కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలివానితో సేవచేయటం

కావలివానితో సేవచేయటం

కావలివానితో సేవచేయటం

“నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను.”—యెషయా 21:8.

1. యెహోవా ఏ గొప్ప వాగ్దానాలకు తానే సాక్షిగా ఉన్నాడు?

యెహోవా గొప్ప సంకల్పకుడు. తన నామాన్ని పవిత్రపర్చుకోవటమూ, పరదైసు భూమిపై మహిమాన్వితమైన రాజ్యపరిపాలనను స్థాపించటమూ ఆయన ఉదాత్త సంకల్పమైయుంది, అపవాదియైన సాతానుగా మారిన తిరుగుబాటుదారుడైన దూత ఆ సంకల్పాన్ని ఎంతమాత్రమూ అడ్డగించలేడు. (మత్తయి 6:9, 10) ఆ పరిపాలన క్రింద మానవజాతి నిశ్చయంగా ఆశీర్వదించబడుతుంది. దేవుడు “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” సంతోషభరితులైన, ఐక్య మానవులు నిరంతరం శాంతి సౌభాగ్యాలను అనుభవిస్తారు. (యెషయా 25:8; 65:17-25) తన ఈ ఉదాత్తమైన వాగ్దానాలకు యెహోవా తానే సాక్షిగా ఉంటూ వాటిని ధృవీకరిస్తున్నాడు!

2. యెహోవా ఏ మానవ సాక్షులను ప్రవేశపెట్టాడు?

2 అయితే, మహా గొప్ప సృష్టికర్తకు మానవ సాక్షులు కూడా ఉన్నారు. క్రైస్తవ పూర్వపు సమయాల్లో, హేబెలు మొదలుకొని, ‘మేఘమువలెనున్న గొప్ప సాక్షి సమూహము,’ తరచూ ఎంతో సంక్లిష్టమైన సమయాల్లో కూడా సహనంతో తన పరుగును కొనసాగించింది. వారి చక్కని మాదిరులు యథార్థవంతులైన నేటి క్రైస్తవులకు ప్రోత్సాహాన్నిస్తాయి. ధైర్యంగా సాక్ష్యమివ్వడంలో క్రీస్తు యేసు సమున్నతమైన మాదిరి. (హెబ్రీయులు 11:1–12:2) ఉదాహరణకు, పొంతి పిలాతు ఎదుట ఆయనిచ్చిన చివరి సాక్ష్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు ఇలా ప్రకటించాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:37) సా.శ. 33 నుండి ఈ సా.శ. 2000వ సంవత్సరం వరకూ, ఆసక్తిపరులైన క్రైస్తవులు యేసు మాదిరిని అనుసరించి, సాక్ష్యమివ్వడంలో కొనసాగి, “దేవుని గొప్పకార్యములను” ధైర్యంగా ప్రకటిస్తున్నారు.—అపొస్తలుల కార్యములు 2:11.

బబులోను తెగవాదం

3. యెహోవా గురించి, ఆయన చిత్తం గురించి ఇవ్వబడిన సాక్ష్యాన్ని సాతాను ఎలా వ్యతిరేకించాడు?

3 గొప్ప శత్రువైన అపవాదియగు సాతాను దేవుని సాక్షుల సాక్ష్యాన్ని నిరర్థకం చేసేందుకు సహస్రాబ్దులుగా వక్రంగా ప్రయత్నించాడు. ‘అబద్ధమునకు జనకునిగా’ “ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము,” “సర్వలోకమును మోసపుచ్చుచు” వచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ అంత్య దినాల్లో “దేవుని ఆజ్ఞలు గైకొనుచు” ఉన్న వారితో నిర్విరామంగా యుద్ధం చేస్తున్నాడు.—యోహాను 8:44; ప్రకటన 12:9, 17.

4. మహా బబులోను ఎలా ఉనికిలోకి వచ్చింది?

4 నాలుగు వేల సంవత్సరాల క్రితం, నోవహు కాలం నాటి జలప్రళయం తర్వాత, “యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడ”యిన నిమ్రోదును సాతాను ప్రవేశపెట్టాడు. (ఆదికాండము 10:9, 10) నిమ్రోదు కట్టించిన గొప్ప పట్టణమైన బబులోను (బాబెలు), దయ్యాల సంబంధిత మతానికి కేంద్రమైంది. బాబెలు గోపుర నిర్మాణకుల భాషను యెహోవా తారుమారు చేసినప్పుడు, ప్రజలు భూమియందంతటా చెదరిపోయారు, వాళ్లు తమతోపాటు తమ అబద్ధ మతాన్ని కూడా తీసుకువెళ్లారు. అలా, ప్రకటన గ్రంథంలో మహా బబులోను అని పిలువబడుతున్న ప్రపంచవ్యాప్త అబద్ధమత సామ్రాజ్యానికి బబులోను మూలమైంది. ఆ గ్రంథం ఈ ప్రాచీన మత విధాన నాశనాన్ని గురించి ప్రవచిస్తుంది.—ప్రకటన 17:5; 18:21.

సాక్షుల జనాంగం

5. తనకు సాక్షిగా ఉండేందుకు యెహోవా ఏ జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కాని అది చెరలోకి వెళ్లడానికి ఆయనెందుకు అనుమతించాడు?

5 నిమ్రోదు కాలం తర్వాత దాదాపు 500 సంవత్సరాలకు, యెహోవా విశ్వసనీయుడైన అబ్రాహాము సంతానపు వారిని, భూమి మీద తన సాక్షులుగా ఉండేందుకు ఇశ్రాయేలు జనాంగంగా సంస్థీకరించాడు. (యెషయా 43:10, 12) ఆ జనాంగానికి చెందిన అనేకులు యథార్థంగా యెహోవా సేవ చేశారు. అయితే, శతాబ్దాలు గడుస్తుండగా, ఇరుగుపొరుగునున్న దేశాల అబద్ధ నమ్మకాలు ఇశ్రాయేలును కలుషితం చేశాయి, యెహోవా నిబంధన ప్రజలు ఆయన నుండి వైదొలగి, అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మొదలు పెట్టారు. కాబట్టి, సా.శ.పూ. 607 లో, రాజైన నెబుకద్నెజరు ఆధ్వర్యంలో బబులోను సైన్యాలు యెరూషలేమును, దాని ఆలయాన్ని నాశనం చేసి, యూదుల్లో చాలామందిని బబులోనుకు చెరగా తీసుకువెళ్లారు.

6. యెహోవా నియమించిన ప్రవచనార్థక కావలివాడు ఏ సువార్తను ప్రకటించాడు, అది ఎప్పుడు నెరవేరింది?

6 అబద్ధ మతానికి అదెంతటి విజయమో కదా! అయితే, బబులోను ఉత్థానం ఎంతోకాలం నిలువలేదు. ఆ సంఘటన జరగడానికి సుమారు 200 సంవత్సరాల ముందు, యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.” ఈ కావలివాడు ఏ వార్తను ప్రకటించాల్సివచ్చింది? “బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు!” (యెషయా 21:6, 9) సరిగ్గా అలానే జరిగింది, సా.శ.పూ. 539 లో ఆ ప్రవచనార్థక ప్రకటన నెరవేరింది. శక్తివంతమైన బబులోను పతనమైంది, దేవుని నిబంధన ప్రజలు త్వరలోనే తమ స్వస్థలానికి తిరిగి రాగలిగారు.

7. (ఎ) యెహోవా ఇచ్చిన క్రమశిక్షణ నుండి యూదులు ఏమి నేర్చుకున్నారు? (బి) తిరిగి వచ్చిన యూదులు ఏ ఉరిలో పడిపోయారు, దాని ఫలితమేమిటి?

7 తిరిగి వచ్చిన యూదులు విగ్రహారాధనను, దయ్యాల సంబంధిత మతాలను విడనాడటం గురించి మంచి పాఠాలనే నేర్చుకున్నారు. అయితే, సంవత్సరాలు గడుస్తుండగా, వాళ్లు ఇతర ఉరుల్లో చిక్కుకున్నారు. కొందరు గ్రీకు తత్త్వజ్ఞాన ఉరిలో చిక్కుకున్నారు. ఇతరులు దేవుని వాక్యం కన్నా మానవ ఆచారాలను నొక్కి చెప్పారు. మరితరులు జాతివాదంతో మోసగించబడ్డారు. (మార్కు 7:13; అపొస్తలుల కార్యములు 5:37) యేసు జన్మించే సమయానికి, ఆ జనాంగం మళ్లీ స్వచ్ఛారాధన నుండి తొలగిపోయింది. కొందరు యూదులు యేసు ప్రకటించిన సువార్తకు ప్రతిస్పందించినప్పటికీ, ఒక జనాంగంగా చూస్తే వారు ఆయనను నిరాకరించి, దేవునిచే నిరాకరించబడ్డారు. (యోహాను 1:9-12; అపొస్తలుల కార్యములు 2:36) ఇశ్రాయేలు ఇక దేవుని సాక్షి కాదు, సా.శ. 70 లో ఈసారి రోమా సైనికుల చేతుల్లో యెరూషలేము, దాని ఆలయం మళ్లీ నాశనమయ్యాయి.—మత్తయి 21:43.

8. ఎవరు యెహోవాకు సాక్షి అయ్యారు, పౌలు ఈ సాక్షికిచ్చిన హెచ్చరిక ఎందుకు సమయానుకూలమైనది?

8 ఈ మధ్యలో, క్రైస్తవులతో కూడిన “దేవుని ఇశ్రాయేలు” జన్మించింది, అది ఇప్పుడు జనాంగాలకు దేవుని సాక్షిగా పనిచేసింది. (గలతీయులు 6:16) త్వరలోనే, ఈ క్రొత్త ఆధ్యాత్మిక జనాంగాన్ని కలుషితం చేయడానికి సాతాను పథకం వేశాడు. మొదటి శతాబ్దాంతానికల్లా, సంఘాల్లో తెగసంబంధిత ప్రభావాలు కనిపించనారంభించాయి. (ప్రకటన 2:6, 14, 20) పౌలు ఇచ్చిన ఈ హెచ్చరిక సమయానుకూలమైనది: “[క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.

9. పౌలు హెచ్చరించినట్లుగా, క్రైస్తవమత సామ్రాజ్య ఉనికికి నడిపిన విషయాలేవి?

9 చివరికి, గ్రీకు తత్త్వం, బబులోను సంబంధిత మత తలంపులు, ఆ తర్వాత, మానవ “జ్ఞానము” అయిన పరిణామ సిద్ధాంతం, బైబిలుపైన విమర్శ వంటివి క్రైస్తవులమని చెప్పుకునే అనేకుల మతాన్ని కలుషితం చేశాయి. అది పౌలు ప్రవచించినట్లుగానే ఉంది: “నేను వెళ్లిపోయన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొస్తలుల కార్యములు 20:29, 30) ఈ మతభ్రష్టత్వం మూలంగా, క్రైస్తవమత సామ్రాజ్యం ఉనికిలోకి వచ్చింది.

10. క్రైస్తవమత సామ్రాజ్యంలో ఆచరించబడుతున్న భ్రష్ట ఆరాధనకు అందరూ లొంగిపోలేదని ఏ విషయాలు స్పష్టం చేస్తున్నాయి?

10 నిజంగా స్వచ్ఛారాధనకు సమర్పించుకున్నవాళ్లు, “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము” పోరాడాలి. (యూదా 3) యెహోవాకు, స్వచ్ఛారాధనకు ఇవ్వబడే సాక్ష్యం భూమి మీది నుండి అంతరించిపోనైవుందా? లేదు. తిరుగుబాటుదారుడైన సాతానును, ఆయన కార్యాలన్నింటినీ నాశనం చేసే సమయం ఆసన్నమైనప్పుడు, క్రైస్తవమత సామ్రాజ్యంలో ఆచరించబడుతున్న భ్రష్ట ఆరాధనకు అందరూ లొంగిపోలేదని స్పష్టమైంది. 19వ శతాబ్దం చివరిభాగంలో, అమెరికాలోని పెన్సిల్వేనియా నందలి పిట్స్‌బర్గ్‌లో యథార్థవంతులైన బైబిలు విద్యార్థుల గుంపొకటి సంస్థీకరించబడి దేవుని ఆధునిక-దిన సాక్షి తరగతికి కేంద్రకంగా రూపొందింది. ఈ క్రైస్తవులు, ప్రస్తుత ప్రపంచ విధానాంతం సమీపంలో ఉందన్నదానికి లేఖనాధార సాక్ష్యాధారం వైపుకు అవధానాన్ని మళ్లించారు. బైబిలు ప్రవచనం ప్రకారం, ఈ ప్రపంచ ‘సమాప్తి’ 1914 లో ప్రారంభమైంది, అది మొదటి ప్రపంచ యుద్ధారంభంతో సూచించబడింది. (మత్తయి 24:3, 7) ఆ సంవత్సరం తర్వాత సాతాను అతని దయ్యాలు పరలోకం నుండి పడద్రోయబడ్డారనడానికి బలమైన సాక్ష్యాధారం ఉంది. కష్టాలతో నిండిన 20వ శతాబ్దం సాతాను కార్యకలాపాలకు స్పష్టమైన నిదర్శనాన్నీ, పరలోక రాజ్య శక్తితో యేసు రాచరిక ప్రత్యక్షత యొక్క విశేషమైన నెరవేర్పునూ అందజేసింది.—మత్తయి 24, 25 అధ్యాయాలు; మార్కు 13వ అధ్యాయం; లూకా 21వ అధ్యాయం; ప్రకటన 12:10, 12.

11. సాతాను ఏమి చేయడానికి ప్రయత్నించాడు, కాని అతని ప్రయత్నం ఎలా విఫలమైంది?

11 జూన్‌ 1918 లో, అప్పటికల్లా అనేక దేశాల్లో ప్రకటిస్తున్న ఆ బైబిలు విద్యార్థులను తుడిచివేయడానికి సాతాను పిచ్చిగా ప్రయత్నించాడు. వారి చట్టబద్ధమైన కార్పొరేషన్‌ అయిన వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీని నాశనం చేయడానికి కూడా అతడు ప్రయత్నించాడు. సొసైటీకి చెందిన బాధ్యతాయుతులైన అధికారులను చెరసాలలో వేసి, మొదటి శతాబ్దంలో యేసును నిందించినట్లే వీరిని కూడా తిరుగుబాటుదారులని నిందించారు. (లూకా 23:2) కానీ 1919 లో, ఈ అధికారులు విడుదల చేయబడ్డారు, దానితో వాళ్లు తమ పరిచర్యను కొనసాగించడం సాధ్యమైంది. తర్వాత, వాళ్లు పూర్తిగా నిర్దోషులుగా నిరూపించబడ్డారు.

కావలికాస్తున్న ‘కావలివాడు’

12. ఈనాడు యెహోవా నియమించిన కావలివాని తరగతి లేక “కావలివాడు” ఎవరితో రూపొందించబడ్డాడు, వాళ్లకు ఎలాంటి దృక్పథం ఉంది?

12 కాబట్టి, “అంత్యకాలము” ప్రారంభమైనప్పుడు, యెహోవాకు మళ్లీ ఒక కావలివాడు రంగంలో సిద్ధంగా ఉన్నాడు, ఆయన సంకల్పాల నెరవేర్పుకు సంబంధించిన సంఘటనల గురించి ప్రజలను హెచ్చరిస్తున్నాడు. (దానియేలు 12:4; 2 తిమోతి 3:1) ఈనాటి వరకు, ఆ కావలివాని తరగతి—దేవుని ఇశ్రాయేలుగా ఉన్న అభిషిక్త క్రైస్తవులు—ప్రవచనార్థక కావలివాని గురించి యెషయా ఇచ్చిన ఈ వివరణకు అనుగుణ్యంగా ప్రవర్తిస్తోంది: “అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించునట్టు కేకలు వేసి—నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను.” (యెషయా 21:7, 8) తన పనిని మనస్సాక్షిపూర్వకంగా నిర్వర్తించే కావలివాడు ఇతడే!

13. (ఎ) యెహోవా నియమించిన కావలివాడు ఏ సందేశాన్ని ప్రకటించాడు? (బి) మహా బబులోను కూలిపోయిందని ఎలా చెప్పవచ్చు?

13 ఈ కావలివాడు ఏమి చూశాడు? యెహోవా నియమించిన కావలివాడు—ఆయన సాక్షి తరగతి—మళ్లీ ఇలా ప్రకటించాడు: “బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన [యెహోవా] నేలను పడవేసియున్నాడు ముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు.” (యెషయా 21:9) ఈసారి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను తన అధికార స్థానం నుండి పడిపోయింది. (యిర్మీయా 50:1-3; ప్రకటన 14:8) అప్పట్లో గ్రేట్‌ వార్‌ అని పిలువబడినది, క్రైస్తవమత సామ్రాజ్యంలో ప్రారంభమైందంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు! ఆ యుద్ధంలో పాల్గొనమని తమ యువశక్తిని ప్రోత్సహిస్తూ ఇరువైపుల మతనాయకులూ దాంట్లో ఇంకాస్త ఆజ్యంపోశారు. ఎంత ఘోరం ! 1919 లో, అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడుతున్న యెహోవాసాక్షులు, తమ నిష్క్రియాత్మక స్థితిని వీడి, ఇప్పటికీ కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త సాక్ష్యపు పనిలో దూసుకుపోకుండా మహాబబులోను వారిని ఆపలేకపోయింది. (మత్తయి 24:14) సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో ఇశ్రాయేలీయుల విడుదల ప్రాచీన బబులోను కూలిపోవడాన్ని సూచించినట్లుగానే, ఇది మహాబబులోను కూలిపోవడాన్ని సూచించింది.

14. యెహోవా నియమించిన కావలివాని తరగతి ఏ పత్రికను ప్రముఖంగా ఉపయోగించింది, యెహోవా దాన్ని ఎలా ఆశీర్వదించాడు?

14 కావలివాని తరగతి తన పనిని ఎల్లప్పుడూ ఎంతో ఆసక్తితోనూ, సరైనది చేయాలనే ఆకాంక్షతోనూ నెరవేర్చింది. 1879 జూలైలో బైబిలు విద్యార్థులు ఈ పత్రిక ప్రచురణను ప్రారంభించారు, అప్పట్లో అది జాయన్స్‌ వాచ్‌ టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెజెన్స్‌ అని పిలువబడేది. 1879 నుండి 1938 డిసెంబరు 15వ సంచిక వరకు ప్రతి సంచిక ముఖపత్రం మీదా “‘కావలివాడా, రాత్రి యెంత వేళైనది?’—యెషయా 21:11” అనే మాటలుండేవి. * కావలికోట 120 సంవత్సరాలపాటు ప్రపంచ సంఘటనలపై, వాటి ప్రవచనార్థక భావంపై నమ్మకంగా కావలి ఉంచింది. (2 తిమోతి 3:1-5, 13) దేవుని కావలివాని తరగతి, దాని “వేరే గొఱ్ఱెల” సహవాసులు, క్రీస్తు రాజ్యం ద్వారా యెహోవా సర్వోన్నతాధిపత్యం ఉన్నతపర్చబడటం త్వరలోనే జరుగుతుందని మానవజాతికి శక్తివంతంగా చాటించడంలో ఈ పత్రికను ఉపయోగించుకున్నారు. (యోహాను 10:16) ఈ సాక్ష్యాన్ని యెహోవా ఆశీర్వదించాడా? 1879 లో 6,000 ప్రతులుగా ఉన్న కావలికోట దాని మొదటి సంచిక నుండి, 132 భాషల్లో 2,20,00,000 కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న పత్రికగా ఎదిగింది, వాటిలో 121 భాషల్లో అది ఏకకాలంలో ప్రచురించబడుతోంది. భూవ్యాప్తంగా అత్యధికంగా పంపిణీ అవుతున్న మతసంబంధమైన పత్రిక, సత్య దేవుడైన యెహోవా నామాన్ని ఘనపర్చే పత్రికై ఉండటం ఎంత సముచితమో కదా !

పురోభివృద్ధికరమైన శుద్ధీకరణ

15. ఏ క్రమానుసారమైన శుద్ధీకరణ 1914కు ముందే ప్రారంభమైంది?

15 క్రీస్తు పరలోక పరిపాలన 1914 లో ప్రారంభం కావటానికి పూర్వం 40 సంవత్సరాల కాలంలో, బైబిలు విద్యార్థులు శిశుబాప్తిస్మం, మానవ ఆత్మ అమర్త్యత్వం, పర్గేటరీ, నరకాగ్ని శిక్ష, త్రిత్వ దేవుడు వంటి క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన అనేక బైబిలేతర సిద్ధాంతాల నుండి విముక్తులయ్యారు. కాని తప్పుడు తలంపులన్నీ తొలగించుకోవడానికి ఇంకా సమయం అవసరమైంది. ఉదాహరణకు, 1920లలో అనేకమంది బైబిలు విద్యార్థులు సిలువ-కిరీటము చిహ్నాలుండే ఒక బ్యాడ్జిని పెట్టుకునేవారు, వాళ్లు క్రిస్మస్‌ను ఇతర అన్యమత పండుగలను ఆచరించేవారు. అయితే, ఆరాధన స్వచ్ఛంగా ఉండాలంటే, విగ్రహారాధనకు సంబంధించిన జాడలన్నీ తొలగించబడాలి. క్రైస్తవుని విశ్వాసానికీ, జీవిత మార్గానికీ దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలే ఏకైక ఆధారంగా ఉండాలి. (యెషయా 8:19, 20; రోమీయులు 15:4) దేవుని వాక్యానికి మార్పులు చేర్పులు చేయడం దోషమే.—ద్వితీయోపదేశకాండము 4:2; ప్రకటన 22:18, 19.

16, 17. (ఎ) కావలివాని తరగతి కొన్ని దశాబ్దాలపాటు ఏ తప్పు తలంపును కల్గివుంది? (బి) “ఐగుప్తు”లోని “బలిపీఠము” మరియు “స్తంభము” యొక్క సరైన వివరణ ఏమిటి?

16 ఈ సూత్రమెంత ప్రాముఖ్యమైనదో ఒక ఉదాహరణ నొక్కి చెప్తుంది. 1886 లో, సి. టి. రస్సెల్‌, ద డివైన్‌ ప్లాన్‌ ఆఫ్‌ ది ఏజస్‌ అనే పుస్తకాన్ని ప్రచురించాడు, అందులో మానవజాతి యుగాలను ఐగుప్తులోని గ్రేట్‌ పిరమిడ్‌తో జతచేయబడిన చార్టు ఉంది. ఫరో కుఫూకు చెందిన ఈ స్మారక చిహ్నం, యెషయా 19:19, 20నందు, “ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైనయొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును” అని చెప్పబడిన స్తంభమని తలంచబడేది. పిరమిడ్‌కు బైబిలుతో ఏమి సంబంధం ఉండగలదు? ఒక ఉదాహరణగా, గొప్ప పిరమిడ్‌లోని కొన్ని వసారాల పొడవు, అప్పట్లో అర్థం చేసుకున్నదాని ప్రకారం, మత్తయి 24:20, 21 లో చెప్పబడిన “మహా శ్రమ” ఆరంభ సమయాన్ని సూచిస్తుందని తలంచబడేది. కొంతమంది బైబిలు విద్యార్థులు తాము పరలోకానికి వెళ్లే దినం వంటి విషయాలను నిశ్చయపర్చుకునేందుకు పిరమిడ్‌ యొక్క వివిధ అంశాలను కొలవడంలో నిమగ్నమైపోయారు.

17 బైబిల్లో ఇవ్వబడిన సాక్ష్యాన్ని ధృవీకరించేందుకు, అన్యమత ఫరోలు నిర్మించిన జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన దయ్యాల సూచనలుగల రాతి స్మారక చిహ్నాలు యెహోవాకు అవసరం లేదని 1928, నవంబరు 15, డిసెంబరు 1, కావలికోట సంచికలు స్పష్టం చేసేవరకూ, రాతి బైబిలు అని పిలువబడే ఈ గొప్ప పిరమిడ్‌ను చాలా దశాబ్దాలపాటు ఎంతో ఉన్నతంగా ఎంచడం జరిగింది. అయితే, యెషయా ప్రవచనానికి ఆధ్యాత్మిక అన్వయింపు ఉన్నట్లు కనుగొనడం జరిగింది. ప్రకటన 11:8 లో ఉన్నట్లుగా, “ఐగుప్తు” అన్నది సాతాను ప్రపంచాన్ని సూచిస్తుంది. “యెహోవాకు ఒక బలిపీఠము” అన్నది, అభిషిక్త క్రైస్తవులు ఈ లోకంలో తాత్కాలిక నివాసులుగా ఉన్నప్పుడు చేసిన అనుకూలమైన బలులను మనకు జ్ఞాపకం చేస్తుంది. (రోమీయులు 12:1; హెబ్రీయులు 13:15, 16) “[ఐగుప్తు] సరిహద్దునొద్ద” ఉన్న స్తంభము, “సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్న” అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని సూచిస్తుంది. వీరు విడిచిపెట్టి వెళ్లనైయున్న ప్రపంచమైన “ఐగుప్తు”లో ఈ సంఘం సాక్షిగా నిల్చుంటుంది.—1 తిమోతి 3:15.

18. (ఎ) యథార్థవంతులైన బైబిలు విద్యార్థులకు యెహోవా విషయాలను ఎలా స్పష్టం చేస్తూనే ఉన్నాడు? (బి) ఏదైనా ఒక లేఖనాధార స్పష్టీకరణను అర్థం చేసుకోవడం ఒక క్రైస్తవునికి కష్టంగా ఉంటే, ఏ విధమైన దృక్పథాన్ని కల్గివుండటం జ్ఞానయుక్తమైనది?

18 సంవత్సరాలు గడుస్తుండగా, యెహోవా మనకు సత్యాన్ని గూర్చిన మరింత స్పష్టీకరణను ఇస్తున్నాడు, దానిలో తన ప్రవచన వాక్యానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన కూడా ఉంది. (సామెతలు 4:18) ఇటీవలి సంవత్సరాల్లో, మనం ఇతర విషయాలతోపాటు, అంతం రావటానికి ముందు గతించిపోని తరం గురించి, గొఱ్ఱెలు మేకలను గూర్చిన ఉపమానం గురించి, హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం గురించి, క్రొత నిబంధన గురించి, రూపాంతరం గురించి, యెహెజ్కేలు పుస్తకంలోని ఆలయ దర్శనం గురించి మరింత అవగాహనతో చూడమని ప్రోత్సహించబడ్డాము. అలాంటి తాజా వివరణలను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు, కాని అందుకు కారణాలు తగిన సమయంలో స్పష్టమౌతాయి. ఒక క్రైస్తవుడు ఒక లేఖనాన్ని గురించిన క్రొత్త వివరణను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, మీకా చెప్పిన ఈ మాటలను అతడు వినయంతో స్మరించడం మంచిది: “రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.”—మీకా 7:7.

19. అభిషిక్త శేషం, వేరే గొఱ్ఱెలైన వారి సహవాసులు ఈ అంత్య దినాల్లో సింహంవంటి ధైర్యాన్ని ఎలా చూపించారు?

19 కావలివాడు “సింహము గర్జించునట్టు కేకలు వేసి—నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను” అని చెప్తున్నాడని గుర్తు తెచ్చుకోండి. (యెషయా 21:8) అబద్ధమతాన్ని బయల్పర్చి, స్వేచ్ఛను పొందడానికి ప్రజలకు మార్గాన్ని చూపించడంలో అభిషిక్త శేషం సింహంవంటి ధైర్యాన్ని చూపించింది. (ప్రకటన 18:2-5) ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసునిగా’ వాళ్లు, “తగినవేళ అన్నము,” అంటే బైబిళ్లను, పత్రికలను, ఇతర ప్రచురణలను అనేకానేక భాషల్లో అందజేశారు. (మత్తయి 24:45) “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు . . . గొప్పసమూహము”ను సమకూర్చడంలో వాళ్లు నాయకత్వం వహించారు. వీళ్లు కూడా యేసు విమోచన బలిరక్తంతో శుద్ధి చేయబడ్డారు, దేవునికి “రాత్రింబగళ్లు” సేవచేయడంలో సింహంవంటి ధైర్యాన్ని చూపిస్తున్నారు. (ప్రకటన 7:9, 14, 15) ఇంకా మిగిలివున్న, యెహోవా అభిషిక్త సాక్షుల చిన్న గుంపు, దాని సహచరులైన గొప్ప సమూహము గత సంవత్సరం ఏమి సాధించారు? మా తదుపరి శీర్షిక చెప్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 14 ఇది, జనవరి 1, 1939 నుండి, “‘నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.’—యెహెజ్కేలు 35:15” అని మార్చబడింది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• యెహోవా సంవత్సరాలుగా ఏ యే సాక్షులను ప్రవేశపెట్టాడు?

• మహా బబులోను ఆరంభం ఏమిటి?

• తన సాక్షుల జనాంగపు ముఖ్య పట్టణమైన యెరూషలేము సా.శ.పూ. 607 లోనూ, సా.శ. 70 లోనూ నాశనమయ్యేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడు?

• యెహోవా నియమించిన కావలివాని తరగతి, వారి సహచరులు ఏ స్ఫూర్తిని చూపించారు?

[అధ్యయన ప్రశ్నలు]

[7వ పేజీలోని చిత్రం]

“నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను”

[10వ పేజీలోని చిత్రాలు]

యెహోవా నియమించిన కావలివాని తరగతి తమ పనిని గంభీరంగా తీసుకుంటుంది