యెహెజ్కేలు 35:1-15

  • శేయీరు పర్వతాలకు వ్యతిరేకంగా ప్రవచనం (1-15)

35  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, శేయీరు+ పర్వత ప్రాంతం వైపు నీ ముఖం తిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించు.+  దానితో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “శేయీరు పర్వత ప్రాంతమా, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. నేను నీ మీదికి నా చెయ్యి చాపి, నిన్ను పనికిరాని నిర్జన ప్రదేశంగా మారుస్తాను.+  నేను నీ నగరాల్ని శిథిలాలుగా మారుస్తాను, నువ్వు పనికిరాని నిర్జన ప్రదేశంగా తయారౌతావు;+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసు​కుంటావు.  ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలీయుల మీద ఎడతెగని శత్రుత్వం చూపించావు;+ వాళ్ల మీదికి విపత్తు వచ్చినప్పుడు, వాళ్ల చివరి శిక్షా సమయంలో నువ్వు వాళ్లను ఖడ్గానికి అప్పగించావు.” ’+  “ ‘కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను ​రక్తపాతం కోసం సిద్ధం చేస్తాను, అది నిన్ను వెంటాడుతుంది.+ నువ్వు రక్తాన్ని ద్వేషించావు, కాబట్టి రక్తపాతమే నిన్ను వెంటాడుతుంది’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.  ‘నేను శేయీరు పర్వత ప్రాంతాన్ని పనికిరాని నిర్జన ప్రదేశంగా చేసి,+ దానిలో ఎవరూ తిరగ​కుండా, దానిలోకి ఎవరూ ​తిరిగిరాకుండా చేస్తాను.  దాని పర్వతాల్ని శవాలతో నింపే​స్తాను; ఖడ్గంతో చంపబడినవాళ్లు నీ కొండల​మీద, నీ లోయల్లో, నీ వాగులన్నిట్లో పడివుంటారు.  నువ్వు ఎప్పటికీ నిర్జనంగా పడి​వుండేలా చేస్తాను, నీ నగరాల్లో ఎవరూ ​నివసించరు;+ అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసు​కుంటావు.’ 10  “యెహోవాయే స్వయంగా అక్కడ ఉన్నా కూడా నువ్వు, ‘ఈ రెండు జనాలు, ఈ రెండు దేశాలు నా సొంతమౌతాయి, మనం వాటిని స్వాధీనం చేసుకుందాం’+ అని అన్నావు కాబట్టి, 11  సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘నా జీవం తోడు, నువ్వు వాళ్లపట్ల ద్వేషంతో వాళ్లమీద ఎంత కోపం, ఈర్ష్య చూపించావో నేను కూడా నీతో అలాగే వ్యవహరిస్తాను;+ నేను నీకు తీర్పు తీర్చినప్పుడు వాళ్ల మధ్య నన్ను నేను తెలియజేసుకుంటాను. 12  నువ్వు ఇశ్రాయేలు పర్వతాల గురించి, “అవి నిర్జనంగా పడివున్నాయి, వాటిని నాశనం చేసే అవకాశం మనకు దొరికింది” అంటూ పలికిన అవమానకరమైన మాటలన్నిటినీ యెహోవానైన నేనే స్వయంగా విన్నానని అప్పుడు నువ్వు తెలుసుకుంటావు. 13  మీరు అహంకారంతో నాకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు,+ అవన్నీ నేను విన్నాను.’ 14  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను పనికిరాని నిర్జన ​ప్రదేశంగా చేసినప్పుడు భూమంతా సంతోషిస్తుంది. 15  ఇశ్రాయేలు ఇంటివాళ్ల స్వాస్థ్యం నిర్జనంగా పడివున్నప్పుడు నువ్వు సంతోషించావు కాబట్టి నేను కూడా నీతో అలాగే వ్యవహరిస్తాను.+ శేయీరు పర్వత ప్రాంతమా, నువ్వు, అవును ఎదోము అంతా శిథిలాలుగా తయారౌతుంది;+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు.’ ”

అధస్సూచీలు