ద్వితీయోపదేశకాండం 4:1-49

  • లోబడి ఉండమని పిలుపు (1-14)

    • దేవుడు చేసినవాటిని మర్చిపోవద్దు (9)

  • యెహోవా సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు (15-31)

  • యెహోవా తప్ప వేరే దేవుడు లేడు (32-40)

  • యొర్దానుకు తూర్పున ఆశ్రయపురాలు (41-43)

  • ధర్మశాస్త్రానికి పరిచయ మాటలు (44-49)

4  “ఇశ్రాయేలీయులారా, మీరు పాటించేలా నేను మీకు బోధిస్తున్న ఈ నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని వినండి. వీటిని పాటిస్తే మీరు ప్రాణాలతో ఉండి,+ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశంలోకి ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు.  నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా ఆజ్ఞల్ని మీరు పాటించాలి, మీరు వాటికి ఏమీ కలపకూడదు, వాటిలో నుండి ఏదీ తీసేయకూడదు.+  “పెయోరులోని బయలు విషయంలో యెహోవా ఏమి చేశాడో మీరు కళ్లారా చూశారు; పెయోరులోని బయలును అనుసరించిన ప్రతీ ఒక్కర్ని మీ దేవుడైన యెహోవా మీ మధ్య లేకుండా సమూలంగా నాశనం చేశాడు.+  కానీ మీ దేవుడైన యెహోవాను అంటిపెట్టుకొని ఉన్న మీరంతా ఈ రోజు సజీవంగా ఉన్నారు.  ఇదిగో, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టే ఈ నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని నేను మీకు నేర్పించాను.+ మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు వాటిని పాటించాలని నేను వాటిని మీకు నేర్పించాను.  మీరు వాటిని జాగ్రత్తగా పాటించాలి.+ అలా పాటిస్తే ఈ నియమాలన్నిటి గురించి వినే జనాలు మీ తెలివిని,+ మీ అవగాహనను+ చూసి, ‘ఈ గొప్ప జనం నిస్సందేహంగా తెలివి, అవగాహన ఉన్న జనం’ అని అంటారు.+  మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు దగ్గరగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి వాళ్ల దేవుళ్లు దగ్గరగా ఉన్నారు?+  నేను ఈ రోజు మీ ముందు పెడుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్నలాంటి నీతియుక్తమైన నియమాలు, న్యాయనిర్ణయాలు ఏ గొప్ప జనానికి ఉన్నాయి?+  “మీరు కళ్లారా చూసినవాటిని మర్చిపోకుండా ఉండేలా, జీవితాంతం అవి మీ హృదయాల్లో ఉండేలా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ* గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. అంతేకాదు మీరు వాటిని మీ కుమారులకు, మీ మనవళ్లకు తెలియజేయాలి.+ 10  హోరేబు దగ్గర మీరు మీ దేవుడైన యెహోవా ముందు నిలబడిన రోజున యెహోవా నాతో ఇలా అన్నాడు: ‘ప్రజలు నా మాటలు వినేలా నువ్వు వాళ్లను నా ముందు సమావేశపర్చు. నా మాటలు వినడం వల్ల వాళ్లు భూమ్మీద బ్రతికి ఉన్నంతకాలం నాకు భయపడడం నేర్చుకుంటారు,+ అలాగే వాళ్లు తమ కుమారులకు కూడా నేర్పిస్తారు.’+ 11  “అప్పుడు మీరు ఆ పర్వతం దగ్గరికి వచ్చి దాని అడుగుభాగం దగ్గర నిలబడ్డారు. ఆ సమయంలో ఆ పర్వతం మండుతూ ఉంది, దాని జ్వాలలు ఆకాశాన్ని అంటాయి; కారుమబ్బు, చిమ్మచీకటి కమ్ముకున్నాయి.+ 12  అప్పుడు యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడడం మొదలుపెట్టాడు.+ మీరు మాటల శబ్దాన్ని మాత్రమే విన్నారు, ఏ రూపాన్నీ చూడలేదు.+ కేవలం స్వరమే వినిపించింది. 13  ఆయన మీకు తన ఒప్పందాన్ని* అంటే ఆ పది ఆజ్ఞల్ని*+ తెలియజేశాడు,+ వాటిని పాటించమని ఆయన మీకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆయన వాటిని రెండు రాతి పలకల మీద రాశాడు.+ 14  మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని మీకు బోధించమని ఆ సమయంలో యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. 15  “కాబట్టి, మీ* గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. హోరేబు దగ్గర యెహోవా అగ్నిలో నుండి మీతో మాట్లాడిన రోజున మీరు ఏ రూపాన్నీ చూడలేదు. 16  అందుకే మీరు భ్రష్టులు కాకుండా ఉండేలా ఏ ఆకారంలో ఉన్న విగ్రహాన్నీ చేసుకోకూడదు. అది పురుషుని రూపమే గానీ స్త్రీ రూపమే గానీ,+ 17  భూమ్మీదున్న ఏ జంతువు రూపాన్ని గానీ, ఆకాశంలో ఎగిరే ఏ పక్షి రూపాన్ని గానీ,+ 18  నేలమీద పాకే దేని రూపాన్ని గానీ, భూమి కింద నీళ్లలో ఉండే ఏ చేప రూపాన్ని గానీ+ మీరు చేసుకోకూడదు. 19  మీరు ఆకాశం వైపు తల ఎత్తి ఆకాశ సైన్యాన్నంతటినీ అంటే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చూసినప్పుడు ప్రలోభానికి గురికాకండి, వాటికి మొక్కకండి, వాటిని పూజించకండి.+ మీ దేవుడైన యెహోవా వాటిని ఆకాశమంతటి కింద ఉన్న జనాలన్నిటికీ ఇచ్చాడు. 20  కానీ మిమ్మల్ని, యెహోవా దేవుడు ఇనుప కొలిమిలో నుండి, అంటే ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. మీరు తన సొత్తైన* ప్రజలు+ అవ్వాలని ఆయన మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ రోజు మీరు ఆయన స్వాస్థ్యంగా ఉన్నారు. 21  “మీ కారణంగా యెహోవా నా మీద కోపగించుకున్నాడు.+ నేను యొర్దాను నది దాటి వెళ్లకూడదని, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోయే మంచి దేశంలోకి నేను వెళ్లకూడదని ఆయన ప్రమాణం చేసి చెప్పాడు.+ 22  నేను ఈ దేశంలోనే చనిపోతాను; నేను యొర్దాను నది దాటను,+ కానీ మీరు దాన్ని దాటుతారు, ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. 23  మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ఒప్పందాన్ని మర్చిపోకుండా జాగ్రత్తపడండి,+ మీ దేవుడైన యెహోవా మీ విషయంలో నిషేధించిన దేని రూపంలోనూ మీరు విగ్రహం చేసుకోకూడదు.+ 24  ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దహించే అగ్ని,+ ఆయన సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు.+ 25  “మీకు కుమారులు, మనవళ్లు పుట్టి, ఆ దేశంలో చాలాకాలం జీవించిన తర్వాత మీరు చెడిపోయి ఏ రకమైన విగ్రహాన్నైనా చేసి,+ మీ దేవుడైన యెహోవాకు కోపం తెప్పించేలా ఆయన దృష్టిలో చెడ్డపనిని చేస్తే,+ 26  మీరు యొర్దాను నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు ఖచ్చితంగా, త్వరగా నాశనమౌతారు. నేడు నేను భూమ్యాకాశాల్ని సాక్షులుగా తీసుకొని ఈ మాట చెప్తున్నాను. మీరు అక్కడ ఎక్కువ కాలం జీవించరు, మీరు సమూలంగా నాశనమౌతారు.+ 27  యెహోవా మిమ్మల్ని జనాల మధ్య చెదరగొడతాడు;+ అంతేకాదు, యెహోవా మిమ్మల్ని వెళ్లగొట్టిన ఆ జనాల మధ్య మీలో కొందరు మాత్రమే మిగిలివుంటారు. 28  అక్కడ మీరు, మనుషులు చేసిన చెక్క దేవుళ్లను, రాతి దేవుళ్లను పూజించాల్సి వస్తుంది.+ అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు. 29  “మీరు అక్కడి నుండి మీ దేవుడైన యెహోవాను మీ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* వెదికితే+ మీరు ఖచ్చితంగా ఆయన్ని కనుగొంటారు.+ 30  తర్వాతి కాలాల్లో ఇవన్నీ మీకు జరిగి, మీరు ఎంతో బాధలో ఉన్నప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగొస్తారు, ఆయన స్వరం వింటారు.+ 31  ఎందుకంటే మీ దేవుడైన యెహోవా కరుణగల దేవుడు.+ ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, మీ పూర్వీకులకు తాను ప్రమాణం చేసిన ఒప్పందాన్ని మర్చిపోడు. 32  “ఇప్పుడు మీరు, దేవుడు భూమ్మీద మనిషిని సృష్టించిన రోజు నుండి మీ కాలానికి ముందున్న రోజుల గురించి అడగండి; ఆకాశపు ఈ కొన నుండి ఆ కొన వరకు వెదకండి. ఇంత గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? ఇలాంటి దాని గురించి ఎవరైనా ఎన్నడైనా విన్నారా? 33  దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడుతున్నప్పుడు మీలా దాన్ని విని, ప్రాణాలతో ఉన్న ప్రజలు ఎవరైనా ఉన్నారా? 34  లేదా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కళ్లముందు మీకోసం చేసినట్టు దేవుడు ఎప్పుడైనా తీర్పులతో,* సూచనలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, భీకరమైన కార్యాలతో+ వేరే జనం నుండి తన కోసం ఒక జనాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడా? 35  యెహోవాయే సత్యదేవుడని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపించబడ్డాయి;+ ఆయన తప్ప వేరే దేవుడు లేడు.+ 36  మిమ్మల్ని సరిదిద్దడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించాడు, అలాగే భూమ్మీద ఆయన తన గొప్ప అగ్నిని చూపించాడు; మీరు ఆ అగ్నిలో నుండి ఆయన మాటల్ని విన్నారు.+ 37  “ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించి, వాళ్ల తర్వాత వాళ్ల సంతానాన్ని* ఎంచుకున్నాడు కాబట్టి తన సమక్షంలో, తన గొప్ప శక్తితో మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. 38  ఆయన మీకన్నా గొప్ప జనాల్ని, బలమైన జనాల్ని మీ ముందు నుండి వెళ్లగొట్టాడు. నేడు చేస్తున్నట్టు, వాళ్ల దేశంలోకి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన అలా వెళ్లగొట్టాడు.+ 39  కాబట్టి పైన ఆకాశంలో, కింద భూమ్మీద యెహోవాయే సత్యదేవుడని+ నేడు మీరు తెలుసుకోండి, ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి. ఆయన తప్ప వేరే దేవుడు లేడు.+ 40  నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన నియమాల్ని, ఆజ్ఞల్ని మీరు పాటించాలి. అలాచేస్తే మీరు, మీ తర్వాత మీ కుమారులు క్షేమంగా ఉంటారు. అంతేకాదు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు చాలాకాలం ఉంటారు.”+ 41  ఆ సమయంలో మోషే యొర్దానుకు తూర్పు వైపున మూడు నగరాల్ని వేరుచేశాడు.+ 42  ఒక వ్యక్తి తోటివాడి మీద ఏ ద్వేషం లేకపోయినా అనుకోకుండా అతన్ని చంపితే, అతను వీటిలో ఒక నగరానికి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకోవాలి.+ 43  ఆ నగరాలు ఏవంటే: రూబేనీయుల కోసం పీఠభూమిలోని ఎడారిలో ఉన్న బేసెరు;+ గాదీయుల కోసం గిలాదులో ఉన్న రామోతు;+ మనష్షే వంశస్థుల కోసం బాషానులో ఉన్న గోలాను.+ 44  ఇశ్రాయేలు ప్రజల ముందు మోషే ఉంచిన ధర్మశాస్త్రం+ ఇదే. 45  ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత వాళ్లకు మోషే ఇచ్చిన జ్ఞాపికలు, నియమాలు, న్యాయనిర్ణయాలు ఇవే. 46  యొర్దాను దగ్గర, బేత్పెయోరుకు ఎదురుగా ఉన్న లోయలో+ మోషే వీటిని ఇచ్చాడు. ఆ లోయ హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చెందిన దేశంలో ఉంది. మోషే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ రాజును ఓడించారు. 47  యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు అమోరీయుల రాజుల దేశాల్ని అంటే సీహోను రాజు దేశాన్ని, బాషానుకు చెందిన ఓగు రాజు దేశాన్ని వాళ్లు స్వాధీనం చేసుకున్నారు.+ 48  అంటే అర్నోను లోయ* అంచున ఉన్న అరోయేరు+ నుండి హెర్మోను+ అనే పేరున్న సీయోను పర్వతం వరకు, 49  అలాగే యొర్దానుకు తూర్పున అరాబా ప్రాంతమంతటినీ, పిస్గా కొండచరియల దిగువన ఉన్న అరాబా సముద్రం*+ వరకు స్వాధీనం చేసుకున్నారు.

అధస్సూచీలు

లేదా “మీ ప్రాణాల.”
అక్ష., “ఆ పది మాటల్ని.”
లేదా “నిబంధనను.”
లేదా “మీ ప్రాణాల.”
లేదా “స్వాస్థ్యమైన.”
పదకోశం చూడండి.
లేదా “పరీక్షలతో.”
అక్ష., “విత్తనాన్ని.”
లేదా “అర్నోను వాగు.”
అంటే, ఉప్పు సముద్రం, లేదా మృత సముద్రం.