కొలొస్సయులు 2:1-23

  • దేవుని పవిత్ర రహస్యం, క్రీస్తు (1-5)

  • మోసం చేసేవాళ్ల విషయంలో జాగ్రత్త (6-15)

  • నిజం క్రీస్తులో ఉంది (16-23)

2  మీ కోసం, లవొదికయలో ఉన్నవాళ్ల కోసం,+ ఇప్పటివరకు నన్ను చూడని వాళ్లందరి కోసం నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు గ్రహించాలని కోరుకుంటు​న్నాను.  అలా వాళ్లకు ఊరట కలగాలని,+ వాళ్లంతా ప్రేమతో ఒక్కటవ్వాలని,+ వాళ్లు స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహన అనే సంపదనూ దేవుని పవిత్ర రహస్యం గురించిన సరైన జ్ఞానం అనే సంపదనూ కలిగివుండాలని నా ఉద్దేశం. ఆ పవిత్ర రహస్యం క్రీస్తే.+  తెలివికి, జ్ఞానానికి సంబంధించిన సంపదలన్నీ ఆయనలోనే జాగ్రత్తగా దాచబడి​వున్నాయి.+  మీరు ఎవరి మాయమాటల వల్లా మోసపోకూడదని ఈ విషయం చెప్తున్నాను.  నేను మీ దగ్గర లేకపోయినా, నా మనసు మాత్రం మీతోనే ఉంది. మీరు సక్రమంగా నడుచుకోవడం,+ క్రీస్తు మీద మీ విశ్వాసం స్థిరంగా ఉండడం+ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది.  కాబట్టి, మీరు ప్రభువైన క్రీస్తుయేసును ఎలా అంగీకరించారో, అలాగే ఆయనతో ఐక్యంగా నడుస్తూ ఉండండి.  మీరు నేర్చుకున్నట్టే, క్రీస్తు మీద మీకున్న విశ్వాసం లోతుగా వేళ్లూనుకున్న చెట్టులా బలంగా,+ స్థిరంగా ఉండాలి.+ మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు+ మీ విశ్వాసం ఉప్పొంగాలి.  క్రీస్తు బోధలకు కాకుండా, మనుషుల సంప్రదాయాలకూ ఈ లోకంలోని ప్రాథమిక విషయాలకూ అనుగుణంగా ఉన్న తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా* జాగ్రత్తపడండి;+  ఎందుకంటే, దేవుని లక్షణాలన్నీ పూర్తి​స్థాయిలో ఉన్నది క్రీస్తులోనే.+ 10  కాబట్టి, ఆయన వల్లే మీరు సంపూర్ణులయ్యారు. ప్రభుత్వాలన్నిటికీ, అధికారాలన్నిటికీ ఆయన శిరస్సుగా ఉన్నాడు.+ 11  ఆయనతో మీకున్న సంబంధం వల్ల మీరు సున్నతి కూడా పొందారు, అది మనుషుల వల్ల పొందే సున్నతి కాదు, బదులుగా పాపభరిత శరీరాన్ని* వదిలేయడం+ ద్వారా క్రీస్తు సేవకులు పొందే సున్నతి.+ 12  ఎందుకంటే, మీరు క్రీస్తు తీసుకున్న బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయనతోపాటు పాతిపెట్టబడ్డారు.+ అయితే, ఆయనతో మీకున్న సంబంధం ద్వారా మీరు క్రీస్తుతోపాటు బ్రతికించబడ్డారు.+ ఎందుకంటే, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన దేవుని ​శక్తివంతమైన పనిమీద+ మీకు విశ్వాసం ఉంది. 13  అంతేకాదు మీ పాపాల వల్ల, సున్నతి ​లేకపోవడం వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు ఆయనతోపాటు బ్రతికించాడు. దేవుడు మన పాపాలన్నిటినీ దయతో క్షమించాడు; 14  చేతితో రాయబడిన, మనకు వ్యతిరేకంగా ఉన్న+ ధర్మశాస్త్రాన్ని తుడిచేశాడు.+ ఆయన దాన్ని మేకులతో హింసాకొయ్యకు* దిగగొట్టి రద్దుచేశాడు.+ 15  ఆ హింసాకొయ్య* ద్వారా దేవుడు ప్రభుత్వాల, అధికారాల బట్టలు తీసేసి, విజయోత్సాహంతో అందరిముందు వాటిని ఖైదీలుగా నడిపించుకొని తీసుకెళ్తూ, వాటిమీద గెలిచానని చూపించాడు.+ 16  కాబట్టి మీరు ఏమి తినాలో, ఏమి తాగాలో నిర్ణయించే అవకాశాన్ని గానీ ఫలానా పండుగను, అమావాస్యను, విశ్రాంతి రోజును* ఆచరించాలో వద్దో చెప్పే అవకాశాన్ని గానీ ఎవ్వరికీ ఇవ్వకండి. 17  అవి రాబోయేవాటి నీడ మాత్రమే,+ కానీ నిజం క్రీస్తులో ఉంది.+ 18  దొంగ ​వినయంలో, దేవదూతల ఆరాధనలో సంతోషిస్తూ, తమకు కలిగిన దర్శనాల విషయంలో పట్టుబట్టే వాళ్లెవరి వల్లా మీ బహుమతిని పోగొట్టుకోకండి. అలాంటివాళ్లు అపరిపూర్ణ మనుషుల్లా ఆలోచిస్తూ, సరైన కారణం లేకుండానే గర్వపడుతుంటారు. 19  వాళ్లు శిరస్సును+ అంటిపెట్టుకొని లేరు. నిజానికి, ఆ శిరస్సు నుండి శరీరమంతా పోషించబడి, కీళ్లు-కండరాలతో చక్కగా అమర్చబడి, దేవుని శక్తితో ఎదుగుతూ ఉంది.+ 20  ఈ లోకంలోని ప్రాథమిక విషయాలకు+ సంబంధించి మీరు క్రీస్తుతోపాటు చనిపోయారు. అలాంటిది, మీరు ఇంకా లోకంలో భాగంగా ఉన్నట్టు, 21  “దీన్ని తీసుకోవద్దు, దాన్ని రుచిచూడొద్దు, అది ముట్టుకోవద్దు” అనే ఆజ్ఞలకు+ ఎందుకు లోబడుతున్నారు? 22  నిజానికి అవి, తినగానే తాగగానే మాయమైపోయే వాటికి సంబంధించిన నియమాలు; అవి కేవలం మనుషుల ఆజ్ఞలు, బోధలు మాత్రమే. 23  వాళ్లు ఇష్టమొచ్చినట్టు చేసే ఆరాధనలో, వాళ్లు చూపించే దొంగ వినయంలో, తమ శరీరాల్ని బాధ పెట్టుకోవడంలో తెలివి ఉన్నట్టు కనిపించవచ్చు,+ కానీ శరీర కోరికలతో పోరాడడానికి అవి ఏమాత్రం ఉపయోగపడవు.

అధస్సూచీలు

లేదా “ఎరగా పట్టుకుపోకుండా.”
లేదా “శరీర పద్ధతుల్ని.”
పదకోశం చూడండి.
లేదా “ఆయన” అయ్యుంటుంది.
లేదా “సబ్బాతును.”