యెషయా 19:1-25
19 ఐగుప్తు గురించిన సందేశం:+
ఇదిగో! వేగంగా కదిలే మేఘం మీద యెహోవా ఐగుప్తులోకి వస్తున్నాడు.
వ్యర్థమైన ఐగుప్తు దేవుళ్లు ఆయన ముందు వణికిపోతారు,+ఐగుప్తీయుల గుండెలు భయంతో నీరుగారిపోతాయి.
2 “నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయుల్ని రేపుతాను,వాళ్లు ఒకరితో ఒకరు పోరాడతారు,ప్రతీ వ్యక్తి తన సహోదరునితో, తన పొరుగువానితో పోరాడతాడు,నగరం మీదికి నగరం, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాయి.
3 ఐగుప్తు కంగారుపడుతుంది,నేను దాని పన్నాగాల్ని తారుమారు చేస్తాను.+
వాళ్లు వ్యర్థమైన దేవుళ్లను ఆశ్రయిస్తారు,మాంత్రికుల్ని,* చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, జ్యోతిష్యులను ఆశ్రయిస్తారు.+
4 నేను ఐగుప్తును కఠినుడైన యజమాని చేతికి అప్పగిస్తాను,క్రూరుడైన రాజు వాళ్లను పరిపాలిస్తాడు”+ అని నిజమైన ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.
5 సముద్రంలోని నీళ్లు ఇంకిపోతాయి,నది ఎండిపోయి పొడినేల అవుతుంది.+
6 నదులు కంపుకొడతాయి;ఐగుప్తులోని నైలు నది కాలువల నీటిమట్టం తగ్గుతుంది, అవి ఎండిపోతాయి.
రెల్లు, తుంగలు కుళ్లిపోతాయి.+
7 నైలు నది వెంబడి, అది సముద్రంలో కలిసే చోట ఉన్న మొక్కలన్నీ ఎండిపోతాయి,నైలు నది ఒడ్డున ఉన్న సాగుభూమంతా+ ఎండిపోతుంది.+
అది గాలికి కొట్టుకుపోతుంది, ఇక ఉండదు.
8 జాలర్లు దుఃఖిస్తారు,నైలు నదిలో గాలం వేసేవాళ్లు విలపిస్తారు,నీళ్ల మీద తమ వలలు వేసేవాళ్లు తగ్గిపోతారు.
9 దువ్వబడిన జనుపనారతో+ పనిచేసేవాళ్లుమగ్గం మీద తెల్లని వస్త్రం నేసేవాళ్లు అవమానించబడతారు.
10 దాని నేతగాళ్లు చితగ్గొట్టబడతారు;కూలి పనివాళ్లంతా దుఃఖిస్తారు.
11 సోయను+ అధిపతులు తెలివితక్కువవాళ్లు.
ఫరో అత్యంత తెలివిగల సలహాదారులు పనికిరాని సలహా ఇస్తారు.+
“నేను జ్ఞానుల వంశానికి చెందినవాణ్ణి,
ప్రాచీనకాల రాజుల వంశస్థుణ్ణి” అనినువ్వు ఫరోతో ఎలా చెప్పగలవు?
12 నీ జ్ఞానులు+ ఎక్కడ?
వాళ్లకు తెలిస్తే, సైన్యాలకు అధిపతైన యెహోవా ఐగుప్తు విషయంలో ఏం నిర్ణయించాడో నీకు చెప్పమను.
13 సోయను అధిపతులు తెలివితక్కువగా ప్రవర్తించారు;నోఫు*+ అధిపతులు మోసగించబడ్డారు;ఐగుప్తు గోత్రాల ప్రధానులు ఐగుప్తును తప్పుదారి పట్టించారు.
14 యెహోవా దాన్ని అయోమయంలో పడేశాడు;+ఐగుప్తు చేసిన ప్రతీ పనిలో వాళ్లు దాన్ని పక్కదారి పట్టించారు,బాగా తాగిన వ్యక్తి తన వాంతిలో తూలినట్టు దాన్ని తూలేలా చేశారు.
15 చేయడానికి ఐగుప్తుకు ఏ పనీ ఉండదు,తలకే గానీ తోకకే గానీ, రెమ్మకే గానీ రెల్లుకే గానీ* ఏ పనీ ఉండదు.
16 ఆ రోజు సైన్యాలకు అధిపతైన యెహోవా ఐగుప్తు మీదికి తన చెయ్యి చాపడం వల్ల ఐగుప్తీయులు భయపడుతూ, వణికిపోతూ స్త్రీలలా అవుతారు.+
17 వాళ్లు యూదా దేశాన్ని బట్టి హడలిపోతారు. తమకు వ్యతిరేకంగా సైన్యాలకు అధిపతైన యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, యూదా పేరు ఎత్తితే చాలు వాళ్లు భయపడిపోతారు.+
18 ఆ రోజు కనాను భాష మాట్లాడే, సైన్యాలకు అధిపతైన యెహోవాకు విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేసే ఐదు నగరాలు ఐగుప్తు దేశంలో ఉంటాయి.+ ఒక నగరం నాశనపురం అని పిలవబడుతుంది.
19 ఆ రోజు ఐగుప్తు దేశం మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది, దాని సరిహద్దున యెహోవా గౌరవార్థం ఒక స్తంభం ఉంటుంది.
20 అది ఐగుప్తు దేశంలో సైన్యాలకు అధిపతైన యెహోవా గురించిన ఒక సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది; ఎందుకంటే తమను అణచివేసే వాళ్లను బట్టి వాళ్లు యెహోవాకు మొరపెడతారు, ఆయన వాళ్లను రక్షించే ఒక గొప్ప రక్షకుణ్ణి పంపిస్తాడు.
21 యెహోవా ఐగుప్తీయులకు తనను తాను తెలియజేసుకుంటాడు, ఆ రోజు ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుంటారు, వాళ్లు బలుల్ని, కానుకల్ని అర్పించి, యెహోవాకు మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లిస్తారు.
22 యెహోవా ఐగుప్తును కొడతాడు;+ ఆయన దాన్ని కొడతాడు, బాగుచేస్తాడు. వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగొస్తారు, ఆయన వాళ్ల మొరల్ని విని వాళ్లను బాగుచేస్తాడు.
23 ఆ రోజు ఐగుప్తు నుండి అష్షూరు వరకు ఒక రాజమార్గం+ ఉంటుంది. అప్పుడు అష్షూరు ఐగుప్తులోకి వస్తుంది, ఐగుప్తు అష్షూరులోకి వస్తుంది, ఐగుప్తు అష్షూరుతో కలిసి దేవుణ్ణి సేవిస్తుంది.
24 ఆ రోజు ఇశ్రాయేలు జనం ఐగుప్తు, అష్షూరులతో పాటు మూడో జనం అయ్యి+ భూమికి దీవెనగా ఉంటుంది.
25 ఎందుకంటే సైన్యాలకు అధిపతైన యెహోవా, “నా జనమైన ఐగుప్తూ, నా చేతిపనైన అష్షూరూ, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలూ దీవెన పొందండి”+ అని అంటూ అప్పటికే దాన్ని దీవించేసి ఉంటాడు.
అధస్సూచీలు
^ లేదా “పాములోళ్లను.”
^ లేదా “మెంఫిస్.”
^ లేదా “తాటిమట్టకే గానీ జమ్ముకే గానీ” అయ్యుంటుంది.