మత్తయి సువార్త 8:1-34

  • ఒక కుష్ఠురోగి బాగవ్వడం (1-4)

  • ఒక సైనికాధికారి విశ్వాసం (5-13)

  • యేసు కపెర్నహూములో చాలామందిని బాగుచేయడం (14-17)

  • యేసును ఎలా అనుసరించాలి (18-22)

  • యేసు తుఫానును నిమ్మళింపజేయడం (23-27)

  • యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం (28-34)

8  యేసు ఆ కొండ దిగి వచ్చాక చాలామంది ప్రజలు ఆయన వెంట వెళ్లారు. 2  అప్పుడు ఇదిగో! ఒక కుష్ఠురోగి వచ్చి ఆయనకు వంగి నమస్కారం చేసి, “ప్రభువా, నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అన్నాడు.+ 3  యేసు తన చెయ్యి చాపి, అతన్ని ముట్టుకుని, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అన్నాడు.+ వెంటనే అతని కుష్ఠురోగం పోయి, అతను శుద్ధుడయ్యాడు.+ 4  అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “జాగ్రత్త, ఈ విషయం ఎవరికీ చెప్పకు.+ అయితే వెళ్లి యాజకునికి కనిపించి,+ మోషే ధర్మశాస్త్రం నియమించిన కానుకను అర్పించు.+ ఇది వాళ్లకు సాక్ష్యంగా ఉంటుంది.” 5  యేసు కపెర్నహూముకు వచ్చినప్పుడు, ఒక సైనికాధికారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని బ్రతిమాలుతూ,+ 6  “అయ్యా, నా సేవకుడు పక్షవాతంతో ఇంట్లో పడివున్నాడు, అతను ఎంతో బాధపడుతున్నాడు” అని అన్నాడు. 7  యేసు అతనితో, “నేను అక్కడికి వచ్చినప్పుడు అతన్ని బాగుచేస్తాను” అన్నాడు. 8  అప్పుడు ఆ సైనికాధికారి ఇలా అన్నాడు: “అయ్యా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాను. నువ్వు ఒక్కమాట చెప్పు చాలు, నా సేవకుడు బాగైపోతాడు. 9  నేను కూడా అధికారం కింద ఉన్నవాణ్ణే; నా కింద సైనికులు ఉన్నారు, నేను ఒకతన్ని ‘వెళ్లు!’ అంటే వెళ్తాడు; ఇంకొకతన్ని ‘రా!’ అంటే వస్తాడు; నా దాసునితో, ‘ఇది చేయి!’ అంటే చేస్తాడు.” 10  ఆ మాటలు విన్నప్పుడు యేసు చాలా ఆశ్చర్యపోయి, తన వెంట వస్తున్నవాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో నిజం చెప్తున్నాను, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాళ్లు ఎవ్వరూ నాకు కనిపించలేదు.+ 11  నేను మీతో చెప్తున్నాను, తూర్పు నుండి, పడమర నుండి చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు బల్ల దగ్గర కూర్చుంటారు;+ 12  అయితే రాజ్యంలోకి వెళ్లాల్సినవాళ్లు* మాత్రం బయట చీకట్లోకి తోసేయబడతారు. అక్కడ వాళ్లు ఏడుస్తూ, పళ్లు కొరుక్కుంటూ ఉంటారు.”+ 13  తర్వాత యేసు ఆ సైనికాధికారితో, “వెళ్లు, నువ్వు విశ్వాసం చూపించావు కాబట్టి నువ్వు కోరుకున్నట్టే జరగాలి” అన్నాడు.+ ఆ క్షణంలోనే అతని సేవకుడు బాగయ్యాడు.+ 14  యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు, పేతురు అత్త+ జ్వరంతో పడుకొని ఉండడం చూశాడు.+ 15  కాబట్టి యేసు ఆమెను ముట్టుకున్నాడు,+ దాంతో ఆమె జ్వరం పోయింది. ఆమె లేచి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టింది. 16  సాయంత్రం అయ్యాక, ప్రజలు చెడ్డదూతలు* పట్టిన చాలామందిని యేసు దగ్గరికి తీసుకొచ్చారు; ఆయన ఒక్కమాటతో ఆ చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు, అనారోగ్యంతో ఉన్న వాళ్లందర్నీ బాగుచేశాడు. 17  “ఆయనే మన రోగాల్ని, జబ్బుల్ని మోసుకెళ్లాడు” అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు అలా నెరవేరాయి.+ 18  యేసు తన చుట్టూ ప్రజలు ఉండడం చూసి, పడవను అవతలి వైపుకు తీసుకెళ్లమని శిష్యులకు ఆజ్ఞాపించాడు.+ 19  అప్పుడు ఒక శాస్త్రి వచ్చి యేసుతో, “బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ వెంట వస్తాను” అన్నాడు.+ 20  యేసు అతనితో, “నక్కలకు బొరియలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి. కానీ మానవ కుమారుడు* తల వాల్చడానికి ఎక్కడా స్థలం లేదు” అన్నాడు.+ 21  తర్వాత ఆయన శిష్యుల్లో ఒకతను, “ప్రభువా, ముందు వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వు” అని ఆయనతో అన్నాడు.+ 22  అందుకు యేసు అతనితో, “నువ్వు నన్ను అనుసరిస్తూ ఉండు, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకోనివ్వు” అన్నాడు.+ 23  తర్వాత యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కి బయల్దేరారు.+ 24  అప్పుడు ఇదిగో! సముద్రంలో ఒక పెద్ద తుఫాను చెలరేగింది. దాంతో అలల వల్ల పడవలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి; అయితే యేసు నిద్రపోతున్నాడు.+ 25  అప్పుడు శిష్యులు వచ్చి, “ప్రభువా, చనిపోయేలా ఉన్నాం! రక్షించు!” అంటూ ఆయన్ని నిద్రలేపారు. 26  కానీ ఆయన వాళ్లతో, “అల్పవిశ్వాసులారా, మీరెందుకు ఇంత భయపడుతున్నారు?”+ అని చెప్పి, లేచి గాలుల్ని, సముద్రాన్ని గద్దించాడు; దాంతో అంతా చాలా ప్రశాంతంగా మారిపోయింది.+ 27  కాబట్టి శిష్యులు ఎంతో ఆశ్చర్యపోయి, “అసలు ఈయన ఎవరు? చివరికి గాలులు, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు. 28  ఆయన సముద్రానికి అవతలి వైపున్న గదరేనువాళ్ల ప్రాంతానికి వచ్చినప్పుడు, చెడ్డదూతలు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల* మధ్య నుండి ఆయనకు ఎదురొచ్చారు.+ వాళ్లు చాలా భయంకరంగా ఉండడం వల్ల ఆ దారిలో వెళ్లే ధైర్యం ఎవరికీ లేకపోయింది. 29  అప్పుడు వాళ్లు, “దేవుని కుమారుడా, మాతో నీకేం పని?+ సమయం రాకముందే మమ్మల్ని హింసించాలని ఇక్కడికి వచ్చావా?”+ అని కేకలు వేశారు.+ 30  వాళ్లకు దూరంలో ఒక పెద్ద పందుల మంద మేత మేస్తూ ఉంది.+ 31  కాబట్టి ఆ చెడ్డదూతలు, “ఒకవేళ నువ్వు మమ్మల్ని వెళ్లగొడితే, ఆ పందుల్లోకి పంపించు” అని ఆయన్ని వేడుకోవడం మొదలుపెట్టారు.+ 32  ఆయన, “వెళ్లండి” అన్నాడు, దాంతో ఆ చెడ్డదూతలు బయటికి వచ్చి పందుల్లో దూరారు. అప్పుడు ఆ పందులన్నీ కొండ అంచు* వరకు పరుగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడి, చచ్చిపోయాయి. 33  దాంతో వాటిని మేపేవాళ్లు అక్కడి నుండి పారిపోయి, నగరంలోకి వెళ్లి జరిగిందంతా చెప్పారు. చెడ్డదూతలు పట్టిన మనుషుల గురించి కూడా చెప్పారు. 34  అప్పుడు ఆ నగరంలోని వాళ్లంతా యేసును కలవడానికి వచ్చారు. వాళ్లు ఆయన్ని చూసినప్పుడు, తమ ప్రాంతం నుండి వెళ్లిపొమ్మని ఆయన్ని బ్రతిమాలారు.+

అధస్సూచీలు

అక్ష., “రాజ్య కుమారులు.”
పదకోశం చూడండి.
యేసు తన గురించి చెప్పడానికే ఈ పదం వాడాడు. పదకోశం చూడండి.
లేదా “స్మారక సమాధుల.”
లేదా “నిటారుగా ఉన్న అంచు.”