యెషయా 21:1-17
21 సముద్రతీరాన ఉన్న ఎడారి* గురించిన సందేశం:+
దక్షిణాన విసిరే సుడిగాలిలా అది వస్తోంది,ఎడారి నుండి, భీకర దేశం నుండి అది వస్తోంది.+
2 ఒక కఠినమైన దర్శనం నాకు చూపబడింది:
మోసగాడు మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాడు,నాశకుడు నాశనం చేస్తున్నాడు.
ఏలామూ, వెళ్లు! మాదీయా, ముట్టడివేయి!+
అది కలిగించిన వేదన అంతటినీ నేను అంతం చేస్తాను.+
3 అందుకే నేను తీవ్రంగా బాధపడుతున్నాను,*+
ప్రసవించే స్త్రీకి వచ్చేలాంటి నొప్పులునాకు వచ్చాయి.
వేదన వల్ల నేను ఏమీ వినలేకపోతున్నాను;దిగులు వల్ల ఏమీ చూడలేకపోతున్నాను.
4 నా హృదయం తడబడుతోంది, నేను భయంతో వణికిపోతున్నాను.
నేను ఎంతగానో కోరుకున్న సంధ్య వెలుగు నన్ను వణికిస్తోంది.
5 బల్లను సిద్ధం చేయండి, కూర్చోవడానికి ఏర్పాట్లు చేయండి!
తినండి, తాగండి!+
అధిపతులారా, లేచి డాలును అభిషేకించండి!*
6 ఎందుకంటే, యెహోవా నాకు ఇలా చెప్పాడు:
“వెళ్లి ఒక కావలివాణ్ణి నిలబెట్టు, అతనికి ఏం కనిపిస్తుందో చెప్పమను.”
7 ఒక జత గుర్రాలు లాగుతున్న యుద్ధ రథం ఒకటి,గాడిదలు లాగుతున్న యుద్ధ రథం ఒకటి,ఒంటెలు లాగుతున్న యుద్ధ రథం ఒకటి అతనికి కనిపించాయి.
అతను జాగ్రత్తగా, చాలా తీక్షణంగా చూశాడు.
8 తర్వాత అతను సింహంలా గట్టిగా ఇలా అరిచాడు:
“యెహోవా, నేను రోజంతా కావలిబురుజు మీద నిలబడుతున్నాను,ప్రతీ రాత్రి నేను నా కావలి స్థలం దగ్గర ఉండి కాపలా కాస్తున్నాను.+
9 చూడండి! గుర్రాల జత లాగుతున్న ఒక యుద్ధ రథంలో
సైనికులు వస్తున్నారు.”+
తర్వాత అతను ఇలా అన్నాడు:
“ఆమె కూలిపోయింది! బబులోను కూలిపోయింది!+
ఆమె దేవుళ్ల విగ్రహాలన్నిటినీ* ఆయన పగలగొట్టి నేలమట్టం చేశాడు!”+
10 నూర్చబడిన నా ప్రజలారా,నా కళ్లంలో* నూర్చబడిన ధాన్యమా,+సైన్యాలకు అధిపతీ ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా నుండి నేను విన్నది మీకు చెప్పాను.
11 దూమా* గురించిన సందేశం:
శేయీరు+ నుండి ఎవరో నన్ను ఇలా అడుగుతున్నారు:
“కావలివాడా, రాత్రి ఎంత సమయమైంది?
కావలివాడా, రాత్రి ఎంత సమయమైంది?”
12 కావలివాడు ఇలా చెప్పాడు:
“తెల్లవారుతోంది, అలాగే రాత్రి కూడా వస్తోంది.
మీరు అడగాలనుకుంటే అడగండి.
మళ్లీ రండి!”
13 ఎడారి మైదానం గురించిన సందేశం:
దెదాను+ ప్రయాణికులారా,ఎడారి మైదానంలోని అడవిలో మీరు రాత్రి గడుపుతారు.
14 తేమా+ దేశ నివాసులారా,దాహంగా ఉన్న వ్యక్తి కోసం నీళ్లు తీసుకురండి,పారిపోతున్న వ్యక్తి కోసం రొట్టె తీసుకురండి.
15 ఎందుకంటే వాళ్లు ఖడ్గం నుండి, దూసిన ఖడ్గం నుండి పారిపోయి వచ్చారు,ఎక్కుపెట్టిన విల్లు నుండి, క్రూరమైన యుద్ధం నుండి పారిపోయి వచ్చారు.
16 ఎందుకంటే యెహోవా నాతో ఇలా అన్నాడు: “కూలివాడి సంవత్సరాల్లా,* ఒక్క సంవత్సరంలో* కేదారు+ ఘనత అంతా మాయమైపోతుంది.
17 కేదారు యోధుల్లో కొంతమంది విలుకాండ్రే మిగులుతారు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ మాట చెప్పాడు.”
అధస్సూచీలు
^ ప్రాచీన బాబిలోనియా ప్రాంతాన్ని సూచిస్తుందని తెలుస్తోంది.
^ అక్ష., “నా తుంట్లలో చాలా నొప్పిగా ఉంది.”
^ లేదా “డాలుకు తైలం పూయండి.”
^ లేదా “చెక్కుడు విగ్రహాలన్నిటినీ.”
^ “నిశ్శబ్దం” అని అర్థం.
^ లేదా “కూలివాడు లెక్కించినంత జాగ్రత్తగా లెక్కిస్తే.”
^ అంటే, సరిగ్గా ఒక్క సంవత్సరంలో.