర్వాత యేసు పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థించడానికి కొండ మీదికి వెళ్లాడు.+ 29  ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖ రూపం మారిపోయింది. ఆయన బట్టలు తెల్లగా అయ్యి తళతళ మెరుస్తున్నాయి. 30  అప్పుడు ఇదిగో! ఇద్దరు మనుషులు ఆయనతో మాట్లాడుతున్నారు. వాళ్లు ఎవరంటే మోషే, ఏలీయా. 31  వాళ్లు తేజస్సుతో కనిపించి, యేసు ఈ లోకం నుండి వెళ్లిపోవడం గురించి, అంటే యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న దాని గురించి+ మాట్లాడడం మొదలుపెట్టారు. 32  అప్పుడు పేతురు, అతనితో పాటు ఉన్నవాళ్లు నిద్రమత్తులో ఉన్నారు. వాళ్లు పూర్తిగా మేల్కొన్నప్పుడు ఆయన తేజస్సును,+ ఆయనతో పాటు నిలబడి ఉన్న ఆ ఇద్దర్ని చూశారు. 33  వాళ్లిద్దరు ఆయన దగ్గర నుండి వెళ్లిపోతుండగా పేతురు యేసుతో, “బోధకుడా, మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది. కాబట్టి మమ్మల్ని మూడు డేరాలు వేయనివ్వు. ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలీయాకు” అన్నాడు. నిజానికి అతను ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. 34  అతను అలా మాట్లాడుతుండగా ఒక మేఘం ఏర్పడి వాళ్లను కమ్ముకోవడం మొదలుపెట్టింది. దాంతో వాళ్లు భయపడిపోయారు. 35  అప్పుడు ఆ మేఘంలో నుండి ఒక స్వరం+ ఇలా వినిపించింది: “ఈయన నేను ఎంచుకున్న నా కుమారుడు.+ ఈయన మాట వినండి.”+ 36  ఆ స్వరం వినిపించే సమయానికి అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. అయితే ఆ రోజుల్లో వాళ్లు తాము చూసిన దేని గురించీ ఎవరికీ చెప్పలేదు.+ 37  తర్వాతి రోజు వాళ్లు కొండ దిగి వచ్చినప్పుడు, చాలామంది ప్రజలు ఆయనకు ఎదురయ్యారు.+ 38  అప్పుడు ఇదిగో! వాళ్లలో ఒకతను ఇలా అరిచాడు: “⁠బోధకుడా, ఒకసారి వచ్చి నా కుమారుణ్ణి చూడమని వేడుకుంటున్నాను. అతను నా ఒక్కగానొక్క కుమారుడు.+ 39  ఇదిగో! ఒక చెడ్డదూత నా కుమారుణ్ణి లొంగదీసుకుంటూ ఉంటాడు. దాంతో అతను ఉన్నట్టుండి పెద్దగా కేకలు వేస్తాడు. ఆ చెడ్డదూత అతన్ని గిలగిల కొట్టుకునేలా చేస్తాడు. అప్పుడు అతని నోటి నుండి నురగ వస్తుంది. ఆ చెడ్డదూత అతన్ని గాయపర్చి, అతి కష్టం మీద గానీ అతనిలో నుండి బయటికి రాడు. 40  ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నేను నీ శిష్యుల్ని వేడుకున్నాను కానీ అది వాళ్లవల్ల కాలేదు.” 41  అప్పుడు యేసు, “విశ్వాసంలేని చెడ్డ* తరమా,+ ఎంతకాలం నేను మీతో ఉంటూ మిమ్మల్ని సహించాలి? నీ కుమారుణ్ణి ఇక్కడికి తీసుకురా” అన్నాడు.+ 42  అతను వస్తున్నప్పుడు కూడా ఆ చెడ్డదూత అతన్ని కిందపడేసి, అతను భయంకరంగా గిలగిల కొట్టుకునేలా చేశాడు. అయితే యేసు ఆ అపవిత్ర దూతను* గద్దించి, ఆ అబ్బాయిని బాగుచేసి, అతన్ని వాళ్ల నాన్నకు అప్పగించాడు. 43  వాళ్లంతా దేవుని గొప్ప శక్తిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన చేస్తున్న వాటన్నిటిని చూసి వాళ్లు అలా ఆశ్చర్యపోతుండగా, ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: 44  “ఈ మాటలు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు.”+ 45  కానీ ఆయన ఏం చెప్తున్నాడో వాళ్లకు అర్థంకాలేదు. నిజానికి వాళ్లు అర్థం చేసుకోకుండా ఉండేలా అది దాచబడి ఉంది. పైగా ఆ మాట గురించి ఆయన్ని ప్రశ్నించడానికి వాళ్లు భయపడ్డారు. 46  తర్వాత, తమలో ఎవరు గొప్ప అనే దాని గురించి వాళ్ల మధ్య గొడవ మొదలైంది.+ 47  యేసుకు వాళ్ల హృదయాలోచన తెలుసు కాబట్టి, ఆయన ఒక చిన్న బాబును పిలిచి, తన పక్కన నిలబెట్టుకొని 48  వాళ్లతో ఇలా అన్నాడు: “నా పేరున ఈ పిల్లవాణ్ణి చేర్చుకునే వ్యక్తి నన్ను కూడా చేర్చుకుంటున్నాడు. నన్ను చేర్చుకునే వ్యక్తి, నన్ను పంపిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటున్నాడు.+ మీ అందరిలో ఎవరు తక్కువవాడిలా నడుచుకుంటాడో అతనే గొప్పవాడు.”+ 49  అప్పుడు యోహాను, “బోధకుడా, ఒకతను నీ పేరున చెడ్డదూతల్ని వెళ్లగొడుతుండడం మేము చూశాం. అతను మాతో కలిసి నిన్ను అనుసరించట్లేదు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాం” అన్నాడు.+ 50  అయితే యేసు, “అతన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. మీకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మీ వైపే ఉన్నాడు” అని అతనితో అన్నాడు. 51  ఆయన పరలోకానికి వెళ్లే సమయం దగ్గరపడుతుండగా,*+ ఆయన యెరూషలేముకు వెళ్లాలని బలంగా నిశ్చయించుకున్నాడు. 52  కాబట్టి ఆయన తనకు ముందుగా కొంతమంది శిష్యుల్ని పంపించాడు. వాళ్లు ఆయన కోసం ఏర్పాట్లు చేయడానికి సమరయుల గ్రామాల్లో ఒకదానికి వెళ్లారు. 53  అయితే, ఆయన యెరూషలేముకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి అక్కడివాళ్లు ఆయన్ని చేర్చుకోలేదు.+ 54  ఆయన శిష్యులు యాకోబు, యోహాను+ అది చూసి, “ప్రభువా, వీళ్లను నాశనం చేయడానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటావా?” అని అన్నారు.+ 55  కానీ ఆయన వాళ్లవైపు తిరిగి, వాళ్లను గద్దించాడు. 56  అప్పుడు వాళ్లు ఇంకో గ్రామానికి వెళ్లారు. 57  వాళ్లు దారిలో వెళ్తుండగా ఒకతను ఆయనతో, “నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెంట వస్తాను” అన్నాడు. 58  యేసు అతనితో, “నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి. కానీ మానవ కుమారుడు తల వాల్చడానికి ఎక్కడా స్థలం లేదు” అన్నాడు.+ 59  తర్వాత ఆయన ఇంకో వ్యక్తితో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. దానికి అతను, “ప్రభువా, ముందు వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు” అన్నాడు.+ 60  కానీ యేసు అతనితో, “మృతులు+ తమ మృతుల్ని పాతిపెట్టుకోనివ్వు. నువ్వు వెళ్లి ప్రతీచోట దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అన్నాడు.+ 61  ఆ తర్వాత ఇంకో వ్యక్తి, “ప్రభువా, నేను నీ వెంట వస్తాను. కానీ ముందు మా ఇంట్లోవాళ్లకు వీడ్కోలు చెప్పిరావడానికి అనుమతి ఇవ్వు” అన్నాడు. 62  యేసు అతనికి ఇలా చెప్పాడు: “నాగలి మీద చెయ్యి పెట్టి వెనక ఉన్నవాటి వైపు చూసే వాళ్లెవ్వరూ+ దేవుని రాజ్యంలో ఉండడానికి తగినవాళ్లు కాదు.”+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “వెండి.”
అక్ష., “రెండు వస్త్రాల్ని.”
అక్ష., “చతుర్థాధిపతైన.”
అంటే, హేరోదు అంతిప. పదకోశం చూడండి.
అక్ష., “దేవుని క్రీస్తువు.”
పదకోశం చూడండి.
లేదా “వక్ర.”
పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
అక్ష., “పూర్తి కావస్తుండగా.”